బొగ్గు మంత్రిత్వ శాఖ
విద్యుత్ రంగానికి సమృద్ధిగా బొగ్గు సరాఫరా 2026 జూలైలో బొగ్గు ఉత్పత్తి, రవాణాలో రెండంకెల వృద్ధి నమోదు
प्रविष्टि तिथि:
06 AUG 2026 3:51PM by PIB Hyderabad
దేశీయ విద్యుత్ రంగానికి అవసరమైన బొగ్గు సరఫరా అత్యంత సంతృప్తికరంగా, సమృద్ధిగా ఉంది. బొగ్గు ఉత్పత్తి, రవాణా, విద్యుత్ కేంద్రానికి చేరుతున్న నిల్వల పరంగా 2026 జూలై నెలలో గణనీయమైన పురోగతి నమోదైంది. గత ఏడాది జూలైలో 64.88 మిలియన్ టన్నులు ఉండగా, ఈ ఏడాది జూలై నాటికి అది 69.75 ఎంటీకి చేరి 7.51 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది 73.58 మిలియన్ టన్నులుగా ఉన్న రవాణా... ఈసారి ఏకంగా 86.85 ఎంటీకి పెరిగి 18.03 శాతం భారీ రెండంకెల వృద్ధిని సాధించింది.
థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అందుకున్న బొగ్గు పరిమాణం 60.69 మిలియన్ టన్నులు ఉండగా.. ఈ ఏడాది జూలై నాటికి 68.83 ఎంటీకి పెరిగి 13.41 శాతం వృద్ధిని కనబరిచింది. విద్యుత్ రంగానికి బొగ్గు సరఫరాలో కనిపిస్తున్న ఈ స్థిరమైన పురోగతి, దేశీయ ఇంధన అవసరాలను తీర్చేందుకు అంతరాయం లేని బొగ్గు లభ్యతను కల్పించడంపై మంత్రిత్వ శాఖకు ఉన్న నిబద్ధతను స్పష్టం చేస్తోంది. దీనికి భారతీయ రైల్వే పూర్తి సహకారాన్ని అందిస్తోంది.
ఆగస్టు 4, 2026 నాటికి థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద 34.55 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. ఇవే కాకుండా గనుల వద్ద, రవాణా మార్గాల్లో 113 మిలియన్ టన్నుల బొగ్గు అందుబాటులో ఉంది. దీంతో ప్రస్తుతం దేశంలో మొత్తం 148 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఇది విద్యుత్ రంగానికి చెందిన దాదాపు 62 రోజుల బొగ్గు వినియోగ అవసరాలకు సరిపోతుంది. ఎటువంటి కొరత లేకుండా తగినంత అదనపు నిల్వ భద్రతను కల్పిస్తోంది.
దేశంలో వేగంగా పెరుగుతున్న ఇంధన అవసరాలకు అనుగుణంగా... వినియోగదారులందరికీ, ముఖ్యంగా విద్యుత్ రంగానికి అంతరాయం లేని, తగినంత బొగ్గు సరఫరాను నిర్ధారించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ పూర్తి అంకితభావంతో ఉంది. ఈ స్థిరమైన ప్రదర్శన దేశానికి ఇంధన భద్రతను, స్వయం సమృద్ధిని కల్పించే ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వికసిత్ భారత్’ లక్ష్యాల పట్ల మంత్రిత్వ శాఖకు ఉన్న నిబద్ధతను చాటిచెబుతోంది. విద్యుత్ రంగానికి అవసరమైన బొగ్గు సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు మంత్రిత్వ శాఖ బొగ్గు సరఫరా వ్యవస్థను నిరంతరం సమగ్రంగా పర్యవేక్షిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2295556)
आगंतुक पटल : 7