బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తక్కువ ఖర్చు, ఎక్కువ సామర్థ్యం, నిరంతర ప్రాతిపదికన విస్తృత స్థాయి గని తవ్వకం కార్యకలాపాలతో భారత్ వృద్ధికి దన్నుగా నిలుస్తున్న దిప్‌కా ఓపెన్ కాస్ట్

प्रविष्टि तिथि: 04 AUG 2026 12:53PM by PIB Hyderabad

సౌత్ ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్‌స్ (ఎస్ఈసీఎల్)కు చెందిన దిప్‌కా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు (ఓసీపీ) భారత బొగ్గు గని తవ్వకాల రంగంలో చోటుచేసుకున్న చెప్పుకోదగిన మార్పులకు ఒక ఉజ్వల ఉదాహరణగా నిలుస్తోంది. దిప్‌కా ఓసీపీలో 1992లో బొగ్గు ఉత్పదన  కేవలం 10 లక్షల టన్నులతో మొదలుపెట్టగా, ప్రస్తుతం ఇది దేశంలో బొగ్గును ఉత్పత్తి చేస్తున్న అతి పెద్ద కాంప్లెక్సులలో ఒకటిగా ఎదిగింది. దిప్‌కా ఓపీసీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 375 లక్షల టన్నుల అత్యధిక ఉత్పత్తితో పాటు, 394 లక్షల టన్నుల బొగ్గు సరఫరాను కూడా నమోదు చేసింది. 400 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి (ఎమ్‌టీపీఏ) పరిమాణానికి అవసరమైన పర్యావరణ సంబంధిత ఆమోదం లభించడమే కాకుండా, రాబోయే కాలంలో 60  ఎమ్‌టీపీఏ లక్ష్యం దిశగా దూసుకుపోవడానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో దిప్‌కా ఓసీపీ ప్రస్తుతం వ్యూహాత్మక జాతీయ ఆస్తిగా నిలిచింది. ఈ బహిరంగ గనిలో తవ్వకం కార్యకలాపాలను తక్కువ ఖర్చుతో, ఎక్కువ సామర్థ్యంతో, నిరంతర ప్రాతిపదికన విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నారు.
పటిష్ఠంగా ఆరంభమైన 2026-27 ఆర్థిక సంవత్సరం
దిప్‌కా ఓసీ గత సంవత్సరం రికార్డు స్థాయి ప్రదర్శనను కొనసాగిస్తూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని కూడా అంతే ప్రభావవంతంగా మొదలుపెట్టింది.
ఈ గని 2026 జులై 25 నాటికి 126.6 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. ఇది ఉత్పత్తి కి సంబంధించి క్రమ క్రమంగా వృద్ధిని సాధించాలనుకున్న లక్ష్యానికి మించి, 104 శాతానికి సమానం. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఇక్కడ బొగ్గు ఉత్పత్తిలో 30.5 శాతం వార్షిక వృద్ధి నమోదవడం మరో ప్రోత్సాహకరమైన అంశం. ఇది గనిలో ఉత్పాదకతలో మెరుగుదలనే కాకుండా, పరికరాలను ఉపయోగించడంలో కూడా చెప్పుకోదగిన మెరుగుదలను సూచిస్తోంది. ఇక్కడి నుంచి బొగ్గు సరఫరా ఇంతే పటిష్ఠంగా ఉంది. ఇది 138.7 లక్షల టన్నులకు చేరింది. దీంతో, ఉత్పత్తి కి సంబంధించి క్రమ క్రమంగా వృద్ధిని సాధించాలని పెట్టుకున్న లక్ష్యానికి మించి 109 శాతం పురోగతిని సాధించినట్లయింది. ఫలితంగా థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు, పారిశ్రామిక వినియోగదారులకు నిరంతరాయ ఇంధన సరఫరా విషయంలో పూచీ పడుతున్నట్లు కూడా అయింది.
