సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
'హర్ ఘర్ తిరంగా 2026’ను ప్రారంభించిన కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖా మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్
2026 ఆగస్టు 9 నుంచి 17 వరకు దేశవ్యాప్తంగా కొనసాగనున్న కార్యక్రమం
ప్రజా ఉద్యమంగా మారిన హర్ ఘర్ తిరంగాకు అయిదేళ్లు
జాతీయ గేయం 'వందేమాతరం' 150 ఏళ్ల వేడుకలకు అంకితంగా కొనసాగనున్న కార్యక్రమం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ రాయబార కార్యాలయాలను అనుసంధానించడానికి 'సూర్యపథ్ తిరంగా' అనే నూతన కార్యక్రమం ప్రారంభం
ఆగస్టు 14న దేశవ్యాప్తంగా విభజన గాయాల సంస్మరణ
प्रविष्टि तिथि:
06 AUG 2026 9:28PM by PIB Hyderabad
ఈ రోజు ఢిల్లీలో దేశవ్యాప్త 'హర్ ఘర్ తిరంగా 2026' కార్యక్రమాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించారు. ఈ ప్రచారోద్యమం 2026 ఆగస్టు 9 నుంచి 17 వరకు దేశమంతటా జరగనుంది. భారతదేశపు అతిపెద్ద ప్రజా భాగస్వామ్య ఉద్యమాల్లో ఒకటిగా మారిన ఈ కార్యక్రమం.. ప్రజలంతా గర్వంగా జాతీయ జెండాను ఎగురవేయాలని.. దేశభక్తి, జాతీయ ఐక్యతా స్ఫూర్తిని చాటే వివిధ కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిస్తోంది. ఈ కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి (ఎక్స్‌పీ), అధికారిక ప్రతినిధి శ్రీ రణధీర్ జైస్వాల్.. ఐజీఎన్‌సీఏ సభ్య కార్యదర్శి డాక్టర్ సచ్చిదానంద్ జోషి పాల్గొన్నారు.

ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కింద 2022లో ప్రారంభమైన 'హర్ ఘర్ తిరంగా' ప్రచారోద్యమం ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం నాడు కోట్లాది మంది ప్రజలు స్వచ్ఛందంగా జాతీయ జెండాను ఎగురవేసే జాతీయ సంప్రదాయంగా మారిందని అన్నారు. హర్ ఘర్ తిరంగా కేవలం జెండా ఎగురవేసే కార్యక్రమంగా మాత్రమే కాకుండా ప్రజా భాగస్వామ్యం, సాంస్కృతిక కార్యక్రమాలు, వారసత్వ కార్యకలాపాలు, డిజిటల్ భాగస్వామ్యంతో కూడిన ఒక దేశవ్యాప్త పండుగలా మారిందని ఆయన పేర్కొన్నారు.
ఈ రోజు అపారమైన ఉత్సాహం, దేశభక్తి శ్రద్ధలతో దేశమంతటా జరుపుకునే ఒక నిజమైన ప్రజా ఉద్యమంగా 'హర్ ఘర్ తిరంగా' మారిందని కేంద్ర మంత్రి తెలిపారు. మువ్వన్నెల జెండా కేవలం ఒక జాతీయ పతాకం మాత్రమే కాదని.. అది భారత ఐక్యత, గౌరవం, సమష్టి జాతీయ గుర్తింపునకు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని రక్షించడానికి, దేశ సేవలో తమ ప్రాణాలను అర్పించిన అసంఖ్యాక వీర జవాన్లు, త్యాగధనుల ధైర్యసాహసాలు, త్యాగాలకు తిరంగా ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పారు.

ప్రాంతం లేదా సమాజంలోని తరగతులతో సంబంధం లేకుండా త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడికి ప్రేరణనిస్తుందని శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. 'వికసిత్ భారత్ 2047' సంకల్పానికి ప్రజలంతా తమ నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ఈ కార్యక్రమం ఒక అవకాశాన్ని కల్పిస్తుందని అన్నారు. మన జాతీయ గేయం 'వందేమాతరం' 150 ఏళ్ల పండుగకు సంబంధించిన వేడుకల సమయంలోనే ఈ ఏడాది 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం రావడం దీని విశిష్టతను మరింత పెంచిందని ఉద్ఘాటించారు. ఇది ఈ వేడుకలకు మరింత అర్థాన్నిస్తూ ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తుందని ఆయన గుర్తుచేశారు.
'హర్ ఘర్ తిరంగా 2026'లో భాగంగా 'సూర్యపథ్ తిరంగా' అనే ఒక కీలకమైన నూతన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ‘తిరంగా రిలే’గా భావించే ఈ కార్యక్రమం.. ఉదయించే సూర్యుని మార్గాన్ని అనుసరిస్తుంది. తూర్పున సూర్యోదయాన్ని మొదటగా చూసే భారతీయ రాయబార కార్యాలయంతో ప్రారంభమై పశ్చిమం వరకు వరుసగా జాతీయ జెండాను అధికారికంగా ఆవిష్కరిస్తారు. దీని ద్వారా తిరంగా పగటి వెలుగుతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణిస్తున్నట్లు ప్రతీకాత్మకంగా చూపుతారు. ఈ కార్యక్రమం భారతదేశ స్వాతంత్ర్య వేడుకలలో విదేశీ భారతీయ రాయబార కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజపు భాగస్వామ్యాన్ని ప్రముఖంగా చాటిచెబుతుంది.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా దేశ విభజన వల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వలసలను గుర్తుచేసుకుంటూ ఆగస్టు 14న దేశవ్యాప్తంగా 'విభజన గాయాల సంస్మరణ దినాన్ని' పాటిస్తారు. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మౌన ర్యాలీలు, విభజనకు సంబంధించిన ప్రదర్శనలు, డాక్యుమెంటరీల ప్రదర్శనలు, ఇతర సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మైగవ్ ప్లాట్‌ఫామ్‌లో విభజన గాయాల సంస్మరణ దినంపై ఒక ప్రత్యేక క్విజ్ కూడా అందుబాటులో ఉంది.
ఢిల్లీ, కోల్కతా, అమృత్సర్లలో ప్రధాన కార్యక్రమాలను సాంస్కృతిక మంత్రిత్వశాఖ సమన్వయం చేస్తుంది. ఢిల్లీలో ఆగస్టు 13న సోనమ్ కల్రా నాటక ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత ఆగస్టు 14న విభజనపై ప్రత్యేక ప్రదర్శన, డాక్యుమెంటరీల ప్రదర్శన ఉంటాయి. ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా, లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ తరంజిత్ సింగ్ సంధులతో పాటు ఇతర ప్రముఖుల నేతృత్వంలో మౌన ర్యాలీ నిర్వహించనున్నారు. కోల్కతాలో.. న్యూ టౌన్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రదర్శన, డాక్యుమెంటరీ ప్రదర్శన, మౌన ర్యాలీతో కూడిన కార్యక్రమాలు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలనే నిర్వహిస్తారు. అమృత్సర్లో హర్‌పాల్ తివానా సెంటర్ 'మిత్తర్ ప్యారే ను' నాటక ప్రదర్శన ఉంటుంది. ఇక్కడ ప్రదర్శన, డాక్యుమెంటరీ ప్రదర్శన, మౌన ర్యాలీ ఉంటుంది. అమృత్సర్లో జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొంటారు.
ప్రజలంతా గర్వంగా జాతీయ జెండాను ఎగురవేయాలని, 'వందేమాతరం' గేయాన్ని నేర్చుకుని ఆలపించాలని, సామాజిక కార్యకలాపాలలో భాగస్వామ్యులవ్వాలని, భారత స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ 'హర్ ఘర్ తిరంగా 2026'లో చురుగ్గా పాల్గొనాలని సాంస్కృతిక మంత్రిత్వశాఖ పిలుపునిచ్చింది.
***
(रिलीज़ आईडी: 2295950)
आगंतुक पटल : 8