ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఏబీ పీఎం-జేఏవై గురించి తాజా సమాచారం
ఏబీ-పీఎంజేఏవై పథకం ద్వారా 30 జూన్ 2026 నాటికి రూ.1.92 లక్షల కోట్ల విలువైన 12.69 కోట్ల నగదు రహిత చికిత్సలు
प्रविष्टि तिथि:
04 AUG 2026 4:12PM by PIB Hyderabad
ఆయుష్మాన్ భారత్ - ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) పథకం దేశ జనాభాలో అట్టడుగు వర్గాలకు చెందిన 40 శాతం మందికి, ఆర్థికంగా వెనకబడిన 12 కోట్ల కుటుంబాలకు ద్వితీయ, తృతీయ శ్రేణి వైద్య సంరక్షణ కోసం ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య కవరేజీని అందిస్తోంది. మార్చి 2024లో, ఈ పథకాన్ని గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, అంగన్‌వాడీ సహాయకులు సహా సుమారు 37 లక్షల కుటుంబాలకు విస్తరించారు. అక్టోబర్ 2024లో, సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 4.5 కోట్ల కుటుంబాలకు చెందిన 70 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు గల 6 కోట్ల మంది వయోవృద్ధులకూ ఈ పథకాన్ని విస్తరించారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఇప్పటివరకు జారీ చేసిన ఆయుష్మాన్ కార్డుల వివరాలను https://dashboard.nha.gov.in/public/card ద్వారా పొందవచ్చు.
ఆరోగ్యం కోసం ప్రజలు చేసే ఖర్చును తగ్గించడంలో ఏబీ-పీఎంజేఏవై గణనీయంగా దోహదపడింది. 30.06.2026 నాటికి... 37,413 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల నెట్‌వర్క్ ద్వారా ఈ పథకం కింద రూ.1.92 లక్షల కోట్ల విలువైన మొత్తం 12.69 కోట్ల నగదు రహిత చికిత్సలు అందించారు.
నేషనల్ హెల్త్ అకౌంట్స్ 2022-23 అంచనాల ప్రకారం... మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రజలు సొంతంగా చేసే ఖర్చుల వాటా గణనీయంగా తగ్గింది. ఇది 2014-15లో 62.6 శాతం ఉండగా, 2022-23 నాటికి 43.4 శాతానికి తగ్గింది. ఆరోగ్యంపై పెరిగిన ప్రభుత్వ పెట్టుబడి, ఏబీ-పీఎంజేఏవై వంటి పథకాలకు ప్రభుత్వం అందించిన నిధులతో ఆరోగ్య బీమా పథకాలు విస్తరించాయి. కుటుంబాలు తమ ఆరోగ్య సంరక్షణ ఖర్చుల్లో చాలా తక్కువ వాటాను మాత్రమే సొంతంగా భరిస్తున్నాయని ఈ గణనీయ తగ్గుదల సూచిస్తోంది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ ఈ రోజు రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2294404)
आगंतुक पटल : 13