గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
మదనపల్లె ముస్తాబవుతోందిలా…!
प्रविष्टि तिथि:
27 JUL 2026 3:01PM by PIB Hyderabad

స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 స్ఫూర్తితో మదనపల్లె మున్సిపాలిటీ పురోగమిస్తోంది. శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ, సుస్థిర పద్ధతులతో వనరుల పునరుద్ధరణ ద్వారా.. పట్టణ పారిశుద్ధ్యానికి సరికొత్త రూపునిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె పురపాలక సంఘం శాస్త్రీయ, సుస్థిర విధానాలతో పట్టణ పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేస్తోంది. వేగవంతమైన పట్టణీకరణ పరిస్థితులూ, వెలువడుతున్న వ్యర్థాల్లో పెరుగుదల నేపథ్యంలో.. వాటిని ఎదుర్కోవడం కోసం ఒక క్రమబద్ధమైన, సమగ్ర విధానాన్ని ఈ మున్సిపాలిటీ అవలంబించింది. వ్యర్థాలను వేరు చేయడం, శాస్త్రీయంగా వాటి ప్రాసెసింగ్, వనరుల పునరుద్ధరణపై దృష్టి సారిస్తూ.. ‘వ్యర్థాల రహిత నగరం (జీరో వేస్ట్ సిటీ)గా మదనపల్లెను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మదనపల్లెలో రోజూ దాదాపు 62 టన్నుల పురపాలక ఘన వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఇందులో 25.50 టన్నుల పొడి వ్యర్థాలు, 36 టన్నుల తడి వ్యర్థాలు, 0.50 టన్నుల గృహ సంబంధిత ప్రమాదకర వ్యర్థాలు ఉన్నాయి. సమర్థంగా ఈ వ్యర్థాల నిర్వహణ కోసం.. వ్యర్థాలు వెలువడే చోటే వాటిని వేరుచేసే క్రమబద్ధమైన విధానాన్ని పట్టణమంతటా అమలు చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ - అర్బన్ 2.0 లక్ష్యాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ... వ్యర్థ పదార్థాలను జీవవిచ్ఛిన్న, జీవ విచ్ఛిన్నం కాని, సృజనాత్మక పునర్వినియోగ వ్యర్థాలుగా వర్గీకరిస్తున్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెసింగుకూ, మెరుగైన పునర్వినియోగ పద్ధతులకూ, పర్యావరణ హిత రీతిలో వ్యర్థాల తొలగింపునకూ ఇది దోహదపడుతోంది.

వికేంద్రీకృత, సుస్థిర పద్ధతుల్లో జీవవిచ్ఛిన్న వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణపై మదనపల్లె పురపాలక సంఘం ప్రధానంగా దృష్టి సారిస్తోంది. భారీగా వ్యర్థాలను వెలువరించే సంస్థలను తమ ప్రాంగణంలోనే కంపోస్టు తయారీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రజలు కూడా ఇంటి వద్దే కంపోస్టు తయారీనీ, మిద్దె తోటల పెంపకాన్నీ అవలంబిస్తున్నారు. దీంతో తడి వ్యర్థాలను వెలువడే చోటే నిర్వహించేందుకు వీలవుతుంది. ప్రతిరోజూ మున్సిపల్ కంపోస్టు యార్డులో విండ్రో కంపోస్టింగ్ పద్ధతి ద్వారా దాదాపు 15.50 టన్నుల తడి వ్యర్థాలను ప్రాసెస్ చేస్తున్నారు. దీనివల్ల దాదాపు 4.65 టన్నుల ఎరువు తయారవుతుండగా.. పట్టణంలోని పార్కులు, మొక్కల పెంపకం, తోటలకు సంబంధించిన కార్యకలాపాల కోసం దీనిని ఉపయోగిస్తున్నారు. అదనంగా మరో 3 టన్నుల తడి వ్యర్థాల నుంచి వర్మి కంపోస్టింగ్ ద్వారా దాదాపు 1.20 టన్నుల పోషక విలువలతో కూడిన ఎరువును తయారు చేస్తున్నారు. వ్యర్ధాల కోసం ఉపయోగించిన గోతుల్ని పూడ్చాల్సిన అవసరం లేకుండా.. వ్యర్థాల సుస్థిర వినియోగాన్నీ ప్రోత్సహిస్తోంది.

