ఔషధాల విభాగం
భారత వైద్య-సాంకేతిక రంగంలో పెట్టుబడులు-ఆవిష్కరణలు- తయారీకి నవ్యోత్తేజం దిశగా ప్రభుత్వ-పారిశ్రామిక భాగస్వామ్యం
జాతీయ వైద్య-సాంకేతిక వ్యవస్థను బలోపేతంలో భాగంగా ఇన్వెస్ట్ ఇండియా-‘ఏపీఏసీమెడ్’ మధ్య అవగాహన ఒప్పందం
प्रविष्टि तिथि:
30 JUL 2026 3:23PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ పెట్టుబడి ప్రోత్సాహక-సౌలభ్య కల్పన సంస్థ ‘ఇన్వెస్ట్ ఇండియా’, ‘ఆసియా పసిఫిక్ మెడికల్ టెక్నాలజీ అసోసియేషన్ (ఏపీఏసీమెడ్) మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. భారత వైద్య-సాంకేతిక (మెడ్‌టెక్) రంగంలో పెట్టుబడులు-ఆవిష్కరణలు-సుస్థిర వృద్ధిని సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం-అంతర్జాతీయ మెడ్‌టెక్ పరిశ్రమల రంగం మధ్య సహకార బలోపేతమే ఈ ఒప్పందం లక్ష్యం.
ఈ నేపథ్యంలో కేంద్ర రసాయనాలు-ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఔషధ విభాగం కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి, నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఎం.శ్రీనివాస్ సమక్షంలో సంతకాలు పూర్తయ్యాక ఒప్పందం ప్రతులను సంబంధిత సంస్థల ప్రతినిధులు ఇచ్చిపుచ్చుకున్నారు.
పెట్టుబడుల సౌలభ్య కల్పన, నియంత్రణ, విధానపరమైన భాగస్వామ్యం, పరిశోధన-ఆవిష్కరణ, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, డిజిటల్ ఆరోగ్యం తదితర రంగాల్లో సహకారానికి అనువైన చట్రాన్ని ఈ భాగస్వామ్యం సమకూరుస్తుంది. అలాగే, ‘ఏపీఏసీమెడ్’ సభ్య కంపెనీలతో భాగస్వామ్యం పెంపొందేలా ప్రోత్సహించడమే కాకుండా భారత్‌లో పెట్టుబడులకు, విస్తరణకు వీలు కల్పిస్తుంది. అలాగే, దేశీయ తయారీ రంగం బలోపేతం కావడంతో పాటు స్థానిక విలువ జోడింపు పుంజుకుంటుంది. తద్వారా వాణిజ్య సౌలభ్యం ఇనుమడిస్తుందని, ప్రపంచ మెడ్‌టెక్ విలువ వ్యవస్థతో భారత్ అనుసంధానం మరింత పెరుగుతుందని అంచనా.
ఒప్పందంపై సంతకాల ప్రక్రియ ముగిశాక “వికసిత భారత్-2047కు ఉత్ప్రేరకంగా మెడ్‌టెక్” అంశంపై శ్రీ మనోజ్ జోషి అధ్యక్షతన ‘సీఈఓ’లతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో సీనియర్ ప్రభుత్వాధికారులు, పరిశ్రమ అగ్రగాములు, కీలక భాగస్వాములు పాల్గొన్నారు. భారత మెడ్‌టెక్ రంగం బలోపేతానికి, ప్రపంచ పోటీతత్వం పెంచేందుకు తగిన వ్యూహాత్మక ప్రాధాన్యాలపై వారు కూలంకషంగా చర్చించారు. స్థానిక వనరుల సేకరణ, సరఫరా వ్యవస్థల బలోపేతం, పరిశోధన-అభివృద్ధి, అంతర్జాతీయ సామర్థ్య వికాస కూడళ్ల (జీసీసీ) పాత్ర, ప్రతిభ-శ్రామిక శక్తి అభివృద్ధి, ప్రపంచ మెడ్‌టెక్ విపణిలో భారత్ భాగస్వామ్యం పెంపు అవకాశాలు సహా కీలక విధాన-నియంత్రణ-పెట్టుబడి ప్రాథమ్యాలపై వారు దృష్టి కేంద్రీకరించారు.
ఈ సందర్భంగా శ్రీ మనోజ్ జోషి మాట్లాడుతూ- “దేశంలో కొన్నేళ్లుగా వైద్య పరికరాల రంగం గణనీయ వృద్ధి సాధించింది. ఆరోగ్య సంరక్షణకు డిమాండ్ పెరుగుదల, ఈ రంగంలో మౌలిక సదుపాయాల విస్తరణ, ఉత్పత్తి సంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) అమలు, ఇతరత్రా విధానపరమైన సహాయక చర్యలే ఇందుకు కారణం. ఇలా మనం ముందుకు సాగుతున్న కొద్దీ నాణ్యత, రోగుల భద్రత, ప్రపంచ పోటీతత్వానికి ప్రోత్సాహం, మరింత పటిష్ట-నియంత్రిత వ్యవస్థగా దేశీయ వైద్య పరికరాల రంగం వృద్ధి చెందడం అవసరం” అని స్పష్టం చేశారు.
అలాగే, మెడ్‌టెక్ రంగం భవిష్యత్ ప్రణాళికను వివరిస్తూ- “బలమైన కాంపోనెంట్ తయారీ వ్యవస్థకు రూపమివ్వడం, దేశీయ విలువ జోడింపును ప్రస్తుత 25శాతం నుంచి 40–45 శాతానికి పెంచడం, ముఖ్యంగా ఉన్నత శ్రేణి వైద్య పరికరాలు, ఇమేజింగ్ పరికరాలలో దేశీయ విలువ జోడింపు బలోపేతమే మా లక్ష్యం. విధానపరమైన సహాయక చర్యల ద్వారా ఈ రంగానికి మద్దతిచ్చేందుకు ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. మరోవైపు ‘పీఎల్‌ఐ’ పథకం తదుపరి దశకు మార్గాన్వేషణ సాగుతోంది. రీఏజెంట్లు-డయాగ్నాస్టిక్స్ ఉత్పత్తుల దేశీయ తయారీకి అధిక పెట్టుబడులను మేం ఆకాంక్షిస్తున్నాం. అదే సమయంలో ‘వికసిత భారత్-2047’ సంకల్పానికి అనుగుణంగా బలమైన ఎగుమతి సామర్థ్యంతో ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల కాంపోనెంట్ పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వం-పరిశ్రమల మధ్య నిరంతర సహకారం ద్వారా పటిష్ట, ఆవిష్కరణాధారిత, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే మెడ్‌టెక్ వ్యవస్థను రూపొందించడం మా లక్ష్యం” అని శ్రీ జోషి విశదీకరించారు.
నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ ఎం.శ్రీనివాస్ సంయుక్త కృషి గురించి మాట్లాడుతూ- “దేశంలో భవిష్యత్ సంసిద్ధ ఆరోగ్య సంరక్షణ కోసం బలమైన మెడ్‌టెక్ వ్యవస్థను రూపొందించడం అత్యంత కీలకం. ఆరోగ్య సంరక్షణ సేవల బలోపేతం, నాణ్యమైన సంరక్షణ సౌలభ్యం కల్పించడంలో వైద్య నైపుణ్యం, సాంకేతికత, పరిశోధన, డిజిటల్ ఆవిష్కరణల సమ్మేళనం దోహదం చేస్తుంది. ఈ నేపథ్యంలో పరిశోధన-అభివృద్ధిని ప్రోత్సహిస్తూ, ఆధునిక సాంకేతికతల అనుసరణకు మద్దతు ఇవ్వడం ముఖ్యం. అంతేగాక పునరుత్థాన, ప్రపంచ పోటీతత్వ మెడ్‌టెక్ వ్యవస్థను సాకారం చేయడంలో ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆవిష్కర్తల మధ్య నిరంతర సహకారం కూడా అత్యంత అవశ్యం” అని స్పష్టం చేశారు.
***
(रिलीज़ आईडी: 2291903)
आगंतुक पटल : 7