బొగ్గు ఉత్పత్తికి, సరఫరాకు మధ్య ఆటంకాలు ఏవీ లేని ఎదురవని విధంగా సమన్వయాన్ని ఏర్పరుచుకోవడం కార్యకలాపాల నిర్వహణలో దిప్‌కా చాటుకుంటున్న పరిణతికి నిదర్శనం. ఇక్కడ గని తవ్వకం పనులు, రవాణా, ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ వేర్వేరు కార్యకలాపాలుగా కన్నా ఏకీకృత విలువ ఆధారిత వ్యవస్థలో అంతర్భాగాలుగా ఉంటున్నాయి.
ఉత్పాదకత కన్నా ఓ అడుగు ముందుకు వేస్తూ విలువ జోడింపు
గని తవ్వకం పనితీరు ఎలా ఉందో ఉత్పత్తి స్థాయే ప్రధానంగా తెలియజేస్తుంది. అయితే, దిప్‌కా సాధించిన విజయం ఆర్థికంగా ఈ గని ఎంత వరకూ తోడ్పడుతోందనే అంశాన్ని కూడా ఇంతే ప్రాధాన్యంతో చాటిచెబుతోంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ గని మొత్తం మీద రూ.3,230.91 కోట్ల లాభాన్ని సంపాదించి, ఎస్ఈసీఎల్‌కు లాభాలు తెచ్చిపెడుతున్న అత్యంత బలమైన కేంద్రాల్లో ఒకటిగా మారింది. లాభదాయకత మెరుగుపడటానికి ఒక్క అధికోత్పత్తే కారణం కాదు. ఖర్చులను మెరుగ్గా నియంత్రించడం, కార్యకలాపాల నిర్వహణలో దక్షతను పెంపొందించడం కూడా తమ వంతు తోడ్పాటును అందించాయి. ప్రతి టన్నుకు లాభం రూ.827కు పెరిగింది. దీంతో పాటు నిర్వహణ సంబంధిత ఖర్చులు అదే నిష్పత్తిలో పెరగకుండానే పెద్ద ఎత్తున ఉత్పత్తిని సాధించవచ్చని ఈ గని నిరూపించింది. ఈ ఆర్థిక ప్రమాణాలు కోల్ ఇండియా సమగ్ర లాభదాయకతలో దిప్‌కా పాత్ర అంతకంతకు పెరుగుతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
భావి వృద్ధికి పటిష్ఠ పునాది
దిప్‌కా ప్రభావవంతమైన ఉత్పత్తి సామర్థ్యంలో అనేక వ్యూహాత్మక కార్యక్రమాలు పోషించిన పాత్రా కీలకమే.  ఇవి గని దీర్ఘకాలిక ఉత్పత్తి సామర్థ్యాన్ని బలోపేతం చేశాయి. వీటిలో భూ సేకరణ, పునరావాసం.. ఇవి దీర్ఘకాలిక సామర్థ్య విస్తరణకు సంబంధించి అన్నింటి కన్నా ముందుగా ప్రస్తావించాల్సిన అంశాలు.
మాల్‌గావ్ గ్రామాన్ని విజయవంతంగా అధీనంలోకి తీసుకున్న తరువాత, ఈ ప్రాంతం హర్‌దీ బజార్ పునరావాసం, పునరాశ్రయ కల్పన దిశగా గొప్ప పురోగతిని సాధించింది. ఇది ఈ ప్రాంతంలో చేపట్టిన అతి పెద్ద, అత్యంత సంక్లిష్ట పునరావాస, పునరాశ్రయ కల్పన (ఆర్ అండ్ ఆర్) కార్యక్రమాల్లో ఒకటి. పునరావాసాన్ని దిప్‌కా ఓ చట్టపరమైన బాధ్యతగా మాత్రమే భావించకుండా, అభివృద్ధి ప్రధాన దృష్టికోణంలో చూస్తూ పునరావాస టౌన్‌షిప్‌ను చక్కని ప్రణాళికతో తీర్చిదిద్దింది. టౌన్‌షిప్‌లో రహదారులు, పాఠశాలలు, ఆరోగ్యసంరక్షణ కేంద్రాలు, సామాజిక సదుపాయాలు, ప్రజోపయోగ సదుపాయాలు వంటి పౌరులకు అత్యవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించారు. ఈ భాగస్వామ్య ప్రధాన విధానం, పారదర్శక వైఖరి గనికి కావలసిన భూమి లభ్యతకు మార్గాన్ని సుగమం చేయడంతో పాటు ఆసక్తిదారులలో విశ్వాసాన్నీ, ఈ ప్రాజెక్టుకు సామాజిక ఆమోదాన్ని బలపరిచాయి.  
పెద్ద ఎత్తున ఉత్పత్తికి సహకరిస్తున్న
మౌలిక సదుపాయాల కల్పన

గని తవ్వకం కార్యకలాపాలను భారీ స్థాయిలో చేపట్టాలంటే తరలింపు సంబంధిత మౌలిక సదుపాయాలను కూడా అంతే విస్తృత స్థాయిలో కల్పించవలసి ఉంటుంది. దిప్‌కాలో కోల్ ఇండియా అత్యంత వైవిధ్యంతో కూడిన బొగ్గు తరలింపు వ్యవస్థలను ఏర్పాటు చేసింది. వాటిలో ఎంజీఆర్‌తో ముడిపడిన సైలోస్, ఫస్ట్ మైల్ కనెక్టివిటీ (ఎఫ్ఎమ్‌సీ) సైలోస్, రైల్వే లోడింగ్ సదుపాయాలు, రోడ్డు రవాణా వ్యవస్థలు భాగంగా ఉన్నాయి. ఈ ఏకీకృత నెట్‌వర్క్.. కార్యకలాపాల నిర్వహణలో సౌలభ్యాన్ని అందిస్తుంది. ఎన్‌టీపీసీ సిపట్ సహా మధ్య భారతంలో అనేక థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు, ప్రధాన వినియోగదారు సంస్థలకు ఎలాంటి అంతరాయాలూ లేకుండా బొగ్గును సరఫరా చేయడానికి ఈ నెట్‌వర్క్ ఉపయోగపడుతోంది. రోజు రోజుకూ పెంచుతున్న ఉత్పత్తిని గని ప్రవేశ మార్గం వద్ద నిల్వలు జమ చేసి ఉంచకుండా, వినియోగదారులకు అధిక పరిమాణాల్లో వెంటనే సరఫరా చేయడం దీంతో సాధ్యపడుతోంది.    
సాంకేతికతతో ఉత్పాదకతకు ప్రోత్సాహం
సాంకేతిక విజ్ఞానం, ఆధునికీకరణ.. వీటిపై నిరంతరం పెట్టుబడి పెడుతుండటం దిప్‌కా అసాధారణ ఉత్పత్తి ప్రస్థానానికి చోదక శక్తిగా మారింది.
ఈ గనిలో రాళ్ళని, మట్టిని ఎత్తడానికి ఉపయోగించే విద్యుచ్ఛక్తి ఆధారిత (42 ఘనపు మీటర్ల) తవ్వకం యంత్రాలు,  రంధ్రాలు చేయడంతోనో, పేలుళ్ల పద్ధతిలోనో కాకుండా నేలను, రాళ్లను నేరుగా కత్తిరించే అధిక సామర్థ్యం కలిగిన పెద్ద యంత్రాలు, గనుల గుంటలో ఉపయోగించే సుదీర్ఘ కన్వేయర్ బెల్ట్ వ్యవస్థ, అధునాతన సైలో లోడింగ్ సదుపాయాలతో పాటు గని పర్యవేక్షణకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. గని నిర్వహణ కోసం డిజిటల్ వేదికలను ఏర్పాటు చేశారు. ఈ సాంకేతికతలు.. పరికరాల ఉత్పాదకతను గణనీయంగా మెరుగుపరిచాయి; గని నియంత్రణను సులభతరం చేశాయి; కార్యకలాపాల్లో జాప్యాన్ని తగ్గించాయి; మొత్తంమీద గని తవ్వకానికి సంబంధించిన కార్యకలాపాల పర్యవేక్షణను బలోపేతం చేశాయి. ఉత్పత్తి రాశి అంతకంతకూ పెరుగుతుండగా, దాంతోపాటే ఉన్నత నిర్వహణ సామర్థ్యం కలిగిందిగా దిప్‌కాను తీర్చిదిద్దడంలో సాంకేతికత ఒక ముఖ్య కారకంగా మారింది.
సుస్థిర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని
బాధ్యతాయుత విధానంలో గని తవ్వకం కార్యకలాపాలు

