ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తీవ్రమైన వ్యాధుల వైద్యానికి ఆర్థిక సహాయం బలోపేతానికి చర్యలు


ఆరోగ్య లబ్ధి ప్యాకేజీ 2022 ద్వారా 1,961 రకాల చికిత్సలకు నగదు రహిత వైద్య సేవలు

12 కోట్ల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ పీఎం-జేఏవై విస్తరణ.. సీనియర్ సిటిజన్లు, క్షేత్రస్థాయి సిబ్బందికి వర్కర్లకు ఆరోగ్య భరోసా

రాష్ట్రీయ ఆరోగ్య నిధి ద్వారా పేద రోగులకు రూ. 15 లక్షల వరకు ఒకేసారి ఆర్థిక సాయం.. వైద్యశాఖ మంత్రి విచక్షణాధికార నిధి కింద రూ. 1.25 లక్షల వరకు సహాయం

ఆరోగ్య ప్రయోజన ప్యాకేజీ 2022 ద్వారా దీర్ఘకాలిక వ్యాధులతో సహా 27 ప్రత్యేక వైద్య విభాగాల్లో నగదు రహిత చికిత్స

జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ వేదిక ద్వారా రాష్ట్రీయ ఆరోగ్య నిధి (ఆర్‌ఏఎన్‌) ఆన్‌లైన్ దరఖాస్తులు.. ఆఫ్‌లైన్లోనూ సమర్పించే వెసులుబాటు

प्रविष्टि तिथि: 28 JUL 2026 6:12PM by PIB Hyderabad

ప్రభుత్వ ఆరోగ్య పథకాల పరిధిని విస్తరించడం, ఉచిత నగదు రహిత వైద్య సేవలను పెంచడం ద్వారా తీవ్రమైన వ్యాధుల చికిత్సకు ఆర్థిక సహాయాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ద్వితీయ, తృతీయ స్థాయి ఆసుపత్రి వైద్య చికిత్సల కోసం ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల ఉచిత వైద్య భరోసా అందించేందుకు 2018 సెప్టెంబర్‌లో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను (ఏబీ పీఎం-జేఏవై) ప్రారంభమైంది. ప్రారంభంలో  సామాజిక-ఆర్థిక కుల గణన 2011ఆధారంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గుర్తించిన 10.74 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఈ పథకం వర్తించేది. దేశ జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని 2023 జనవరిలో లబ్ధిదారుల సంఖ్యను 10.74 కోట్ల నుంచి 12 కోట్ల కుటుంబాలకు పెంచారు. లబ్ధిదారుల గుర్తింపును మరింత పటిష్టం చేయడానికి, పథకం పరిధిని విస్తరించడానికి జాతీయ ఆహార భద్రతా చట్టం డేటాబేస్, ఇలాంటి సామాజిక-ఆర్థిక ప్రమాణాలు కలిగిన ఇతర రాష్ట్ర స్థాయి లబ్ధిదారుల డేటాబేస్‌లను ఈ పథకంలో అనుసంధానించారు.

 

 ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, అంగన్‌వాడీ సహాయకులకు చెందిన సుమారు 37 లక్షల అదనపు కుటుంబాలను 2024 మార్చిలో ఈ పథకంలోకి చేర్చారు.  అనంతరం వారి సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 4.5 కోట్ల కుటుంబాలకు చెందిన 70 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు గల 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లను చేర్చడానికి ఈ పథకాన్ని మరింత విస్తరించారు.

 

జాతీయ ఆరోగ్య ప్రయోజనాల ప్యాకేజీ (హెచ్‌బీపీ-2022) కింద 27 ప్రత్యేక వైద్య విభాగాల్లోని 1,961 రకాల వైద్యా విధానాలకు ఉచిత నగదు రహిత చికిత్స అందుబాటులో ఉంది. క్యాన్సర్, గుండె జబ్బులు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, మధుమేహ సమస్యలు, పక్షవాతం, తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు, నరాల వ్యాధులు, కాలేయ సంబంధిత సమస్యలు వంటి ప్రధాన వ్యాధులతో సహా అనేక ద్వితీయ, తృతీయ స్థాయి వైద్య సేవలు దీని పరిధిలోకి వస్తాయి.

 

రాష్ట్రీయ ఆరోగ్య నిధి పథకం కింద సూపర్‌స్పెషాలిటీ సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు లేదా వైద్య సంస్థల్లో చికిత్స పొందే నిరుపేద రోగులకు కేంద్ర ప్రభుత్వం రూ. 15 లక్షల వరకు ఒకేసారి ఆర్థిక సహాయం అందిస్తుంది. గుండె, మూత్రపిండాలు, కాలేయం, క్యాన్సర్ వంటి తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులతో బాధపడే పేద రోగులకు పథకం నిబంధనలు, అర్హతా షరతుల ప్రకారం ఈ సాయం అందుతుంది.

 

ఉచిత వైద్య సౌకర్యాలు అందుబాటులో లేని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందే నిరుపేద రోగులకు కేంద్ర వైద్యశాఖ మంత్రి విచక్షణాధికార నిధి (హెచ్‌ఎండీజీ) కింద సహాయం లభిస్తుంది. ప్రాణాంతక వ్యాధులతో బాధపడే పేదలకు ఆసుపత్రి, వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 1.25 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ పథకం మార్గదర్శకాల ప్రకారం అర్హత నిబంధనలకు లోబడి ఈ సాయం మంజూరవుతుంది. రాష్ట్రీయ ఆరోగ్య నిధి పథకం కింద ఆర్థిక సహాయం పొందేందుకు సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆర్‌ఏఎన్‌ నోడల్ అధికారిని సంప్రదించాలి. ఆ అధికారి నేషనల్ హెల్త్ అథారిటీ ఐటీ వేదిక ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడంలో సహాయపడతారు. ఒకవేళ సదరు ఆసుపత్రి ఆన్‌లైన్ విధానంలో నమోదు కాకపోతే లేదా సాంకేతిక సమస్యలు ఎదురైతే పూర్తి వివరాలతో నింపిన రోగి దరఖాస్తును (ఆర్‌ఏఎన్‌ మార్గదర్శకాలతో లభిస్తుంది) సంబంధిత చికిత్స అందించే ఆసుపత్రి ద్వారా కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు పరిశీలన కోసం పంపాల్సి ఉంటుంది. ఆర్‌ఏఎన్‌/హెచ్‌ఎమ్‌డీజీ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ ( https://www.mohfw-dohfw.gov.in/  Offerings  Programmes  Poor Patients Financial Support) లో తెలుసుకోవచ్చు.

 

ఈ సమాచారాన్ని కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావు జాదవ్ నేడు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు.

 

***


(रिलीज़ आईडी: 2290850) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी