రక్షణ మంత్రిత్వ శాఖ
దమన్, దాద్రా నగర్ హవేలీ, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లో భారీ వరద సహాయక చర్యలు: 170 మందిని కాపాడిన భారతీయ తీర రక్షక దళం
प्रविष्टि तिथि:
25 JUL 2026 12:13PM by PIB Hyderabad
కుండపోత వర్షాలు, తీవ్రమైన వరదలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భారత తీర రక్షక దళం విస్తృత సహాయక చర్యలు చేపట్టింది. పౌర యంత్రాంగంతో కలిసి పనిచేస్తూ దమన్, దాద్రా నాగర్ హవేలీ, దక్షిణ గుజరాత్ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న 170 మందిని కాపాడింది. జూలై 22 అర్ధరాత్రి నుంచి ఇప్పటివరకు మొత్తం 11 సహాయక చర్యలను విజయవంతంగా నిర్వహించింది.
ఈ సహాయక చర్యలు జూలై 22/23 రాత్రి సిల్వాస్సాలోని ఖాన్వెల్ వద్ద చిక్కుకుపోయిన అయిదుగురిని రక్షించడంతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కడైయా తీర ప్రాంతంలో పొంగిపొర్లుతున్న నదీ తీరంలో చిక్కుకున్న ముగ్గురు మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రవాణా వ్యవస్థ పూర్తిగా తెగిపోయిన వెల్‌స్పన్ పారిశ్రామిక ప్రాంతంలో చిక్కుకున్న 60 మందిని జూలై 23/24 రాత్రి సమయంలో తీర రక్షక దళ బలగాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి.

ఆ తర్వాతి ఆపరేషన్లలో భాగంగా ఏరో ఫైబర్ ప్రైవేటు లిమిటెడ్ సమీపంలో వరద నీటిలో చిక్కుకున్న బస్సు నుంచి ఏడుగురిని అధికారులు రక్షించారు. డోంగ్రి ప్రాంతం నుంచి పదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వల్సాద్-పర్ది ప్రాంతంలో చిక్కుకున్న నలుగురిని హెలికాప్టర్ ద్వారా కాపాడగా, రిలయన్స్ పారిశ్రామిక ప్రాంతం నుంచి రాత్రికి రాత్రే ఎనిమిది మందిని ఖాళీ చేయించారు.

మరొక కీలక సహాయక చర్యలో అవధ్ సొసైటీ ప్రాంతం నుంచి పదిమందిని రక్షించారు. వీరిలో తొమ్మిది నెలల గర్భవతితో పాటు శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఒక మహిళ ఉన్నారు. వారికి సమయానికి వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. జూలై 24న నవసారి జిల్లా మెందర్ గ్రామంలో చిక్కుకున్న 33 మందిని రెండు భారతీయ తీర రక్షక దళ హెలికాప్టర్లు సురక్షితంగా తరలించాయి. తీవ్రమైన గుండెనొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తికి తక్షణ వైద్య సాయం అందించారు.

ఎడతెరిపి లేని వర్షాలు, వేగవంతమైన ప్రవాహాలు, ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ, తీర రక్షక దళ సిబ్బంది ఏమాత్రం విరామం లేకుండా రక్షణ చర్యలను కొనసాగించారు. వయం రక్షామః (మేం రక్షిస్తాం) అనే తమ సంస్థ ఆదర్శ నినాదాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు.
ప్రస్తుత వరద పరిస్థితి నుంచి ఉత్పన్నమయ్యే ఎలాంటి అత్యవసర పరిస్థితికైనా వేగంగా స్పందించడానికి భారతీయ తీర రక్షక దళం సిద్ధంగా ఉంది. సహాయక చర్యల్లో పౌర యంత్రాంగానికి పూర్తి మద్దతుగా నిలుస్తోంది.
***
(रिलीज़ आईडी: 2289457)
आगंतुक पटल : 15