కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మత్స్యరంగం అభివృద్ధి కోసం 2020-21 నుంచి ఇప్పటిదాకా మత్స్య-పశుసంవర్ధక-పాడిపరిశ్రమ మంత్రిత్వశాఖ పరిధిలోని మత్స్యశాఖ ద్వారా రూ.20,750 కోట్లతో ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ (పీఎంఎంఎస్‌వై)ను అమలు చేస్తోంది. ఈ పథకం కింద మత్స్యకారులతోపాటు ఆ రంగంలోని కార్మికులకు సామాజిక భద్రత కూడా లభిస్తుంది. తదనుగుణంగా సముద్ర-అంతర్గత జలాల్లో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు సహా అనుబంధ రంగ కార్మికులకు సామూహిక ప్రమాద బీమా పథకం (జీఏఐఎస్) ద్వారా సామాజిక భద్రత సదుపాయం లభిస్తుంది. ఈ బీమా రక్షణ కోసం చెల్లించాల్సిన రుసుము భారాన్ని (హిమాలయ, ఈశాన్య రాష్ట్రాలకు 90:10) కేంద్ర-రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రం మొత్తం రుసుమును కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. పీఎంఎంఎస్‌వై కింద బీమా రక్షణ: (i) మరణం లేదా శాశ్వత సంపూర్ణ వైకల్యానికి రూ.5,00,000, (ii) శాశ్వత పాక్షిక వైకల్యానికి రూ.2,50,000, (iii) ప్రమాదం సంభవించి ఆసుపత్రిలో చేరినపుడు ఖర్చుల కోసం రూ.25,000 వంతున బాధితులకు ఆర్థిక సహాయం లభిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ గడచిన ఐదేళ్లలో ‘జీఏఐఎస్’ భాగస్వామ్యం స్వీకరించని నేపథ్యంలో ప్రస్తుత (2026-27) ఆర్థిక సంవత్సరం 2,84,888 మంది మత్స్యకారులకు ఈ పథకం కింద బీమా రక్షణ కోసం ప్రతిపాదన పంపింది. దీనికింద అభ్యర్థనల దాఖలు-పరిష్కార ప్రక్రియలు సంబంధిత పాలసీ నిబంధనలు-షరతులకు లోబడి ఉంటాయి. ఈ ప్రక్రియల సరళీకరణతో పాటు ప్రామాణిక అభ్యర్థన విధివిధానాలు, ఆవశ్యక పత్రాలు వంటివాటిని ఇప్పటికే ప్రకటించారు. దీనికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కాల వ్యవధి సమాచారం కూడా వెళ్లింది. లోపాల సవరణ, అభ్యర్థనల సమర్పణను వేగిరపరచి, అర్హత గల అభ్యర్థనల సత్వర పరిష్కారం దిశగా రాష్ట్ర మత్స్యశాఖలు, బీమా కంపెనీలు, మధ్యవర్తిత్వ సంస్థలతో క్రమం తప్పకుండా సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని 2,84,888 మంది మత్స్యకారులకు బీమా రక్షణ కోరుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత (2026-27)ఆర్థిక సంవత్సరంలో (01.06.2026 నుంచి 31.05.2027 మధ్య) ‘జీఏఐఎస్’లో తొలిసారి భాగస్వామ్యం స్వీకరించింది. అయితే, ఇప్పటివరకూ పరిష్కారం కోసం ఎలాంటి అభ్యర్థనలూ దాఖలు చేయలేదు. ప్రమాదం సంభవించిన తేదీ నుంచి 120 రోజుల్లోగా సమాచారం పంపాల్సి ఉంటుంది. అలాగే, అవసరమైన అన్ని పత్రాలతో పూర్తి అభ్యర్థనను 180 రోజుల్లోగా సమర్పించాలని ఈ పథకం మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నాయి. ఈ ప్రక్రియలను వేగిరపరచేందుకు క్రమం తప్పకుండా ప్రభుత్వం సమీక్ష సమావేశాల నిర్వహణతో పాటు తగిన చర్యలు చేపడుతోంది.
కేంద్ర మత్స్య-పశుసంవర్ధక-పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు జవాబిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.
***