శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
లక్నోలోని సీఎస్‌ఐఆర్-ఎన్‌బీఆర్‌ఐ అభివృద్ధి చేసిన దేశంలోనే తొలి ఎకో ఎడ్యూకేషనల్ హబ్‌ను జాతికి అంకితం చేసిన కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
సాంకేతికతను, విజయగాథలను ప్రజలకు చేరవేయటం ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సమాజానికి చేరువ చేయాలని పిలుపునిచ్చిన డాక్టర్ జితేంద్ర సింగ్
శాస్త్ర, సాంకేతిక సంస్థలు పరిశోధనలను ఉపాధి, సామాజిక అవసరాలతో అనుసంధానించాలి: డాక్టర్ జితేంద్ర సింగ్
సమాజంపై ప్రభావవంతంగా ఉండేలా వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంతో కూడిన శాస్త్రీయ ప్రయత్నాలు అవసరమన్న డాక్టర్ జితేంద్ర సింగ్
సాంకేతిక బదిలీలు, జీవవైవిధ్య సంరక్షణ, అనుభవపూర్వక అభ్యాసం ద్వారా శాస్త్రానికి, సమాజానికి మధ్య అనుసంధానాన్ని తెలియజేసే సీఎస్‌ఐఆర్-ఎన్‌బీఆర్‌ఐ
प्रविष्टि तिथि:
08 AUG 2026 4:54PM by PIB Hyderabad
శాస్త్రీయ సంస్థల పనులను సమాజానికి మరింత చేరువ చేయాలని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాఖల సహాయమంత్రి (స్వతంత్ర హోదా), ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయమంత్రి, సీఎస్‌ఐఆర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ జితేంద్ర సింగ్ నేడు పిలుపునిచ్చారు. లక్నోలోని బాంథ్రా వద్ద మహర్షి పరాశర్ బయోరిసోర్స్ సెంటర్ (ఎంపీబీసీ)లో తొలి సీఎస్‌ఐఆర్-నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎస్‌ఐఆర్-ఎన్‌బీఆర్‌ఐ) 'ఎకో ఎడ్యూకేషనల్ హబ్' 'ప్రకృతి జ్ఞాన్ ధామ్'ను జాతికి అంకితం చేశారు. శాస్త్రీయ సంస్థల సాంకేతికతలు, విజయగాథలను, సామాజిక అనువర్తనాలను సమాజానికి తెలియజేయాలని కోరారు.
శాస్త్రీయ సంస్థల పరిధి కేవలం ప్రయోగశాలలు, సంస్థల ప్రాంగణాలకే పరిమితం కాకూడదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విజయవంతమైన సాంకేతికతలు, కార్యక్రమాలను తెలియజేసేందుకు డిజిటల్, సోషల్ మీడియా వేదికలను మరింతగా ఉపయోగించాలన్నారు. తద్వారా రైతులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, పరిశ్రమలు, ఇతర భాగస్వాములు... శాస్త్రీయ పరిష్కారాలను, జీవనోపాధి అవకాశాలను పొందగలరని తెలిపారు. శాస్త్ర సాంకేతిక పరిశోధనలు, నూతన ఆవిష్కరణల ద్వారా సమాజానికి మేలు జరిగేలా వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖల పరిధిలోని ఒకే రకమైన, పరస్పర సంబంధమున్న ప్రాజెక్టులను అనుసంధానించాలని ఆయన పిలుపునిచ్చారు. దీనివల్ల సంస్థలన్నీ కలిసికట్టుగా పని చేసేందుకు వీలవుతుంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆరోగ్య సలహాదారు డాక్టర్ జీ.ఎన్. సింగ్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒరిస్సా వైస్ ఛాన్సలర్ డాక్టర్ అజిత్ కుమార్ శసాన్సన్, సీఎస్‌ఐఆర్-ఎన్‌బీఆర్‌ఐ, జమ్మూలోని సీఎస్‌ఐఆర్-ఐఐఐఎం డైరెక్టర్ డాక్టర్ జబీర్ అహ్మద్, సీనియర్ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సీఎస్ఐఐర్ ఫ్లోరికల్చర్ మిషన్ లబ్ధిదారులు, ఇతర ఆహ్వానితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శాస్త్రీయ పరిశోధన, పర్యావరణ విద్య, జీవవైవిధ్య పరిరక్షణ, వృక్షశాస్త్ర వారసత్వం, సాంస్కృతిక విశ్లేషణ కలిసిన విశిష్ట కేంద్రమే ఎకో-ఎడ్యుకేషనల్ హబ్. భారతదేశ సుసంపన్న వృక్షజాలం సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా దీన్ని రూపొందించారు. విద్యార్థులు, పరిశోధకులు, విద్యావేత్తలు, ప్రకృతి ప్రేమికులు, సాధారణ ప్రజలందరికీ ఆకట్టుకునే అనుభవాన్ని ఇది కల్పిస్తుంది.
