వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏపీఈడీఏ సహకారంతో త్రిపురలోని డెర్గాంగ్ ఎఫ్‌పీఓ ద్వారా తొలిసారిగా దుబాయ్‌కు ఆవ తేనె ఎగుమతి


1 మెట్రిక్ టన్ను ఎగుమతితో డెర్గాంగ్ ఎఫ్‌పీఓ, స్థానిక తేనెటీగల పెంపకందారులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు

నాడు పోస్టు చేయడమైనది: 10 AUG 2026 6:02PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార పదార్థాల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) ఆధ్వర్యంలో త్రిపురకు చెందిన డెర్గాంగ్  రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీఓ) ద్వారా సేకరించిన 1 మెట్రిక్ టన్ను నాణ్యమైన ఆవ తేనెను దుబాయ్‌కి విజయవంతంగా ఎగుమతి చేశారు. త్రిపుర ప్రాంతం నుంచి ఆవ తేనె విదేశాలకు ఎగుమతి కావడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంతో స్థానిక తేనెటీగల పెంపకందారులకు, రైతులకు అంతర్జాతీయ మార్కెట్లలోకి అడుగుపెట్టే గొప్ప అవకాశం లభించింది.ఈ ఎగుమతి ఆ రైతు ఉత్పత్తిదారుల సంస్థకే కాకుండా, ఆ ప్రాంతానికి కూడా ఒక సరికొత్త మైలురాయిగా నిలిచింది.

 

ఈ ప్రాంతం నుంచి ఆవ తేనె విదేశాలకు ఎగుమతి కావడం ఇదే మొదటిసారి. ఇది త్రిపుర  తేనె వ్యాపార రంగాన్ని మరింత విస్తరించడానికి కొత్త మార్గాలను తెరిచింది. ఈ ప్రయత్నం వల్ల స్థానిక రైతులు, రైతు సంఘాలు రాబోయే రోజుల్లో ఎగుమతి అవకాశాలపై దృష్టి పెట్టడమే కాకుండా, అంతర్జాతీయ వ్యవసాయ మార్కెట్లలో చురుగ్గా పాల్గొనేందుకు ప్రోత్సాహం లభిస్తుంది.

 

ఈ ఎగుమతి ద్వారా డెర్గాంగ్  ఎఫ్‌పీఓం అనుబంధ రైతులకు స్థానిక మార్కెట్‌తో పోలిస్తే తమ ఉత్పత్తులకు మరింత మెరుగైన, లాభదాయకమైన ధర లభిస్తుందని భావిస్తున్నారు. ఇలా అంతర్జాతీయ మార్కెట్ అందుబాటులోకి రావడం వల్ల తేనెటీగల పెంపకందారులకు అదనపు ఆదాయం సమకూరడమే కాకుండా, నాణ్యతతో కూడిన ఎగుమతి ఆధారిత తేనె ఉత్పత్తి పద్ధతులను అవలంబించేందుకు వారికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది.

 

ఈ కార్యక్రమానికి సాల్ట్ రేంజ్ ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ పూర్తి మద్దతునందించి, చేయూతనిచ్చింది. ఈ సంస్థ తేనె ఉత్పత్తిని పెంచడానికి, ఎగుమతికి అనువైన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి దెర్గాంగ్ ఎఫ్‌పీతో కలిసి పనిచేస్తోంది. ఈ ఉమ్మడి భాగస్వామ్యం వల్ల సదరు ఎఫ్‌పీఓ అంతర్జాతీయ మార్కెట్ వైపు తన తొలి అడుగు వేయగలిగింది. అలాగే స్థానిక రైతులు కూడా ఎగుమతి వ్యాపారంలో క్రమబద్ధమైన పద్ధతిలో భాగస్వాములు కావడానికి ఒక మంచి అవకాశం లభించింది.