అధికోత్పత్తి, పర్యావరణ సంరక్షణ చెట్టపట్టాల్ వేసుకొని ముందుకు సాగ గలుగుతాయని దిప్‌కా తెలియజెప్పింది.
ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలను అమలుచేశారు. వాటిలో.. కంటిన్యువస్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్స్ (సీఏఏక్యూఎమ్ఎస్), గనుల్లో గాలిలో తేలియాడే ధూళి కణాలను తగ్గించడానికి పెద్ద ఫిరంగుల లాంటి యంత్రాల ద్వారా నీటి తుంపరలను గాలిలోకి చిమ్మే ఫాగ్ కానన్ వ్యవస్థలు, గనుల నుంచి బయటకు వచ్చే భారీ వాహనాల టైర్లు సహా ఆ వాహనాల అడుగు భాగాన్ని శుభ్రం చేసే ప్రత్యేక వ్యవస్థలు, గనుల తవ్వకం వల్ల దెబ్బతిన్న పర్యావరణాన్ని కాపాడటానికి పెద్ద ఎత్తున మొక్కల పెంపకం కార్యక్రమాలను చేపట్టడం, విద్యుత్తు ఆధారిత వాహనాల వినియోగం, ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి ఉపయోగించడానికి అనువుగా మార్చే కేంద్రాలు వంటివి భాగంగా ఉన్నాయి. ఈ చర్యలతో పర్యావరణ సంరక్షణను బలోపేతం చేశారు. అలాగే గని తవ్వకం కార్యకలాపాలకు సంబంధించినంతవరకు సమగ్ర స్థిరత్వాన్ని మెరుగుపరిచారు. ఏకీకృత ఆన్‌లైన్ వేదికలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణ పర్యవేక్షణను డిజిటల్ విధానంలో చేపట్టడంతో నియమ పాలన, కార్యకలాపాల నిర్వహణలో పారదర్శకత్వం పెరిగాయి.
వీటితో పాటు వ్యవస్థిత పునరావాసం, పునరాశ్రయ కల్పన దిశగా ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణం.. ఇవి ప్రాజెక్టుతో ప్రభావితమైన కుటుంబాలతో చక్కని అనుబంధాన్ని కొనసాగిస్తూ, రాబోయే కాలంలో గని తవ్వకం కార్యకలాపాల కోసం అవసరమైన భూమి అందుబాటులోకి వచ్చేందుకు తోడ్పడుతున్నాయి. ఈ సమతౌల్య వైఖరి ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక ఉత్పత్తి కి సంబంధించిన దృష్టికోణాన్ని గణనీయంగా పటిష్ఠపరిచింది.
4 కోట్ల టన్నులకు మించిన పురోగతిపై దృష్టి
ఇటీవల పర్యావరణ ఆమోదాన్ని 40 ఎమ్‌టీపీఏకు పెంచడం దిప్‌కా గని సాధించిన విజయాలకు అంతం కాదు, అభివృద్ధి ప్రస్థానంలో ఈ గని తన తదుపరి దశను మొదలుపెడుతోందనడానికి ఆరంభం.  భూ సేకరణలో ప్రగతి, పునరావాస కార్యక్రమాల కొనసాగింపు, మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకొంటూ ఉండటం, 60 ఎమ్‌టీపీఏ స్థాయికి విస్తరించాలన్న స్పష్టమైన ప్రణాళికతో పాటు గని తవ్వకం కార్యకలాపాల్లో నిరంతరం ఉన్నత స్థాయి పనితీరును కనబరచడానికి అవసరమైన అన్ని అంశాలూ దిప్‌కా గని విషయంలో అనుకూలంగా ఉన్నాయి.
గని తవ్వకం సంబంధిత ప్రణాళికలను శాస్త్రీయ దృక్పథంతో రూపొందించడం, సాంకేతికత పరంగా నూతన ఆవిష్కరణలకు మొగ్గు చూపడం, ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణను పాటించడం, గని తవ్వకం కార్యకలాపాలను బాధ్యతాయుతంగా నిర్వహిస్తుండటం.. ఇవన్నీ కలిసి ప్రపంచ స్థాయి గని నిర్వహణకు దోహదపడతాయనడానికి దిప్‌కా ప్రస్థానమే శక్తిమంతమైన ఉదాహరణ. కోల్ ఇండియా ప్రధాన ఉత్పాదక గనులలో ఒకటైన దిప్‌కా.. ఉత్పత్తి, లాభదాయకత, కార్యకలాపాల నిర్వహణలో నైపుణ్యం, పర్యావరణ సంబంధ విషయాల్లో జవాబుదారీతనం వంటి అంశాల్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతూనే ఉంటుంది. దీంతోపాటు, భారత్ ఇంధన భద్రతకు తన వంతు తోడ్పాటును నిలకడగా అందిస్తూనే ఉంటుంది.

 

***


(रिलीज़ आईडी: 2294371) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil