బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తగ్గిన బొగ్గు దిగుమతులు

प्रविष्टि तिथि: 27 JUL 2026 5:11PM by PIB Hyderabad

థర్మల్ విద్యుత్ కేంద్రాలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 62.5 మిలియన్ టన్నుల (ఎంటీ) బొగ్గును దిగుమతి చేసుకోగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో అది 27.4 శాతం తగ్గి 45.4 మిలియన్ టన్నులకు చేరింది. దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారంగా పనిచేసే విద్యుత్ కేంద్రాల దిగుమతులు 2025 ఏప్రిల్‌లోని 3.97 మిలియన్ టన్నుల నుంచి 2026 ఏప్రిల్‌ నాటికి 2.88 మిలియన్ టన్నులకు తగ్గాయి. 

విద్యుత్ రంగంలో బొగ్గు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన చర్యలు:

  1. గతంలో తీరప్రాంతం కాని విద్యుత్ కేంద్రాలకు 90 శాతంగా, తీరప్రాంత విద్యుత్ కేంద్రాలకు 70 శాతంగా ఉన్న వార్షిక కాంట్రాక్ట్ పరిమాణాన్ని (ఏసీక్యూ- యాన్యువల్ కాంట్రాక్టెడ్ క్వాంటిటీ) ఇప్పుడు 100 శాతం వరకు పెంచారు. ఏసీక్యూ పెరగడం వల్ల స్వదేశీ బొగ్గు సరఫరా పెరిగి దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది.

  2. ట్రిగ్గర్ స్థాయిలు, ఏసీక్యూ స్థాయిలతో సంబంధం లేకుండా విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రస్తుత లింకేజ్ హోల్డర్లందరి పూర్తి పీపీఏ (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్) అవసరాలకు తగినంత బొగ్గును బొగ్గు సంస్థలే సరఫరా చేయాలని ప్రభుత్వం 2022లో నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా దిగుమతులపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుంది.

  3. దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత (ఐసీబీ) విద్యుత్ కేంద్రాలు సవరించిన శక్తి విధానం- 2025 కింద బొగ్గును పొందేందుకు అనుమతి ఇచ్చారు. ఈ విధానం కింద లభించే స్వదేశీ బొగ్గు వల్ల ఈ ఐసీబీ కేంద్రాలు దిగుమతి చేసుకునే బొగ్గుపై ఆధారపడటం తగ్గుతుంది.

  4. ప్రస్తుతం ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్ఎస్ఏ) ఉన్న విద్యుత్ కేంద్రాలు తమ ఒప్పందం ప్రకారం ఉన్న 100 శాతం ఏసీక్యూ బొగ్గును పొందిన తర్వాత సవరించిన 'శక్తి విధానం- 2025' కింద అదనపు బొగ్గును తీసుకునేందుకు అనుమతించారు. ఈవిధంగా ఏసీక్యూ పరిమితికి మించి బొగ్గు అందుబాటులోకి రావడం వల్ల విద్యుత్ ఉత్పత్తిదారులు తమ కేంద్రాల మొత్తం అవసరాలను తీర్చుకోవడానికి వీలు కలుగుతుంది.

  5. అనియంత్రిత రంగాల లింకేజ్ వేలం కింద ఇటీవల ప్రారంభించిన 'కోల్‌సేతు' విండో ద్వారా బొగ్గు లింకేజీలు కల్పించడం వల్ల దేశంలో శుద్ధి చేసిన (వాష్డ్) బొగ్గు లభ్యత పెరుగుతుంది. తద్వారా బొగ్గు దిగుమతులు గణనీయంగా తగ్గుతాయి.

బొగ్గు రవాణా, సరఫరా వ్యవస్థలోని సవాళ్లను అంచనా వేసి వాటిని పరిష్కరించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు, భాగస్వాములతో కలిసి బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక సమన్విత బొగ్గు లాజిస్టిక్స్ ప్రణాళికను ప్రారంభించింది. ఇందులో భాగంగా 33 కీలకమైన రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి, ఫస్ట్ మైల్ కనెక్టివిటీ (ఎఫ్ఎంసీ) మౌలిక వసతుల విస్తరణ, రైల్వే మంత్రిత్వ శాఖతో కలిసి రైలు రవాణా సామర్థ్యం పెంపుదల.. రైలు, తీరప్రాంత నౌకాయానం, అంతర్గత జలమార్గాల ద్వారా బహుళ-నమూనా రవాణాను ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకున్నారు. బొగ్గు రవాణాను మరింత వేగవంతం చేసేందుకు 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి 1319 మిలియన్ టన్నుల (ఎంటీ) సామర్థ్యంతో 139 ఎఫ్ఎంసీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రాల్లో రవాణాను సులభతరం చేసేందుకు బొగ్గు రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) ఎనిమిది రైల్వే ప్రాజెక్టులను చేపడుతున్నాయి.

ప్రస్తుత దిగుమతి విధానం ప్రకారం ఓపెన్ జనరల్ లైసెన్స్ (ఓజీఎల్) కింద బొగ్గు ఉంది. కాబట్టి వినియోగ సంస్థలు దానికి వర్తించే సుంకాలను చెల్లించి తమ కాంట్రాక్టు ధరల ప్రకారం తమకు నచ్చిన దేశం నుంచి స్వేచ్ఛగా బొగ్గును దిగుమతి చేసుకోవచ్చు. అయితే సవరించిన ‘శక్తి విధానం - 2025’ కింద దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత (ఐసీబీ) విద్యుత్ కేంద్రాలు కూడా స్వదేశీ బొగ్గును పొందేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. స్వదేశీ బొగ్గు ఉత్పత్తిని పెంచడం, దేశంలోకి అనవసరమైన బొగ్గు దిగుమతులను పూర్తిగా అరికట్టడంపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. అంతేకాకుండా జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ రద్దు చేయడం వల్ల దిగుమతి చేసుకునే బొగ్గుతో పోలిస్తే మన స్వదేశీ బొగ్గు మరింత తక్కువ ధరకే లభ్యమై మార్కెట్‌లో పోటీతత్వాన్ని సాధించింది.

ప్రతి రంగానికి వర్తించే నిబంధనలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలు (పీఎస్‌యూ) అందుబాటు ధరలలోనే బొగ్గును సరఫరా చేయడాన్ని కొనసాగిస్తున్నాయి. గత ఎనిమిది సంవత్సరాలుగా కోల్ ఇండియా లిమిటెడ్‌కు (సీఐఎల్) చెందిన మెజారిటీ గ్రేడ్ల బొగ్గు నోటిఫైడ్ ధర టన్నుకు స్వల్పంగా రూ. 20 మాత్రమే పెరిగింది. అంతేకాకుండా సవరించిన 'శక్తి విధానం - 2025'లోని విండో-II కింద 2026లో (2026 జూన్ వరకు) సీఐఎల్ మూడేసి విడతల స్వల్పకాలిక వేలాలు, ఒక విడత దీర్ఘ లేదా మధ్యకాలిక వేలాన్ని నిర్వహించింది. వీటిలో తగినంత పరిమాణంలో బొగ్గు అందుబాటులో ఉండటం వల్ల విద్యుత్ కేంద్రాలు దాదాపు ఎలాంటి ఎక్కువ ధర లేకుండానే బొగ్గును బుక్ చేసుకుని తమ స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక అవసరాలను తీర్చుకోవడానికి వీలు కలిగింది. 

ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో వెల్లడించారు.

 

***


(रिलीज़ आईडी: 2290203) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Tamil