వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్: సమీకృత, సమన్వయ మౌలిక సదుపాయాల ప్రణాళికకు సరికొత్త ఊతం


ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు లేకుండానే.. సమగ్ర ప్రణాళిక విధానాలను అందిస్తున్న పీఎం గతిశక్తి

प्रविष्टि तिथि: 11 AUG 2026 6:35PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనను మరింత వేగవంతం చేసేందుకు, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు 2021 అక్టోబర్‌లో ప్రారంభించిన ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ (పీఎంజీఎస్‌ ఎన్‌ఎంపీ) కీలక సాధనంగా మారింది. ఇది కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలను ఒకే తాటిపైకి తెచ్చే ఒక పరివర్తనాత్మక ‘‘సమగ్ర ప్రభుత్వ’’ విధానం. మౌలిక సదుపాయాల అభివృద్ధిని పర్యవేక్షించడానికి, ప్రణాళిక చేయడానికి, సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి భౌగోళిక సమాచారం, ఉపగ్రహ చిత్రాలు ఏపీఐ ఇంటిగ్రేషన్‌లను ఉపయోగించడం ద్వారా డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేలా మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలను సులభతరం చేయడమే పీఎంజీఎస్‌ ఎన్‌ఎంపీ లక్ష్యం.  వివిధ రకాల రవాణా మార్గాల ద్వారా ప్రజలు, వస్తువులు, సేవల రవాణాకు అంతరాయం లేని, సమర్థవంతమైన అనుసంధానాన్ని అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. తద్వారా సామాజిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో సహా ఆయా ప్రాజెక్టులను ఏకీకృత, సమకాలీకరించిన, సమన్వయ పద్ధతిలో ప్రణాళిక  చేయడానికి వీలవుతుంది. ఇది క్షేత్ర స్థాయిలో చివరి వ్యక్తి వరకు అనుసంధానతను మెరుగుపరచడమే కాకుండా ప్రయాణ సమయాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుంది.

 

పీఎం గతిశక్తి అనేది కేవలం ఒక సమగ్ర ప్రణాళికా వ్యవస్థ మాత్రమేనని, దీని కింద ప్రాజెక్టుల ఆమోదం, అమలు ప్రక్రియలను ఆయా కేంద్ర మంత్రిత్వ శాఖలు,విభాగాలు, రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలే స్వయంగా చేపడతాయని స్పష్టమైంది. ఆయా శాఖలు తమ స్వంత ప్రణాళికలు, పథకాలు, విధానాలు, బడ్జెట్,ఆర్థిక నిధుల నిబంధనల ప్రకారమే ఈ పనులను నిర్వహిస్తాయి. పీఎం గతిశక్తి కార్యక్రమం కింద నిర్దిష్టంగా ఎలాంటి పరిమాణాత్మక లక్ష్యాలను లేదా ప్రత్యేక వ్యయ అవసరాలను  కేటాయించలేదు.

 

ప్రధానమంత్రి గతిశక్తి విధానం కింద ఏర్పాటైన నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్‌పీజీ), కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రణాళిక దశలోనే సమగ్రంగా సమీక్షిస్తోంది. ప్రాజెక్టుల రూపకల్పనలో సమగ్ర ప్రణాళిక, బహుళ విధానాలు, ఇతర విధానాలు, వివిధ శాఖల ఉమ్మడి ప్రయత్నాల సమకాలీకరణ, చివరి మైలు అనుసంధానం, ప్రాజెక్టు పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, డేటా ఆధారిత నిర్ణయాలను నిర్ధారించడానికి ఈ ఎన్‌పీజీ నిర్వహణా విధానం పనిచేస్తుంది. ఇప్పటి వరకు దాదాపు రూ. 18.66 లక్షల కోట్ల అంచనా వ్యయంతో కూడిన 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఎన్‌పీజీ విధానం ద్వారా ఇప్పటివరకు మూల్యాంకనం చేశారు. ఈ 396 ప్రాజెక్టులలో ఇప్పటికే 256 ప్రాజెక్టులకు ఆమోదం లభించగా, వాటిలో 198 ప్రాజెక్టులు ప్రస్తుతం అమలు దశలో ఉన్నాయి. వీటికి సంబంధించిన మంత్రిత్వ శాఖల వారీ పూర్తి వివరాలను అఅనుబంధం-ఏలో పొందుపరిచారు.

 

 

