ఔషధాల విభాగం
అత్యవర ఔషధ ధరల నియంత్రణ
प्रविष्टि तिथि:
28 JUL 2026 3:30PM by PIB Hyderabad
దేశంలో ఔషధ ధరలను ‘డ్రగ్స్ (ప్రైసెస్ కంట్రోల్) ఆర్డర్-2013 నిబంధనలు’ (డీపీసీఓ-2013) నియంత్రిస్తాయి. ఈ నిబంధనలకు లోబడి ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రచురించిన ‘అత్యవసర ఔషధాల జాతీయ జాబితా’ (ఎన్‌ఎల్‌ఈఎం) ఆధారంగా ‘డీపీసీఓ-2013’ కింద షెడ్యూల్-Iలోని ఔషధాల గరిష్ఠ ధరలను ‘నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ’ (ఎన్‌పీపీఏ) నిర్ణయిస్తుంది. తదనుగుణంగా ‘ఎన్‌ఎల్‌ఈఎం-2022’లోని 29 చికిత్స విభాగాల జాబితాలో 388 ఔషధాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఈ నెల 23 నాటికి 935 షెడ్యూల్డ్ ఫార్ములేషన్ల గరిష్ఠ ధరలను ఎన్‌పీపీఏ నిర్ణయించింది. ఇక డీపీసీఓ-2013 పేరా 2(1)(యు)లో నిర్వచించిన మేరకు ‘కొత్త ఔషధాల’ (‘ఎన్‌ఎల్‌ఈఎం’లోని ఔషధాన్ని మరొక ఔషధంతో జోడించడం లేదా దాని సామర్థ్యం లేదా మోతాదు లేదా రెండింటినీ మార్చడం ద్వారా ఇప్పటికేగల తయారీదారులు ఆవిష్కరించే ఫార్ములేషన్లు) చిల్లర ధరలను కూడా ఎన్‌పీపీఏ నిర్ణయిస్తుంది. ఈ కొత్త ఔషధాల చిల్లర ధరలు దరఖాస్తు చేసిన తయారీదారు-విక్రయదారులకు వర్తిస్తాయి. అంటే- ఎన్‌పీపీఏ ప్రకటించిన ధరకన్నా ఎక్కువకు వారు సదరు కొత్త ఔషధాన్ని విక్రయించరాదు. ఈ నేపథ్యంలో ఈ నెల 23 నాటికి ఎన్‌పీపీఏ 3,845 కొత్త ఔషధాల చిల్లర ధరలను నిర్ణయించింది. ఇక షెడ్యూల్ చేయని ఫార్ములేషన్ల విషయంలో, తయారీదారులు గత 12 నెలల్లో వాటి గరిష్ఠ చిల్లర ధరను పది శాతానికి మించి పెంచి ఉండరాదు. మరోవైపు అసాధారణ పరిస్థితులలో ప్రజా హితం దృష్ట్యా ‘డీపీసీఓ-2013లోని పేరా 19 కిందకు వచ్చే ఏదైనా ఔషధం ధరను కూడా ఎన్‌పీపీఏ నిర్ణయించవచ్చు. ఇలా నిర్ణయించిన-సవరించిన ధరల వివరాలను ఎన్‌పీపీఏ వెబ్‌సైట్ (www.nppa.gov.in)లో చూడవచ్చు.
దేశవ్యాప్తంగా మందుల ధరల అందుబాటు-లభ్యతను ‘ఎన్‌పీపీఏ’ నిరంతరం సమీక్షిస్తూంటుంది. అవసరమైన సందర్భాల్లో డీపీసీఓ-2013 నిబంధనల అమలు ద్వారా అత్యవసర మందుల ధరల అందుబాటు సహా లభ్యతపైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.
అధిక ధరల నియంత్రణలో భాగంగా డీపీసీఓ-2013 ప్రకారం ప్రతి ఔషధ తయారీదారు తమ ఉత్పత్తి (ఫార్ములేషన్) ప్యాకింగ్ లేదా కంటైనర్ లేబుల్‌పై గరిష్ఠ చిల్లర ధరను తప్పనిసరిగా ముద్రించాలి. అలాగే ప్రస్తుత ధరల జాబితాలో నిర్దేశించిన లేదా లేబుల్‌పై ధర- వీటిలో ఏది తక్కువైతే అంతకుమించి మందులను విక్రయించరాదు. ‘షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్’ మందుల ధరలను కూడా ఎన్‌పీపీఏ నిరంతరం పర్యవేక్షిస్తుంది. రాష్ట్రాల్లో స్థాయిలోగల ‘'ప్రైస్ మానిటరింగ్ అండ్ రిసోర్స్ యూనిట్లు’ రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు కూడా ఈ బాధ్యతల్లో పాలుపంచుకుంటారు. ఈ మేరకు బహిరంగ మార్కెట్ నుంచి సేకరించిన నమూనాలు, మార్కెట్ సమాచార నివేదికలు సహా వివిధ ఫిర్యాదు పరిష్కార వేదికల నుంచి అందే సమాచారం ప్రాతిపదికన అధిక ధరలు వసూలు చేసే కంపెనీలపై డీపీసీఓ-2013 నిబంధనల కింద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
ఈ క్రమంలో అందుబాటు ధరతో అత్యవసర మందులు సామాన్యులకు లభించేలా ప్రభుత్వం చేపట్టిన చర్యలు కిందివిధంగా ఉన్నాయి:
I. దేశంలో ప్రస్తుతం అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన’ పథకం కింద 20,000కు పైగా జనౌషధి కేంద్రాల ద్వారా నాణ్యమైన జనరిక్ మందులను బ్రాండెడ్ మందులకన్నా దాదాపు 50 నుంచి 80 శాతం తక్కువ ధరతో అందుబాటులో ఉంచింది.
II. ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ‘ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జనారోగ్య యోజన’ (ఏబీ-పీఎంజేఏవై) కింద, ద్వితీయ-తృతీయ అంచెలలోని ఆసుపత్రులలో చికిత్స (మందుల ఖర్చు సహా) నిమిత్తం పేద కుటుంబాలకు ఏటా ₹5 లక్షల విలువైన బీమా సదుపాయంతో ఆరోగ్య రక్షణ కల్పిస్తోంది.
III. ‘నేషనల్ హెల్త్ మిషన్’ పరిధిలో ‘ఉచిత ఔషధ ప్రదానం’ కార్యక్రమం కింద ‘ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్’ సిఫారసు చేసిన అత్యవసర మందుల జాబితాలోని ఔషధాలను దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల దాకాగల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా అందిస్తోంది.
IV. ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ‘అమృత్’ పథకం కింద, అనేక ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలలో ‘అమృత్ ఫార్మసీ’ పేరిట కేన్సర్, గుండె సంబంధిత, ఇతర వ్యాధుల చికిత్సలో అవసరమైన మందులు, ఇంప్లాంట్లు, శస్త్రచికిత్స పరికరాలు, ఇతర వస్తువులను మార్కెట్ ధరకన్నా సగటున 50 శాతం తక్కువ ధరకు అందుబాటులో ఉంచింది.
V. ‘రాష్ట్రీయ ఆరోగ్య నిధి’, ‘ఆరోగ్యశాఖ మంత్రి విచక్షణాధికార సహాయం’ పథకాల కింద కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి పీడితులైన, దారిద్ర్య రేఖకు దిగువగల పేద కుటుంబాల రోగులకు ఆర్థిక సహాయం అందిస్తోంది.
కేంద్ర రసాయనాలు-ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2290830)
आगंतुक पटल : 6