ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై)కు సంబంధించిన తాజా సమాచారం
దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, యూటీల్లో ఏబీ పీఎం-జేఏవై అమలు
ఏబీ పీఎం-జేఏవై పోర్టబిలిటీ ద్వారా దేశవ్యాప్తంగా అందుబాటులోకి ఆరోగ్య సంరక్షణ సేవలు... రూ.8,383.97 కోట్ల విలువైన 29.05 లక్షల అంతర్-రాష్ట్ర ప్రవేశాలకు ఆమోదం
70 ఏళ్లు, అంతకు పైబడిన 6 కోట్ల మంది వృద్ధులకు ఆరోగ్య బీమా పొడిగింపు
ఆరోగ్య బీమా వ్యవస్థ బలోపేతం.. లబ్ధిదారుల సంఖ్య 10.74 కోట్ల నుంచి 12 కోట్ల కుటుంబాలకు పెంపు
ఏబీ పీఎం-జేఏవై ద్వారా లబ్ధిదారుల ధ్రువీకరణ, నగదు రహిత ప్రవేశాలు, ఆస్పత్రి సహాయం ద్వారా అంతర్-రాష్ట్ర పోర్టబిలిటీని సులభతరం చేసిన ప్రధానమంత్రి ఆరోగ్య మిత్రలు
प्रविष्टि तिथि:
28 JUL 2026 6:14PM by PIB Hyderabad
ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) ద్వారా నాణ్యమైన, చవకైన, నగదు రహిత ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులోకి తెస్తూ భారతదేశ సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ ప్రయాణాన్ని మరింత పటిష్టం చేస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ స్థాయి వైద్య సేవలందించే విధానాన్ని బలోపేతం చేయటంలో, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను విస్తరించటంలో కీలకఘట్టంగా ఇది నిలిచింది. ప్రస్తుతం దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమలవుతోంది.
సామాజిక-ఆర్థిక కులగణన-2011 ద్వారా గుర్తించిన భారతదేశ జనాభాలో అట్టడుగునున్న 40 శాతానికి ప్రాతినిధ్యం వహించే 10.74 కోట్ల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. భారతదేశ దశాబ్దపు జనాభా వృద్ధిని దృష్టిలో ఉంచుకుని జనవరి-2023లో లబ్ధిదారుల సంఖ్యను 10.74 కోట్ల నుంచి 12 కోట్ల కుటుంబాలకు సవరించారు. మార్చి 2024లో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ సహాయకుల నుంచి సుమారు 37 లక్షల అదనపు కుటుంబాలను ఈ పథకంలో చేర్చారు. సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 4.5 కోట్ల కుటుంబాలకు చెందిన 70 ఏళ్లు, అంతకు పైబడిన వయసు గల 6 కోట్ల మంది వృద్ధులకు కూడా వర్తించేలా ఈ పథకాన్ని విస్తరించారు.
ఎన్నో రాష్ట్రాలు సొంత ఆరోగ్య పథకాలను ఏబీ పీఎం-జేఏవైతో అనుసంధానించటం ద్వారా కేంద్రం నిర్దేశించిన లబ్ధిదారుల సంఖ్యకు పైగా అర్హుల పరిధిని విస్తరించాయి. ఏబీ పీఎం-జేఏవై ద్వారా లబ్ధిదారుల సంఖ్య పెరగటం, వివిధ రాష్ట్రాల ఆరోగ్య భరోసా పథకాలు ఇందులో విలీనం కావటం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాలకు ఈ పథకం మరింత చేరువయింది.
జాతీయ పోర్టబిలిటీ సౌకర్యాన్ని ఏబీ పీఎం-జేఏవై కల్పిస్తోంది. దీనిద్వారా లబ్ధిదారులు స్వరాష్ట్రం, యూటీతో సంబంధం లేకుండా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలను పొందవచ్చు. వలస కార్మికులకు, సొంత రాష్ట్రం దాటి ప్రయాణించే లబ్ధిదారులకు ఈ పోర్టబిలిటీ మెరుగైన ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోకి తీసుకువస్తుంది.
జూన్ 30, 2026 నాటికి దేశవ్యాప్తంగా ఏబీ పీఎం-జేఏవై ద్వారా రూ.8,383.97 కోట్లకు పైగా విలువైన మొత్తం 29.05 లక్షల అంతర్-రాష్ట్ర పోర్టబిలిటీ ఆస్పత్రి ప్రవేశాలకు ఆమోదం లభించింది.
ఏబీ పీఎం-జేఏవై పటిష్ఠమైన సమగ్ర డిజిటల్ వేదిక ద్వారా అమలవుతోంది. జాబితాలో చేర్చిన ఆసుపత్రులకు లబ్ధిదారుల సొంత రాష్ట్రంతో సంబంధం లేకుండా అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు, ధ్రువీకరించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. పోర్టబిలిటీ కేసుల కోసం ఆసుపత్రిలో చేరటం క్లెయిమ్‌ల పరిశీలన, సెటిల్మెంట్ ప్రక్రియలను ఇది సులభతరం చేస్తుంది. ఈ సమగ్ర డిజిటల్ వ్యవస్థ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో అంతరాయం లేకుండా, నగదు రహితంగా, కాగితం అవసరం లేకుండా ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తుంది.
లబ్ధిదారుల నమోదును మెరుగుపరిచేందుకు పోర్టబిలిటీ ఫీచర్‌తో సహా అవగాహనను పెంపొందించేందుకు, ఏబీ పీఎం-జేఏవై ఒక సమగ్ర సమాచార, విద్య, ప్రసార (ఐఈసీ), ప్రచార వ్యూహాన్ని అనుసరించింది. ఈ వ్యూహంలో భాగంగా వార్తాపత్రికలు, కమ్యూనిటీ రేడియో, టెలివిజన్, రేడియో ప్రకటనలు, డిజిటల్ డిస్ప్లేలు, వీధి నాటకాలు, మాస్ మెసేజింగ్, సోషల్ మీడియా వంటి సంప్రదాయ, డిజిటల్ మీడియా వేదికల ద్వారా అవగాహన ప్రచారాలు నిర్వహించటంతో పాటు లబ్ధిదారుల అనుభవాల ప్రచారం కూడా జరుగుతోంది.
ఏబీ పీఎం-జేఏవై పథకం ద్వారా వివిధ రాష్ట్రాల మధ్య వైద్య సేవలు పొందే సౌలభ్యాన్ని కల్పించటంలో ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో నియమించిన ప్రధానమంత్రి ఆరోగ్య మిత్రలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వలస కార్మికులు, సొంత రాష్ట్రం వెలుపల వైద్య సేవలు పొందాలనుకునే వారితో సహా లబ్ధిదారులకు.. గుర్తింపు, ధ్రువీకరణ, నగదు రహిత ప్రవేశం, ఆస్పత్రి సమన్వయం, ఆస్పత్రిలో చేరినంత కాలం వారికి అవసరమైన సహాయాన్ని అందించటంలో వీరు తోడ్పడుతున్నారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ ఇవాళ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2290855)
आगंतुक पटल : 9