జల శక్తి మంత్రిత్వ శాఖ
వర్షపు నీటి సంరక్షణ (క్యాచ్ ది రైన్) ప్రచారంలో భాగంగా నీటి సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ నిల్వ సామర్థ్యాన్ని పెంచిన నంద్యాల జిల్లా
प्रविष्टि तिथि:
25 JUL 2026 2:36PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లావ్యాప్తంగా జూలై 4 నుంచి ఆగస్టు 4, 2026 వరకు వర్షపు నీటి సంరక్షణ (క్యాచ్ ది రైన్) ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. సాంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ, ఫీడర్ కాలువల పూడికతీత, చెరువుల పునరుజ్జీవం, అదనపు నీటి నిల్వ సామర్థ్యం పెంపు ద్వారా వర్షపు నీటి ప్రతి బొట్టునూ సంరక్షించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఎక్కడ కురిస్తే అక్కడ, ఎప్పుడు కురిస్తే అప్పుడు - సూత్రం ఆధారంగా వర్షపు నీటిని ఒడిసి పట్టే ప్రచారాన్ని అమలు చేస్తున్నారు. శాస్త్రీయ ప్రణాళిక, ప్రజల భాగస్వామ్యం, సమన్వయంతో కూడిన అమలు ద్వారా నంద్యాల జిల్లా తన నీటి సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకుంటూ, వర్షాకాలపు నీటిని సేకరించి నిల్వ చేసే సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటోంది.
శాస్త్రీయ ప్రణాళిక - సమాజ భాగస్వామ్యం
జిల్లాలోని మొత్తం 489 గ్రామ పంచాయతీల్లోనూ క్షేత్రస్థాయి అధ్యయనాలు, ప్రాధాన్యత కలిగిన నీటి వనరులు, ఫీడర్ కాలువలు, వాటర్‌షెడ్ ప్రాంతాల గుర్తింపు, సంబంధిత శాఖల ద్వారా సాంకేతిక అంచనాల ద్వారా శాస్త్రీయ ప్రణాళికను రూపొందించారు. స్థానిక అవసరాలు, సాంప్రదాయ పరిజ్ఞానం ఆధారంగా చేపట్టాల్సిన పనులను గుర్తించడంలో స్థానిక ప్రజలు, గ్రామంలోని పెద్దలతో నిర్వహించిన సంప్రదింపులు ఎంతగానో తోడ్పడ్డాయి. పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం కోసం ప్రతిపాదిత పనులను గ్రామసభ ముందు ఉంచుతున్నారు.
ఈ శాస్త్రీయ, ప్రజా భాగస్వామ్య ప్రణాళిక ప్రక్రియ ఆధారంగా జిల్లావ్యాప్తంగా 2,103 నీటి సంరక్షణ పనులను గుర్తించి, మంజూరు చేశారు. మొత్తం 100% పనులూ క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యాయి. వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, నీటి నిల్వ సామర్థ్యాన్ని గరిష్టంగా పెంచేలా ఈ పనులను వ్యూహాత్మకంగా రూపొందించారు. తద్వారా 'క్యాచ్ ది రైన్' ప్రచార లక్ష్యాలను నంద్యాల జిల్లా మరింత ముందుకు తీసుకువెడుతోంది.
భారీస్థాయిలో నీటి సంరక్షణ పనులు
ఈ ప్రచారంలో భాగంగా 2,691 కిలోమీటర్ల పొడవైన ఫీడర్, సప్లై కాలువలలో పూడికతీత పనులు చేపట్టి వాటిని పునరుద్ధరించారు. దీనివల్ల వర్షపు నీరు చెరువులు, రిజర్వాయర్లకు సజావుగా చేరే మార్గం సుగమమైంది. 251 చిన్న నీటిపారుదల చెరువుల్లో పునరుద్ధరణ పనులు ప్రారంభించగా, వాటిలో 225 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి.
