కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారత్ 6జీ అలయన్స్ (బీ6జీఏ) ప్రగతిపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం.సింధియా సమీక్ష
ఈ కార్యక్రమంలో భాగంగా 5జీ ల్యాబ్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం
“టెలికాం సాంకేతికతలో భారత్‌ను అగ్రగామిగా నిలపాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత సాధన దిశగా ‘బీ6జీఏ’ కృషి చేస్తోంది”
“ప్రపంచ పురోగమనానికి భారత్ 6జీ అలయన్స్ ఒక ప్రమాణం కావాలి.. కార్యాచరణ బృందాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాలి”
“6జీ సాంకేతికతలో భారత్‌ను ప్రపంచంలో అగ్రస్థానాన నిలపడంపై ప్రభుత్వం తన నిబద్ధతను పునరుద్ఘాటించింది”
प्रविष्टि तिथि:
28 JUL 2026 7:51PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ రోజు ‘భారత్ 6జీ అలయన్స్’ (బీ6జీఏ) ప్రగతిని కేంద్ర మంత్రులు సమీక్షించారు. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో కేంద్ర కమ్యూనికేషన్లు-ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం.సింధియా, కమ్యూనికేషన్స్-గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని సహా టెలికాం శాఖ కార్యదర్శి శ్రీ అమిత్ అగర్వాల్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మార్చి 22న ‘భారత్ 6జి విజన్’ పేరిట ఒక దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించారు. భారత్ 2030 నాటికి 6జి సాంకేతికత రూపకల్పన-అభివృద్ధి-అమలులో అగ్రగామిగా నిలవాలన్న లక్ష్యాన్ని ఈ పత్రం నిర్దేశిస్తుంది.
ఈ నేపథ్యంలో భారత్ 6G లక్ష్యాల సాధన దిశగా ప్రస్థానంలో ‘బీ6జీఏ’ పురోగతిని, ఆ దిశగా చేపట్టిన చర్యలను వారు సమీక్షించారు. ఈ కూటమి లక్ష్యసాధనలో 7 ప్రత్యేక కార్యాచరణ బృందాల భాగస్వామ్యం ఉంటుంది. ఈ మేరకు “స్పెక్ట్రమ్, పరికరాల సాంకేతికత-తయారీ వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానం, అనువర్తనాలు, కాలుష్య రహిత-సుస్థిరత వ్యవస్థ, విస్తరణ, 6జీ వినియోగ విధానాలు-ఆదాయ మార్గాలు” ఇందులో భాగంగా ఉంటాయి.
ఈ కూటమిలోని సభ్య సంస్థలు 5జీ, 6జీ సాంకేతికతలకు సంబంధించి మొత్తం 7,700కు పైగా (వీటిలో 4,400కు పైగా విదేశీ) పేటెంట్ దరఖాస్తులు దాఖలు చేశాయి. భారత పరిశోధన-ఆవిష్కరణల వ్యవస్థ సామర్థ్యం ఇనుమడిస్తుండటాన్ని ఈ పరిణామం ప్రతిబింబిస్తుంది. ఇక 3జీపీపీలో భారత్ భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగింది. అలాగే, ఇందులో భాగస్వాములైన భారతీయుల సంఖ్య 2020 నాటి 717 నుంచి 2025కల్లా 1,787కు చేరగా, అదే వ్యవధిలో సాంకేతిక సహకార కార్యకలాపాలు 196 నుంచి 2,943కు పెరిగాయి.
ఈ సమీక్షలో భాగంగా టెలికాం స్టాండర్డ్స్ డెవలప్‌మెంట్ సొసైటీ, ఇండియా (టీఎస్‌డీఎస్‌ఐ) ద్వారా 6జీ సాంకేతికత ప్రమాణాల రూపకల్పన కృషిపై తాజా సమాచారాన్ని అధికారులు అందజేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రామాణిక ప్రక్రియలలో భారత్ చురుకైన-అర్థవంతమైన భాగస్వామ్యం ప్రాధాన్యాన్ని ఈ చర్చలు స్పష్టం చేశాయి. అంతేకాకుండా భారతీయ ఆవిష్కరణలు, సాంకేతికతలు, వినియోగ విధానాలు, అవసరాలు ప్రపంచవ్యాప్త ఆమోదయోగ్య 6జీ ప్రమాణాల రూపకల్పనకు దోహదపడేలా చూడాల్సిన అవసరాన్ని కూడా తేటతెల్లం చేశాయి.
‘భారత్ 6జీ అలయన్స్’ కార్యాచరణ బందాల సంబంధిత త్రైమాసిక ప్రగతి నివేదికలను ఈ సమావేశంలో సమర్పించారు. ఇవి 6జీ వ్యవస్థలోని ఆరు కీలకాంశాలను వివరించాయి. వీటిలో “సాంకేతిక పరిజ్ఞానం, అనువర్తనాలు, 6జీ వినియోగ విధానాలు-ఆదాయ మార్గాలు, కాలుష్య రహిత-సుస్థిర వ్యవస్థ, స్పెక్ట్రమ్, పరికరాల సాంకేతికత-విడిభాగాలు-సెన్సర్లు-తయారీ వ్యవస్థ, విస్తరణ” భాగంగా ఉన్నాయి. స్వదేశీ పరిశోధన-అభివృద్ధి ప్రక్రియలను వేగిరపరచడం, ఆధునిక అనువర్తనాలు, వినియోగ ఔచిత్యాల గుర్తింపు, స్పెక్ట్రమ్ వ్యూహాల బలోపేతం, శక్తి-సామర్థ్యం గల సుస్థిర సాంకేతికతలకు ప్రోత్సాహం, పరికరాలు-విడిభాగాలు-సెన్సర్లు, తయారీ రంగాల్లో దేశీయ సామర్థ్యాల పెంపు సహా ఈ వ్యవస్థ అంతటా సహకారం-విస్తరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
పరిశోధన, ఆవిష్కరణ, ప్రమాణాలు, తయారీ, మార్కెట్ విస్తరణల మధ్య బలమైన అనుసంధానంతో భారత్‌లో పటిష్ట-సమగ్ర టెలికమ్యూనికేషన్ల వ్యవస్థను రూపొందించాల్సిన ఆవశ్యకతను ఈ సమావేశం స్పష్టం చేసింది. సాంకేతిక ప్రగతిని వేగిరపరచడం, పరిశోధనను అమలు చేయగల పరిష్కారాలుగా మార్పు, ప్రపంచవ్యాప్త పోటీతత్వం గల ఉత్పత్తులు-సేవల సృష్టికి ప్రభుత్వం, పరిశ్రమ, విద్యాసంస్థలు, అంకుర-పరిశోధన సంస్థల మధ్య మరింత సహకారం అవసరమని అందరూ అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 2026 జనవరి-జూన్ మధ్య సమీకృత పనితీరు ప్రాతిపదికన 5జీ/5జీ-అడ్వాన్స్‌డ్ సాంకేతికతలలో వినియోగం, భాగస్వామ్యం, ఆవిష్కరణ సహా యావత్ నాణ్యతపరంగా అత్యుత్తమ పనితీరు కనబరచిన సంస్థలకు 5జీ ల్యాబ్స్ ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ రెండు సాంకేతికతల ప్రాతిపదికన ప్రయోగాలు, ఆవిష్కరణలు, పరీక్షలు, నైపుణ్యాభివృద్ధి, అనువర్తనాలు, వినియోగ ఔచిత్యం అభివృద్ధికి సంస్థలు, భాగస్వాముల కృషికి గుర్తింపుగా నాలుగు విభాగాలలో ఈ అవార్డులకు విజేతలను ఎంపిక చేశారు:
|
అవార్డు విభాగం
|
ప్రథమ ర్యాంకు
|
ద్వితీయ ర్యాంకు
|
తృతీయ ర్యాంకు
|
|
5జీ ల్యాబ్ ఎక్సలెన్స్ అవార్డు
|
ఐఐఐటీడీఎం కర్నూల్
|
డీకేటీఈ టెక్స్‌టైల్ & ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్, మహారాష్ట్ర
|
ఐఐటీ-రూర్కీ
|
|
5జీ ల్యాబ్ వినియోగం ఎక్సలెన్స్ అవార్డు
|
ఐఐఐటీడీఎం కర్నూల్
|
ఐఐటీ-రోపర్
|
పీఈసీ-చండీగఢ్
|
|
5జీ ల్యాబ్ ఎంగేజ్‌మెంట్ ఎక్సలెన్స్ అవార్డు
|
ఐఐఐటీడీఎం కర్నూల్
|
ఐఐటీ-రూర్కీ
|
టీహెచ్‌డీసీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రోపవర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, తెహ్రీ
|
|
5జీ ల్యాబ్ ఇన్నోవేషన్ ఎక్సలెన్స్ అవార్డు
|
ఐఐఐటీడీఎం కర్నూల్
|
డీకేటీఈ టెక్స్‌టైల్ & ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్, మహారాష్ట్ర
|
ఐఐటీ-ఢిల్లీ
|
దేశవ్యాప్తంగా ఉన్న ‘5జీ యూజ్ కేస్ ల్యాబ్స్’లో.. ‘ఐఐఐటీడీఎం-కర్నూలు’ నాలుగు విభాగాల్లోనూ ప్రథమ స్థానం కైవసం చేసుకోవడం ఆ సంస్థ అత్యుత్తమ, సమగ్ర పనితీరుకు నిదర్శనం.
