శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కృత్రిమ మేధ ఆధారిత స్వదేశీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్


సాంకేతికత వాణిజ్యీకరణ కోసం విశాఖపట్నం గ్రీవా హెల్త్‌కేర్‌కు టీడీబీ-డీఎస్‌టీ మద్దతు

నాడు పోస్టు చేయడమైనది: 10 AUG 2026 4:01PM by PIB Hyderabad

మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ముందస్తు తనిఖీలు అత్యంత కీలకమని భావించిన ప్రభుత్వం, ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ పరిధిలోని ‘సాంకేతిక అభివృద్ధి మండలి’ (టీడీబీ). విశాఖపట్నానికి చెందిన గ్రీవా హెల్త్‌కేర్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. గర్బాశయ ముఖధార క్యాన్సర్ పూర్వ సంకేతాలను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ సహాయ సామర్థ్యాలు కలిగిన పోర్టబుల్ డిజిటల్ కాల్పోస్కోప్ ‘గ్రీవావిజన్’ తయారీ, వాణిజ్యీకరణకు మద్దతు ఇవ్వడానికి ఈ ఒప్పందం కుదిరింది.

టీడీబీ ఆర్థిక మద్దతుతో గ్రీవా హెల్త్‌కేర్ సంస్థ కేరళలోని కొల్లాం ప్రాంతంలో ఒక అధునాతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేపట్టి, ఈ సాంకేతికతను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. ముఖ్యంగా ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ సేవలను మరింత సులభంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావడం ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం. అధునాతన వైద్య పరికరాల తయారీలో దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఖరీదైన వైద్య పరికరాలపై ఆధారాన్ని తగ్గించేందుకు ఇది తోడ్పడుతుంది.

గ్రీవావిజన్ అనేది కృత్రిమ మేధ సాంకేతికతతో పనిచేసే డిజిటల్ కాల్పోస్కోప్ పరికరం. దీనిని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు.ఇందులో హై-డెఫినిషన్ కెమెరా, ఇన్‌బిల్ట్ డిస్‌ప్లే, సులభంగా ఉపయోగించే ఇంటర్‌ఫేస్, ఆధునాతన ఆప్టిక్స్, స్వదేశీ కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్‌వేర్ అమర్చి ఉంటుంది. సాధారణ పరీక్షల సమయంలో గైనకాలజిస్టులు గర్భాశయ ముఖద్వారంలోని మార్పులను సులభంగా పరిశీలించి, క్యాన్సర్‌కు దారితీసే గాయాలను, అసాధారణతలను వెంటనే గుర్తించడానికి ఈ పరికరం సహాయపడుతుంది. ఈ సాంకేతికత డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదించిన ఆటోమేటెడ్ విజువల్ ఎవాల్యుయేషన్ (ఏవీఈ) ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. దీని సాఫ్ట్‌వేర్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) నిబంధనలకు కట్టుబడి పనిచేయడం వల్ల బాధితుల డేటాను దేశ డిజిటల్ ఆరోగ్య వ్యవస్థతో సులభంగా అనుసంధానించవచ్చు.

విశాఖపట్నానికి చెందిన గ్రీవా హెల్త్‌కేర్ తయారు చేసిన ఈ పరికరం క్లాస్‌ బీ నాన్-ఇన్వేసివ్ వైద్య పరికరంగా వర్గీకరించారు. దీనికి సీడీఎస్‌సీఓ నుంచి క్లాస్ బీ తయారీ లైసెన్స్ లభించింది. ఈ పరికరాన్ని అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలైన ఐఎస్‌ఓ 13485కి అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నారు. దీని ప్రత్యేక హార్డ్‌వేర్ నిర్మాణాన్ని గ్రీవా హెల్త్‌కేర్‌ సంస్థ సొంతంగా డిజైన్ చేసి, భారత్‌లో పేటెంట్ కూడా పొందింది. ప్రస్తుతం గ్రీవా హెల్త్‌కేర్ తన పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను విశాఖపట్నంలోని ఏఐసీ- ఏఎంటీజెడ్‌ మెడివ్యాలీలో నిర్వహిస్తోంది. టీడీబీ మద్దతుతో కేరళలోని నూతన కేంద్రంలో వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తిని భారీ స్థాయిలో ప్రారంభించనుంది.

