ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
టీసీఐఎమ్ బలోపేతం లక్ష్యంగా చేతులు కలిపిన బ్రిక్స్ దేశాలు
రూపుదిద్దుకోనున్న నిపుణుల కార్యవర్గం
ఆయుష్ జోన్ ద్వారా ఆయుష్ గురించి తెలుసుకున్న ప్రతినిధులు
ఆయుష్ ఆహారం, ఆరోగ్య శ్రేయో సంబంధిత చికిత్సలు, భారత మూలికా వారసత్వం గురించిన సంపూర్ణ అవగాహన
प्रविष्टि तिथि:
21 JUL 2026 5:14PM by PIB Hyderabad
బ్రిక్స్-2026 అధ్యక్షతలో భాగంగా... సాంప్రదాయిక, అనుబంధ, సమగ్ర వైద్యం (టీసీఐఎమ్) పై భారత్ ఈ రోజు బ్రిక్స్ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ చండీగఢ్ వేదికగా సంయుక్తంగా నిర్వహించిన నాలుగు రోజుల బ్రిక్స్ హెల్త్ ట్రాక్ కార్యక్రమాల్లో భాగంగా ఈ సమావేశం జరిగింది. బహుపాక్షిక సహకార బలోపేతం... విజ్ఞానం, ఉత్తమ పద్ధతులను పంచుకోవడాన్ని ప్రోత్సహించడం... సాంప్రదాయిక-అనుబంధ-సమగ్ర వైద్య రంగంలో సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ టీసీఐఎమ్ సమావేశం జరిగింది. బ్రిక్స్ సభ్య దేశాల సీనియర్ ప్రభుత్వ అధికారులు, సాంకేతిక నిపుణులు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బ్రిక్స్ అధ్యక్షతన భారత్ "సమర్థత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం" అనే ప్రధాన ఇతివృత్తం ఆధారంగా ఈ సమావేశాన్ని నిర్వహించింది. సాక్ష్యాధారిత సాంప్రదాయిక వైద్య విధానాలను ప్రోత్సహించడానికి... సంస్థాగత భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి... సుస్థిరమైన, సమర్థమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు దోహదపడటానికి బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని ఈ సమావేశం ముందుకు తీసుకువెళ్ళింది.
సాంప్రదాయిక-అనుబంధ-సమగ్ర వైద్య రంగాల్లో ఉత్తమ పద్ధతులు, విధానపరమైన అనుభవాలు, శాస్త్రీయ పురోగతులను పరస్పరం పంచుకోవడానికి ఈ సమావేశం ఒక వేదికను అందించింది. బ్రిక్స్ సభ్య దేశాలైన బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, ఇరాన్, రష్యా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటెచా స్వాగతోపన్యాసంతో టీసీఐఎమ్ గురించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సభ్య దేశాల ప్రతినిధి బృందాలు ప్రారంభోపన్యాసాలు చేశారు. అందుబాటులో ఉన్న అన్ని సభ్య దేశాల ఏకాభిప్రాయంతో టీసీఐఎమ్‌పై ప్రతిపాదిత బ్రిక్స్ నిపుణుల కార్యవర్గ విధివిధానాలను ఖరారు చేశారు. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, విధానపరమైన పద్ధతులను సమన్వయం చేయడం, భవిష్యత్ సహకార రంగాలను గుర్తించడంపైనా ఈ సమావేశంలో చర్చించారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో "సామర్థ్య నిర్మాణం, విద్య, మానవ వనరుల అభివృద్ధి" అనే అంశంపై ఒక ప్రత్యేక అనుబంధ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచవ్యాప్త అనుసంధానం గల టీసీఐఎమ్ వ్యవస్థను నిర్మించడం లక్ష్యంగా... విద్యాపరమైన సహకారాలు, ఆయుష్ స్కాలర్‌షిప్ కార్యక్రమాలు, అధ్యాపకులు-విద్యార్థుల రాకపోకలు, పరిశోధన భాగస్వామ్యాలు, సాక్ష్యాధారాల రూపకల్పన యంత్రాంగాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయిక వైద్య విద్య, శిక్షణను బలోపేతం చేయడంపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించింది.
భారత్ బ్రిక్స్-2026 అధ్యక్షతన... భారత సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను ప్రదర్శించే ఆయుష్ జోన్‌ను ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటెచా ప్రారంభించారు. ఆయుష్ ఆహారం, ఆరోగ్యం-శ్రేయస్సు సంబంధిత కన్సల్టేషన్స్, భారత మూలికా వారసత్వం, మంత్రిత్వ శాఖ దార్శనికత, ప్రపంచ స్థాయి కార్యక్రమాలు, పరిశోధన-ఆవిష్కరణలు, విజ్ఞానం గురించిన సంపూర్ణ అనుభవాన్ని ఆయుష్ జోన్ బ్రిక్స్ ప్రతినిధులకు కలిగించింది. ఆరోగ్య సంబంధిత కార్యకలాపాలు, యోగానూ ప్రదర్శించిన ఈ ఆయుష్ జోన్... సాంప్రదాయిక-అనుబంధ-సమగ్ర వైద్యంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం పట్ల భారత్ నిబద్ధతను ప్రతిబింబించింది.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో జరిగిన టీసీఐఎమ్ చర్చలు విస్తృత బ్రిక్స్ హెల్త్ ట్రాక్‌కూ దోహదపడ్డాయి. బ్రిక్స్ దేశాల మధ్య ఆరోగ్య సంరక్షణ సహకారాన్ని బలోపేతం చేయడంపై కొనసాగుతున్న చర్చలకూ ఇవి మద్దతునిచ్చాయి.
నాలుగు రోజుల ఈ కార్యక్రమంలో భాగంగా భారత సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ సంప్రదాయాలను ప్రదర్శించే అనేక ఆరోగ్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రిక్స్ దేశాల ప్రతినిధులు చైర్ యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగ విద్యాసంస్థ నిర్వహించిన కామన్ యోగా ప్రోటోకాల్ ప్రదర్శనలు, సమావేశాల సమయంలో యోగా బ్రేక్ సెషన్లు, ఫిట్ ఇండియా రన్‌లోనూ వారు పాల్గొన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సాంకేతిక సహకారంతో రూపొందించిన ఆయుష్ ఆహార్ మేళాతో పాటు, ఆరోగ్య శ్రేయో సంబంధిత చికిత్సలు, పరిశోధన-ఆవిష్కరణల ప్రదర్శనలు, ప్రత్యక్ష యోగా ప్రదర్శనలు, ఇతర ఆరోగ్య సంబంధిత కార్యకలాపాల ద్వారా భారత సాంప్రదాయిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఆయుష్ జోన్ ప్రదర్శించింది. ఇది ప్రతినిధులకు భారత సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ సంప్రదాయాల గురించిన సమగ్ర అవగాహనను అందించింది.
ఈ సమావేశం అనేక కీలక ఫలితాలను సాధించింది. సాంప్రదాయిక-అనుబంధ-సమగ్ర వైద్యంపై 'బ్రిక్స్ నిపుణుల కార్యవర్గం' ఏర్పాటు దిశగా పురోగతి... పరిశోధన-విద్య-నియంత్రణ విధానాల పరంగా మెరుగైన సహకారం... సభ్య దేశాలు పరస్పరం విజ్ఞానాన్ని పంచుకునే ప్రక్రియను మెరుగుపరచడం... బ్రిక్స్ ఆరోగ్య ఎజెండాలో సాంప్రదాయిక-అనుబంధ-సమగ్ర వైద్యానికి మరింత బలమైన గుర్తింపు వంటివి వీటిలో భాగంగా ఉన్నాయి.
సాక్ష్యాధారిత సాంప్రదాయిక వైద్య విధానాలను ప్రోత్సహించడం... అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంపొందించడం... అందరికీ సంపూర్ణమైన, అందుబాటులో ఉండే, సుస్థిరమైన ఆరోగ్య సంరక్షణను అభివృద్ధి చేయడం పట్ల భారత నిరంతర నిబద్ధతను ఈ బ్రిక్స్ టీసీఐఎమ్ సమావేశం ప్రతిబింబించింది.
***
(रिलीज़ आईडी: 2287515)
आगंतुक पटल : 12