శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్థిక సమ్మిళితం నుంచి ఆర్థిక సాధికారత వైపు, డిజిటల్ చెల్లింపుల నుంచి డిజిటల్ సమృద్ధి వైపు భారత్ అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నం: డాక్టర్ జితేంద్ర సింగ్


మేధోసంపన్నమైన, సురక్షితమైన, విశ్వసనీయమైన ఫిన్‌టెక్ వ్యవస్థను నిర్మించాలని మూడో ఇండియా ఇంటర్నేషనల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపు

కేవలం మూడు సంవత్సరాల్లోనే 1,000 కిలోమీటర్లకు పైగా సురక్షిత క్వాంటం కమ్యూనికేషన్ సాధించిన భారత్: డాక్టర్ జితేంద్ర సింగ్

సుమారు 350 నుంచి దాదాపు 2.4 లక్షల సంస్థలకు విస్తరించిన భారత స్టార్టప్ వ్యవస్థ : శ్రీ జితేంద్ర సింగ్

నాడు పోస్టు చేయడమైనది: 07 AUG 2026 4:17PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన జన్ ధన్ యోజన వంటి కార్యక్రమాల ఫలితంగా ఆర్థిక సమ్మిళితం సాధనలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని సైన్స్, టెక్నాలజీ, భూ విజ్ఞాన శాఖ స్వతంత్ర హోదా, ప్రధానమంత్రి కార్యాలయం, అణుశక్తి,  అంతరిక్ష , సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఇప్పుడు దేశం ఆర్థిక సమ్మిళితం నుంచి ఆర్థిక సాధికారత  వైపు దృఢంగా ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.

దేశంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ఆధారంగా మేధోసంపన్నమైన, సురక్షితమైన, విశ్వసనీయమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. కృత్రిమ మేధ, క్వాంటం సాంకేతికతలు, సైబర్ భద్రత, బ్లాక్‌చెయిన్, విశ్వసనీయ డిజిటల్ ఆవిష్కరణలు వంటి ఆధునిక సాంకేతికతలే భారత ఫిన్‌టెక్ రంగం తదుపరి వృద్ధి దశను నిర్దేశిస్తాయని ఆయన అన్నారు.

న్యూఢిల్లీలో జరిగిన మూడో ఇండియా ఇంటర్నేషనల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగిస్తూ, బ్యాంకింగ్ రంగం, ఆర్థిక సంస్థలు, సాంకేతిక సంస్థలు, స్టార్టప్‌ల మధ్య సన్నిహిత సహకారంతో భారత ఫిన్‌టెక్ రంగం దేశ ఆర్థిక మార్పునకు కీలక చోదకశక్తిగా అవతరించిందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాల మద్దతుతో కొనసాగుతున్న ఈ సహకార విధానమే వేగంగా విస్తరిస్తున్న భారత ఆవిష్కరణల వ్యవస్థకు బలమైన పునాదిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

ఆర్థిక సేవల భవిష్యత్తును నిర్దేశించడంలో అత్యాధునిక సాంకేతికతల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తదుపరి తరం ఫిన్‌టెక్ పరిష్కారాలు కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, సైబర్ భద్రత, క్వాంటం సాంకేతికతలు, బ్లాక్‌చెయిన్ వంటి రంగాలపై మరింత దృష్టి సారించాలని ఆయన సూచించారు. సురక్షితమైన, స్థిరమైన, పౌర కేంద్రిత ఆర్థిక సేవలను అందించగల బాధ్యతాయుత కృత్రిమ మేధ,  విశ్వసనీయ ఆవిష్కరణలే భవిష్యత్తును శాసిస్తాయని ఆయన స్పష్టం చేశారు.

భారత్ సాధిస్తున్న సాంకేతిక పురోగతిని ప్రస్తావిస్తూ, జాతీయ క్వాంటం మిషన్ ద్వారా క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం సెన్సింగ్, క్వాంటం మెటీరియల్స్ మొదలైన నాలుగు కీలక రంగాల్లో పెట్టుబడులు పెడుతున్న ప్రపంచంలోని కొద్ది దేశాల జాబితాలో భారత్ ఒకటిగా నిలిచిందని శ్రీ జితేంద్ర సింగ్ తెలిపారు. జాతీయ క్వాంటం మిషన్ కింద పదేళ్లలో 2,000 కిలోమీటర్ల సురక్షిత క్వాంటం కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, కేవలం మూడు సంవత్సరాల్లోనే భారత్ 1,000 కిలోమీటర్లకు పైగా సురక్షిత క్వాంటం కమ్యూనికేషన్ వ్యవస్థను సాధించి, నిర్దేశిత గడువు కంటే ఎంతో ముందుగానే గణనీయమైన పురోగతిని సాధించిందని ఆయన తెలిపారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న అత్యాధునిక సాంకేతిక పర్యావరణ వ్యవస్థకు ఊతమిస్తున్న మరో కీలక కార్యక్రమంగా ఇండియాఏఐ మిషన్ ను ఆయన ప్రస్తావించారు.

ప్రపంచంలో చోటుచేసుకుంటున్న సాంకేతిక పరిణామాలకు భారత్ ఇకపై ఏళ్ల తర్వాత స్పందించే దేశంగా ఉండబోదని, వాటితో సమానంగా అడుగులు వేస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అంతరిక్ష రంగంతో పాటు అణుశక్తి రంగాన్ని కూడా ఇటీవల ప్రైవేట్ భాగస్వామ్యానికి తెరవడం ద్వారా ప్రభుత్వం అవలంబిస్తున్న సహకార విధానం ఆవిష్కరణలకు మరింత వేగం తీసుకువస్తూ, సాంకేతికత ఆధారిత ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలను సృష్టిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సుమారు 9 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువ కలిగిన భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ఈ దశాబ్దం ముగిసేలోపు 45 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశముందని ఆయన తెలిపారు. పరిశ్రమల భాగస్వామ్యంతో అమలవుతున్న విధాన సంస్కరణలు ఎంతటి ఫలితాలను అందించగలవో దీనిద్వారా స్పష్టమవుతోందని ఆయన అన్నారు.

భారత ఫిన్‌టెక్ రంగం తదుపరి వృద్ధి దశకు సిద్ధమవ్వాలంటే కృత్రిమ మేధ ఆధారిత ఆర్థిక సేవలు, సురక్షిత నిరంతర బ్యాంకింగ్, అధునాతన మోసాల నివారణ వ్యవస్థలు, సరిహద్దుల వెలుపల డిజిటల్ చెల్లింపులు, అందుబాటు ధరలో ఆర్థిక పరిష్కారాల అభివృద్ధిపై దృష్టి సారించాలని శ్రీ జితేంద్ర సింగ్ ఉద్ఘాటించారు. ఈ అభివృద్ధి చెందుతున్న రంగాలు భారత ఫిన్‌టెక్ సంస్థలు ప్రపంచ స్థాయిలో అగ్రగాములుగా ఎదగడానికి విస్తృత అవకాశాలను కల్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

భారత్‌లో ఆవిష్కరణల వ్యవస్థను ప్రస్తావిస్తూ,  గత దశాబ్దంలో దేశంలో స్టార్టప్‌ల సంఖ్య సుమారు 350 నుంచి దాదాపు 2.4 లక్షలకు పెరిగిందని శ్రీ జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు తగిన మానవ వనరుల సామర్ధ్యం, అనుకూల విధానాల వాతావరణం ఈ వృద్ధికి బలమైన పునాదిగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. ఈ పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే స్టార్టప్‌లు, నియంత్రణ సంస్థలు, విద్యా సంస్థలు, ఆర్థిక సంస్థలు, పరిశ్రమలు, సాంకేతిక సంస్థల మధ్య మరింత బలమైన భాగస్వామ్యం అవసరమని ఆయన ఉద్ఘాటించారు. అలాంటి సమన్వయంతోనే ప్రపంచ స్థాయిలో పోటీపడగల అత్యాధునిక ఆర్థిక సాంకేతికతలను అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

దేశంలో ఆర్థిక సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో అమలు చేసిన కార్యక్రమాల విజయమే భారత తదుపరి అభివృద్ధి దశకు బలమైన పునాదిగా నిలిచిందని కేంద్ర మంత్రి అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచ అగ్రగామిగా ఎదిగిన భారత్ ఇకపై డిజిటల్ చెల్లింపుల నుంచి డిజిటల్ సౌభాగ్యం దిశగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. సాంకేతికత ఆధారిత ఆర్థిక వ్యవస్థలు దేశ ఆర్థిక వృద్ధికి, ప్రజల జీవనోపాధి మెరుగుదలకు నేరుగా దోహదపడేలా రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

వేగంగా మారుతున్న సాంకేతిక పరిణామాల నేపథ్యంలో నిరంతర ఆవిష్కరణలు, కాలానుగుణంగా మార్పులను స్వీకరించడం అత్యవసరమని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంలో తదుపరి మార్పును ప్రస్తావిస్తూ, భవిష్యత్ పారిశ్రామిక విప్లవానికి కృత్రిమ మేధ ప్రధాన చోదకశక్తిగా నిలుస్తుందని, అదే సమయంలో ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి వంటి కీలక సవాళ్ల పరిష్కారంలో విప్లవాత్మక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం కింద ఇప్పటికే పది వేల మంది వ్యక్తుల జన్యు క్రమ విశ్లేషణ (జీనోమ్ సీక్వెన్సింగ్) ను విజయవంతంగా పూర్తి చేయడాన్ని ప్రస్తావిస్తూ, అత్యాధునిక విజ్ఞానశాస్త్రం, సాంకేతిక రంగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

శాస్త్రీయ ప్రతిభ, సాంకేతిక నాయకత్వం, సహకార భాగస్వామ్యాల సమన్వయంతో  ప్రపంచంలోనే విశ్వసనీయ ఆవిష్కరణల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అపూర్వ అవకాశం భారత్‌కు ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అత్యాధునిక సాంకేతికతలు, ఆవిష్కరణలు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలపై నిరంతర పెట్టుబడులు కొనసాగితే, ప్రపంచ సాంకేతిక పురోగతికి భారత్ గణనీయమైన తోడ్పాటు అందించడంతో పాటు తన సొంత ఆర్థిక మార్పును కూడా మరింత వేగవంతం చేయగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

 

***


(రిలీజ్ ఐడి: 2296436) సందర్శకుల సూచీ సంఖ్య : : 54
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil