ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
డీహెచ్ఆర్-ఐసీఎంఆర్ షైన్ 2026 ద్వారా 83 ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య పరిశోధన ప్రత్యక్ష పరిచయం
ఆరోగ్య పరిశోధనను అనుభవపూర్వకంగా తెలుసుకోనున్న సుమారు 30,000 మంది విద్యార్థులు
దేశవ్యాప్తంగా 83 ఐసీఎంఆర్ కేంద్రాల్లో ఆగస్టు 11, 12వ తేదీల్లో కొనసాగే కార్యక్రమం
కేలాంగ్ నుంచి కేరళ వరకు, డయ్యూ నుంచి నాగాలాండ్ వరకు షైన్ 2026 ద్వారా దేశవ్యాప్తంగా సైన్స్ విస్తరణ
ప్రయోగశాలను సందర్శించేందుకు, నేరుగా ప్రదర్శనలను వీక్షించేందుకు, ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలతో సంభాషించేందుకు విద్యార్థులకు అవకాశం
ఉత్సుకతతో ఉండాలని, ప్రశ్నలు అడగాలని, విజ్ఞాన శాస్త్రాన్ని వృత్తిగా చేపట్టాలని విద్యార్థులను ప్రోత్సహించిన డాక్టర్ రాజీవ్ బహ్ల్
ప్రారంభమైన షైన్ వెబ్‌సైట్.. దేశవ్యాప్తంగా విద్యార్థుల పరిశోధనా పోటీల ప్రకటన
శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించటం, భవిష్యత్ తరం ఆరోగ్య పరిశోధకులకు స్ఫూర్తిని కలిగించటమే ఈ కార్యక్రమం లక్ష్యం
प्रविष्टि तिथि:
11 AUG 2026 1:55PM by PIB Hyderabad
ఆరోగ్య పరిశోధన విభాగం (డీహెచ్ఆర్), భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) సంయుక్తంగా నిర్వహించే ఐసీఎంఆర్-షైన్ (సైన్స్ అండ్ హెల్త్ ఇన్నోవేషన్ ఫర్ నెక్ట్స్‌జెన్ ఎక్స్‌ప్లోరర్స్) రెండో ఎడిషన్ ఇవాళ ప్రారంభమైంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులను ప్రయోగశాలల్లోకి ఆహ్వానించి, ప్రయోగాలను నేరుగా వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. విద్యార్థులు ఒకరోజు శాస్త్రవేత్తగా గడపాలంటూ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు రెండు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమం ఆగస్టు 11, 12వ తేదీల్లో దేశవ్యాప్తంగా 83 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఐసీఎంఆర్ సంస్థలు, మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ యూనిట్లు (ఎంఆర్ హెచ్ఆర్ యూలు), వాటికి అనుబంధంగా ఉండే క్షేత్ర స్థాయి విభాగాలు ఇందులో భాగంగా ఉన్నాయి. దాదాపు 10,000 అడుగుల ఎత్తులో ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లోని కేలాంగ్ నుంచి దక్షిణాన కేరళ వరకు… పశ్చిమాన డయ్యూ నుంచి తూర్పున నాగాలాండ్ వరకు దేశవ్యాప్తంగా విద్యార్థులను ఈ కార్యక్రమం చేరుకుంటుంది. ఇది వారిని విజ్ఞాన శాస్త్రానికి చేరువ చేయటమే కాక, శాస్త్రీయ పరిశోధనలపై ఉత్సుకతను, ఆసక్తిని పెంపొందిస్తుంది.
ఈ కార్యక్రమంలో డీహెచ్ఆర్ కార్యదర్శి, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ మాట్లాడుతూ.. "ఇవాళ ఇక్కడున్న విద్యార్థులను నేను ఒకటే కోరుతున్నా. ఎల్లప్పుడూ ఉత్సుకతతో ఉండండి. ప్రశ్నలు అడగండి. ఎందుకు అని ప్రశ్నించేందుకు ఎప్పుడూ భయపడవద్దు. ప్రశ్నతోనే ఆవిష్కరణ మొదలవుతుంది. నూతన అవకాశాలను అన్వేషించే ధైర్యంతోనే కొత్త ఆవిష్కరణ ప్రారంభమవుతుంది. షైన్ కార్యక్రమంలోని మీ అనుభవం… ఆరోగ్య పరిశోధనకు సంబంధించి అద్భుతమైన ప్రపంచాన్ని మీకు పరిచయం చేస్తుందని, సైన్స్‌ను కేవలం సబ్జెక్టుగా మాత్రమే కాక, ప్రజల జీవితాల్లో అర్థవంతమైన మార్పును తీసుకువచ్చే కెరీర్‌గా ఎంచుకునేలా మీకు స్ఫూర్తిని కలిగిస్తుందని నేను ఆశిస్తున్నా" అని అన్నారు.
సైన్స్, ఆరోగ్యం, పరిశోధనలపై విద్యార్థుల ప్రశ్నలకు సులభంగా అర్థమయ్యే ఉదాహరణలతో డాక్టర్ రాజీవ్ బహ్ల్ సమాధానమిచ్చారు. ఎప్పుడూ ఆసక్తితో ఉంటూ, పాఠ్యపుస్తకాలను దాటి ఆలోచించాలని ప్రోత్సహించారు. ఐసీఎంఆర్ పరిశోధనలు, ఆవిష్కరణల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. దీనివల్ల శాస్త్రీయ ఆవిష్కరణలు వాస్తవ ప్రపంచ ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలుగా మారే విధానాన్ని విద్యార్థులు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 9 నుంచి 12వ తరగతుల విద్యార్థులు ఈ రెండు రోజుల్లో నేరుగా ఆరోగ్య పరిశోధనా ప్రపంచంలోకి అడుగుపెడతారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులు గైడెడ్ ల్యాబొరేటరీ టూర్లు, పరిశోధన ప్రదర్శనలు, పోస్టర్ వాక్స్, వీడియో ప్రజెంటేషన్లు, శాస్త్రీయ పనుల ప్రత్యక్ష ప్రదర్శనలను వీక్షిస్తారు. ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలతో మాట్లాడి… వారి పరిశోధనా ప్రయాణాలు, నైపుణ్యాలు, ప్రజారోగ్య రంగంలో రోజువారీ పనుల గురించి తెలుసుకుంటారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనే యువతకు శాస్త్రీయ ఉత్సుకత స్ఫూర్తిని అందించేందుకు షైన్ అధికారిక చిహ్నం- డాక్టర్ క్యూరియోని రూపొందించారు. ప్రచార సామాగ్రి, పోస్టర్లు, సోషల్ మీడియాలో, ఐసీఎంఆర్ పనుల గురించి వివరించే పరస్పర సంభాషణ వీడియోలో వ్యాఖ్యాతగా కూడా డాక్టర్ క్యూరియో మస్కట్ వ్యవహరిస్తుంది.
ఈ సందర్భంగా అధికారిక షైన్ వెబ్సైట్ ( shine.icmr.org.in )ను ఐసీఎంఆర్ ప్రారంభించింది. ఆరోగ్య పరిశోధనలపై ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం వనరులు, తాజా సమాచారం, అవకాశాలను అందించే ప్రత్యేక వేదిక ఇది. దీనితో పాటు విద్యార్థులు స్వయంగా పరిశోధనా ప్రశ్నలను రూపొందించేందుకు, వాస్తవ జీవిత ప్రజా ఆరోగ్య సవాళ్లకు తగిన పరిష్కారాలను సూచించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా పాఠశాల పోటీలను కూడా ఐసీఎంఆర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐసీఎంఆర్ ప్రయోగశాలల నుంచి వచ్చిన ఆహ్వానాల మేరకు తదుపరి కార్యక్రమంలో సుమారు 30,000 మంది విద్యార్థులు పాల్గొంటారని అంచనా.
పరిశోధనా సంస్థలు, కేంద్రాలను సందర్శించేందుకు అనుమతించటం ద్వారా విజ్ఞాన శాస్త్రం స్పష్టంగా అర్థమయ్యేలా, అందరికీ చేరువయ్యేలా చేసేందుకు ఈ కార్యక్రమం ప్రయత్నిస్తుంది. సమాజం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను పరిశోధనలు పరిష్కరించే విధానాన్ని ఈ కార్యక్రమం విద్యార్థులకు తెలియజేస్తుంది. శాస్త్రీయ పరిశోధనలో భవిష్యత్తును చూసుకునేలా విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. వికసిత్ భారత్-2047 లక్ష్యానికి అనుగుణంగా ఉన్న ఈ కార్యక్రమం… దేశ యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఐసీఎంఆర్ నిబద్ధతను స్పష్టం చేస్తుంది. భారతదేశ ఆరోగ్య, అభివృద్ధి లక్ష్యాలకు ఉపయోగపడే భవిష్యత్ తరం పరిశోధకులకు ఇది స్ఫూర్తినిస్తుంది.
****
(रिलीज़ आईडी: 2297760)
आगंतुक पटल : 19