 

త్రిపుర రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ ఎగుమతుల వ్యవస్థకు, ముఖ్యంగా తేనె, తేనెటీగల పెంపక రంగానికి ఈ ఎగుమతి కీలకంగా నిలిచింది. వైవిధ్యభరితమైన వ్యవసాయ వనరులు ఉన్న త్రిపురలో.. సంఘటిత రైతు సంఘాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన తేనె, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను మరింత విస్తరించడానికి భారీ అవకాశాలు ఏర్పడ్డాయి.

 

 

ఈ ఆవ తేనె ఎగుమతి విజయం ఎఫ్‌పీఓలు, ప్రైవేటు పరిశ్రమలు కలిసికట్టుగా పనిచేస్తే స్థానిక రైతులను అంతర్జాతీయ మార్కెట్లతో ఎలా అనుసంధానించవచ్చో నిరూపించింది. ఈ కార్యక్రమం త్రిపురతో పాటు, ఈశాన్య భారత్‌లోని ఇతర ఎఫ్‌పీఓలను, రైతులను కూడా తమ ఉత్పత్తులకు విలువ జోడించడం, నాణ్యతను పెంచడం, విదేశీ ఎగుమతి అవకాశాలను అన్వేషించేలా ఎంతగానో  ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.

 

ఈ అద్భుతమైన విజయంపై త్రిపుర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ రతన్ లాల్ నాథ్ హర్షం వ్యక్తం చేస్తూ.. ‘‘దెర్గాంగ్ ఎఫ్‌పీఓ సాధించిన ఈ తొలి ఆవ తేనె ఎగుమతి త్రిపుర తేనెటీగల పెంపకందారులకు, రైతులకు ఒక గొప్ప విజయం. మన స్థానిక వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునే సత్తా ఉందని, తద్వారా రైతు కుటుంబాల ఆదాయాన్ని మెరుగుపరచవచ్చని ఇది నిరూపించింది. రాష్ట్రంలో తేనెటీగల పెంపకాన్ని,సేంద్రీయ వ్యవసాయాన్ని బలోపేతం చేయడంతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, పెద్ద మార్కెట్లను చేరుకునేలా సహాయం చేయడానికి త్రిపుర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. రైతులు, ఎఫ్‌పీఓలు, ఎగుమతిదారులు, ఏపీఈడీఏ వంటి ప్రభుత్వ సంస్థల ఉమ్మడి కృషితో.. నాణ్యమైన వ్యవసాయ, ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రపంచ మార్కెట్లో త్రిపుర తన ఉనికిని మరింత బలంగా చాటుకోగలదు’’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ఈ తేనే ఎగుమతి సరుకును  త్రిపుర రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ రతన్ లాల్ నాథ్ అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో త్రిపుర ప్రభుత్వ వ్యవసాయ, ఉద్యానవన శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ రాయ్ ఐఏఎస్‌, ఐఎఫ్‌ఓఎమ్ ఆర్గానిక్స్ ఆసియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి జెన్నీఫర్ చాంగ్, ఏపీఈడీఏ ఉన్నతాధికారులు, ఎగుమతిదారుల ప్రతినిధులు, లాజిస్టిక్స్ భాగస్వాములు, ఆ ప్రాంతానికి చెందిన ఆదర్శ తేనెటీగల పెంపకందారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

ఈశాన్య భారత ప్రాంతం నుంచి వ్యవసాయ ఎగుమతులను పెంపొందించడానికి ఏపీఈడీఏ నిరంతరం కృషి చేస్తోంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు సంఘాలు, ఎగుమతిదారులు, ప్రాసెసర్లు, ఇతర భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది. మార్కెట్ అనుసంధానం, నైపుణ్యాభివృద్ధి, నాణ్యత హామీ, ఎగుమతుల సౌలభ్యం ద్వారా ఎగుమతులను వేగవంతం చేస్తోంది. ఇటువంటి కార్యక్రమాలు రైతులకు నిరంతర ఆదాయం ఇచ్చే మార్కెట్ అవకాశాలను సృష్టించడమే కాకుండా, దేశంలోని విభిన్న వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2297402) సందర్శకుల సూచీ సంఖ్య : : 49
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , हिन्दी , Tamil