పట్టణంలో వెలువడే పొడి వ్యర్థాలను.. పునర్వినియోగించదగిన, పునర్వినియోగించలేని రకాలుగా ఇంటి వద్దనే క్రమబద్ధంగా వేరు చేస్తున్నారు. పునర్వినియోగానుకూల పదార్థాలను.. పదార్థ పునరుద్ధరణ కేంద్రానికి (ఎంఆర్ఎఫ్) పంపుతారు. అక్కడ వాటిని ప్రాసెస్ చేసి, వనరుల పునరుద్ధరణ కోసం ఆధీకృత పునర్వినియోగ యూనిట్లకు తరలిస్తారు.
పునర్వినియోగానికి వీలు కాని వ్యర్థాలను కో-ప్రాసెసింగ్ కోసం సిమెంటు పరిశ్రమలకు తరలిస్తున్నారు. ఇది వ్యర్థాల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మున్సిపాలిటీకి అదనపు ఆదాయం సమకూరేందుకు కూడా దోహదపడుతోంది. వెలువడే చోటే వ్యర్థాలను సరైన విధంగా వేరుచేయడం ద్వారా.. పునర్వినియోగానుకూల వ్యర్థాల ఉష్ణ జనక విలువను మదనపల్లె మెరుగుపరిచింది. అలాగే డంపింగ్ ప్రదేశాలకు చేరే మిశ్రమ వ్యర్థాల పరిమాణాన్ని కనిష్ట స్థాయికి తగ్గించింది.
ఇంటింటికీ తిరిగి వ్యర్థాల సేకరణ కార్యక్రమాలు, ప్రస్తుత ‘రెడ్యూస్, రీయూజ్, రీసైక్లింగ్ (ఆర్ఆర్ఆర్)’ కేంద్రం ద్వారా.. ఇ-వ్యర్థాలు, పాత దుస్తులు, బొమ్మలు, పుస్తకాలు, పాదరక్షల వంటి వస్తువులను పురపాలక సంఘం సేకరిస్తోంది. ఈ వస్తువులను పునరుద్ధరించడమో, పునర్వినియోగించడమో, లేదా మురికి వాడల్లోనో, నిరాశ్రయులకో, వృద్ధాశ్రయాల్లోనో పంపిణీ చేయడమో చేస్తున్నారు.
‘వ్యర్థం నుంచి కళాత్మకత’ దిశగా మదనపల్లె మున్సిపాలిటీ కొన్ని కార్యక్రమాలను చేపట్టింది. పారేసిన టైర్లను ఇందుకోసం ఉపయోగిస్తోంది. వ్యర్థ పదార్థాలతో రూపొందించిన కళాకృతులతో ప్రభుత్వ స్థలాలనూ, పార్కులనూ సుందరీకరిస్తున్నారు. ఇది డంప్‌యార్డుల వద్ద వ్యర్థ రాహిత్యానికి (జీరో డంపింగ్) దోహదపడడమే కాకుండా, పర్యావరణ అవగాహనను కూడా పెంపొందిస్తుంది.

బయో మైనింగ్, బయో రెమిడియేషన్ ద్వారా మదనపల్లె దాదాపు 36,512 మెట్రిక్ టన్నుల పాత వ్యర్థాలను విజయవంతంగా శుద్ధి చేసి, దాదాపు 9.40 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. తిరిగి స్వాధీనం చేసుకున్న ఈ భూమిలో దాదాపు 5 ఎకరాల్లో మొక్కలను పెంచి.. ఒకప్పుడు డంపింగ్ యార్డులుగా ఉన్న ప్రాంతాలను పచ్చని పట్టణ ప్రాంతాలుగా తీర్చిదిద్దారు. వ్యర్థాల నుంచి తయారు చేసిన ఇంధనం (ఆర్డీఎఫ్) వంటి పునరుద్ధరించిన పదార్థాలను.. కో ప్రాసెసింగ్ కోసం సిమెంటు ప్లాంట్లకు పంపిస్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాలను నింపడానికీ, శాస్త్రీయంగా వ్యర్థాల వినియోగాన్ని ప్రోత్సహించడానికీ, పర్యావరణాన్ని మెరుగుపరచడానికీ మట్టినీ, ఇతర జడ పదార్థాలనూ ఉపయోగిస్తారు.

గోడలపై పెయింటింగులూ, చిత్రాలతో పారిశుద్ధ్యానికి, వ్యర్థాలను వేరు చేయడానికీ ప్రాచుర్యం కల్పిస్తున్నారు. పారిశుద్ధ్యం వల్ల బహిరంగ ప్రదేశాలు చైతన్యవంతమైన అవగాహన వేదికలుగా మారాయి. ఎన్వీఆర్ లే అవుట్ లోని ‘వేస్ట్ టు ఆర్ట్ పార్కు’ ఆవిష్కరణకూ, సుస్థిరతకూ ప్రతీకగా నిలుస్తోంది. పనికిరాని పదార్థాలను సృజనాత్మక పద్ధతిలో ఉపయోగకరమైన, సౌందర్యవంతమైన బహిరంగ కళాకృతులుగా మలచగల తీరుకు ఇది అద్దం పడుతోంది.
స్వచ్ఛ భారత్ మిషన్ - అర్బన్ 2.0 లక్ష్యాలకు అనుగుణంగా, బలమైన పరిపాలన నాయకత్వం, శాస్త్రీయంగా వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు, క్రియాశీల సామాజిక భాగస్వామ్యం ద్వారా... చెత్త కుప్పలు లేని, చెత్తాచెదారం లేని నగరంగా మారే దిశగా మదనపల్లె క్రమంగా పురోగమిస్తోంది. కంపోస్టింగు, పునర్వినియోగం, సృజనాత్మక పునర్వినియోగం, బయోమైనింగ్, పాత వ్యర్థాల పునరుద్ధరణ, ప్రజల భాగస్వామ్యంతో.. సుస్థిరమైన, పర్యావరణపరంగా బాధ్యతాయుతమైన నగరాలను పట్టణ స్థానిక సంస్థలు నిర్మించగల తీరుకు - మున్సిపాలిటీ అవలంబించే ఈ సమీకృత విధానం నిదర్శనం.
***
(रिलीज़ आईडी: 2290207)
आगंतुक पटल : 7