జిల్లావ్యాప్తంగా ఉన్న 22,221 వ్యవసాయ కుంటలు, 2,221 చెక్ డ్యామ్‌లు, 202 ఇంకుడు గుంటల వ్యవస్థను జిల్లా యంత్రాంగం మరింత పటిష్టం చేసింది. ఇది వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, జిల్లావ్యాప్తంగా నీటి లభ్యతను గణనీయంగా పెంచింది. ఈ చర్యలు నీటి సంరక్షణ వ్యవస్థ మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, కురిసే ప్రతి వర్షపు బొట్టునూ ఒడిసిపట్టేందుకు జిల్లా యంత్రాంగాన్ని మరింత సన్నద్ధం చేసింది.
అదనపు నీటి నిల్వ సామర్థ్యం పెంపు
చేపట్టిన పనుల ద్వారా సమకూరిన అదనపు నీటి నిల్వ సామర్థ్యాన్ని సంబంధిత ఇంజనీరింగ్ శాఖలు రూపొందించిన సాంకేతిక నివేదికల ఆధారంగా జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. ఫీడర్ కాలువలు, నీటి సంరక్షణ నిర్మాణాల పునరుద్ధరణ ద్వారా సుమారు 3.27 టీఎంసీల చెరువుల నీటి నిల్వ సామర్థ్యం, కొత్తగా నిర్మించిన నీటి సంరక్షణ నిర్మాణాల ద్వారా అదనంగా 0.03 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.
చెరువులు, ఇతర జలవనరులు వర్షాకాలంలో ప్రవహించే నీటిని మరింతగా సేకరించి నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచడం ద్వారా శాస్త్రీయ ప్రణాళికతో చేపట్టిన ఈ చర్యలు ‘క్యాచ్ ది రైన్’ కార్యక్రమాన్ని గణనీయంగా బలోపేతం చేస్తున్నాయి.భూగర్భ జలాల పునరుద్ధరణను మెరుగుపరచడంతో పాటు వ్యవసాయం, జీవనోపాధులు, స్థానిక సమాజాల అవసరాల కోసం నీటి లభ్యతను మరింత పెంచేందుకు కూడా దోహదపడుతున్నాయి
స్థిరమైన నీటి భద్రత వైపు అడుగులు
నంద్యాల జిల్లా అంతటా ‘క్యాచ్ ది రైన్’ కార్యక్రమం కింద నీటి సంరక్షణ చర్యలు మరింత బలోపేతమవుతున్నాయి. ఇందులో భాగంగా 2,691 కిలోమీటర్ల ఫీడర్, సరఫరా కాలువల్లో భారీ స్థాయిలో పూడికతీత చేపట్టారు. 251 చిన్న నీటిపారుదల చెరువులను పునరుద్ధరించడంతో పాటు, 2,103 నీటి సంరక్షణ పనులను అమలు చేశారు. అదనంగా వేలాది వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలను పునరుద్ధరించి మళ్లీ వినియోగంలోకి తీసుకొచ్చారు.
శాస్త్రీయ ప్రణాళిక, సాంకేతిక అంచనాలు, ప్రజల చురుకైన భాగస్వామ్యంతో చేపట్టిన ఈ చర్యలు జిల్లాలో వర్షపు నీటిని సేకరించే, నిల్వ చేసే, భూగర్భ జలాలను పునరుద్ధరించే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతున్నాయి. అలాగే దీర్ఘకాలిక నీటి భద్రతను, వాతావరణ మార్పుల ప్రభావాలను తట్టుకునే సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. జిల్లా యంత్రాంగం చేపట్టిన సమగ్ర విధానం, 'క్యాచ్ ది రైన్' ప్రచారం కింద సమన్వయంతో కూడిన చర్యలు స్థిరమైన నీటి సంరక్షణ ఫలితాలను ఎలా అందిస్తున్నాయో నిరూపిస్తున్నాయి. ఎక్కడ కురిస్తే అక్కడ, ఎప్పుడు కురిస్తే అప్పుడు వర్షపు నీటిని ఒడిసి పట్టే దార్శనికతను మరింత ముందుకు తీసుకు వెళుతున్నాయి.
***
(रिलीज़ आईडी: 2289456)
आगंतुक पटल : 5