బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శాస్త్రీయ విధానంలో గనుల మూసివేతలో, వాడకంలో లేని గనులను సుస్థిరమైన సామాజిక ఆస్తులుగా మార్చడంలో ముందున్న ఎస్ఈసీఎల్

నాడు పోస్టు చేయడమైనది: 07 AUG 2026 3:18PM by PIB Hyderabad

శాస్త్రీయ విధానంలో గనుల మూసివేతలో సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్) భారతదేశంలోనే ముందంజలో ఉంది. వాడకంలో లేని 28 గనులను శాస్త్రీయ విధానంలో విజయవంతంగా మూసివేసింది. కోల్ ఇండియా అనుబంధ సంస్థల్లో ఇదే అత్యధికం. దేశవ్యాప్తంగా శాస్త్రీయ విధానంలో మూసివేసిన గనుల్లో 67 శాతం ఈ సంస్థకు సంబంధించినవే. ఆర్థిక సంవత్సరం 2025–26లో 25 గనులను శాస్త్రీయంగా మూసివేసింది. భారతదేశంలోని ఏ సంస్థ అయినా ఒక ఏడాదిలో అత్యధికంగా మూసివేసిన గనుల సంఖ్య ఇది.

గనుల మూసివేతను గనుల తవ్వకానికి ముగింపుగా కాకుండా ఆ గని జీవితకాలంలో సమగ్ర భాగంగా ఎస్‌ఈసీఎల్‌ పరిగణిస్తుంది. బొగ్గును వెలికితీయడం పూర్తయిన తర్వాత ఆ భూభాగాన్ని రక్షించడం, పునరుద్దరించడం, భవిష్యత్తులో ఉత్పాదక వినియోగం కోసం భూమిని సిద్ధం చేయడంపై దృష్టి సారిస్తారు. దీనికోసం శాస్త్రీయ పునరుద్ధరణ, పునర్వినియోగ పద్ధతులను అవలంబిస్తారు.

శాస్త్రీయ విధానంలో మూసివేయడానికి వినియోగంలో లేని 54 గనులను ఎస్ఈసీఎల్ గుర్తించింది. వాటిలో ఆర్థిక సంవత్సరం 2024–25లో మూడు గనులను మూసివేయగా, ఆర్థిక సంవత్సరం 2025–26లో 25 గనులను మూసివేసింది. మరో 11 గనులను 2026–27 ఆర్థిక సంవత్సరంలోనూ, మిగిలిన 15 గనులను 2027–28 ఆర్థిక సంవత్సరంలోనూ మూసివేయాలని సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకుంది. గుర్తించిన గనులను శాస్త్రీయ విధానంలో దశల వారీగా మూసివేస్తోంది.

 

ప్రణాళికను, ఈ రంగంలోని నిపుణుల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో బొగ్గు తవ్వకాలు జరిగే 10 జిల్లాల్లో జిల్లా గనుల మూసివేత సలహా కమిటీ (డీఎంసీఏసీ)లు ఏర్పాటయ్యాయి.

భూగర్భ ప్రవేశ మార్గాలను శాశ్వతంగా మూసివేయడం, వినియోగంలో లేని మౌలిక వసతులను కూల్చివేయడం, కుంగిపోయిన ప్రాంతాలను బాగు చేయడం, భద్రతా చర్యలను ఏర్పాటు చేయడం, భూమిని పునరుద్ధరించడం, మొక్కలు నాటడం, పర్యావరణ పునరుద్ధరణ ద్వారా తవ్వకాలు పూర్తయిన గనులను శాస్త్రీయ పద్దతుల్లో ఎస్ఈసీఎల్ మూసివేస్తోంది. పునరుత్పాదక విద్యుత్తు, సామాజిక మౌలిక వసతులు, జీవనోపాధి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు ఇచ్చేలా పునరుద్ధరించిన భూమిని ఉత్పాదక పునర్వినియోగం కోసం అంచనా వేస్తారు. ప్రస్తుతం ఎనిమిది గనుల పునరుద్ధరణ ప్రాజెక్టులను సంస్థ అమలు చేస్తోంది.

 

ప్రధాన కార్యక్రమాల్లో భాగంగా బిశ్రామ్‌పూర్‌లో పునరుద్ధరించిన గని ప్రాంతంలో కెనాపారా ఎకో పార్కును అభివృద్ధి చేశారు. వివేక్ నగర్ యూజీ వద్ద ఎకో పార్కుతో అనుసంధానించిన 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. భట్గావ్, బిశ్రామ్‌పూర్‌లో 20 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఇప్పటికే ఎస్ఈసీఎల్ ప్రారంభించింది. అలాగే పినౌరా యూజీ వద్ద 40 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు కూడా నిర్మాణంలో ఉంది. అదనంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కోసం పునరుద్ధరించిన గనుల భూముల ఉత్పాదక వినియోగాన్ని విస్తరిస్తూ... జమునా యూజీ, గోవిందా యూజీ వద్ద 55 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

 

శాస్త్రీయంగా మూసివేసిన అనేక గనులను ప్రజా మౌలిక సదుపాయాలుగా మార్చారు. కోర్బా 3 అండ్ 4 యూజీలో పునరుద్ధరించిన గని భూమిని బాల విహార్ హయ్యర్ సెకండరీ స్కూల్ క్యాంపస్‌లో విలీనం చేశారు. ఒక పబ్లిక్ పార్కుకు, నీటి శుద్ధి కర్మాగారానికి ఉత్తర జాగ్రఖండ్ యూజీ తోడ్పాటును అందిస్తోంది. సుభాష్ ఇంక్లైన్‌లోని పాత సేవా భవనాన్ని మున్సిపల్ వాటర్ ఫిల్టర్ కేంద్రంగా మార్చారు. దక్షిణ జాగ్రఖండ్ 5 అండ్ 6 యూజీలో ఒకప్పుటి మైన్ సర్వీస్ భవనాన్ని సీఐఎస్ఎఫ్ పోస్టుగా మార్చారు. అలాగే దక్షిణ జాగ్రఖండ్ 10 అండ్ 11 యూజీని పబ్లిక్ పార్కుగా అభివృద్ధి చేశారు. బంకి 7 అండ్ 8 యూజీలో ఇప్పుడు ఆరోగ్య కేంద్రాన్ని, వారపు సంతను నిర్వహిస్తున్నారు. అలాగే బంకి 5 అండ్ 6 యూజీని కమ్యూనిటీ సెంటర్‌గా అభివృద్ధి చేశారు.

 

ప్రతి గని మూసివేత ప్రాజెక్టులో పర్యావరణ పునరుద్ధరణ ప్రధానాంశంగా ఉంటుంది. చచాయ్ యూజీలో దాదాపు 35,000 మొక్కలు నాటారు. గని మార్గాలను మూసివేసి, పాత నిర్మాణాలను కూల్చివేసిన అనంతరం ఈ మొక్కలను నాటారు. రామ్ నగర్ యూజీ, కొరియా యూజీ, మాల్గా యూజీతో సహా వివిధ గని ప్రాంతాల్లో అడవులను అభివృద్ధి చేశారు. అలాగే పర్యావరణ పునరుద్ధరణకు తోడ్పడేలా రాజ్‌గమార్ 8 అండ్ 9 యూజీ, ప్యూర్ చిరిమిరి యూజీ వద్ద సహజంగా పెరిగిన వృక్ష సంపదను పరిరక్షించారు.

 

పునరుద్ధరించిన గనుల ప్రాంతాల్లో పర్యావరణ పునరుజ్జీవంతో పాటు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను, ఆరోగ్య శిబిరాలను ఎస్ఈసీఎల్ నిర్వహించింది. ప్రాజెక్టు ప్రభావిత వర్గాల కోసం కంప్యూటర్ విద్య, టైలరింగ్, చేతివృత్తులు, పుట్టగొడుగుల పెంపకం, పచ్చళ్ల తయారీ, ఇతర జీవనోపాధి కార్యక్రమాల్లో శిక్షణ అందించింది.

పునరుద్ధరించిన గనుల భూమిని, గని జల వనరులను ఉత్పాదకంగా వినియోగించడం ద్వారా సుస్థిర జీవనోపాధిని కూడా ఈ సంస్థ ప్రోత్సహిస్తోంది. మత్స్య పెంపకం కార్యక్రమాలు ఏటా 25 టన్నుల చేపల ఉత్పత్తికి తోడ్పడతాయని, 206 జీవనోపాధి అవకాశాలను కల్పిస్తాయని, దీనిలో భాగమైన ప్రతి కుటుంబానికి రూ.3 లక్షల వార్షికాదాయం పొందే వీలు ఉందని అంచనా వేశారు.

 

స్థానిక పరిస్థితులు, భవిష్యత్తులో భూ వినియోగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జమునా ఓసీలో ఎకోటూరిజం, మత్స్య పెంపకం, పౌల్ట్రీ ఫార్మింగ్, మసాలా ప్రాసెసింగ్, బైగా ఓసీలో తేనె శుద్ధి, పసుపు సాగు, కేజ్ కల్చర్, బంకీ యూజీలో శిక్షణ కేంద్రం, కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) కేంద్రం, ఫల వృక్షాల పెంపకాన్ని భవిష్యత్తు పునరుపయోగ ప్రతిపాదనల్లో చేర్చారు.

 

గనుల జీవితకాలాన్ని బాధ్యతాయుతంగా పూర్తిచేయడాన్ని, సుస్థిర గనుల తవ్వకంలో సంస్థ నిబద్ధతను శాస్త్రీయ విధానంలో గనుల మూసివేత ప్రతిబింబిస్తుందని ఎస్ఈసీఎల్ ఛైర్మన్–కమ్–మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ దుహాన్ చెప్పారు.

 

‘‘ఎస్ఈసీఎల్‌లో గనిని మూసివేయడం అంటే అది మైనింగ్‌‌కు ముగింపు కాదు. అది నూతన అధ్యాయానికి ఆరంభం. భూమిని పునరుద్ధరించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, పునరుద్ధరించిన గనుల ప్రాంతాలను శుద్ధ విద్యుత్తును ఉత్పత్తి చేసే, జీవనోపాధికి తోడ్పడే, స్థానిక సమాజాలకు సేవ చేసే ఉత్పాదక ఆస్తులుగా మార్చడమే మా లక్ష్యం. బాధ్యతాయుతమైన మైనింగ్, సుస్థిర అభివృద్ధి పట్ల మా నిబద్ధతను శాస్త్రీయ పద్ధతిలో మూసివేసిన ప్రతి గని తెలియజేస్తుంది’’ అని దుహాన్ అన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2296435) సందర్శకుల సూచీ సంఖ్య : : 45
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Tamil