రక్షణ మంత్రిత్వ శాఖ
నౌకాదళ డిప్యూటీ చీఫ్‌గా పదవీబాధ్యతలు స్వీకరించిన వైస్ అడ్మిరల్ ఎ ఎన్ ప్రమోద్, ఏవీఎస్ఎమ్, వైఎస్ఎమ్
प्रविष्टि तिथि:
01 AUG 2026 11:47AM by PIB Hyderabad
నౌకాదళ డిప్యూటీ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ ఎ. ఎన్. ప్రమోద్, ఏవీఎస్ఎమ్, వైఎస్ఎమ్ ఈ రోజు పదవీబాధ్యతలు స్వీకరించారు.
గోవాలోని నౌకాదళ అకాడమీకి చెందిన 38వ ఏకీకృత కేడెట్ కోర్సు పూర్వ విద్యార్థి అయిన వైస్ అడ్మిరల్ ఎ. ఎన్. ప్రమోద్ 1990 జులై 1న భారతీయ నౌకాదళంలో చేరారు. ఈ ఫ్లాగ్ ఆఫీసర్ కేటగిరీ ‘ఎ‘కి చెందిన సీ కింగ్ ఎయిర్ ఆపరేషన్స్ అధికారి. అంతేకాక, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ నిపుణుడు కూడా. వెల్లింగ్టన్‌లో గల డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కళాశాలలోనూ, గోవాలోని నౌకాదళ యుద్ధ కళాశాలలో నావల్ హయ్యర్ కమాండ్ కోర్సులోనూ ఈయన పూర్వ విద్యార్థి.
ఈ ఫ్లాగ్ ఆఫీసరు 36 సంవత్సరాలకు పైగా తన విశిష్ట కెరియర్‌లో.. సముద్రంలోనూ, సముద్రతీరంలోనూ కమాండ్, కార్యకలాపాలు, బోధన, సిబ్బందికి సంబంధించిన అనేక పదవులను నిర్వహించారు. నౌకాదళంలో ఆయన నిర్వహించిన కీలక పదవుల్లో.. గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ రాజ్‌పుత్ కు కార్యనిర్వహణ అధికారి, జలాంతర్గామి నిరోధక యుద్ధ గస్తీ నౌక ఐఎన్ఎస్ అభయ్, ల్యాండింగ్ షిప్ ట్యాంక్ (పెద్దది) ఐఎన్ఎస్ శార్దూల్, గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ సాత్పురాకు కమాండ్ వంటివి ఉన్నాయి. గల్వాన్ ఘటన అనంతరం ‘ఆపరేషన్ స్నో లెపర్డ్’ వేళ.. పశ్చిమ నౌకాదళ ఫ్లీట్ ఆపరేషన్స్ అధికారిగా కూడా ఈయన సేవలు అందించారు. 1999 నాటి ‘ఆపరేషన్ విజయ్’లో, 2001 నాటి ‘ఆపరేషన్ పరాక్రమ్’లో ఈ ఫ్లాగ్ ఆఫీసరు పాల్గొన్నారు.
తీర ప్రాంతాల్లో ఈ ఫ్లాగ్ ఆఫీసరు.. శ్రీ విజయ పురంలో నెలకొన్న నౌకాదళ వైమానిక స్టేషను ఐఎన్ఎస్ ఉత్క్రోశ్ కమాండ్ బాధ్యతలను నిర్వహించారు. వెల్లింగ్టన్‌లో డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కళాశాలలో డైరెక్టింగ్ స్టాఫ్‌గా సేవలను అందించారు. నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఈయన నిర్వహించిన కీలక పదవుల్లో.. నౌకాదళ వైమానిక స్టాఫ్ జాయింట్ డైరెక్టరు, డైరెక్టరు పదవులే కాక, ఎయిర్‌క్రాఫ్ట్ అక్విజిషన్ ప్రిన్సిపల్ డైరెక్టరు పదవి వంటివి ఉన్నాయి. ఈయన 2006 నుంచి 2009 వరకూ వ్యూహరచనా సంబంధి ఆడిట్ గ్రూపులో సభ్యునిగా ఉండడమే కాక, 2016 నుంచి 2019 వరకూ భారతీయ నౌకాదళ వ్యూహాత్మక, యుద్ధ కార్యకలాపాల మండలిలో సభ్యునిగా కూడా ఉన్నారు.
రియర్ అడ్మిరల్ పదవికి పదోన్నతి లభించిన తరువాత, ఈయన భారతీయ నౌకాదళ అకాడమీలో డిప్యూటీ కమాండ్ అధికారి, నౌకాదళ సిబ్బంది (వైమానిక) అసిస్టెంట్ చీఫ్ పదవులనే కాక, మహారాష్ట్ర నావల్ ఏరియాకు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండ్ అధికారి పదవిని కూడా నిర్వహించారు.
వైస్ అడ్మిరల్ పదవికి పదోన్నతిని పొందిన తరువాత, ఈయన 2023 డిసెంబరు 13 నుంచి నిన్నటి వరకూ.. అంటే 2026 జులై 31 వరకూ నౌకాదళ కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ (డీజీఎన్ఓ)గా సేవలు అందించారు. డీజీఎన్ఓగా ఈయన ‘ఆపరేషన్ సిందూర్’ కాలంలో భారతీయ నౌకాదళ ప్రణాళికరచన, సన్నాహకాలు, కార్యకలాపాల సన్నద్ధతలతో పాటు ప్రస్తుత పశ్చిమాసియయా సంక్షోభ కాలంలో సముద్ర భద్రత సంబంధిత కార్యకలాపాల నిర్వహణలో చురుకుగా పాలుపంచుకున్నారు.
ఈ ఫ్లాగ్ ఆఫీసరు అందించిన విశిష్ట సేవలకీ, కార్యకలాపాల నాయకత్వ భూమికకీ గుర్తింపునిస్తూ, 2024లో ‘అతి విశిష్ట సేవా పతకం’, 2025లో ‘యుద్ధ సేవా పతకం’ తో సత్కరించారు.
ఈయన.. వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తీ, యూవైఎస్ఎమ్, ఏవీఎస్ఎమ్, వీఎస్ఎమ్ స్థానాన్ని స్వీకరిస్తారు. వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తీ, యూవైఎస్ఎమ్, ఏవీఎస్ఎమ్, వీఎస్ఎమ్ 38 సంవత్సరాలకు పైగా విశిష్ట సేవలను అందించిన అనంతరం నిన్న అంటే 2026 జులై 31న పదవీ విరమణ చేశారు.
***
(रिलीज़ आईडी: 2293123)
आगंतुक पटल : 6