సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంటు ప్రశ్న: యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీలో సంస్కరణలు

प्रविष्टि तिथि: 30 JUL 2026 5:15PM by PIB Hyderabad

ప్రభుత్వ ఉద్యోగ నియమకాల ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) అనేక సంస్కరణలు చేపట్టింది. పరీక్షల విశ్వసనీయతను, పారదర్శకతను పెంచడమే వీటి ప్రధాన లక్ష్యం. నియమకాలను వేగవంతం చేయడానికి, నిష్పాక్షికతను నిర్ధారించడానికి గ్రూప్ ‘సి’, గ్రూప్ ‘బీ ’ (నాన్ గెజిటెడ్) పోస్టులకు ఇంటర్వ్యూ విధానాన్ని 2016 జనవరి 1వ తేదీ నుంచి పూర్తిగా రద్దు చేశారు. అభ్యర్థుల స్వయం ధ్రువీకరణ ఆధారంగానే తాత్కాలిక నియామక పత్రాలను జారీ చేస్తున్నారు. కుల, ప్రవర్తనా ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఆరు నెలల గడువు కేటాయించారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీని అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు సమయ పరిమితితో కూడిన మిషన్ మోడ్‌ పద్దతిలో చేపట్టాయి. 2022 అక్టోబర్ నుంచి ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ రోజ్‌గార్ మేళాల ద్వారా లక్షలాది నియామక పత్రాలను పంపిణీ చేశారు.

 

 

శిక్షణ విభాగం పరిపాలన పరిధిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) అనే రెండు ప్రధాన నియామక సంస్థలు పనిచేస్తున్నాయి. వీటిలో ఎస్ఎస్‌సీ పరీక్షల భద్రత, పారదర్శకతను పెంచేందుకు సమగ్రమైన సాంకేతిక, పరిపాలన సంస్కరణలను అమలు చేసింది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు , తక్కువ పరీక్షా దశలను అమలు చేయడం ద్వారా గతంలో 15 నుంచి 18 నెలలు పట్టే నియామక ప్రక్రియను 6 నుంచి 8 నెలలకు తగ్గించారు. పత్రాల సమాచారాన్ని ట్యాంపర్‌-ప్రూఫ్, వేగవంతమైన, సురక్షితమైన డిజిటల్ డాక్యుమెంట్ కమ్యూనికేషన్ కోసం‘ఈ-డాసియర్‌’ వ్యవస్థను ప్రారంభించారు. ప్రతిభ ఆధారంగా ఖాళీలను గరిష్టంగా భర్తీ చేసేందుకు, పోస్టుల అప్‌గ్రేడేషన్ కోసం స్లైడింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. తాత్కాలిక, తుది జవాబు కీలను ప్రచురించడం, అభ్యర్థుల అభ్యంతరాలను ఆహ్వానించడం, అభ్యంతరాల రుసుమును తగ్గించడం, మార్కులు, ఫలితాలను ఆన్‌లైన్‌లో విడుదల చేయడం ద్వారా పారదర్శకతను పెంచారు.

 

 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) పలు కీలక సంస్కరణలను అమలులోకి తెచ్చింది. దీనివల్ల గతంలో 15 నెలలకు పైగా పట్టే నియామక ప్రక్రియ సమయం ప్రస్తుతం దాదాపు 13 నెలలకు తగ్గింది. దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసేందుకు ఆన్‌లైన్ మాడ్యులర్ దరఖాస్తు వేదికను అందుబాటులోకి తెచ్చారు. సివిల్ సర్వీసెస్ పరీక్ష యత్నాలను ఖచ్చితంగా తనిఖీ చేయడానికి కృత్రిమ మేధ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇతరులతో పరీక్ష రాయించే మాల్ ప్రాక్టీస్‌ను  నిరోధించడానికి ముఖ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టారు. పారదర్శకమైన అభ్యంతరాల స్వీకరణ విధానంతో కూడిన తాత్కాలిక జవాబు కీలను విడుదల చేస్తున్నారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.పరీక్షా కేంద్రాలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించడంతో పాటు దివ్యాంగులకు తమకు కావలసిన పరీక్షా కేంద్రాన్ని ఎంచుకునే సౌకర్యాన్ని కల్పించారు.

 

ఈ సమాచారాన్ని నేడు రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

 

***


(रिलीज़ आईडी: 2292146) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी