శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సీఎస్‌ఐఆర్‌ సమగ్ర నైపుణ్య కార్యక్రమం: మూడో దశ తొలి ఏడాదికి సంబంధించి (2025-30) పర్యవేక్షణ కమిటీ-సమన్వయకర్తల సదస్సు

నాడు పోస్టు చేయడమైనది: 08 AUG 2026 9:48AM by PIB Hyderabad

సీఎస్ఐఆర్ సమగ్ర నైపుణ్య కార్యక్రమం మూడో దశ(2025–30) తొలి సంవత్సరానికి సంబంధించిన సమన్వయకర్తల సదస్సుతోపాటు పర్యవేక్షణ కమిటీ సమావేశం పూణేలో ఎన్‌సీఎల్‌ వేదికగా విజయవంతంగా జరిగింది. ఘజియాబాద్‌లోని సీఎస్ఐఆర్-మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (సీఎస్‌ఐఆర్‌-హెచ్‌ఆర్‌డీసీ), పూణేలోని సీఎస్ఐఆర్-జాతీయ రసాయన ప్రయోగశాల (సీఎస్‌ఐఆర్‌-ఎన్‌సీఎల్‌) సంయుక్త భాగస్వామ్యంతో 2026 ఆగస్టు 6-7 తేదీల్లో ఈ రెండు రోజుల సదస్సును నిర్వహించారు. మూడో దశ మొదటి సంవత్సరంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. వివిధ ప్రయోగశాలల మధ్య సమాచార మార్పిడిని సులభతరం చేయడానికి, ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ సదస్సు కీలక వేదికగా నిలిచింది.

 

ప్రముఖులకు, ప్రతినిధులకు ఘన స్వాగతం పలకడం, సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేయడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. సీఎస్ఐఆర్-ఎన్‌సీఎల్‌ శాస్త్రవేత్త డాక్టర్ రాజేష్ జీ గొన్నాడే సదస్సుకు వచ్చిన వారందరికీ స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ..ఈ సమావేశ లక్ష్యాలను సాధించడంలో పరస్పర సహకారం, కొత్త ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి ఎంత కీలకమో వివరించారు. అనంతరం సీఎస్ఐఆర్-హెచ్‌ఆర్‌డీసీ శాస్త్రవేత్త, నైపుణ్య నోడల్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ వినయ్ కుమార్ సదస్సు  ముఖ్య ఉద్దేశాలను తెలియజేశారు. 2025-26 సంవత్సరంలో  నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం సాధించిన అద్భుతమైన ప్రగతిని నివేదిక రూపంలో వివరించారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా యువతలో నైపుణ్యాలను పెంచడం ద్వారా, సాంకేతికతతో నడిచే బలమైన శ్రామిక శక్తిని నిర్మించవచ్చని, దేశవ్యాప్త నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేయడంలో సీఎస్ఐఆర్ కీలక పాత్ర పోషిస్తోందని స్పష్టం చేశారు. సీఎస్ఐఆర్-సెంట్రల్ ప్లానింగ్ డైరెక్టరేట్ (సీపీడీ) శాస్త్రవేత్త డాక్టర్ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ.. గతేడాదిగా ఈ కార్యక్రమం సాధించిన ముఖ్య విజయాలను, తీసుకువచ్చిన విధానపరమైన మార్పులను వివరించారు. జ్ఞానాన్ని డిజిటల్ రూపంలోకి మార్చడం, అనుభవపూర్వక, ఆవిష్కరణలతో కూడిన నైపుణ్యాభివృద్ధి పరిష్కారాలను అందించడానికి సీఎస్ఐఆర్ కట్టుబడి ఉందని ఘజియాబాద్ సీఎస్ఐఆర్-హెచ్‌ఆర్‌డీసీ అధిపతి డాక్టర్ టీఎస్‌ రాణా పేర్కొన్నారు.

 

గురుగ్రామ్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెస్టిసైడ్ ఫార్ములేషన్ టెక్నాలజీ (ఐపీఎఫ్‌టీ) డైరెక్టర్, పర్యవేక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మోహన కృష్ణా రెడ్డి ముదియం మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో నైపుణ్యాభివృద్ధి ఒక ముఖ్యమైన భాగమని తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు, పరిశ్రమలకు తగ్గట్టుగా ఒక బలమైన నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను నిర్మించడానికి, ఈ సీఎస్ఐఆర్ సమగ్ర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం అనుసరించాల్సిన ప్రాధాన్యత కలిగిన అయిదు అంశాలను ఆయన వివరించారు. అనంతరం పూణే సీఎస్ఐఆర్-ఎన్‌సీఎల్‌ డైరెక్టర్ డాక్టర్ ఆశిష్ లేలే మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న తన విస్తృతమైన పరిశోధనా వ్యవస్థ, శాస్త్రీయ నైపుణ్యాల ద్వారా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్కిల్ ఇండియా మిషన్ విజయవంతానికి సీఎస్ఐఆర్ అద్భుతమైన సహకారం అందించగలదని చెప్పారు. భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల కేంద్రంగా మార్చడంలో సీఎస్ఐఆర్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు.

 

సీఎస్ఐఆర్ సమగ్ర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం మూడో దశ కింద 2025–26 వార్షిక ప్రగతిపై  సమగ్ర సమీక్ష నిర్వహించడం ఈ సదస్సులో ప్రధాన అంశంగా నిలిచింది. మొదటి రోజు చర్చల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 37 సీఎస్ఐఆర్ ప్రయోగశాలల నుంచి నైపుణ్య నోడల్ కోఆర్డినేటర్లు పాల్గొని తమ వార్షిక ప్రగతి నివేదికలను సమర్పించారు. తాము నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు, లబ్ధి పొందిన అభ్యర్థుల వివరాలు, కొత్త ఆవిష్కరణలు, ఎదురైన సవాళ్లు, భవిష్యత్తు కార్యాచరణను వారు వివరించారు. ఈ నివేదికలు ప్రయోగశాలల అంతటా అమలు స్థితిని సమగ్రంగా అంచనా వేయడానికి పర్యవేక్షణ కమిటీకి వీలు కల్పించాయి. ఈ ప్రదర్శనలను ఐపీఎఫ్‌టీ డైరెక్టర్‌, పర్యవేక్షణ కమిటీ ఛైర్మన్‌ డాక్టర్ మోహన కృష్ణ రెడ్డి ముదియం, కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వశాఖ డైరెక్టర్‌ శ్రీ ఎన్ రమేష్ బాబు, ఢిల్లీ ఉత్పాదకతా మండలి సంయుక్త కార్యదర్శి శ్రీమతి అంజు బజాజ్, జేపీ. బోస్ శాస్త్ర సాంకేతికత విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, ఛైర్‌పర్సన్ డాక్టర్ అరవింద్ కుమార్, లైఫ్ సైన్సెస్ సెక్టార్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎస్‌ఎస్‌ఎస్‌డీసీ) ఉపాధ్యక్షుడు శ్రీ అన్షుల్ సక్సేనా పరిశీలించారు. నైపుణ్యాభివృద్ధి కోసం అమలు అవుతున్న తీరును, అత్యుత్తమ విధానాలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి ఈ సదస్సు ఒక మంచి వేదికగా నిలిచింది. పర్యవేక్షణ కమిటీ సుదీర్ఘ సమీక్ష, చర్చతో తొలి రోజు సమావేశం ముగిసింది. ఇప్పటివరకు ఈ కమిటీ సాధించిన ప్రగతిని అభినందించి, ఈ శిక్షణా కార్యక్రమాల నాణ్యతను, సమర్థతను, దీర్ఘకాలిక ప్రభావాన్ని మరింత పెంచి ఎక్కువ మందికి చేరవేసేందుకు కొన్ని నిర్మాణాత్మక సూచనలను అందించింది.

 

రెండో రోజు రెండు సాంకేతిక సమావేశాలు జరిగాయి. మొదటి కార్యక్రమంలో ఎల్ఎస్ఎస్ఎస్‌డీసీ ఉపాధ్యక్షుడు శ్రీ అంశుల్ సక్సేనా మాట్లాడారు. విద్యార్థుల ఉపాధి అవకాశాలను పెంచేందుకు, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణను రూపొందించేందుకు, సీఎస్ఐఆర్-లైఫ్ సైన్సెస్ రంగానికి మధ్య భాగస్వామ్యాన్ని ఎలా బలోపేతం చేయాలో ఆయన వివరించారు. రెండో కార్యక్రమంలో సీఎస్ఐఆర్-సెంట్రల్ ప్లానింగ్ డైరెక్టరేట్ శాస్త్రవేత్త డాక్టర్ అభిషేక్ కుమార్ ప్రసంగిస్తూ... నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల సమర్థవంతమైన అమలు, ఆర్థిక వనరుల సరైన వినియోగం, పర్యవేక్షణ, ప్రాజెక్టు ప్లానింగ్ విధానాలపై అవగాహన కల్పించారు.

 

ఒక ముగింపు సమావేశంతో ఈ కార్యక్రమం పూర్తయింది. ఇందులో వివిధ సీఎస్ఐఆర్ ప్రయోగశాలల నైపుణ్య నోడల్ అధికారులు పాల్గొని తమ అనుభవాలను పంచుకోవడంతో పాటు, ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పలు సూచనలు చేశారు. ఈ రెండు రోజుల సదస్సు ద్వారా సీఎస్ఐఆర్ ప్రయోగశాలల మధ్య సమన్వయం మరింత పెరిగింది. మూడో దశ మొదటి సంవత్సరంలో సాధించిన విజయాలను సమగ్రంగా సమీక్షించడంతో పాటు, ఈ శిక్షణా కార్యక్రమాల నాణ్యతను, పరిధిని పెంచేందుకు కీలక వ్యూహాలను ఖరారు చేశారు. ఈ సమావేశంలో వచ్చిన సిఫార్సులు దేశానికి అవసరమైన అత్యున్నత సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడంలో ఎంతగానో తోడ్పడతాయని భావిస్తున్నారు.

 


(రిలీజ్ ఐడి: 2296524) సందర్శకుల సూచీ సంఖ్య : : 45
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Tamil