సమావేశంలో పాల్గొన్న వారందరూ సార్వత్రిక చర్చతోపాటు సంభాషణలు సాగాయి. 6జీ వ్యవస్థలు ఆధునిక సాంకేతికతలు, అవకాశాలు-సవాళ్లపై తమ దృక్కోణాన్ని పంచుకోవడంలో వారికి ఇదొక వేదికగా నిలిచింది. సాంకేతిక అభివృద్ధి, ప్రామాణీకరణ, స్పెక్ట్రమ్, సుస్థిర కమ్యూనికేషన్లు, పరికరాలు-తయారీ, అనువర్తనాలు, వినియోగ ఔచిత్యాలు సహా వివిధ భాగస్వాముల మధ్య సహకార బలోపేతం దిశగా యంత్రాంగాలు తదితర అనేక కీలకాంశాలపై చర్చించారు.
కేంద్ర కమ్యూనికేషన్లు-ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం.సింధియా ఈ సమావేశంలో ప్రధాన ప్రసంగం చేశారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ల వ్యవస్థలో భారత్‌ను ఒక ప్రధాన భాగస్వామిగా నిలపడంపై ప్రభుత్వ నిబద్ధతను ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. స్వదేశీ పరిశోధన-ఆవిష్కరణలు, పటిష్ట ప్రమాణాల భాగస్వామ్యం, దేశీయ తయారీ, సుస్థిర సాంకేతికతలు, ప్రపంచ భాగస్వామ్యాలు ప్రాతిపదికగా భారత 6జీ ప్రస్థానం సాగాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే, “గత సమావేశం నుంచి గణనీయ పురోగతి సాధించాం. నిర్దేశిత లక్ష్యాల సాధనపై ఈ బృందాన్ని అభినందిస్తున్నాను. తదుపరి దశ లక్ష్యాల సాధనలోనూ చురుగ్గా ముందడుగు వేయాలని ఆశిస్తున్నాను. అంతేకాకుండా 6జీ లక్ష్య సాధనలో ఇతర అంతర్జాతీయ సమూహాలు ఏ స్థాయిలో ఉన్నాయో, వాటితో పోలిస్తే మన స్థాయి ఏమిటో చూసుకోవాలి. కార్యాచరణ బృందాల మధ్య గల ఉమ్మడి అంశాలను, వాటి మధ్య సహకారానికి గల అవకాశాలను కూడా మనం గుర్తించాలి” అని ఆకాంక్షించారు.
ఏడు కార్యాచరణ బృందాల మధ్య మరింత సమన్వయం, సహకారం పెంచే దిశగా ఉమ్మడి అంశాల గుర్తింపుపై దృష్టి సారించాలని కేంద్ర మంత్రి సూచించారు. అదే సమయంలో లోపాల గుర్తింపు, ప్రపంచ ఉత్తమ పద్ధతుల నుంచి నేర్చుకోవడానికి, దేశం పనితీరును మరింత మెరుగుపరచడానికి వీలుగా అంతర్జాతీయ 6జీ సమూహాలతో దేశ ప్రగతిని పోల్చి చూసుకోవాలని ఆయన సూచించారు. 6జీ సాంకేతికతలో భారత్ సామర్థ్యాల బలోపేతానికి మంత్రిత్వశాఖతో పాటు ప్రభుత్వం నుంచి మరింత మద్దతు అవసరమన్నారు. అలాగే విద్యాసంస్థలు, పరిశోధన-అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి పరీక్ష మౌలిక సదుపాయాలతో కూడిన పటిష్ట వ్యవస్థను ప్రోత్సహించాల్సిన అవసరం తదితరాలపై అందరి సూచనలు, సలహాలను కూడా ఆయన ప్రస్తావించారు.
