బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు గ్యాసిఫికేషన్, స్వచ్ఛమైన బొగ్గు సాంకేతికతలకు ప్రోత్సాహం

प्रविष्टि तिथि: 27 JUL 2026 5:12PM by PIB Hyderabad

నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్, 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రోజు వరకు సుమారు 22.6 మిలియన్ టన్నుల వార్షిక  బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యం కార్యరూపం లేదా అమలు దశలో ఉంది, అందులో:

  (i) జిందాల్ స్టీల్ లిమిటెడ్ (జేఎస్ఎల్): సుమారు 8 మిలియన్ టన్నుల వార్షిక (ఎంటీపీఏ) బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యం కలిగి ఉంది. (నిర్వహణలోఉంది).

  (ii) తాల్చేర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (టీఎఫ్ఎల్): సుమారు 2.6 ఎంటీపీఏ బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యం కలిగి ఉంది (ప్రస్తుతం అమలు దశలో ఉంది).

  (iii) 24.01.2024న ప్రకటించిన రూ. 8,500 కోట్ల ఆర్థిక ప్రోత్సాహక పథకం కింద 8 ప్రాజెక్టులు: సుమారు 12 మిలియన్ టన్నుల ఎంటీపీఏబొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యం కలిగి ఉన్నాయి (ప్రస్తుతం అమలు దశలో ఉన్నాయి).

ఉపరితల బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం ప్రభుత్వం 13.05.2026న ఒక పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకానికి రూ. 37,500 కోట్ల ఆర్థిక కేటాయింపు ఉంది. ఈ కొత్త పథకం ద్వారా సుమారు 75 ఎంటీపీఏ బొగ్గును వినియోగించనున్నట్లు అంచనా వేస్తున్నారు. తద్వారా 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ లక్ష్యాన్ని సాధించడంలో గణనీయమైన సహకారం అందించనుంది.

24.01.2024న ఆమోదించిన రూ.8,500 కోట్ల బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రోత్సాహక పథకం కింద మొత్తం ఎనిమిది  బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు అనుమతి లభించింది. వీటిలో జిందాల్ స్టీల్ లిమిటెడ్ (కు చెందిన ఒక ప్రాజెక్టు ఆర్థిక అనుమతులు పూర్తి చేసుకుని నిర్మాణ దశలో ఉంది. మొత్తంగా ఐదు ప్రాజెక్టులు భూమి పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, వివిధ అనుమతులు పొందడం, అమలు దశల్లో ఉన్నాయి.

బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక, బొగ్గు సరఫరా, విధానపరమైన మద్దతు వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

ఆర్థిక ప్రోత్సాహకాలు: రూ. 8,500 కోట్ల పథకం కింద మూలధన వ్యయంలో 15%, రూ. 37,500 కోట్ల పథకం కింద ప్లాంట్ యంత్రాల అర్హత వ్యయంలో 20% వరకు ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తారు.

బొగ్గు లింకేజ్ మద్దతు: బొగ్గు గ్యాసిఫికేషన్‌కు అవసరమైన బొగ్గు లభ్యతను సులభతరం చేసేందుకు, బొగ్గు లింకేజీ వేలం విధానంలో “బొగ్గు గ్యాసిఫికేషన్‌కు దారితీసే సింథటిక్ గ్యాస్ ఉత్పత్తి” అనే కొత్త అనుబంధ రంగాన్ని  చేర్చారు. దీనికి విద్యుత్ రంగానికి సమానమైన కనీస ధర ను నిర్ణయించారు. బొగ్గు లింకేజీ కాలపరిమితిని కూడా 30 సంవత్సరాలకు పొడిగించారు. ఒక ప్రాజెక్టుకు వేలం ద్వారా కేటాయించిన బొగ్గు గని  ఉన్నట్లయితే, ఆ గనికి కేటాయించిన సామర్థ్యానికి మించి కూడా అదనపు బొగ్గు లింకేజీ పొందేందుకు అర్హత కల్పించారు.

విధానపరమైన మద్దతు: గ్యాసిఫికేషన్ కోసం వినియోగించే బొగ్గుపై రెవెన్యూ వాటాలో 50 శాతం రాయితీ అందుబాటులో ఉంది. భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ (యూసీజీ) కోసం ప్రభుత్వం ఒక విధాన పరిధిని, మార్గదర్శకాలను జారీ చేసింది. యూసీజీ పైలట్ ప్రాజెక్టులను చేపట్టేందుకు మినహాయింపు కూడా కల్పించింది. యూసీజీ కోసం బొగ్గు బ్లాక్‌ల వేలం నిర్వహించిన సందర్భంలో, భూగర్భ బొగ్గు తవ్వకాలకు వర్తించే 4 శాతం కనీస ధరను 2 శాతానికి తగ్గించారు. అదనపు ముందస్తు చెల్లింపు మినహాయింపుతో పాటు, పనితీరు సంబంధిత బ్యాంకు హామీపై 50 శాతం రాయితీని అందించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

భారత బ్రిక్స్ అధ్యక్ష కాలంలో, బొగ్గు మంత్రిత్వ శాఖ 24.06.2026న స్వచ్ఛమైన బొగ్గు సాంకేతికతలపై ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బొగ్గు గ్యాసిఫికేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కార్యక్రమం ద్వారా బ్రిక్స్ దేశాల మధ్య స్వచ్ఛమైన బొగ్గు సాంకేతికతలపై విజ్ఞాన మార్పిడి, ఉత్తమ పద్ధతుల పరస్పర భాగస్వామ్యానికి అవకాశం కల్పించింది.

బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా దేశీయ బొగ్గును ఉపయోగించి సింథటిక్ నేచురల్ గ్యాస్, రసాయనాలు, ఎరువులు, హైడ్రోజన్, ఇతర ఉత్పత్తులను స్వచ్ఛమైన, విలువ ఆధారిత పద్ధతిలో తయారు చేయవచ్చు. దీనివల్ల విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. ఈ కార్యక్రమాలు ఇంధన భద్రతను బలోపేతం చేయడం, దిగుమతుల ప్రత్యామ్నాయాన్ని ప్రోత్సహించడం, విలువ ఆధారిత పారిశ్రామిక ఉత్పత్తిని పెంచడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, స్వచ్ఛమైన బొగ్గు సాంకేతికతల ద్వారా వనరుల వినియోగాన్ని మెరుగుపరచడం వంటి ప్రయోజనాలను అందిస్తాయని భావిస్తున్నారు. రూ. 8,500 కోట్ల పథకం, రూ.37,500 కోట్ల పథకం కింద చేపట్టిన ప్రాజెక్టులతో పాటు తాల్చేర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ద్వారా దిగుమతుల ప్రత్యామ్నాయం రూపంలో సంవత్సరానికి సుమారు రూ. 1.5 లక్షల కోట్ల మేర ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.

కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే  ఈరోజు రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు. 

 

***


(रिलीज़ आईडी: 2290204) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil