ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏబీహెచ్ఏ-ఆధారిత 'స్కాన్ అండ్ రిజిస్టర్' సేవ ద్వారా


25 కోట్ల ఓపీడీ నమోదులతో కీలక మైలురాయిని సాధించిన నేషనల్ హెల్త్ అథారిటీ

‘స్కాన్ అండ్ రిజిస్టర్’ సేవ ద్వారా రోజుకు దాదాపు 4 లక్షల మంది పౌరులకు ప్రయోజనం

36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 30,800 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో అందుబాటులో 'స్కాన్ అండ్ రిజిస్టర్' సేవలు

డిజిటల్ ఓపీడీ రిజిస్ట్రేషన్ సేవ వినియోగంలో ముందంజలో బీహార్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్

54 లక్షలకు పైగా డిజిటల్ ఓపీడీ నమోదులతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ ఎయిమ్స్

ఆసుపత్రుల్లో ఓపీడీ నమోదును వేగవంతంగా, మరింత పౌర-కేంద్రితంగా మార్చిన ‘స్కాన్ అండ్ రిజిస్టర్’ సేవ

प्रविष्टि तिथि: 07 AUG 2026 3:27PM by PIB Hyderabad

దేశంలో డిజిటల్ ఆరోగ్య సంరక్షణ సేవల పంపిణీ అభివృద్ధి దిశగా కీలక ముందడుగు పడింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద అందించే 'స్కాన్ అండ్ రిజిస్టర్ సేవ' (గతంలో 'స్కాన్ అండ్ షేర్ సేవ'గా పిలిచేవారు) 25 కోట్ల ఓపీడీ రిజిస్ట్రేషన్ల మైలురాయిని దాటింది. ఇది దేశవ్యాప్తంగా డిజిటల్ ఆరోగ్య సేవల వినియోగంలో పెరుగుదలను స్పష్టం చేసింది. 2022, అక్టోబర్ నెలలో ప్రారంభమైనప్పటి నుంచి ఈ సేవ... ఒక సాధారణ క్యూఆర్-కోడ్ స్కాన్ ద్వారా రోగులు డిజిటల్‌గా ఆసుపత్రిలో ఓపీడీ కోసం రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయడానికి వీలు కల్పిస్తూ, ఈ అనుభవాన్ని సులభతరం చేసింది. తద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేస్తూ, మరింత సౌకర్యవంతంగా మార్చింది.

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద పౌర కేంద్రిత డిజిటల్ సేవలు వేగంగా విస్తరించడాన్ని ఈ మైలురాయి స్పష్టం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఏబీహెచ్ఏ-ఆధారిత డిజిటల్ ఆరోగ్య పరిష్కారాలను ప్రజలు వినియోగిస్తున్న తీరునూ ఇది ప్రతిబింబిస్తోంది.

 ‘స్కాన్ అండ్ రిజిస్టర్’ సేవ ద్వారా రోగులు ఏదైనా ఏబీడీఎం-అనుమతి గల పర్సనల్ హెల్త్ రికార్డ్ (పీహెచ్ఆర్) అప్లికేషన్‌ను ఉపయోగించి, భాగస్వామ్య ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ప్రదర్శించే ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చు. సమ్మతిని అందించిన తర్వాత, రోగులు తమ ఏబీహెచ్ఏ ప్రొఫైల్‌ను ఆరోగ్య సంరక్షణ కేంద్రంతో సురక్షితంగా పంచుకోవచ్చు. మాన్యువల్ రిజిస్ట్రేషన్, కాగితపు ఫారంల అవసరం లేకుండానే తక్షణం ఓపీడీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు, ఆరోగ్య సంరక్షణ ప్రదాతల కార్యాచరణ సామర్థ్యాన్నీ ఈ సేవ మెరుగుపరుస్తుంది. 25 కోట్ల ‘స్కాన్ అండ్ రిజిస్టర్’ లావాదేవీలను సాధించడం... భారత డిజిటల్ ఆరోగ్య వ్యవస్థపై పౌరులు, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ‘స్కాన్ అండ్ రిజిస్టర్’ సేవను ప్రారంభించినప్పటి నుంచి... దేశంలోనే అత్యంత విస్తృతంగా వినియోగిస్తున్న డిజిటల్ ఆరోగ్య సేవల్లో ఒకటిగా ఇది అవతరించింది. ఇది లక్షలాది మంది రోగులకు నిరాటంకమైన ఓపీడీ రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేయడంతో పాటు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో డిజిటల్ సేవల పంపిణీని బలోపేతం చేస్తోంది.

'స్కాన్ అండ్ రిజిస్టర్' సేవ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 756 జిల్లాల్లో గల 30,800 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో అందుబాటులో ఉంది. వీటిలో 24,323 ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు కాగా, 6,481 ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. వివిధ రకాల ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఈ సేవ వేగంగా విస్తరించడం... ఏబీడీఎమ్ (ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్) కింద డిజిటల్ ఆరోగ్య సేవల బలోపేతం కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, డిజిటల్ పరిష్కార సంస్థల సమష్టి కృషిని తెలియజేస్తుంది.

సగటున, ప్రతిరోజూ దాదాపు 4 లక్షల మంది రోగులు ఓపీడీ రిజిస్ట్రేషన్ కోసం ‘స్కాన్ అండ్ రిజిస్టర్’ సేవను ఉపయోగిస్తున్నారు. ఇది డిజిటల్ హెల్త్‌కేర్ సేవల పట్ల ప్రజల్లో పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. మహిళలు, వయోవృద్ధులు, గర్భిణీ స్త్రీలు, తరచుగా ఆసుపత్రిని సందర్శించాల్సిన వ్యక్తులు సహా లక్షలాది మంది లబ్ధిదారులకు ఆసుపత్రిలో ఓపీడీ రిజిస్ట్రేషన్ అనుభవాన్ని ఈ సేవ సులభతరం చేసింది.

ఒక సులభమైన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా తక్షణ ఓపీడీ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించడం, రోగి ఏబీహెచ్ఏ ద్వారా వారి వివరాలను స్వయంచాలకంగా పొందడం వంటి ప్రయోజనాలతో... ఈ సేవ నిరీక్షణ సమయాన్ని గణనీయంగా తగ్గించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. ఇది ఓపీడీ రిజిస్ట్రేషన్‌ను వేగవంతంగా, మరింత సౌకర్యంగా, సమ్మిళితంగా, రోగుల-హితంగా మార్చింది. అవాంతరాలు లేని ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేయడమే కాకుండా, డిజిటల్ ఆరోగ్య వ్యవస్థకు ముఖద్వారంగానూ ఈ సేవ పనిచేస్తోంది. ప్రజలు తమ ఏబీహెచ్ఏ-అనుసంధానిత డిజిటల్ ఆరోగ్య రికార్డులను సులభంగా యాక్సెస్ చేయడానికి, పంచుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 7.30 కోట్లకు పైగా 'స్కాన్ అండ్ రిజిస్టర్' లావాదేవీలతో బీహార్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (4.09 కోట్లు), ఆంధ్రప్రదేశ్ (3.38 కోట్లు), జమ్మూ కాశ్మీర్ (1.39 కోట్లు) ఉన్నాయి. వివిధ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లో ఏబీడీఎమ్-ఆధారిత డిజిటల్ సేవలు విజయవంతంగా అమలు కావడం వల్ల ఈ సేవలు విస్తృత ఆదరణ పొందాయి.

ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కేంద్రాల విభాగంలో... ఢిల్లీలోని ఎయిమ్స్ అత్యధికంగా 54.29 లక్షలకు పైగా 'స్కాన్ అండ్ రిజిస్టర్' నమోదులను సాధించింది. తర్వాతి స్థానాల్లో ఎయిమ్స్ భోపాల్ (29.10 లక్షలు), ఎయిమ్స్ భువనేశ్వర్ (23.93 లక్షలు), ఎయిమ్స్ పాట్నా (19.62 లక్షలు), ఎయిమ్స్ రాయ్‌పూర్ (18.63 లక్షలు) ఉన్నాయి. సాధారణ ఆరోగ్య సంరక్షణ సేవల్లో ఏబీడీఎమ్-ఆధారిత డిజిటల్ సేవలను విజయవంతంగా అనుసంధానించడంలో ఈ సంస్థలు చక్కని ఉదాహరణగా నిలుస్తున్నాయి.

ఈ విజయం గురించి నేషనల్ హెల్త్ అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ సునీల్ కుమార్ బర్న్వాల్ మాట్లాడుతూ... " ‘స్కాన్ అండ్ రిజిస్టర్’ సేవ ద్వారా 25 కోట్ల ఓపీడీ రిజిస్ట్రేషన్ల మైలురాయిని దాటడం, భారత డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ పట్ల పౌరులు, ఆరోగ్య సంరక్షణ ప్రదాతల్లో పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఆరోగ్య సంరక్షణలోని అత్యంత సాధారణ ప్రక్రియల్లో ఒకటైన ఓపీడీ రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేయడం ద్వారా, రోగుల సౌకర్యాన్ని ఈ సేవ గణనీయంగా మెరుగుపరించింది. ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికీ ఇది దోహదపడింది. పరస్పర అనుసంధానం గల, సురక్షితమైన, పౌర-కేంద్రితమైన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను నిర్మించడంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పరివర్తనాత్మక సామర్థ్యాన్ని ఈ విజయం ప్రదర్శిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత మెరుగుపరుస్తోంది" అని అన్నారు.

ఎయిమ్స్, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రులు, ఉప-జిల్లా ఆసుపత్రులు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, స్పెషాలిటీ ఆసుపత్రులు, ట్రస్ట్ ఆసుపత్రులు, ఈఎస్ఐసి ఆసుపత్రులు, రైల్వే ఆసుపత్రులు, ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు సహా విస్తృత శ్రేణి ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ప్రస్తుతం ‘స్కాన్ అండ్ రిజిస్టర్’ సేవ అమలవుతోంది. విభిన్న ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లోని పౌరులు... అవాంతరాలు లేని డిజిటల్ ఓపీడీ రిజిస్ట్రేషన్ ద్వారా ప్రయోజనం పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది.

నేషనల్ హెల్త్ అథారిటీ దేశవ్యాప్తంగా పౌర కేంద్రిత డిజిటల్ ఆరోగ్య సేవలను విస్తరించడం ద్వారా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌నూ మరింత బలోపేతం చేస్తోంది. మరిన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఏబీడీఎమ్-ఆధారిత పరిష్కారాలను వినియోగిస్తున్న కొద్దీ... వేగవంతమైన రిజిస్ట్రేషన్, డిజిటల్ ఆరోగ్య రికార్డులు సురక్షిత విధానంలో అందుబాటులో ఉండడం, నిరాటంకమైన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా ప్రజలు అధిక ప్రయోజనం పొందుతున్నారు. 25 కోట్ల 'స్కాన్ అండ్ రిజిస్టర్' లావాదేవీల మైలురాయి... ప్రతి పౌరుడి కోసం ఒక అనుసంధానిత, పరస్పర అనుకూలమైన, డిజిటల్ సాధికారత కలిగిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్మించే దిశగా మరో కీలక ముందడుగును సూచిస్తుంది.

వివరణాత్మక సమాచారం కోసం, ఏబీడీఎమ్ డాష్‌బోర్డ్‌ను https://dashboard.abdm.gov.in/abdm/ వద్ద సందర్శించవచ్చు. 'స్కాన్ అండ్ రిజిస్టర్' సదుపాయాన్ని వినియోగించుకోవడానికి పౌరులు https://abdm.gov.in/our-partners/PHR నుంచి ఏదైనా పీహెచ్ఆర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

***


(रिलीज़ आईडी: 2296434) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil