సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్ ద్వారా సీనియర్ సిటిజన్లకు పునరుద్యోగ అవకాశాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
2050 నాటికి 60 ఏళ్లు, అంతకుమించి వయస్సు ఉన్నవారి జనాభా 20.8 శాతానికి, ఈ శతాబ్దం ముగిసే సమయానికి 36 శాతానికి పెరిగే అవకాశం: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్
నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్‌లో సీనియర్ సిటిజన్ అభ్యర్థుల కోసం 1.68 లక్షల పోస్టులు; ఇప్పటివరకు ఉద్యోగార్ధులుగా నమోదు చేసుకున్న 1.89 లక్షల మంది సీనియర్ సిటిజన్లు
प्रविष्टि तिथि:
22 JUL 2026 7:46PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్ ద్వారా సీనియర్ సిటిజన్లు క్రియాశీలకంగా జీవించేలా ప్రోత్సహించడానికీ, వారికి పునరుద్యోగావకాశాలను మెరుగుపరచడానికీ తన కట్టుబాటును పునరుద్ఘాటించింది. ఈ ప్రత్యేక సీనియర్ సిటిజన్ పునరుద్యోగ కార్యక్రమం కింద రిజిస్ట్రేషన్లు, యజమానుల భాగస్వామ్యం, ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరిగాయి. దీని ద్వారా అనుభవజ్ఞులైన నిపుణులు దేశ శ్రామిక శక్తికి తమ వంతు సహకారాన్ని అందించడం కొనసాగించేలా తోడ్పాటు లభిస్తోంది.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ఈ రోజు రాజ్యసభలో ఎంపీ శ్రీ రాజీందర్ గుప్తా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం తెలియజేశారు.
భారత్‌లో వయోవృద్ధుల జనాభా గణనీయంగా పెరగనుందని యూఎన్ఎఫ్‌పీఏ -ఇండియా ఇచ్చిన ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 ఫలితాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని మంత్రి సభకు తెలిపారు. ఈ నివేదిక ప్రకారం 2022లో 10.4 శాతంగా ఉన్న 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి జనాభా 2050 నాటికి 20.8 శాతానికి, ఈ శతాబ్దం ముగిసే సమయానికి 36 శాతానికి పెరుగుతుందని అంచనా వేసినట్లు ఆయన పేర్కొన్నారు.
వయోవృద్ధులకు, ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి ఆదాయం, భద్రత కల్పించేందుకు ఆమోదయోగ్యమైన జీవనోపాధి అవకాశాలు, క్రమబద్ధమైన పునరుద్యోగ మార్గాలను అందించే విధానాల అవసరాన్ని కూడా ఈ నివేదిక స్పష్టం చేస్తోందని మంత్రి తెలిపారు.
ఎన్సీఎస్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రాలు, వివిధ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వం 407 మోడల్ కెరీర్ సెంటర్లను (ఎంసీసీ) మంజూరు చేసినట్లు మంత్రి తెలియజేశారు. ఈ కేంద్రాలు ఉద్యోగ మేళాలు, ఎన్సీఎస్ పోర్టల్, కెరీర్ కౌన్సెలింగ్, శిక్షణ ద్వారా యువతతో పాటు సీనియర్ సిటిజన్లనూ, ఇతర ఉద్యోగార్ధులను కూడా ఉద్యోగావకాశాలతో అనుసంధానిస్తాయి.
భారతదేశానికి చెందిన నైపుణ్యం కలిగిన, ఉద్యోగార్హత ఉన్న, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే శ్రామిక శక్తి అభివృద్ధిలో నేషనల్ కెరీర్ సర్వీస్ కీలక పాత్ర పోషిస్తోందని డాక్టర్ కుమార్ పేర్కొన్నారు. కృత్రిమ మేధ ఆధారిత సేవలు, విస్తృత సమ్మేళనం, మెరుగైన ప్రజా కేంద్రీకృత సేవల ద్వారా అభివృద్ధి చెందుతున్న ఈ వేదిక దేశంలోని ఆధునిక ఉద్యోగ సేవల వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుందని, సమ్మిళిత ఆర్థిక వృద్ధికీ, ఉద్యోగ కల్పనకూ దోహదపడుతుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
2015లో ఎన్సీఎస్ పోర్టల్ ను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 6.46 కోట్లకు పైగా ఉద్యోగార్థులు, 58.76 లక్షల మంది యజమానులు (ఈ-ఎంప్లాయర్లు) ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారని మంత్రి తెలిపారు. వీరిలో 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ ఉద్యోగార్థులు 1.89 లక్షల మంది ఉన్నారు.
ఈ పోర్టల్‌లో ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు సరిపడే 1.68 లక్షల ఖాళీలు అందుబాటులో ఉండడం విశేషం. ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లతో సహా 2.29 కోట్లకు పైగా ఉద్యోగార్థులను వివిధ సంస్థల యజమానులు ఎంపిక చేసుకున్నారు.
***
(रिलीज़ आईडी: 2288077)
आगंतुक पटल : 5