పర్యటక మంత్రిత్వ శాఖ
ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా భారత్ కు ప్రాచుర్యం కల్పించడానికి ఇండీగోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న పర్యాటక మంత్రిత్వ శాఖ
దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో భారతదేశ విభిన్న పర్యాటక సౌందర్యాలను ప్రదర్శించడానికి ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా బై ఇండీగో’ ప్రచారం ప్రారంభం
प्रविष्टि तिथि:
30 JUL 2026 6:09PM by PIB Hyderabad
భారత్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్య పర్యాటక గమ్యస్థానంగా ప్రోత్సహించేందుకు వ్యూహాత్మక, ప్రత్యేక హక్కులు, ఆర్థిక లావాదేవీలు లేని భాగస్వామ్యంతో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో)తో భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ నేడు న్యూఢిల్లీలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేసింది.
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ భువనేశ్ కుమార్, అదనపు కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ (టూరిజం) శ్రీ సుమన్ బిల్లా, సంయుక్త కార్యదర్శి శ్రీ ఎస్. హరికిషోర్, మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఇండిగో తరఫున చీఫ్ డిజిటల్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ నీతన్ చోప్రా, క్రియేటివ్ డైరెక్టర్ శ్రీ వి. సునీల్‌తో పాటు సంస్థకు చెందిన పలువురు సీనియర్ ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మక ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్‌ను ఇండిగోకు ఉన్న విస్తృత దేశీయ, అంతర్జాతీయ విమాన నెట్‌వర్క్‌తో అనుసంధానించడం ద్వారా భారత పర్యాటక రంగ ప్రచారానికి మరింత బలం చేకూరుతుందని అన్నారు. ఇలాంటి భాగస్వామ్య కార్యక్రమాలు భారత పర్యాటక సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తృత స్థాయిలో ప్రజల్లోకి చేరవేయడమే కాకుండా, ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ అవగాహన ఒప్పందం కింద పర్యాటక మంత్రిత్వ శాఖ, ఇండిగో సంయుక్తంగా ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా బై ఇండిగో’ పేరుతో ప్రపంచవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. ఈ ప్రచారం ద్వారా భారతదేశంలోని సంపన్న, వైవిధ్యభరితమైన పర్యాటక ఆకర్షణలను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఇందులో సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి సౌందర్యాలు, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలు, వెల్‌నెస్ టూరిజం, సాహస పర్యాటకం, వన్యప్రాణి పర్యాటకం, అనుభూతిని కలిగించే ఇతర పర్యాటక అంశాలకు విస్తృత ప్రాధాన్యం కల్పించనున్నారు.
ఈ ప్రచార కార్యక్రమాన్ని డిజిటల్, ప్రింట్ మీడియా, విమానాశ్రయ బ్రాండింగ్, విమానాల్లోని ప్రచార వేదికలు, సామాజిక మాధ్యమాలు, అంతర్జాతీయ పర్యాటక ప్రదర్శనలు, ఇతర ప్రచార మార్గాల ద్వారా విస్తృతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా పర్యాటక మంత్రిత్వ శాఖ ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్‌కు సంబంధించిన ప్రచార సామగ్రి, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌ను అందించడంతో పాటు, అవసరమైన చోట సంబంధిత భాగస్వామ్య సంస్థలతో సమన్వయం కూడా కల్పిస్తుంది.
వివిధ పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక ప్రచార కంటెంట్‌ను రూపొందించి, తన వినియోగదారుల అనుసంధాన వేదికల ద్వారా భారత పర్యాటక సందేశాన్ని ఇండిగో విస్తృతంగా ప్రచారం చేయనుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా పర్యాటక ప్రచార కార్యక్రమాలు, గమ్యస్థానాలపై ప్రత్యేక ప్రచార యత్నాలు, పరస్పర అంగీకారంతో చేపట్టే ఇతర కార్యక్రమాల్లో సంయుక్తంగా పాల్గొని, దేశీయ, అంతర్జాతీయ ప్రధాన మార్కెట్లలో భారత పర్యాటక ఆకర్షణలకు మరింత గుర్తింపు, ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేయనున్నారు.
ఈ అవగాహన ఒప్పందం మొదట రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది. భారత పర్యాటక సామర్థ్యాన్ని ప్రపంచానికి మరింతగా పరిచయం చేయడం, విదేశీ పర్యాటకుల రాకను పెంచడం, ప్రపంచంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా భారత్‌ను నిలబెట్టడం పట్ల పర్యాటక మంత్రిత్వ శాఖ, ఇండిగో ఉమ్మడి నిబద్ధతకు ఈ భాగస్వామ్యం నిదర్శనంగా నిలుస్తుంది.
***
(रिलीज़ आईडी: 2292145)
आगंतुक पटल : 14