ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శాస్త్రవేత్తలుగా ఒక రోజు… పాఠశాల విద్యార్థులకు ఆహ్వానం

దేశవ్యాప్తంగా ఎస్‌హెచ్ఐఎన్ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్న ఆరోగ్య పరిశోధన విభాగం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (డీహెచ్‌ఆర్–ఐసీఎంఆర్)

ఎస్‌హెచ్ఐఎన్ఈ–2026: ఆధునిక అన్వేషకుల కోసం సైన్స్, ఆరోగ్యం, ఆవిష్కరణ

దేశవ్యాప్తంగా పాఠశాల స్థాయి ప్రచారాన్ని విస్తరిస్తూ.. ఎస్‌హెచ్ఐఎన్ఈ రెండో ఎడిషన్‌ నిర్వహిస్తున్న డీహెచ్‌ఆర్–ఐసీఎంఆర్

భారతదేశంలోని 83 ప్రాంతాల్లో శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశాన్ని విద్యార్థులకు అందిస్తున్న ఎస్‌హెచ్ఐఎన్ఈ–2026

ఐసీఎంఆర్ పరిశోధన, ప్రయోగశాలలు, శాస్త్రీయ ఆవిష్కరణల గురించి తెలుసుకోనున్న 9 నుంచి 12 తరగతులకు చెందిన 30,000 మంది విద్యార్థులు

నాడు పోస్టు చేయడమైనది: 10 AUG 2026 8:59PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా పాఠశాల ప్రచార కార్యక్రమమైన ఎస్‌హెచ్ఐఎన్‌ఈ – సైన్స్, హెల్త్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ నెక్స్ట్ జెన్ ఎక్స్‌ప్లోరర్స్ రెండో సంచికను 2026, ఆగస్టు 11, 12 తేదీల్లో ఆరోగ్య పరిశోధనా విభాగం – భారత వైద్య పరిశోధనా మండలి (డీహెచ్ఆర్–ఐసీఎంఆర్) నిర్వహిస్తోంది. ‘‘శాస్త్రవేత్తగా ఒక రోజు గడపండి’’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.

 

దేశవ్యాప్తంగా ఉన్న ఐసీఎంఆర్ సంస్థలు, డీహెచ్ఆర్–మోడల్ ఆరోగ్య పరిశోధనా కేంద్రాలు (ఎంఆర్‌హెచ్ఆర్‌యూ), అనుబంధ క్షేత్రస్థాయి కేంద్రాలతో సహా 83 ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇది శాస్త్రవేత్తలతో మమేకమై, శాస్త్రీయ పరిశోధనను అన్వేషించడానికి, ఆరోగ్యం, ఆవిష్కరణల ప్రపంచాన్ని ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశాన్ని పాఠశాల విద్యార్థులకు అందిస్తుంది.

 

ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులను ఆరోగ్య పరిశోధనా విభాగం కార్యదర్శి, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ స్వాగతించారు. శాస్త్రవేత్తలతో ముచ్చటించడానికి, పరిశోధనా ప్రయోగశాలలను పరిశీలించడానికి, ఆరోగ్యం, ఆవిష్కరణల రంగం గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు.

డీహెచ్ఆర్, కార్యదర్శి, ఐసీఎంఆర్, డీజీ సందేశం:

వాస్తవ ప్రపంచంలో ఎదురవుతున్న ప్రజారోగ్య సవాళ్లకు శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని అన్వయించమని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 9 నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను ఎస్‌హెచ్ఐఎన్ఈ ఆహ్వానిస్తోంది.

 

వికసిత్ భారత్–2047 దార్శనికతకు అనుగుణంగా, యువ అన్వేషకుల్లో ప్రజారోగ్య పరిష్కారాల పట్ల ఆసక్తిని పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ ఏడాది ఆహ్వానాల ద్వారా ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొంటారు. తమ సమీపంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఐసీఎంఆర్ ల్యాబరేటరీలు ఆహ్వానిస్తాయి. ఈ కార్యక్రమంలో 30,000 మంది విద్యార్థులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.

 

రెండు రోజుల ఈ కార్యక్రమంలో.. మార్గదర్శక ప్రయోగశాల పర్యటనలు, పరిశోధన ప్రదర్శనలు, పోస్టర్ వాక్స్, వీడియో ప్రదర్శనలు, కొనసాగుతున్న శాస్త్రీయ పరిశోధనకు సంబంధించి ప్రత్యక్ష ప్రదర్శనలతో సహా వివిధ కార్యక్రమాల్లో విద్యార్థులు భాగం పంచుకుంటారు. ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలతో నేరుగా సంభాషించి, వారి పరిశోధనా ప్రయాణం, నైపుణ్య రంగాలు, ప్రజారోగ్యంలో రోజువారీ కార్యకలాపాల గురించి ప్రత్యక్షంగా తెలుసుకొనే అవకాశం విద్యార్థులకు లభిస్తుంది.

 

తన సంస్థలు, గ్రామీణ పరిశోధనా విభాగాల తలుపులను యువ విద్యార్థుల కోసం తెరవడం ద్వారా సైన్సును వారికి స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా చేయాలని ఎస్‌హెచ్ఐఎన్ఈ లక్ష్యంగా పెట్టుకుంది. సమాజం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను పరిశోధన ఎలా పరిష్కరిస్తుందో విద్యార్థులకు చూపిస్తూ.. శాస్త్రీయ అన్వేషణలో తమ భవిష్యత్తును చూసుకొనేలా విద్యార్థులను ప్రోత్సహిస్తుంది.

 

యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి, వికసిత్ భారత్–2047 దార్శనికత పరిధిలో దేశ ఆరోగ్య, అభివృద్ధి లక్ష్యాలకు తోడ్పడేలా తదుపరి తరం పరిశోధకుల్లో స్ఫూర్తి నింపడంలో తన నిబద్ధతను ఈ కార్యక్రమం ద్వారా ఐసీఎంఆర్ పునరుద్ఘాటిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2297531) సందర్శకుల సూచీ సంఖ్య : : 28
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Kannada