స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించడం, స్థానిక తయారీకి ప్రాధాన్యత ఇవ్వడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ సాంకేతికతను పూర్తిగా భారత్‌లోనే రూపొందించారు. పరికరంలో ఉపయోగిస్తున్న విడిభాగాల్లో 50 శాతానికి పైగా ప్రస్తుతం దేశీయంగానే సేకరిస్తున్నారు. దీనిని భారీ స్థాయిలో వాణిజ్యపరంగా తయారు చేయడం వల్ల దేశీయ వైద్య పరికరాల సరఫరా వ్యవస్థ మరింత బలపడటమే కాకుండా, గర్బాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణలో విదేశీ పరికరాలకు ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో కూడిన భారతీయ సాంకేతికత అందుబాటులోకి వస్తుంది.

దేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ అవసరమైన మహిళల జనాభా చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సాంకేతికత అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లే సౌలభ్యం, డిజిటల్ ఇమేజింగ్, కృత్రిమ మేధ ఆధారిత తనిఖీ, ఎక్కడైనా సులభంగా వినియోగించే వెసులుబాటు కలిగిన గ్రీవావిజన్‌.. ప్రత్యేక వైద్య సదుపాయాలు ఉన్న కేంద్రాలకే పరిమితమైన స్క్రీనింగ్‌ను మరింత విస్తృత ప్రాంతాలకు తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. తగిన వైద్య సదుపాయాలు, వనరులు అందుబాటులో లేని ప్రాంతాల్లో మహిళలకు స్క్రీనింగ్ సేవలను అందించడంలో వైద్యులకు ఎంతో తోడ్పడుతుంది.

ఈ సందర్భంగా టీడీపీ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ.. ‘‘గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో ముందస్తు నిర్ధారణ అత్యంత నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. ప్రాణాంతక వ్యాధుల నివారణకు వైద్య పరికరాలు, డిజిటల్ ఆరోగ్యం, కృత్రిమ మేధ కలిసి ఏవిధంగా పరిష్కారం చూపించవచ్చనే దానికి గ్రీవావిజన్ లాంటి స్వదేశీ సాంకేతికతలే నిదర్శనం. వైద్య పరికరాల తయారీలో భారత్‌ను స్వయంసమృద్ధి దిశగా తీసుకెళ్లడమే లక్ష్యంగా టీడీబీ పనిచేస్తోంది. దేశీయ ఆవిష్కరణలను కేవలం ప్రయోగశాలలకే పరిమితం చేయకుండా, వాణిజ్యపరమైన ఉత్పత్తి స్థాయికి తీసుకెళ్లడం ద్వారానే సామాన్యులకు అధునాతన క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి’’ అని పేర్కొన్నారు.

టీడీబీ అందిస్తున్న ఆర్థిక, సాంకేతిక మద్దతుపై గ్రీవా హెల్త్‌కేర్ సంస్థ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. ఈ ప్రోత్సాహంతో తమ స్వదేశీ సాంకేతికతను వాణిజ్య ప్రాతిపదికన భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి, దేశవ్యాప్తంగా కృత్రిమ మేధ ఆధారిత క్యాన్సర్ తనిఖీలను విస్తరించడానికి మార్గం సుగమమైందని పేర్కొంది. ప్రత్యేకమైన ఆసుపత్రులు, వైద్య సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు కూడా అత్యంత విశ్వసనీయమైన స్క్రీనింగ్ పరికరాలను చేరువ చేయడమే తమ ప్రధాన ధ్యేయమని సంస్థ స్పష్టం చేసింది.

 

***


(రిలీజ్ ఐడి: 2297389) సందర్శకుల సూచీ సంఖ్య : : 54
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil