వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్‌తో రైతుల భేటీ.. ఇథనాల్‌కు మద్దతు తెలిపిన కర్షకులు

ఇథనాల్ రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు దేశ ఇంధన భద్రతకు తోడ్పడుతుందని
కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్‌‌‌తో చెప్పిన ఏఐకేసీసీ నేతలు

‘‘సాగుకు ఇథనాల్ ఒక కొత్త అవకాశాన్ని అందిస్తోంది’’ అని
శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌‌కు తెలిపిన రైతులు

ఇథనాల్‌ విషయంలో వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడానికి
రైతులు, ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేయాలి: ఏఐకేసీసీ

పెట్రోలుపై కాకుండా పొలాల్లో నుంచి వచ్చే ఇథనాల్‌పై దేశ భవిత ఆధారపడుతుందని
కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌‌తో చెప్పిన వివిధ రాష్ట్రాల రైతు నేతలు

ఇథనాల్, రైతుల ఆదాయం అంశాలపై
న్యూఢిల్లీ లోని కృషి భవన్‌లో నిర్వహించిన బహిరంగ చర్చలో పాల్గొన్న దేశవ్యాప్త రైతు నేతలు

కృషి భవన్ తలుపులు రైతుల కోసం ఎప్పటికీ తెరిచే ఉంటాయి..
రైతులు దైవంతో సమానం: కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌

प्रविष्टि तिथि: 04 AUG 2026 8:29PM by PIB Hyderabad

అఖిల భారత కిసాన్ సమన్వయ సంఘం (ఏఐకేసీసీ) ప్రతినిధి వర్గం నిన్న... అంటే 2026 ఆగస్టు 4న, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌‌తో సమావేశమయ్యారు. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని, అయితే ఇథనాల్‌కు సంబంధించిన విధానాన్ని రూపొందించేటప్పుడు రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని, పంటకు సరి అయిన ధర రైతులకు అందేటట్లు చూడాలని వారు స్పష్టం చేశారు. రైతు నేతల సూచనలన్నింటినీ కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌‌ శ్రద్ధగా విన్నారు. ఇథనాల్ విషయంలో రైతుల అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం తప్పక పరిగణనలోకి తీసుకుంటుందని రైతు నేతలకు మంత్రి హామీని ఇచ్చారు. రైతులను తాను దైవంతో సమానంగా చూస్తానని, కృషి భవన్‌లో రైతులకు అన్ని వేళలా సాదర స్వాగతం లభిస్తుందని శ్రీ శివరాజ్ సింగ్ అన్నారు.


