శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
స్వదేశీ సార్వత్రిక ఈవీ ఛార్జింగ్ సాంకేతికత వాణిజ్యీకరణ దిశగా
ఇండోర్ సంస్థ ‘రోడ్‌గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’కు ‘టీడీబీ-డీఎస్‌టీ’ తోడ్పాటు
प्रविष्टि तिथि:
31 JUL 2026 12:58PM by PIB Hyderabad
దేశంలో విద్యుత్ వాహన వినియోగం శరవేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ (డీఎస్‌టీ) పరిధిలోని సాంకేతికాభివృద్ధి బోర్డు (టీడీబీ) మరింత చురుకైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా “యూనివర్సల్ ఈవీ ఛార్జర్ వాణిజ్యీకరణ కోసం అసెంబ్లింగ్ కేంద్రం” ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఇండోర్ సంస్థ ‘మెస్సర్స్ రోడ్‌గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’కు ఆర్థిక సహాయం అందిస్తోంది. భావితరం సార్వత్రిక ఈవీ ఛార్జర్ల కోసం స్వదేశీ తయారీ సామర్థ్యం పెంచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. భారత ఛార్జింగ్ మౌలిక సదుపాయాల వ్యవస్థ బలోపేతం సహా స్వయంసమృద్ధ భారత్, సుస్థిర రవాణాపై జాతీయ ప్రణాళికను విజయవంతం చేయడం కూడా దీని ప్రధాన ధ్యేయం.
ఒకే సమీకృత ఛార్జింగ్ వేదిక ద్వారా ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర, ప్రయాణక, వాణిజ్య వాహనాలకు చార్జింగ్ సేవలందించే సార్వత్రిక ఈవీ ఛార్జర్ల వాణిజ్యపరమైన ఉత్పత్తి కోసం ఈ ప్రాజెక్టు కింద ఒక అత్యాధునిక తయారీ-అసెంబ్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఛార్జింగ్ సాంకేతికత దిగుమతి పరాధీనత తగ్గుతుంది. అలాగే, బహుళ వాహన మద్దతుగల పరస్పర సంధాన, అధిక-పనితీరు గల ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఈవీల వినియోగం పరంగా కీలక సమస్యలలో ఒకటి పరిష్కారమవుతుంది.
రోడ్‌గ్రిడ్ సంస్థ ఇప్పటికే 140 కిలోవాట్ డ్యూయల్ డీసీ గన్ (సీసీఎస్2 + టైప్ 6) ఛార్జింగ్‌సహా ఏసీ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కూడా అనుసంధానిస్తూ సార్వత్రిక ఈవీ ఛార్జర్‌ను రూపొందించి, దానికి పేటెంట్ కూడా పొందింది. ఇది అనేక రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు నిరంతర ఛార్జింగుకు వీలు కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టులో పవర్ ఎలక్ట్రానిక్స్, థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్, కమ్యూనికేషన్ మాడ్యూల్స్, మీటరింగ్ సిస్టమ్స్, కంట్రోల్ హార్డ్‌వేర్, ఎన్‌క్లోజర్ ఫ్యాబ్రికేషన్, క్వాలిటీ టెస్టింగ్, కేలిబ్రేషన్, ఫైనల్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ తదితర తయారీ-అసెంబ్లింగ్ ప్రక్రియలు పూర్తిస్థాయిలో ఉన్నాయి. భవిష్యత్తులో అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్స్, ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్‌లోకి విస్తరించడానికి తగిన సామర్థ్యంతో ఈ తయారీ కేంద్రాన్ని రూపొందించారు.
రోడ్‌గ్రిడ్ సంస్థ 2020లో స్వదేశీ హార్డ్‌వేర్, ఇంటెలిజెంట్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్స్, ఛార్జింగ్ మౌలిక సదుపాయ సేవలందించే ఇంటిగ్రేటెడ్ ఈవీ ఛార్జింగ్ టెక్నాలజీ కంపెనీగా ఏర్పాటైంది. ఈ మేరకు ఈవీ ఛార్జర్ల తయారీ, పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పన, స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ రూపకల్పన వగైరాలలో ఈ సంస్థ చురుగ్గా పనిచేస్తోంది. భారత ఈవీ ఛార్జింగ్ వ్యవస్థ బలోపేతంలో దీని పాత్ర మరింత ఇనుమడిస్తుంది. ప్రసిద్ధ పరిశ్రమ భాగస్వాములతో ఇటీవల రోడ్‌గ్రిడ్ కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒడంబడికలే ఇందుకు నిదర్శనం.
అత్యాధునిక ఈవీ ఛార్జింగ్ పరికరాల ఉత్పాదనలో దేశీయ తయారీ సామర్థ్యాన్ని ఈ ప్రాజెక్టు గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు. కీలకమైన పవర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో దిగుమతి ప్రత్యామ్నాయాన్ని ప్రోత్సహించడం సహా పట్టణ కేంద్రాలు, రహదారులు, నివాస-వాణిజ్య వాహన సముదాయాలు వంటి ప్రదేశాల్లో బహిరంగ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరించేందుకు ఇది మద్దతిస్తుందని అంచనా. స్వదేశీ హార్డ్‌వేర్‌ను ఇంటెలిజెంట్ సాఫ్ట్‌వేర్, స్మార్ట్-గ్రిడ్‌తో జోడించడం ద్వారా దేశం కోసం ఒక పటిష్ట, పరస్పర సంధానిత, భవిష్యత్ సంసిద్ధ ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్ రూపకల్పనకు ఇది దోహదం చేస్తుంది.
ఈ సందర్భంగా ‘టీబీడీ’ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ- “దేశంలో విద్యుత్ వాహన రవాణాను వేగిరపరచడానికి విశ్వసనీయ, పరస్పరాధారిత ఛార్జింగ్ మౌలిక సదుపాయాల సత్వర విస్తరణ చాలా కీలకం. అధునాతన ఈవీ ఛార్జింగ్ టెక్నాలజీల స్వదేశీ రూపకల్పన-తయారీ ద్వారా దేశీయ కాలుష్య రహిత రవాణా వ్యవస్థ బలోపేతం అవుతుంది. దీంతో దిగుమతి పరాధీన తగ్గి, సుస్థిర రవాణా వైపు దేశం కీలక మలుపు తిరుగుతుంది. భారత కాలుష్య రహిత రవాణా భవిష్యత్తు దిశగా ప్రపంచమంతటా పోటీపడగల పరిష్కారాలను ఆవిష్కరించే సాంకేతికాధారిత సంస్థలకు మద్దతివ్వడానికి టీడీబీ కట్టుబడి ఉంది” అని ప్రకటించారు.
ప్రభుత్వం నుంచి తమకు మద్దతు లభించడంపై మెస్సర్స్ రోడ్‌గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కృతజ్ఞతలు తెలిపింది. టీడీబీ చేయూతతో తమ పేటెంటెడ్ యూనివర్సల్ ఈవీ ఛార్జర్ల తయారీని పెంచుతామని ఆ సంస్థ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అలాగే ఛార్జింగ్ మౌలిక సదుపాయాలలో స్వదేశీ ఆవిష్కరణల బలోపేతం, దేశవ్యాప్తంగా అత్యాధునిక-విశ్వసనీయ, సౌలభ్య ఈవీ ఛార్జింగ్ పరిష్కారాల విస్తరణను వేగిరపరచడంలో కంపెనీకి ఎంతో వెసులుబాటు లభిస్తుందని తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2292594)
आगंतुक पटल : 5