శాస్త్రీయ పరిజ్ఞానానికి, ప్రజల భాగస్వామ్యానికి మధ్య ఈ హబ్ అనుసంధాన వేదిక. భారతదేశ మొక్కల వైవిధ్యం, పరిరక్షణ ప్రయత్నాలు, వృక్షశాస్త్ర వారసత్వాన్ని ఆచరణాత్మక, పరస్పర అభ్యాసం ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేలా దీనిలో సౌకర్యాలను కల్పించారు. శాస్త్రీయ సంస్థలకు, సమాజానికి మధ్య సంబంధాన్ని బలోపేతం చేయటంలో, శాస్త్రీయ విజ్ఞాన ఆచరణాత్మక విలువలపై అవగాహన కల్పించటంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
ఈ హబ్ ప్రధాన విశేషాల్లో 'పావన్ పాత్' (ప్రకృతిని ఆస్వాదించేందుకు మొక్కలు, వాటికి సంబంధించిన వృక్ష సంపద) ఒకటి. ఈ ప్రాంగణంలో సందర్శకులకు అద్భుతమైన అనుభూతిని కలిగించే ప్రధానమైన మార్గం ఇదే. ఈ మార్గంలో వివిధ పర్యావరణ ప్రాంతాలకు చెందిన అరుదైన మొక్కలను, వాటికి సంబంధించిన వృక్షజాలాన్ని సందర్శకులు దగ్గరగా చూడవచ్చు.
ఈ హబ్‌కు ప్రధాన కేంద్రంగా ఇండియన్ హెరిటేజ్ గార్డెన్ ఉంది. ఇది దేశవ్యాప్తంగా చారిత్రక ప్రాముఖ్యత గల ప్రాంతాల నుంచి సేకరించి, అభివృద్ధి చేసిన వారసత్వ చెట్లతో ఉంటుంది. ఈ ఉద్యానవనంలో ఫతేపూర్‌కు చెందిన 52 మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగానికి ప్రతీక అయిన బవాన్ ఇమ్లీ చింత చెట్టు, లక్నోకు చెందిన మదర్ దశహరి మామిడి చెట్టు, ప్రయాగ్‌రాజ్‌కు చెందిన పాటలపురి మర్రి చెట్టు, చంపారన్‌లోని భితిహర్వాలో మహాత్మా గాంధీ నాటిన మామిడి చెట్టు, గుజరాత్‌లోని చరిత్రాత్మక దండియాత్ర మార్గానికి సంబంధించిన చెట్ల వంశపారంపర్య మొక్కలున్నాయి.
స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఈ వారసత్వ చెట్లకు సంబంధించిన చరిత్రాత్మక, సాంస్కృతిక, వృక్షశాస్త్ర సమాచారాన్ని సందర్శకులు తెలుసుకునేందుకు ఈ ఉద్యానవనంలో క్యూఆర్-ఆధారిత ఆడియో వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇది ఈ ప్రాంగణాన్ని పరస్పర అభ్యాస ప్రదేశంగా మారుస్తుంది.
విభవ్ ఎన్‌క్లేవ్ - భారతదేశంలోని అంతరించిపోతున్న మొక్కల ఉద్యానవనం... అరుదైన, అంతరించిపోతున్న, ప్రమాదంలో ఉన్న మొక్కల జాతుల కోసం ప్రత్యేకమైన ప్రదేశం. ఇది జీవవైవిధ్య నష్టం, ఆవాసాల క్షీణత, వాతావరణ మార్పులు, మొక్కల జన్యు వనరులను సంరక్షించాల్సిన అవసరంపై అవగాహన కల్పిస్తుంది. భైరవ్ ఎన్‌క్లేవ్ - భారతదేశ రాష్ట్రాల మొక్కల ఉద్యానవనం... వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారిక రాష్ట్ర మొక్కలను ఒకచోట చేర్చి, వాటి పర్యావరణ, సాంస్కృతిక, విశిష్టమైన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
మరో ప్రత్యేక ఆకర్షణ బాంబూస్టియం. ఇది 43 స్వదేశీ, విదేశీ వెదురు జాతులతో రూపొందించినది. పర్యావరణ పునరుద్ధరణ, కార్బన్‌ను నిల్వ చేయటం, మృత్తికా సంరక్షణ, స్థిరమైన జీవనోపాధి, సంప్రదాయ హస్తకళలు, గ్రీన్ మౌలిక సదుపాయాల్లో వెదురు ప్రాముఖ్యతను ఈ కేంద్రం వివరిస్తుంది.
ఈ కార్యక్రమంలో ప్రారంభించిన, బదిలీ చేసిన సాంకేతికతలు, ఉత్పత్తుల్లోనూ ఈ హబ్ విజ్ఞాన శాస్త్రాన్ని సమాజానికి చేరవేయటం ప్రతిబింబించింది. హిమాలయ సంస్థ సహకారంతో అభివృద్ధి చేసిన పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించిన మూలికా సూత్రం అధికారికంగా ప్రారంభమైంది. శాస్త్ర ఆధారిత విలువైన ఉత్పత్తుల ద్వారా మహిళా నేతృత్వంలోని వ్యవస్థాపకతను, జీవనోపాధిని పెంపొందించే ఉద్దేశంతో నాలుగు మొక్కల ఆధారిత సాంకేతికతలను కేరళలోని కుటుంబశ్రీ రాష్ట్ర పేదరిక నిర్మూలన మిషన్‌కు బదిలీ చేశారు. ఆ ఉత్పత్తులు: హెర్బల్ యాంటి-డాండ్రఫ్ హెయిర్ కేర్ ఆయిల్, ప్రోటస్: లోటస్-ఇన్‌స్పైర్డ్ పర్ఫ్యూమ్, ప్రోటస్: రుద్ర పర్ఫ్యూమ్, హెర్బల్ నానో సీరం.
పరిశ్రమలు-విద్యాసంస్థల సహకారాన్ని మరింత బలోపేతం చేస్తూ... లక్నోలోని విట్‌వే సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు తక్కువ ఖర్చుతో కూడిన ఫోటోబయోరియాక్టర్ రూపకల్పన, అభివృద్ధిని సీఎస్‌ఐఆర్-ఎన్‌బీఆర్‌ఐ బదిలీ చేసింది. శాస్త్రీయ సంస్థలో రూపుదిద్దుకున్న పరిశోధనలను విస్తృత సాంకేతిక, పారిశ్రామిక అనువర్తనాల కోసం ఎలా ముందుకు తీసుకెళ్లవచ్చో ఈ సాంకేతికత బదిలీ నిరూపిస్తుంది.
శాస్త్రీయ సంస్థలు కేవలం సమాచార ప్రసార సాధనాలుగా మాత్రమే ఉండిపోకుండా.. విజయగాథలను, సాంకేతిక విజయాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. దీనివల్ల జీవనోపాధికి, ఆర్థిక అవకాశాలకు దోహదపడే పరిష్కారాల గురించి వినియోగదారులు, వాటాదారులకు అవగాహన కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జరిగిన సాంకేతికత బదిలీలు ఈ విధానానికి ఒక ఆచరణాత్మక ఉదాహరణగా నిలిచాయి. ఇవి సంస్థాగత పరిశోధనలను వ్యవస్థాపకత, పరిశ్రమలు, జీవనోపాధి కల్పనతో అనుసంధానించాయి.
ప్రాజెక్టులు, లక్ష్యాలు ఒకే విధంగా ఉన్నప్పుడు... విభాగాలు, మంత్రిత్వ శాఖలు సంస్థల మధ్య సమన్వయంతో కూడిన పని ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. ఇటువంటి సహకారం ద్వారా పరస్పర శాస్త్రీయ సామర్థ్యాలను ఏకం చేసేందుకు, విజయవంతమైన కార్యక్రమాలు మరింత విస్తృతమైన ప్రభావం చూపటానికి దోహదపడతాయని తెలిపారు.
మొక్కల శాస్త్ర పరిశోధనలను రైతులు, పరిశ్రమలు, సాధారణ ప్రజల కోసం సాంకేతికతలుగా, ఉత్పత్తులుగా మార్చటంలో సీఎస్‌ఐఆర్-ఎన్‌బీఆర్‌ఐ అందిస్తున్న కృషిని మంత్రి అభినందించారు. భవిష్యత్తులో ఎదురయ్యే పర్యావరణ, వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతలతో అనుసంధానించాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు.
భారతదేశ వృక్షసంపదను, మొక్కల వైవిధ్యంతో ముడిపడున్న సాంస్కృతిక, చారిత్రక, పర్యావరణ ప్రాముఖ్యతను తెలియజేసే ఒక డాక్యుమెంటరీని ఈ కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేశారు.
సీఎస్‌ఐఆర్-ఎన్‌బీఆర్‌ఐ, జమ్మూ సీఎస్‌ఐఆర్-ఐఐఐఎం డైరెక్టర్ డాక్టర్ జబీర్ అహ్మద్ ప్రసంగిస్తూ.. ముఖ్య అతిథికి, ఇతర ప్రముఖులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మొక్కల శాస్త్ర పరిశోధన, పరిరక్షణ, సాంకేతిక అభివృద్ధిలో సంస్థ చేసిన కృషి గురించి మాట్లాడారు. చర్చలు, అనుభవపూర్వక అభ్యాసం ద్వారా సందర్శకులు దేశ మొక్కల వారసత్వాన్ని అనుభూతి చెందటానికి వీలుగా ఈ ఎకో-ఎడ్యుకేషనల్ హబ్‌ను రూపొందించినట్లు చెప్పారు. భారతదేశ వృక్షజాల వైవిధ్యానికి జీవనాధారమైన భాండాగారంగా ఇది ఉందని పేర్కొన్నారు.
వృక్షజాల వైవిధ్యం, పరిరక్షణ, వారసత్వం, శాస్త్రీయ పరిజ్ఞానానికి వేదికగా నిలుస్తూ అనుభవపూర్వక అభ్యాసం, ప్రజల భాగస్వామ్యం కోసం జాతీయ గమ్యస్థానంగా బాంథ్రా క్యాంపస్‌లోని ఎంపీబీసీ వద్ద ఎకో-ఎడ్యుకేషనల్ హబ్ రూపుదిద్దుకుంది. సజీవ సేకరణలు, వారసత్వ మార్గాలు , డిజిటల్ విశ్లేషణ, సాంకేతికత ఆధారిత కార్యక్రమాల ద్వారా ఈ హబ్... ప్రజలకు, ప్రకృతికి మధ్య బలమైన అనుబంధాన్ని పెంపొందించటంతో పాటు శాస్త్రీయ సంస్థలకు, సమాజానికి మధ్య అనుసంధానాన్ని బలపరిచే ప్రయత్నం చేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2296682)
आगंतुक पटल : 10