ప్రభుత్వం తన వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు తీరును తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు వివిధ అధ్యయనాలు, సర్వేల ద్వారా సమీక్షలు నిర్వహిస్తోంది. వీటితో పాటు పలు విశ్వవిద్యాలయాలు, పరిశోధకులు సైతం వీటిపై ప్రత్యేక అధ్యయనాలు జరుపుతున్నారు. ఈ నివేదికల ప్రకారం పీఎం గతిశక్తి, జాతీయ లాజిస్టిక్స్ విధానం ప్రగతి, సాగర్‌మాల వంటి సమగ్ర ప్రణాళికా కార్యక్రమాలతో పాటు ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులు, డెడికేటెడ్ రైల్ ఫ్రైట్ కారిడార్లు, రైల్వే ట్రాక్‌లు, పారిశ్రామిక కారిడార్లు, హబ్‌ల వంటి అనుసంధాన మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయి. ఇవి ఒకదానితో ఒకటి అనుసంధానమై, అంతర్జాతీయంగా పోటీ పడగల సత్తా ఉన్న నవ భారత విజన్‌కు రూపకల్పన చేశాయి. ఈ చర్యల వల్ల దేశంలో లాజిస్టిక్స్ సామర్థ్యం, టర్న్-అరౌండ్ సమయం (వస్తువుల రవాణా సమయం), వ్యాపార సౌలభ్యం మెరుగవ్వడమే కాకుండా పారిశ్రామిక వృద్ధి పెరిగి, రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డీపీఐఐటీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్‌) భాగస్వామ్యంతో 2025లో దేశంలో లాజిస్టిక్స్ వ్యయంపై ఒక ప్రత్యేక అంచనాను నిర్వహించింది. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు దేశ మొత్తం జీడీపీలో 7.9 శాతంగానే నమోదైంది. ఈ ఘనత ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల రవాణా వ్యయంతో సమానంగా ఉండటం విశేషం. ఇదే అంశాన్ని ఆర్థిక సర్వే 2023-24 కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ఈ సంస్కరణల వల్ల దేశీయ ఉత్పాదక రంగం, ఎగుమతుల పోటీతత్వం ఎంతో మెరుగయ్యాయని స్పష్టం చేసింది. జాతీయ రహదారుల ప్రాజెక్టుల అభివృద్ధి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఒక ప్రత్యేక అధ్యయనం చేపట్టింది. జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి  రూపాయి కూడా దేశ స్థూల దేశీయోత్పత్తిలో ఏకంగా రూ.3.2 వృద్ధికి దారి తీస్తుందని తన అధ్యయనంలో తెలిపింది.

 

 

ఇప్పటివరకు 58 కేంద్ర మంత్రిత్వ శాఖలు,విభాగాలు, దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు  పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ పరిధిలోకి వచ్చాయి. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, జలమార్గాలు, విద్యుత్, పెట్రోలియం, సహజ వాయువు, పౌర విమానయానం, టెలికమ్యూనికేషన్స్, పారిశ్రామిక కారిడార్లు వంటి అన్ని కీలక మౌలిక సదుపాయాల రంగాలు దీని పరిధిలోకి వచ్చాయి. దీనితో పాటు జిల్లా స్థాయి ప్రణాళికల కోసం కూడా పీఎం గతిశక్తి వినియోగాన్ని మరింత విస్తరించాలని రాష్ట్రాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సెప్టెంబర్ 2025లో పీఎం గతిశక్తి వేదికను (ugi.pmgatishakti.gov.in) ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇది ప్రైవేటు సంస్థలకు, సాధారణ ప్రజలకు సైతం పీఎం గతిశక్తి డేటా అనలిటిక్స్ అందుబాటులోకి తెచ్చింది. ఈ వేదికపై ఉన్న సులభమైన క్వెరీ-ఆధారిత విధానం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమకు కావలసిన సమాచారాన్ని నివేదికల రూపంలో పొంది, వాటి ఆధారంగా తమ ప్రాజెక్టులను సులభంగా ప్రణాళిక చేసుకోగలుగుతున్నాయి. ఈ డిజిటల్ వ్యవస్థలో ఇప్పటివరకు సుమారు 1800 డేటా లేయర్లను అనుసంధానించారు. భాగస్వాములందరి సౌకర్యార్థం 65కు పైగా సాఫ్ట్‌వేర్ మాడ్యూల్స్, విభాగాలు, 100కు పైగా మొబైల్, వెబ్ అప్లికేషన్లను అభివృద్ధి చేసి ఈ వేదికలో చేర్చారు. పీఎం గతిశక్తి కార్యక్రమాన్ని మరింత విస్తరించడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు, ఇతర భాగస్వాముల అవసరాలకు అనుగుణంగా మరిన్ని డేటా లేయర్లను మ్యాపింగ్ చేయడం, అదనపు ఫీచర్లు, సాఫ్ట్‌వేర్ మాడ్యూల్స్, విభాగాలు, మొబైల్, వెబ్ అప్లికేషన్లను అభివృద్ధి చేసి అనుసంధానించే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది.

 

ఈ సమాచారాన్ని వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద నేడు లోక్‌సభలో అందించిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.

ఎన్‌పీజీ  కార్యవిధానం ద్వారా మూల్యాంకనం చేసిన ప్రాజెక్టుల మంత్రిత్వ శాఖల వారీ వివరాలు

మంత్రిత్వ శాఖ / విభాగం

ప్రాజెక్టుల సంఖ్య

ఆమోదించినవి

ఇంకా ఆమోదించవలసినవి

అమలులో ఉన్నవి

అంచనా వ్యవయం రూ. కోట్లలో

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ

171

108

63

53

9,01,668

రైల్వే మంత్రిత్వ శాఖ

162

102

60

102

5,43,315

గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

31

17

14

17

2,88,614

పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ

4

4

0

3#

9,271

ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ

3

2

1

2

49,759

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

6

4

2

2

10,005

ఎన్‌ఐసీడీసీ, పరిశ్రమలుఅంతర్గత వాణిజ్య ప్రోత్సాహక  విభాగం (డీపీఐఐటీ)

12

12

0

12

28,693

నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ

01

1

0

1

20,774

ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ

01

1

0

1

4,680

జౌళి  మంత్రిత్వ శాఖ

05

05

0

05

9,760

మొత్తం

396

256

140

198

18,66,539

 


(रिलीज़ आईडी: 2297968) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Gujarati