మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మెరుగైన పోషకాహారం, ఈసీసీఈ కార్యకలాపాల కోసం 2 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలను సక్షమ్ అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ఆమోదం
प्रविष्टि तिथि:
24 JUL 2026 2:00PM by PIB Hyderabad
దేశంలో పోషకాహార లోపం సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీ సేవలు, పోషణ్ అభియాన్, కౌమార బాలికల కోసం ఉద్దేశించిన పథకాలను ‘‘మిషన్ సక్షమ్ అంగన్‌వాడీ, పోషణ్ 2.0 (మిషన్ పోషణ్ 2.0)’’ అనే ప్రధాన వ్యవస్థ కిందకు తీసుకొచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే పథకం. ఇందులోని వివిధ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసే బాధ్యత పూర్తిగా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై ఉంటుంది. ఈ మిషన్‌ను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు తీవ్ర ప్రభావం ఉన్న జిల్లాల్లో కూడా అమలు చేస్తున్నారు. దీని పరిధిలో 6 సంవత్సరాల లోపు పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఆకాంక్షిత జిల్లాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని 14 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల కౌమార దశ (టీనేజ్) బాలికలు లబ్ధిదారులుగా ఉంటారు.
మెరుగైన పోషకాహార పంపిణీతో పాటు ముందస్తు బాల్య సంరక్షణ, విద్య (ఈసీసీఈ) కార్యకలాపాలు అందించేందుకు దేశవ్యాప్తంగా 2 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలను సక్షమ్ అంగన్‌వాడీలుగా ఉన్నతీకరించేందుకు ఆమోదం లభించింది. ఈ సక్షమ్ అంగన్‌వాడీల్లో అత్యాధునిక మౌలిక వసతులు కల్పిస్తున్నారు. వాటిలో ఎల్ఈడీ స్క్రీన్లు, నీటి వడపోత వ్యవస్థ, పోషణ్ వాటిక, ఈసీసీఈ బోధనా సామాగ్రి, భవనాన్నే బోధనా సాధనంగా మార్చేబాలా పెయింటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 లోని షెడ్యూల్-II ఆధారంగా 6 నెలల నుంచి 6 సంవత్సరాల పిల్లలు, గర్భిణులు, బాలింతలు, టీనేజ్ బాలికలకు అదనపు పోషకాహారాన్ని అందిస్తున్నారు. ఈ పోషకాహార నిబంధనలను 2023 జనవరిలో సవరించారు. గతంలో ఉన్న పాత నిబంధనలు కేవలం క్యాలరీల ఆధారంగా మాత్రమే ఉండేవి. కానీ ఈ సవరించిన నూతన నిబంధనలు ఆహార వైవిధ్య సూత్రాలపై ఆధారపడి, పోషకాహార పరిమాణంతో పాటు నాణ్యత పరంగా ఎంతో సమగ్రంగా, సమతుల్యంగా రూపొందించారు. అంతేకాకుండా తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న (ఎస్ఏఎం) పిల్లలకు ప్రత్యేకంగా అదనపు పోషకాహారాన్ని ‘టేక్ హోమ్ రేషన్’ రూపంలో అందిస్తున్నారు.
ఈ పథకాన్ని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఐసీటీ ఆధారిత పాలనా సాధనమైన ‘పోషణ్ ట్రాకర్’ అనే డిజిటల్ అప్లికేషన్ ద్వారా పూర్తి డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షిస్తూ, క్రమం తప్పకుండా సమీక్షిస్తోంది. ఈ అప్లికేషన్ సహాయంతో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, అంగన్‌వాడీ కార్యకర్తల కార్యకలాపాలు, నిర్దేశిత సూచికల ఆధారంగా లబ్ధిదారుల వివరాలను ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో నమోదు చేయడానికి, ట్రాక్ చేయడానికి వీలవుతుంది. దీనికి సంబంధించి రాష్ట్రాల వారీగా గుర్తించిన లబ్ధిదారుల వివరాలు, వారు సాధించిన పురోగతికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోషణ్ ట్రాకర్ అధికారిక వెబ్‌సైట్ లింక్ (https://www.poshantracker.in/statistics) ద్వారా తెలుసుకోవచ్చు.
పిల్లల్లో తీవ్రమైన పోషకాహార లోపాన్ని నివారించి, దానికి చికిత్స అందించడంతో పాటు సంబంధిత అనారోగ్యాలు, మరణాలను తగ్గించే లక్ష్యంతో మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ‘పిల్లల్లో పోషకాహార లోప నిర్వహణ ప్రోటోకాల్’ ను విడుదల చేశాయి. ఈ సమాజ ఆధారిత విధానం ద్వారా సమాజంలో తీవ్ర పోషకాహార లోపంతో ఉన్న పిల్లలను సకాలంలో గుర్తించి పరీక్షలు నిర్వహిస్తారు. ఎలాంటి వైద్యపరమైన సంక్లిష్టతలు లేని పిల్లలకు ఇంట్లోనే లభించే పౌష్టికాహారంతో పాటు అవసరమైన ఆరోగ్య సంరక్షణ అందిస్తూ వారిని కోలుకునేలా చేస్తారు.
ప్రజలు మంచి పోషకాహార అలవాట్లను అలవర్చుకోవాలంటే వారి ఆలోచనా విధానంలో మార్పు రావాలి. దీనికి నిరంతర కృషి అవసరం కాబట్టి, ఈ పథకంలో భాగంగా ప్రజలను చైతన్యపరచడం, పోషకాహారంపై అవగాహన కల్పించడం అనేవి ప్రధాన కార్యక్రమాలుగా చేపట్టారు. ఇందుకోసం ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో పోషణ్ మాహ్ (పోషకాహార మాసం), మార్చి-ఏప్రిల్ నెలల్లో పోషణ్ పఖ్వాడా (పోషకాహార పక్షోత్సవాలు) నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల సమయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జన్ ఆందోళన్ (ప్రజా ఉద్యమం) పేరిట విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రజల ఆహార అలవాట్లలో సానుకూల మార్పులు తేవడంలో సమాజ ఆధారిత కార్యక్రమాలు (సీబీఈలు) చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ప్రతి అంగన్‌వాడీ కార్యకర్త తప్పనిసరిగా నెలకు రెండుసార్లు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
నీతి ఆయోగ్ 2020లో పోషణ్ అభియాన్‌పై తృతీయ పక్ష మూల్యాంకనం, ప్రభావ అంచనాను నిర్వహించింది. ఇందులో దేశంలో పోషకాహార లోపాన్ని నివారించడంలో పోషణ్ అభియాన్ పనితీరు సంతృప్తికరంగా ఉందని తేలింది. దీనికి కొనసాగింపుగా నీతి ఆయోగ్ 2025లో మిషన్ సక్షమ్ అంగన్‌వాడీ, పోషణ్ 2.0 ఫలితాల ఆధారిత మూల్యాంకనాన్ని నిర్వహించింది. సంస్థాగత అంచనాలు, గృహ సర్వేల ద్వారా లభించిన ఆధారాల ప్రకారం మునుపటి కార్యక్రమాల అనుభవాలను సమన్వయం చేసుకుంటూ మరింత బలోపేతం చేసిన మిషన్ పోషణ్ 2.0 పోషకాహార లోపాన్ని సమగ్రంగా ఎదుర్కొంటూ బాలల వికాసానికి ప్రభుత్వం చేపడుతున్న సరికొత్త ప్రయత్నంగా నిలిచింది. సూక్ష్మపోషకాల విషయంలో సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ (ఎన్ఎన్‌పీ), సంబంధిత కార్యక్రమాల ద్వారా అందించిన ఐరన్-ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు, బలవర్ధకమైన ఆహార పదార్థాలు, మెరుగైన సేవల కారణంతో 6 నుంచి 59 నెలల వయస్సు ఉన్న పిల్లల్లో రక్తహీనత తీవ్రత 8.5 శాతం మేర తగ్గడం ఈ పథకం సాధించిన సత్ఫలితాలకు అద్దం పడుతోంది.
ఈ సమాచారాన్ని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రి ఠాకూర్ లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2288856)
आगंतुक पटल : 7