భారత డిజిటల్ ఆకాంక్షలకు మద్దతుగా ప్రపంచ సాంకేతిక పురోగతికి దోహదపడగల సురక్షిత, పునరుత్థాన, సుస్థిర, సమ్మిళిత టెలికమ్యూనికేషన్ల వ్యవస్థ సృష్టి ప్రాధాన్యాన్ని కేంద్ర మంత్రి మరింతగా విశదీకరించారు. భవిష్యత్ అత్యాధునిక సాంకేతికతలను అనుసరించే దేశంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో వాటి ఆవిష్కరణకూ భారత్ గణనీయంగా దోహదపడేలా పరిశోధన, ఆవిష్కరణ, ప్రమాణాలు, తయారీ, అనువర్తనాల సమ్మేళనం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
కమ్యూనికేషన్లు-గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని మాట్లాడుతూ- భవిష్యత్ సంసిద్ధ టెలికమ్యూనికేషన్ల వ్యవస్థ రూపకల్పనలో ఆవిష్కరణ, పరిశోధన-అభివృద్ధికి ప్రాధాన్యం ఉండాలన్నారు. అలాగే ప్రభుత్వం, పరిశ్రమ, విద్యా-పరిశోధన సంస్థల మధ్య సన్నిహిత సహకారం అవశ్యమని పేర్కొన్నారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధిని వేగిరపరచడం, ప్రతిభను ప్రోత్సహించడం, వర్ధమాన కమ్యూనికేషన్ సాంకేతికతలకు పరిష్కారాల రూపకల్పన దిశగా అంకుర సంస్థలు, ఆవిష్కర్తల సానుకూల వాతావరణ సృష్టి అవసరాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే, “భారత్ 6జీ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు పరిశ్రమ, విద్యాసంస్థలు, అంకుర సంస్థలు, పరిశోధన సంస్థలను ఏకతాటిపైకి తేవడంలో భారత్ 6జీ అలయన్స్ సాధించిన అద్భుత ప్రగతి నాకెంతో సంతోషం కలిగిస్తోంది. భాగస్వాములు, కార్యాచరణ బృందాల సమిష్టి కృషితో ఆవిష్కరణలకు, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి, ప్రపంచ స్థాయి ప్రామాణీకరణకు బలమైన పునాది పడింది. మనం ముందడుగు వేస్తున్న సందర్భంలో భాగస్వాములందరి మధ్య సహకార విస్తృతి, కార్యాచరణ బృందాల మధ్య సమన్వయ బలోపేతం, పరిశోధన, పరీక్షలు, ప్రమాణాల అభివృద్ధిని వేగిరపరచడం కూడా అత్యంత అవశ్యం” అని పేర్కొన్నారు.
సాంకేతికత, అనువర్తనాలు, వినియోగ ఔచిత్యాలు, సుస్థిరత, స్పెక్ట్రమ్, పరికరాలు, తయారీ, ప్రమాణీకరణ, విస్తరణ వంటి రంగాల్లో సమన్వయ కృషి ద్వారా భారత 6జీ ప్రస్థానాన్ని వేగిరపరచాలనే సమష్టి సంకల్పాన్ని కూటమి సమీక్ష సమావేశం పునరుద్ఘాటించింది. స్వదేశీ, ప్రపంచవ్యాప్త పరస్పర అనుసంధానిత, భవిష్యత్ సంసిద్ధ టెలికమ్యూనికేషన్ల వ్యవస్థను అభివృద్ధి చేయాలనే దార్శనికతకు ఈ చర్చలు, సంప్రదింపులు మరింత ఉత్తేజమిచ్చాయి. తద్వారా 6జీ ఆవిష్కరణలు, సాంకేతికత, ప్రమాణాలు, విస్తరణలో భారత్ ఓ కీలక కూడలిగా ఆవిర్భవించడానికి వీలు కల్పిస్తాయి.
భారత్ 6జీ అలయెన్స్
‘భారత్ 6జీ అలయన్స్’ అనేది దేశంలో అంతర్జాతీయ స్థాయి, భవిష్యత్ సంసిద్ధ 6జీ వ్యవస్థ రూపకల్పనకు విద్యాసంస్థలు, పరిశ్రమలు, అంకుర-ప్రభుత్వ సంస్థలను ఏకం చేసే బహుళ భాగస్వామ్య సహకార వేదిక. పరిశోధన-అభివృద్ధి, ఆవిష్కరణ, ప్రామాణీకరణపై దృష్టి సారిస్తూ, భావితరం కమ్యూనికేషన్ సాంకేతికతలలో ప్రపంచ అగ్రగామిగా నిలవాలనే భారత్ ఆకాంక్షను నెరవేర్చడంలో ‘బీ6జీఏ’ కీలక పాత్ర పోషిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2290853)
आगंतुक पटल : 5