ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా డీఆర్‌ఐ మెగా ఆపరేషన్: భారీగా బంగారం, మత్తు పదార్థాలు, ఈ-సిగరెట్ల స్వాధీనం... అయిదుగురు విదేశీయులతో సహా 20 మంది అరెస్టు

प्रविष्टि तिथि: 01 AUG 2026 5:21PM by PIB Hyderabad

వ్యవస్థీకృత స్మగ్లింగ్ వ్యవస్థలు, సరిహద్దు దాటే అక్రమ రవాణా ముఠాలపై నిరంతర నిఘాలో భాగంగా డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) ఈ వారం దేశవ్యాప్తంగా పలు నిఘా ఆధారిత ప్రత్యేక దాడులను నిర్వహించింది. ఈ ఆపరేషన్లలో విదేశీ బంగారం, హెరాయిన్, ఎండీఎంఏ, హైడ్రోపోనిక్ గంజాయి, ఎర్రచందనం, నిషేధిత వన్యప్రాణి ఉత్పత్తులు, ఈ-సిగరెట్లు, విదేశీ గసగసాలు, పోకచెక్కలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణా, స్మగ్లింగ్ కార్యకలాపాల్లో భాగస్వాములైన అయిదుగురు విదేశీయులతో పాటు మొత్తం 20 మంది నిందితులను అధికారులు అరెస్టు చేశారు. క్రిమినల్ ముఠాలు నిషేధిత వస్తువులను దాచడానికి ఉపయోగించిన అత్యంత సంక్లిష్టమైన, ఆధునికమైన దాచే పద్ధతులను ఈ తనిఖీల్లో డీఆర్‌ఐ అధికారులు బహిర్గతం చేశారు.

 

న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 29.07.2026న డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు నిర్వహించిన ప్రధాన ఆపరేషన్‌లో దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు విదేశీయులను అడ్డుకున్నారు. ప్రయాణికుల ట్రాలీని తనిఖీ చేయగా, ట్రాలీ పరిమాణానికి తగినట్లుగా స్టీల్ షీట్‌తో ప్రత్యేకంగా తయారు చేసిన రహస్య గదిని అధికారులు గుర్తించారు. ఆ రహస్య గది నుంచి 4 కిలోల బరువున్న 40 విదేశీ బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారాన్ని జప్తు చేసి, ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు. 

 

అంతకుముందు అదే వారంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో డీఆర్‌ఐ, సరిహద్దు భద్రతా దళ సిబ్బంది (బీఎస్‌ఎఫ్‌) బలగాలు సంయుక్తంగా నిర్వహించిన వేర్వేరు ఆపరేషన్లలో సుమారు 3.2 కిలోల విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తుంగిలోని సరిహద్దు ఫెన్సింగ్ వద్ద ఒకరి నుంచి, హిలీ సరిహద్దు గేట్ వద్ద మరొకరి నుంచి, నిత్యానందకటి, హకింపూర్ సమీపంలో అడ్డుకున్న మోటార్ సైకిల్‌పై ఉన్న వ్యక్తి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనాలకు సంబంధించి ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

 

పై కేసులతో పాటు వారణాసి ఢిల్లీ విమానాశ్రయం, తమిళనాడుల్లో నిర్వహించిన మూడు వేర్వేరు ఆపరేషన్లలో డీఆర్ఐ అధికారులు సుమారు 2.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేశారు.

 

మొత్తం సుమారు రూ. 14 కోట్ల విలువైన 9.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని 9 మందిని అరెస్టు చేశారు.

 

వన్యప్రాణికి సంబంధించిన ఉత్పత్తులు

 

రవాణాపై నిషేధం ఉన్న వస్తువుల దిగుమతికి సంబంధించిన మరో ముఖ్యమైన కేసులో సుమారు రూ. 1.4 కోట్ల విలువైన 14 మెట్రిక్ టన్నుల పాకిస్తాన్ రకానికి చెందిన గుగ్గిలం దిగుమతి యత్నాన్ని డీఆర్‌ఐ అధికారులు బట్టబయలు చేశారు. ఈ సరుకు వివరణను, ఉత్పత్తి చేసిన దేశం పేరును తప్పుగా ప్రకటించి తీసుకురావడానికి ప్రయత్నించారు. సొమాలియా నుంచి వస్తున్న సహజమైన రెసిన్ (జిగురు) అని, దుబాయ్ మార్గంలో పంపుతున్నామని తప్పుడు ప్రకటనలు ఇచ్చారు.

 

భారత్, పాకిస్తాన్ శుష్క (ఎడారి) ప్రాంతాల్లో మాత్రమే పెరిగే గుగ్గిలం (క్యామిఫోరా రెసిన్) రకం సీఐటీఈఎస్‌ అనుబంధం II జాబితాలో ఉంది. ఇది ఐయూసీఎన్‌ రెడ్ లిస్ట్‌లో తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్న జాతిగా వర్గీకరించారు. విచారణలో ఆ సరుకు పాకిస్తాన్ మూలాలు ఉన్న గుగ్గిలం అని, నకిలీ పత్రాలను ఉపయోగించి దారి మళ్లించి తీసుకువచ్చారని నిర్ధారణ అయింది. పాకిస్తాన్ నుంచి నేరుగా లేదా పరోక్షంగా ఉత్పత్తుల దిగుమతిని నిషేధించే డీజీఎఫ్‌టీ నిబంధనలకు విరుద్ధంగా ఈ దిగుమతి జరిగింది. ఈ కుట్రలో భాగస్వాములైన ఇద్దరు వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు.

 

మరో ప్రధాన వన్యప్రాణి, అటవీ ఉత్పత్తుల అక్రమ రవాణా కేసులో, చెన్నై శివార్లలో ఒక ట్రక్కును డీఆర్ఐ అధికారులు అడ్డుకున్నారు. ఖాళీ ప్లాస్టిక్ క్రేట్ల వెనుక దాచిన 142 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు సుమారు 4.8 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఎర్రచందనం అనేది సీఐటీఈఎస్‌ అనుబంధం II, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద రక్షణ పొందుతున్న జాతి. స్వాధీనం చేసిన ఈ సరుకు విలువ సుమారు రూ. 2.50 కోట్లు ఉంటుంది. గతంలో అక్రమ ఎగుమతులు చేసిన చరిత్ర ఉన్న ఒక సంఘటిత స్మగ్లింగ్ వ్యవస్థ హస్తం దీని వెనుక ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో ముగ్గురిని అరెస్టు చేశారు. 

 

మాదక ద్రవ్యాలు

 

మయాన్మార్ నుంచి సరిహద్దుల గుండా జరుగుతున్న మత్తు పదార్థాల అక్రమ రవాణాపై అందిన కచ్చితమైన సమాచారంతో మణిపూర్‌లోని చూరాచంద్‌పూర్ సమీపంలో ఒక వాహనాన్ని డీఆర్‌ఐ అధికారులు అడ్డుకున్నారు. అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసుల సహాయంతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో 220 సబ్బుల పెట్టెల్లో దాచిన సుమారు 2.7 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

 

ముంబైలో నిర్వహించిన వేర్వేరు రెండు ఆపరేషన్లలో ఢిల్లీ నుంచి ప్రయాణిస్తున్న ఇద్దరు విదేశీ మహిళలను డీఆర్‌ఐ అధికారులు అడ్డుకున్నారు. వారి లగేజీ సంచులలో ప్రత్యేకంగా తయారు చేసిన రహస్య అరల్లో దాచిన సింథటిక్ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో సుమారు 2 కిలోల యాంఫెటమైన్ క్రిస్టల్స్, ఎండీఎమ్‌ఏ టాబ్లెట్లను జప్తు చేశారు. ఎన్‌డీపీఎస్‌ చట్టం 1985 కింద ఆ ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు.

 

న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో, డీఆర్ఐ అధికారులు ఒక విదేశీయుడితో సహా ఇద్దరు ప్రయాణికులను అడ్డగించి, వారి వద్ద నుంచి సుమారు 25 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి ప్రయాణించిన ఈ ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు. 

 

పొగాకు ఉత్పత్తులు

 

నిషేధిత వస్తువుల అక్రమ దిగుమతిని అరికట్టే లక్ష్యంతో చేపట్టిన మరో ఆపరేషన్‌లో నవషేవా ఓడరేవు వద్ద ఒక దిగుమతి సరుకును డీఆర్‌ఐ అధికారులు అడ్డుకున్నారు. ఎల్‌ఈడీ లైట్లు, ఫిక్చర్లుగా తప్పుడు ప్రకటన ఇచ్చిన ఆ సరుకును తనిఖీ చేయగా, వివిధ బ్రాండ్లు, ఫ్లేవర్లకు చెందిన 9,230 నిషేధిత ఎలక్ట్రానిక్ సిగరెట్లు బయటపడ్డాయి. ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిరోధక చట్టం 2019 ప్రకారం భారత్‌లో ఈ-సిగరెట్లపై పూర్తి నిషేధం ఉంది. ఆ  కార్గోతో పాటు నిషేధిత ఈ-సిగరెట్లను అధికారులు జప్తు చేశారు. స్వాధీనం చేసిన ఈ మొత్తం సరుకు విలువ సుమారు రూ. 3.70 కోట్లు ఉంటుంది.

 

నిషేధిత వస్తువులు

 

మిజోరంలో భారత్-మయాన్మార్ సరిహద్దు సమీపంలో ఉన్న నాలుగు అనుమానాస్పద గోదాములపై డీఆర్‌ఐ అధికారులు అస్సాం రైఫిల్స్ బలగాల సహాయంతో దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విదేశీ మూలాలు ఉన్న సుమారు 14.5 మెట్రిక్ టన్నుల గసగసాలు, 14 మెట్రిక్ టన్నుల  పోకచెక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 3.6 కోట్లు ఉంటుంది. భారత్-మయాన్మార్ సరిహద్దులోని జోఖావ్‌థార్ సెక్టార్ గుండా ఈ వస్తువులను భారత్‌లోకి అక్రమంగా తరలించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కస్టమ్స్ చట్టం 1962 ప్రకారం ఈ సరుకును జప్తు చేశారు.

 

విదేశీ వాణిజ్య విధానం ప్రకారం గసగసాలు నియంత్రిత వస్తువుల జాబితా కిందకు వస్తాయి. నిర్దేశిత దేశాల నుంచి చట్టబద్ధంగా సాగు చేసిన పంటను మాత్రమే దిగుమతి చేసుకోవడం, గ్వాలియర్ నార్కోటిక్స్ కమిషనర్ వద్ద అన్ని దిగుమతి కాంట్రాక్టులను తప్పనిసరిగా నమోదు చేసుకోవడం వంటి నిర్దిష్ట నిబంధనలకు లోబడి మాత్రమే వీటి దిగుమతికి అనుమతి ఉంటుంది.

 

 



1. ఢిల్లీలోని ఐజీఐలో 4 కేజీల బంగారం స్వాధీనం

 

2. ఎండీఎంఏ టాబ్లెట్లు, ఆంఫెటమైన్ క్రిస్టల్స్ స్వాధీనం

 

3. హైడ్రోపోనిక్ గంజాయి

 

4. ముంబైలో ఈ-సిగరెట్లు స్వాధీనం

 

***


(रिलीज़ आईडी: 2293115) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Tamil