ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

క్యాన్సర్, అంటువ్యాధులకు పరిష్కారాలను మెరుగుపరిచే దిశగా.. మూడు దేశీయ బయోమెడికల్ సాంకేతికతలను బదిలీ చేసిన ఐసీఎంఆర్


పరిశోధన దశలో ఉన్న యాంటీ-హెచ్‌పీవీ SHetA2, రెండు పేగు సంబంధిత వ్యాక్సిన్ల సాంకేతికత బదిలీ.. వాటిని మరింత అభివృద్ధి చేయడం లక్ష్యం

ప్రభుత్వ నిధులతో జరిగే పరిశోధనను.. అందుబాటు ధరలో ఆరోగ్య రక్షణకు మరింత చేరువ చేసేలా సాంకేతికత బదిలీ

ఆరోగ్య రక్షణ ఆవిష్కరణల్లో ఆత్మనిర్భరత దిశగా భారత్ ప్రయాణానికి ఊతమిస్తున్న ‘వైద్య ఆవిష్కరణల్లో పేటెంట్ మిత్ర’: డీహెచ్ఆర్ కార్యదర్శి, ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ రాజీవ్ బాల్

प्रविष्टि तिथि: 21 JUL 2026 11:26AM by PIB Hyderabad

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తన వైద్య ఆవిష్కరణల పేటెంట్ మిత్ర కార్యక్రమం కింద.. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన మూడు కీలకమైన బయోమెడికల్ సాంకేతికతలను ప్రముఖ భారతీయ ఔషధ, వ్యాక్సిన్ తయారీ సంస్థలకు బదిలీ చేసింది. ఈ సాంకేతికతల ఆధారంగా తదుపరి పరిశోధనలు, తయారీ, వాణిజ్యీకరణకు వీలుగా ఒప్పందాలు కుదిరాయి. ఇందులో భాగంగా, సర్వికల్ ఇంట్రాఎపిథీలియల్ నియోప్లాసియా (సీఐఎన్) చికిత్స కోసం రూపొందించిన, ప్రతిపాదిత కొత్త యాంటీ-హెచ్‌పీవీ ఔషధ సాంకేతికత ‘SHetA2’పై ఎమ్‌క్యూర్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ సంస్థకు లైసెన్స్ ఇచ్చారు. అలాగే పేగు సంబంధిత బ్యాక్టీరియా వ్యాధుల నివారణ కోసం కలకత్తాలోని ఐసీఎంఆర్-జాతీయ బ్యాక్టీరియా వ్యాధుల పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్-ఎన్ఐఆర్భీఐ) అభివృద్ధి చేసిన రెండు తదుపరి తరం వ్యాక్సిన్ సాంకేతికతలను బయోలాజికల్ ఇ- లిమిటెడ్ సంస్థకు అందించారు. ప్రభుత్వ నిధులతో జరిగిన పరిశోధనలను ప్రజలకు అందుబాటు ధరల్లో వైద్య పరిష్కారాలుగా మలచడంలో, దేశంలో బయోమెడికల్ ఆవిష్కరణల వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఈ సాంకేతిక బదిలీలు కీలకమైన ముందడుగు.

ఐసీఎంఆర్ జాతీయ క్యాన్సర్ నివారణ, పరిశోదన సంస్థ (ఐసీఎంఆర్-ఎన్ఐసీపీఆర్)కు చెందిన డాక్టర్ షౌకత్ హుస్సేన్, అమెరికాలోని ఒక్లహామా యూనివర్సిటీ పరిధిలోని స్టీఫెన్‌సన్ క్యాన్సర్ సెంటర్‌కు చెందిన డాక్టర్ డోరిస్ ఎం. బెన్ బ్రూక్ మధ్య సమన్వయంతో SHetA2 రూపుదిద్దుకుంది. ఇది ఈ తరహాలో మొదటి సరికొత్త చికిత్సా ప్రయోగం. ఇది ఆరోగ్యకరమైన కణాలకు హానిచేయకుండా, హెచ్‌పీవీ ప్రేరిత క్యాన్సర్ పూర్వ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కణాలను మాత్రమే ఎంపిక చేసుకుని నిర్మూలిస్తుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు సురక్షితమైనఅందుబాటు ధరల్లో ఉండే, అతి తక్కువ శస్త్రచికిత్సతో కూడిన చికిత్సా విధానాన్ని అందించే సామర్థ్యం ఈ సాంకేతికతకు ఉంది.

ఐసీఎంఆర్ - జాతీయ బ్యాక్టీరియా వ్యాధుల పరిశోధన సంస్థలో డాక్టర్ శాంతసబుజ్ దాస్, ఆయన బృందం అభివృద్ధి చేసిన రెండు టీకా సాంకేతికతలు:

  • సాల్మోనెల్లా టైఫీ బాహ్య త్వచ ప్రోటీన్‌ ఉన్న ఒక సంలీన నిర్మాణం.. ఆశాజనకమైన తదుపరి తరం టైఫాయిడ్ వ్యాక్సిన్ ప్రతిపాదనగా ఉంది.
  • ప్రధాన పేగు సంబంధిత బ్యాక్టీరియా వ్యాధికారకాల నుంచి మరింత విస్తృత రక్షణను అందించేలా రూపొందించిన, సాల్మోనెల్లా టైఫీ/పారాటైఫీ, షిగెల్లా వ్యాధుల నివారణకు సంబంధించిన పునస్సంయోజక వ్యాక్సిన్ కూర్పు.

క్యాన్సర్ నివారణ, అంటువ్యాధుల నియంత్రణలో భారత్ ప్రయత్నాలను బలోపేతం చేయడంతోపాటు.. తదుపరి తరం చికిత్స విధానాలు, టీకాల అభివృద్ధిని దేశీయంగా ముందుకు తీసుకువెళ్లే సామర్థ్యం ఈ సాంకేతికతలకు ఉంది.

‘‘ప్రభుత్వ నిధులతో నిర్వహించే పరిశోధనలను ఆరోగ్యపరంగా సత్ఫలితాలను పెంచే ఉత్పత్తులుగా నిలిపేందుకు ఐసీఎంఆర్ కట్టుబడి ఉంది. వైద్య ఆవిష్కరణల పేటెంట్ మిత్ర వంటి కార్యక్రమాల ద్వారా- పరిశోధకులు, పరిశ్రమల మధ్య భాగస్వామ్యాలను పెంపొందిస్తూ.. శాస్త్రీయ ఆవిష్కరణల నుంచి వాణిజ్యీకరణ వరకు ప్రతి మార్గాన్ని బలోపేతం చేస్తున్నాం. దేశ బయోమెడికల్ ఆవిష్కరణల వ్యవస్థలో పెరుగుతున్న పరిణతిని ఈ సాంకేతికతా బదిలీలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య రక్షణ ఆవిష్కరణల్లో ఆత్మనిర్భరతను సాధించే దిశగా ఇదొక కీలక ముందడుగు’’ అని ఆరోగ్య పరిశోధన విభాగం (డీహెచ్ఆర్) కార్యదర్శి, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బాల్ అన్నారు.

దేశంలో అత్యున్నత బయోమెడికల్ పరిశోధన సంస్థగా - ఆవిష్కరణ, మేధో సంపత్తి పరిరక్షణ నుంచి చికిత్సాపరమైన ధ్రువీకరణ, నియంత్రణ సౌలభ్యం, వాణిజ్యీకరణ వరకు.. ఆవిష్కరణల నిరంతర ప్రక్రియలో ఆరోగ్య రక్షణ సాంకేతికతలకు సహకరించేలా ఒక సమీకృత ఆవిష్కరణ వ్యవస్థను ఐసీఎంఆర్ నెలకొల్పింది. ‘వైద్య ఆవిష్కరణల పేటెంట్ మిత్ర’ ద్వారా.. పేటెంట్ దాఖలుసాంకేతిక పరిజ్ఞాన బదిలీ, లైసెన్సింగ్ కోసం ఆవిష్కర్తలకు వ్యవస్థీకృత మద్దతు లభిస్తుంది. అలాగే దేశీయ వైద్య సాంకేతికతలకు నియంత్రణాపరమైన మార్గనిర్దేశం, క్లినికల్ మూల్యాంకనం, మార్కెట్ ప్రవేశాన్ని ‘మెడ్‌టెక్ మిత్ర’ సులభతరం చేస్తుంది.

వైజ్ఞానిక ఉన్నతి, వ్యూహాత్మక సహకారాలు, పారిశ్రామిక భాగస్వామ్యాలతో అందుబాటు ధరల్లో, అత్యంత నాణ్యమైన ఆరోగ్య రక్షణ పరిష్కారాలను దేశానికి, ప్రపంచానికి అందించే దిశగా.. దేశ బయోమెడికల్ ఆవిష్కరణ వ్యవస్థ బలం పెరుగుతోందనడానికి ఈ సాంకేతికతలకు లైసెన్సింగ్ ప్రక్రియ నిదర్శనం.  

 

***


(रिलीज़ आईडी: 2287138) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Tamil