ఇథనాల్‌పై కృషి భవన్‌లో 

మనసు విప్పి మాట్లాడిన దేశవ్యాప్త రైతు నేతలు
ఏఐకేసీసీ ప్రతినిధి వర్గం కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌‌‌‌తో న్యూఢిల్లీ లోని కృషి భవన్‌లో సమావేశమైంది. ప్రతినిధి వర్గంలో పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన రైతు నాయకులు ఉన్నారు. సమావేశంలో ప్రధానంగా ఇథనాల్, రైతుల ఆదాయం, కనీస గిట్టుబాటు ధర (ఎమ్ఎస్‌పీ), మార్కెట్లతో పాటు, జాతీయ వ్యవసాయ విధానంపై చర్చించారు. రైతులు తాము ఇథనాల్‌ పట్ల సానుకూలంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే ఈ కార్యక్రమ సిసలు ప్రయోజనం కంపెనీలకు, మధ్యవర్తులకు మాత్రమే కాకుండా రైతులకు అందాలనే తాము కోరుతున్నామని వారు అన్నారు.
ఇథనాల్‌కు అనుకూలంగా రైతులు ఏమన్నారంటే...
సమావేశంలో రైతులు ఇథనాల్‌పై తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. ఇథనాల్ వల్ల పంట ఉత్పాదన ఒక్క బజారుకే పరిమితం కాబోదని, అది పెట్రోల్ పంపులకు, ఇంధన మార్కెట్టు వరకూ చేరుకొంటుందని వారు అన్నారు. దీంతో రైతులకు కొత్త, బలమైన మార్కెట్టు లభిస్తుందని వారు అన్నారు. చెరుకు, మొక్కజొన్న, వరి, ఇతర ముడి సరుకులతో ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తే రైతులకు మరింత ఎక్కువ మంది కొనుగోలుదారులు లభిస్తారని, ఫలసాయం చెడిపోవడం, నిల్వ సమస్యలు ఎదురవడం అనే సమస్యలు తగ్గుతాయన్నారు.
ఇథనాల్‌‌కు తాము వ్యతిరేకం కాదని, దానిని పూర్తిగా సమర్థిస్తున్నామని రైతులు తెలిపారు. అయితే, ఏ పంటకైనా.. అది చెరుకు కావచ్చు, లేదా మొక్కజొన్న కావచ్చు.. సరైన ధరలు రైతులకు లభించడం అవసరమని వారు అన్నారు. ఇథనాల్‌కు సంబంధించిన విధానం సాగుకు ఒక కొత్త మార్గాన్ని చూపాలని, అది తమకు ఒక కొత్త చిక్కుసమస్యగా మారకూడదనే తాము కోరుతున్నామని రైతు ప్రతినిధులు అన్నారు. తాము ఇథనాల్‌కు మద్దతు తెలుపుతున్నామని, అయితే ఇథనాల్ కూడా తమకు అండగా నిలవాలని వారు అన్నారు.
ఇథనాల్ విషయంలో అపార్థాలను తొలగించడం అవసరమన్న రైతు నేతలు
ఇథనాల్ పేరిట సామాజిక మాధ్యమాలతో పాటు కొన్ని వేదికలలో గందరగోళాన్ని వ్యాప్తి చేస్తున్నారని అనేక మంది రైతు నేతలు సమావేశంలో ప్రస్తావించారు. ఇథనాల్‌‌ వాడితే వాహనాలకు చేటు అని, ఇథనాల్ రైతు ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని చెబుతున్నారన్నారు. ఇథనాల్ వల్ల ఏయే పంటలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, సేద్యపు నీటిని ఎక్కువగా వినియోగించాల్సిన పంటల నుంచి దుర్భిక్ష పరిస్థితిని తట్టుకొనే పంటల వైపు ఎలా మళ్లాలనే అంశాలపై కేంద్ర వ్యవసాయ శాఖ, రైతు సంస్థలూ కలిసికట్టుగా సుస్పష్టంగా అర్థం అయ్యేటట్లు వివరాలను అందించాలని రైతులు డిమాండ్ చేశారు. యువతరానికి అవగాహన కలిగేలా రీల్స్, చిన్న వీడియోలు, క్షేత్ర స్థాయి సభలను నిర్వహించడం ద్వారా ఇథనాల్‌కు సంబంధించిన వాస్తవ అంశాల్ని ప్రచారం చేయడం అవసరమని వారు అన్నారు.
సూచనలను విని, 

మార్గదర్శనం చేసిన శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌
రైతులు చెప్పినదంతా కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌ శ్రద్ధగా విన్నారు. మధ్య మధ్యలో ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతూ, క్షేత్ర స్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. కేంద్ర ప్రభుత్వ ఆలోచనా విధానం స్పష్టంగా ఉందని, ఇథనాల్ కార్యక్రమం లబ్ధి పూర్తి వ్యవస్థకు అందాలని  ఆయన చెప్పారు. వ్యవసాయ క్షేత్రం మొదలు ఇంధన ట్యాంకు వరకూ ప్రతిదశలో ప్రయోజనం చేకూరాలని, అయితే భీమభాగం లబ్ధి రైతులకు అందాలని ఆయన స్పష్టం చేశారు. ఇథనాల్ రైతుల జేబులను నింపడంతో పాటు దేశానికి ఇంధన భద్రతను కూడా పటిష్ఠపరుస్తుందని శ్రీ శివరాజ్ సింగ్ అన్నారు. ‘ఏ పంటకు, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడటమే మా ప్రాధాన్యం’ అని ఆయన అన్నారు.
మొక్కజొన్న, బియ్యం, చెరుకు, ఇతర ముడిసరుకుల ధరలకీ, డిమాండుకీ మధ్య సమతౌల్యాన్ని కాపాడటానికి విధాన సమీక్ష చేపడతామని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌ సమావేశంలో హామీని ఇచ్చారు. రైతులకు కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, మరీముఖ్యంగా మొక్కజొన్న రైతుల లబ్ధిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారని ఆయన తెలిపారు. ఇథనాల్‌ విషయంలో అందుబాటులో ఉన్న శాస్త్రీయ అధ్యయనాలు, సాంకేతిక నివేదికల సాయంతో వ్యతిరేక ప్రచారానికి బదులిస్తారనీ, రైతులతో కలిసి వాస్తవాల ఆధారంగా చర్చను చేపడతారని ఆయన వివరించారు.
రైతుల అభిప్రాయాలు, మంత్రి మార్గదర్శనం-
భాగస్వామ్యం అందిస్తున్న సందేశం

ఇథనాల్ విషయంలో గందరగోళాన్ని యదార్థాలు, క్షేత్ర స్థాయి అనుభవం దన్నుతో పటాపంచలు చేస్తారనే సందేశాన్ని, అలాగే ప్రభుత్వంతో కలిసి పనిచేసి రైతులకు ప్రయోజనకరమైన విధానాన్ని రూపొందించే ప్రక్రియను బలోపేతం చేస్తారన్న సందేశాన్ని గ్రామ గ్రామానికీ తీసుకుపోతామని ఏఐకేసీసీ ప్రతినిధులు సమావేశం చివర్లో అన్నారు. రైతు సంస్థలు ప్రభుత్వానికి ప్రత్యర్థులు కావని, విధాన రూపకల్పనలో భాగస్వాములని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌ ఒక సుస్పష్ట సందేశాన్ని ఇచ్చారు. ‘‘ఇథనాల్‌ అంశంపై రైతులు చెప్పింది మేం సావధానంగా విన్నాం. ఇప్పుడిక ఈ సూచనలు, సలహాల ఆధారంగా ఎలాంటి ప్రాథమిక ప్రణాళికను రూపొందించాలన్నదే మేం చేయాల్సిన పని.. ఆ ప్రణాళికతో రైతులు, దేశం, ఇంధనం.. ఈ మూడూ బలపడాలి’’ అని ఆయన అన్నారు.
 ఏఐకేసీసీ ప్రతినిధి వర్గంలో ఏఐకేసీసీ జాతీయ అధ్యక్షుడు, భారతీయ కిసాన్ యూనియన్ (మాన్) పూర్వ ఎంపీ శ్రీ భూపిందర్ సింగ్ మాన్, ఏఐకేసీసీ జాతీయ ఉపాధ్యక్షుడు, నేషనల్ అసోసియేషన్ ఫర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎన్ఏఎఫ్‌పీఓ)ఊ అధ్యక్షుడు శ్రీ బినోద్ ఆనంద్, ఏఐకేసీసీ జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీ గురుసాహిబ్ సింగ్ మాన్, ఏఐకేసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మహారాష్ట్రకు చెందిన షేట్కారీ సంఘటన (శరద్ జోషీ) ట్రయినరు శ్రీ గుణవత్ పాటిల్, ఏఐకేసీసీ సభ్యుడు, భారతీయ కిసాన్ యూనియన్ మాన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, కిసాన్ యూనియన్ మాన్ (యూపీ) శ్రీ అజయ్ అన్‌మోల్, ఏఐకేసీసీ సభ్యుడు, భారతీయ కిసాన్ యూనియన్ మాన్ (హర్యానా) జాతీయ ప్రధాన కార్యదర్శి ఏఐకేసీసీ సభ్యుడు, షేట్కారీ సంఘటన (శరద్ జోషీ) మహారాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ లలిత్ బహాలే పాటిల్, ఏఐకేసీసీ సభ్యుడు, భారతీయ కిసాన్ యూనియన్ మాన్ (హర్యానా) జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బల్‌రాజ్ సింగ్ సంధూ, ఏఐకేసీసీ సభ్యుడు, బీకేయూ మాన్ (హర్యానా) అధ్యక్షుడు శ్రీ సుర్జీత్ సింగ్ మణి గుర్జర్, ఏఐకేసీసీ సభ్యుడు, బీకేయూ మాన్ (హర్యానా) రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ జుగ్ను రాణా, ఏఐకేసీసీ సభ్యుడు, బీకేయూ మాన్ (హర్యానా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ మన్‌ఫూల్ సింగ్, ఏఐకేసీసీ సభ్యుడు, వ్యామలన్ కిసాన్ సంఘటన్ (తమిళనాడు) అధ్యక్షుడు శ్రీ వి. మాణిక్కమ్, ఏఐకేసీసీ సభ్యుడు, కిసాన్ జాగరణ్ (తెలంగాణ) అధ్యక్షుడు శ్రీ సుగుణాకర్ రావు, ఏఐకేసీసీ సభ్యుడు, బీకేయూ మాన్ (చండీగఢ్) శ్రీ బల్వంత్ సింగ్ నడియాలీ, ఏఐకేసీసీ సభ్యుడు, షేట్కారీ సంఘటన (శరద్ జోషీ) మహారాష్ట్ర ప్రతినిధి శ్రీ దినేశ్ శర్మ, ఏఐకేసీసీ సభ్యుడు, మాల్వా బీకేయూ మాన్ అధ్యక్షుడు శ్రీ బల్‌వీర్ సింగ్‌తో పాటు ఏఐకేసీసీ సభ్యుడు శ్రీ శివరాజ్ సింగ్ ఉన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2294722) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Kannada