సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో సంస్కరణలను సమీక్షించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


సాంకేతికత ఆధారిత పాలనతో పరిపాలనా న్యాయం బలోపేతమవుతుందని వ్యాఖ్య

ట్రిబ్యునల్ 93 శాతానికి పైగా కేసుల పరిష్కార రేటును కొనసాగిస్తోందని కేంద్ర మంత్రికి తెలిపిన క్యాట్ ఛైర్మన్ జస్టిస్ రంజిత్ వసంతరావు మోరే

డిజిటల్ పరివర్తన, మెరుగైన కేసు పరిష్కారంతో క్యాట్‌ సంస్కరణల్లో నూతన దశకు నాంది

పరిపాలనా న్యాయాన్ని మరింత వేగవంతం, పారదర్శకం, సాంకేతికత ఆధారితం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: డాక్టర్ జితేంద్ర సింగ్

प्रविष्टि तिथि: 04 AUG 2026 3:17PM by PIB Hyderabad

కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్ర శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌ను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (సీఏటీ) ఛైర్మన్, జస్టిస్ రంజిత్ వసంతరావు మోరే ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. సంస్థాగత సంస్కరణలు, విస్తృత ప్రచారం, సాంకేతికత ఆధారిత సేవల ద్వారా పరిపాలన న్యాయాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ట్రిబ్యునల్ ఇటీవల చేపట్టిన కార్యక్రమాల గురించి ఆయనకు వివరించారు.

ట్రిబ్యునల్ ప్రారంభం నుంచి 10 లక్షలకు పైగా కేసులు విచారణకు రాగా, వాటిలో 9.32 లక్షలకు పైగా కేసులను పరిష్కరించినట్లు ఆయన వివరించారు. మొత్తం పరిష్కార రేటు 93 శాతానికి పైగా ఉందని జస్టిస్ మోరే కేంద్ర మంత్రికి తెలియజేశారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం... ప్రభుత్వ సంస్థలను మరింత పారదర్శకంగా, సమర్థంగా, పౌర-కేంద్రితంగా మార్చే పరిపాలనా సంస్కరణలను నిరంతరం చేపడుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పరిపాలనా న్యాయం సుపరిపాలనలో అంతర్భాగమని ఆయన పేర్కొన్నారు. సంస్కరణలు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ సేవలన్నింటినీ మరింత మెరుగ్గా అందుబాటులో ఉంచడం సహా సేవల సామర్థ్యాన్ని, సౌలభ్యాన్ని నిరంతరం మెరుగుపరచాలని ఆయన సూచించారు.

ప్రభుత్వ సంస్థలన్నింటిలో కొనసాగుతున్న పరివర్తనకు సాంకేతికత, పారదర్శకత, ప్రక్రియల సరళీకరణ కోసం ప్రభుత్వం ఇస్తున్న అధిక ప్రాధాన్యతే కారణమని కేంద్ర మంత్రి తెలిపారు. సంస్థలకు సేవలను వేగంగా అందించడానికి, జవాబుదారీతనాన్ని మరింత మెరుగుపరచడానికి, విధానపరమైన జాప్యాలను తగ్గించడానికి డిజిటల్ వేదికలు సహాయపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగానే పాలన... పౌరుల అవసరాలకు మరింత అనుగుణంగా మారుతోందన్నారు.

కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ సాధించిన పురోగతిని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావిస్తూ... ట్రిబ్యునల్‌కు సంబంధించి విస్తరిస్తున్న డిజిటల్ వ్యవస్థ, బలపడుతున్న మౌలిక సదుపాయాలు, కేసుల పరిష్కారంలో నిరంతర మెరుగుదల వంటివి ప్రభుత్వం అనుసరిస్తున్న పాలనాపరమైన సంస్కరణల విస్తృత దిశను ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమాలు మరింత సమర్థమైన, అందుబాటులో ఉండే పరిపాలనా న్యాయ పంపిణీ వ్యవస్థకు దోహదపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

న్యాయం మరింత అందుబాటులో ఉండేలా చేయడం ప్రభుత్వ కీలక ప్రాధాన్యంగా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. భౌగోళికంగా సుదూరంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో కొత్త బెంచ్‌ల ఏర్పాటు, సర్క్యూట్ సిట్టింగ్‌ల ప్రారంభం వంటి కార్యక్రమాలు కక్షిదారులకు పరిపాలనా న్యాయాన్ని మరింత చేరువ చేశాయన్నారు. ప్రయాణ భారాన్ని తగ్గించడం సహా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సౌకర్యాన్నీ మెరుగుపరిచాయని ఆయన తెలిపారు.

అందరికీ కనిపించే ఫలితాలను ఇచ్చినప్పుడే సంస్థాగత సంస్కరణలు అత్యంత అర్థవంతమైనవి అవుతాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యాయ ప్రక్రియల ఆధునికీకరణతో పాటు కేసుల పరిష్కారంలో నిరంతర మెరుగుదల... సాంకేతికత, మెరుగైన పరిపాలనా వ్యవస్థల మద్దతుతో కూడిన సుస్థిర సంస్కరణల విలువను ప్రదర్శిస్తుందని ఆయన తెలిపారు.

గత కొన్నేళ్లుగా ట్రిబ్యునల్ అనేక ముఖ్యమైన కార్యక్రమాలను చేపట్టిందని జస్టిస్ రంజిత్ వసంతరావు మోరే పేర్కొన్నారు. జమ్మూ, శ్రీనగర్‌లలో కొత్త బెంచ్‌ల ఏర్పాటు... పుదుచ్చేరి, లేహ్, కార్గిల్, విజయవాడలలో సర్క్యూట్ సిట్టింగ్‌ల ప్రారంభం వంటి కార్యక్రమాలు వాటిలో భాగంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా మారుమూల, వెనుకబడిన ప్రాంతాల్లో పరిపాలనా న్యాయం మరింత అందుబాటులోకి వచ్చిందని జస్టిస్ మోరే కేంద్ర మంత్రికి వివరించారు.

అడ్వాన్స్‌డ్ కేస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఏసీఐఎస్) కింద సాధించిన గణనీయ పురోగతిని చైర్మన్ ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి వివరించారు. ఈ వ్యవస్థ ద్వారా ఇ-ఫైలింగ్, వర్చువల్ విచారణలు, ఆన్‌లైన్ డిస్‌ప్లే బోర్డులు, ఎస్ఎమ్ఎస్, ఈ-మెయిల్ ద్వారా అలర్ట్‌లు, కోర్టు ఫీజుల ఆన్‌లైన్ చెల్లింపు, మొబైల్ అప్లికేషన్, ఇ-సర్టిఫైడ్ కాపీలు, న్యాయ రికార్డుల డిజిటల్ తనిఖీ, అధునాతన శోధన సౌకర్యాలు, ఇ-మెన్షనింగ్, ఇ-లిస్టింగ్, డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా కాగితరహిత కోర్టు పనితీరు వంటి అనేక రకాల డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయని జస్టిస్ మోరే తెలియజేశారు.

ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వ డిజిటల్ ఇండియా దార్శనికతకు పూర్తిగా అనుగుణంగా ఉన్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. పారదర్శకత, సామర్థ్యం, పాలనా సౌలభ్యానికి సాంకేతికత ఎంతగానో దోహదపడుతోందని ఆయన అన్నారు. డిజిటల్ పరివర్తన కారణంగా సంస్థలు మరింత అందుబాటులో ఉండడం, మెరుగ్గా ప్రతిస్పందించడం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండడం సాధ్యమవుతోందని ఆయన తెలిపారు.

ట్రిబ్యునల్ ప్రారంభం నుంచి 10 లక్షలకు పైగా కేసులు విచారణకు రాగా, 9.32 లక్షలకు పైగా కేసులను పరిష్కరించడం ద్వారా మొత్తం పరిష్కార రేటు 93 శాతానికి పైగా ఉందని జస్టిస్ మోరే కేంద్ర మంత్రికి తెలియజేశారు. కొత్త కేసులు నిరంతరం వస్తూనే ఉన్నప్పటికీ... ఇటీవలి సంవత్సరాల్లో పెండింగ్ కేసులు గణనీయంగా తగ్గాయని ఆయన తెలిపారు. 2025లో వార్షిక పరిష్కారాల సంఖ్య కొత్తగా దాఖలైన కేసుల సంఖ్యను మించిపోయిందనీ జస్టిస్ మోరే కేంద్ర మంత్రికి వివరించారు.

ట్రిబ్యునల్ విస్తృత డిజిటల్ పాలన కార్యక్రమాల్లో భాగంగా... అన్ని బెంచ్‌లలో ఇ-ఆఫీస్ అమలు, ఇ-హెచ్‌ఆర్‌ఎంఎస్‌పై అధికారులు, సిబ్బంది ఆన్‌బోర్డింగ్, పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (పీఎఫ్‌ఎంఎస్) అమలు, భవిష్య పోర్టల్ ద్వారా పెన్షన్ కేసుల డిజిటల్ ప్రాసెసింగ్, ఇ-ఎస్‌ఏఎం అమలు గురించీ చైర్మన్ ఈ సందర్బంగా కేంద్ర మంత్రికి వివరించారు.

సమర్థమైన, జవాబుదారీ, పౌర-కేంద్రిత సంస్థల నిర్మాణం కోసం... సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేసే, ప్రజా సేవల పంపిణీని మెరుగుపరిచే, సాంకేతికతను ఉపయోగించుకునే సంస్కరణలకు ప్రభుత్వ మద్దతు కొనసాగుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పరిపాలన సంస్కరణలు ఉద్యోగులకూ, పౌరులకూ ఒకే విధమైన, స్పష్టమైన ప్రయోజనాలుగా మారేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

***


(रिलीज़ आईडी: 2294309) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil