జాతీయ మానవ హక్కుల కమిషన్
మధ్యప్రదేశ్ విదిశ జిల్లాలో బెత్‌వా నదిని దాటడానికి బడిపిల్లలు చెక్ డ్యామ్ స్తంభాల మీది నుంచి గెంతుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారన్న వార్తాకథనం... ఆ వార్తాకథనాన్ని స్వయంగా పరిశీలనకు స్వీకరించిన ఎన్‌హెచ్ఆర్‌సీ ఇండియా
రోడ్డు మార్గంలో 13 కి.మీ.ల దూరం కేవలం 1.5 కి.మీ.కి తగ్గిపోతుందని వారు ఈ ప్రమాదకర దోవను ఎంచుకొంటున్న వైనం
బాలలకు బడికి చేరుకోవడానికి సురక్షిత రవాణా సదుపాయం లేకపోవడం ఆత్మవిశ్వాసంతో చదువుకోవడానికి వారికి గల ప్రాథమిక హక్కును కాదనడమేనని అభిప్రాయపడిన ఎన్‌హెచ్ఆర్‌సీ
రెండు వారాల్లోగా ఈ విషయంపై సమగ్ర నివేదిక కోరుతూ మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు
प्रविष्टि तिथि:
07 AUG 2026 11:00AM by PIB Hyderabad
మధ్యప్రదేశ్ విదిశ జిల్లాలో కాక్‌రౌవా గ్రామంలోని బడిపిల్లలు పాఠశాలకు వెళ్లేందుకు బెత్‌వా నదిని దాటడానికి చెక్ డ్యాము స్తంభాల మీదికి ఎక్కి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని ప్రసార మాధ్యమాల్లో ఒక వార్తాకథనం పేర్కొంది. దీనిని భారత జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్‌సీ) స్వయంగా పరిశీలనకు స్వీకరించింది. రహదారి మార్గంలో 13 కిలోమీటర్ల దూరం వెళ్లవలసి వస్తున్న కారణంగా, ఇలాగైతే కేవలం ఒకటిన్నర కి.మీ. ప్రయాణిస్తే చాలని స్కూలు పిల్లలు ఈ పని చేస్తున్నారని వార్తలో రాశారు. అయిదుగురు బాలికలు సహా మొత్తం తొమ్మిది మంది విద్యార్థులు ప్రతి రోజూ ఇలా చేస్తున్నారు.
వార్తాకథనంలో ప్రస్తావించిన అంశాలు నిజమేనని తేలినట్లయితే, ఈ విషయంలో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన గంభీర సమస్య ఎదురవుతున్నట్లేనని ఎన్‌హెచ్ఆర్‌సీ అభిప్రాయపడింది. 6 ఏళ్ల మొదలు 14 ఏళ్ల వయసు బాలలకు ప్రభుత్వం ఉచితంగా, తప్పనిసరిగా విద్యను అందించాలని భారత రాజ్యాంగంలోని ‘21 ఎ’ అధికరణం చెబుతోందని కమిషన్ గుర్తు చేసింది. ఈ వయోవర్గానికి చెందిన బాలలందరికీ చదువుకునే హక్కు ఉందని ‘2009 నాటి బాలల ఉచిత, అనివార్య హక్కు చట్టం’ కూడా తెలియజేస్తోంది. దీనికి తోడు, విద్యాభ్యాసం హక్కులో సురక్షిత స్కూలు, సురక్షిత మౌలిక సదుపాయాలకు సంబంధించిన హక్కు కూడా ఒక అంతర్భాగంగా ఉందని అవినాశ్ మెహరోత్నా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2009) కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ కారణంగా, బడికి చేరుకోవడానికి బాలలకు ఒక సురక్షిత రవాణా పద్ధతి అందుబాటులో లేకపోతే అది ఆత్మగౌరవంతో చదువుకునేందుకు వారికి ఉన్న ప్రాథమిక హక్కును తోసిరాజనడమే అవుతుందని కమిషన్ భావించింది. దీనికి అనుగుణంగా, రెండు వారాల లోపల ఈ విషయంలో ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కమిషన్ సూచిస్తూ ఒక నోటీసును జారీ చేసింది.
2026 ఆగస్టు 4న ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తాకథనం ప్రకారం.. పిల్లలు ఆనకట్టకు సంబంధించిన స్తంభాల మధ్య వెడల్పయిన సందుల మీది నుంచి గెంతుతూ అపాయకర పద్ధతిలో అవతలి ఒడ్డుకు చేరుకొంటున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కాగా, ఆ వీడియోను చాలా మంది చూశారు. గ్రామస్తులు తాము పొలం పనికి వెళ్లవలసివస్తున్న కారణంగా పిల్లలను దూర ప్రాంతంలో ఉన్న బడి దగ్గరకు తీసుకువెళ్లి దిగబెట్ట లేకపోతున్నామంటున్నారని కూడా వార్తలో పేర్కొన్నారు. అయితే ఇదే పద్ధతిని కొనసాగించడం, లేదా బాలలను బడికి పంపించడం మానేయడం.. ఈ రెండిటిలో ఏదో ఒకదానినే తాము ఎంపికచేసుకోవాల్సి ఉంటుందని కూడా వారు వివరించారు.
వార్తాకథనంలో తెలియజేసిన అంశాలను బట్టి చూస్తే, ఒక విద్యార్థిని అంత పొడవుగా లేనందువల్ల డ్యాము స్తంభాల సందుల మీది నుంచి గెంతలేక బడికి వెళ్లడం కుదరకపోవడంతో, తుది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. ఈ ప్రదేశాన్ని జిల్లా విద్యాధికారి చూసి, సమస్యను గురించి జిల్లా కలెక్టరుకు తెలియజేశారు. ఏమైనా, నదిని దాటడానికి సురక్షిత మార్గాన్ని ఎప్పటి లోపల నిర్మిస్తారనే సంగతిని మాత్రం ప్రస్తావించలేదు.
***
(रिलीज़ आईडी: 2295989)
आगंतुक पटल : 2