రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తెలంగాణ పురోగతి కారిడార్: ఎన్‌హెచ్-63, ఎన్‌హెచ్-563 విస్తరణతో రవాణా, వాణిజ్యం, పర్యాటక రంగానికి ఊతం

प्रविष्टि तिथि: 20 JUL 2026 4:02PM by PIB Hyderabad

వేములవాడ వంటి పుణ్యక్షేత్రం, ధర్మపురి వంటి చారిత్రక ప్రాంతాల నుంచి నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల వంటి వ్యవసాయ, పారిశ్రామిక కేంద్రాల వరకు ఉత్తర తెలంగాణ వృద్ధి బలమైన రవాణా వ్యవస్థపై ఆధారపడి ఉంది. వాహనాల రాకపోకలు పెరగటం, ఆర్థిక కార్యకలాపాలు విస్తరించటంతో ఎన్‌హెచ్-63, ఎన్‌హెచ్-563 జాతీయ రహదారుల ప్రధాన మార్గాల్లో రద్దీ పెరుగుతోంది. ఈ సవాలును అధిగమించేందుకు ఎన్‌హెచ్-63లోని ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల విభాగాన్ని, ఎన్‌హెచ్-563లోని జగిత్యాల-కరీంనగర్ విభాగాన్ని నాలుగు లైన్ల రహదారులుగా మార్చేందుకు గత నెలలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఆధునిక రహదారి వ్యవస్థ నిర్మాణం ద్వారా పుణ్యక్షేత్రాలు, పారిశ్రామిక కేంద్రాలు, లాజిస్టిక్స్ కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్లకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచటమే ముఖ్య ఉద్దేశం.

 

దాదాపు 190.76 కిలోమీటర్ల మేర ఉన్న ఈ ప్రాజెక్టులు తెలంగాణ రవాణా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటంలో కీలక ముందడుగు. ఎన్‌హెచ్-63లోని ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల విభాగంలోని నాలుగు లైన్ల పనులను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌ (హెచ్ఏఎం) ద్వారా చేపట్టనుండగా.. ఎన్‌హెచ్-563లోని జగిత్యాల-కరీంనగర్ విభాగ పనులను బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (టోల్) ప్రాతిపదికన అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం రూ.7,597.16 కోట్లు వ్యయం చేయనున్నది. ఇది ప్రాంతీయ రవాణా అనుసంధానాన్ని, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వానికున్న బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ ఆధునిక కారిడార్లు కేవలం ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించటమే కాక ఆర్థిక వృద్ధి, పర్యాటకం, ప్రాంతీయ అభివృద్ధికి నూతన అవకాశాలను కల్పిస్తాయి.

ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక రంగాన్ని బలోపేతం చేయటం

ఏడాది పొడవునా పెద్ద సంఖ్యలో భక్తులు, సందర్శకులు వచ్చే పర్యాటక ప్రాంతాల్లో ప్రయాణ అనుభూతిని మెరుగుపరచటంలో రహదారులు కీలక పాత్ర పోషిస్తాయి. ఎన్‌హెచ్-63, ఎన్‌హెచ్-563ల విస్తరణ ద్వారా తెలంగాణలోని అత్యంత ప్రాచుర్యం పొందిన ఆధ్యాత్మిక, వారసత్వ క్షేత్రాలైన వేములవాడ ఆలయం, కొండగట్టు అంజనేయ స్వామి ఆలయం, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, కాళేశ్వరం ఆలయం, చరిత్రాత్మక నగునూరు కోట వంటి ప్రాంతాలకు రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడుతుంది.

 

ఈ మెరుగైన రహదారి వ్యవస్థ వల్ల భక్తులు, ప్రయాణికులు మరింత వేగంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఇది ఒకే పర్యటనలో వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించేలా భక్తులను ప్రోత్సహిస్తుంది. దీని ప్రయోజనాలు కేవలం పర్యాటక రంగానికే పరిమితం కాకుండా సందర్శకుల సంఖ్య పెరగటం వల్ల స్థానిక వ్యాపారాలకు, హోటల్ రంగానికి, రవాణాదారులకు, హస్త కళాకారులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఇది ఉపాధిని కల్పించటమే కాక స్థానిక ఆర్థిక వ్యవస్థకు అండగా నిలుస్తుంది.

 

తెలంగాణ ఆర్థిక వృద్ధి కేంద్రాలను అనుసంధానించటం

ఇటీవలి కాలంలో ఉత్తర తెలంగాణ వ్యవసాయం, ఆహార శుద్ధి, మత్స్య పరిశ్రమ, ఉత్పాదక రంగాలకు కీలక కేంద్రంగా ఎదిగింది. ఈ వృద్ధిని కొనసాగించేందుకు సమర్థవంతమైన రవాణా వ్యవస్థ కీలకమైనది. ఈ నూతన రహదారి కారిడార్ ద్వారా సిద్దిపేట, వరంగల్‌లోని ప్రత్యేక ఆర్థిక మండళ్లు.. నిజామాబాద్, సిద్దిపేటలోని మెగా ఫుడ్ పార్కులతో పాటు మత్స్య పరిశ్రమ, సీఫుడ్ క్లస్టర్లకు రవాణా మెరుగవుతుంది. మెరుగైన రవాణా వ్యవస్థ వల్ల రైతులకు, పరిశ్రమలకు ముడి సరకులు, ఉత్పత్తుల సరఫరా వేగంగా జరుగుతుంది. రవాణా ఖర్చులు తగ్గుతాయి. వివిధ మార్కెట్లతో అనుసంధానం పెరుగుతుంది.

 

ఈ ప్రాజెక్టు పీఎం గతి శక్తి ప్రణాళికకు అనుగుణంగా ఉండటంతో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. పలు ఆర్థిక, సామాజిక, రవాణా కేంద్రాలను అనుసంధానించటం ద్వారా సమగ్ర సరఫరా వ్యవస్థను ఇది ఏర్పరుస్తుంది. మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధిని ప్రోత్సహిస్తూ ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేస్తుంది.

వ్యవసాయ క్షేత్రాల నుంచి రవాణా వరకు: సంపదను పెంచే కారిడార్

ఈ రహదారుల ద్వారా అనుసంధానమైన జిల్లాలు.. తెలంగాణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్నాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం కీలకం. ఈ కారిడార్ల వెంట ఉన్న జిల్లాలు.. వరి, మొక్కజొన్న, పత్తి, పసుపు, ఉద్యానవన పంటలను అధికంగా పండిస్తాయి. ఈ ప్రాంత సంపద విశ్వసనీయ రహదారులపైనే ఆధారపడి ఉంటుంది. ఎన్‌హెచ్-63లోని ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల.. ఎన్‌హెచ్-563 లోని జగిత్యాల-కరీంనగర్ విభాగంలో నాలుగు లైన్ల విస్తరణతో రైతులకు మార్కెట్లు, మండీలు, గిడ్డంగులు, ఆహార శుద్ధి కేంద్రాలకు రవాణా సౌకర్యం మెరుగవుతుంది. ఆహార శుద్ధి, సీఫుడ్ ఎగుమతులకు సంబంధించిన వ్యాపారాలకు ప్రయాణ సమయంపై స్పష్టత ఉంటుంది. సరకు రవాణా వేగం పెరగటం వల్ల ఇంధన వినియోగం, వాహన నిర్వహణ ఖర్చులు తగ్గి లాజిస్టిక్స్ సామర్థ్యం మెరుగవుతుంది. 

ఈ మెరుగైన కారిడార్ ద్వారా ముడి సరకులు, తుది ఉత్పత్తుల రవాణా.. ఆహార శుద్ధి పరిశ్రమల వృద్ధికి తోడ్పడుతుంది. మెరుగైన రవాణా అనుసంధానం వల్ల వ్యవసాయ క్షేత్రాలు, ఫుడ్ పార్కులు, శీతలీకరణ కేంద్రాల సౌకర్యాలు, ప్రాసెసింగ్ యూనిట్ల మధ్య అనుసంధానం బలోపేతమై విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ పెరుగుతుంది. త్వరగా పాడైపోయే ఉత్పత్తుల వృధా తగ్గుతుంది.

బలమైన వ్యూహాత్మక రవాణా వ్యవస్థ నిర్మాణం

జాతీయ రహదారుల వ్యవస్థలో ఈ ప్రాజెక్టు పోషించే పాత్రే.. దీనిద్వారా లభించే అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి. ఈ ఆధునిక కారిడార్ ఉత్తర-దక్షిణ భారతదేశాన్ని కలుపుతూ సాగే అత్యంత పొడవైన రహదారి ఎన్‌హెచ్-44తో అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. ఎన్‌హెచ్-363, ఎన్‌హెచ్-163జీ వంటి కీలక మార్గాలను కలుపుతుంది. ప్రధాన పట్టణ, పారిశ్రామిక కేంద్రాల మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు ఈ అనుసంధానాలు చాలా అవసరం.

 

ఈ కారిడార్ నాగ్‌పూర్-హైదరాబాద్, నాగ్‌పూర్-విజయవాడ మార్గాల అనుసంధానంతో సహా ప్రాధాన్యత గల ప్రాంతీయ పర్యటన, సరకు రవాణా మార్గాలకు మద్దతుగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయి అందుబాటులోకి వస్తే ఆర్మూర్, మంచిర్యాల మధ్య సుమారు 1:30 గంటల ప్రయాణ సమయం తగ్గుతుందని అంచనా. జగిత్యాల, కరీంనగర్ మధ్య 45 నిమిషాల ప్రయాణ సమయం తగ్గుతుంది. ఫలితంగా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా సురక్షితమైన, వేగవంతమైన, విశ్వసనీయమైన ప్రయాణం సాధ్యమవుతుంది.

 

ప్రస్తుతం, రెండు రహదారి కారిడార్లలోనూ అధిక జనాభా గల పట్టణాలు, విస్తరిస్తున్న పట్టణాల వల్ల వాహనాల రాకపోకల్లో అంతరాయం కలుగుతుంది. దీనివల్ల ట్రాఫిక్ రద్దీ ఏర్పడి ప్రయాణికులతో పాటు సరకు రవాణా వాహనాలకు ఆలస్యం జరుగుతోంది. ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల మార్గం.. అంకాపూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్సెట్టిపేట, మంచిర్యాల వంటి విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాల గుండా వెళుతుంది. ఇక్కడ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీతో ప్రయాణ సమయం పెరుగుతోంది. జగిత్యాల-కరీంనగర్ మార్గం.. జగిత్యాల, పోతారం, గంగాధర, కరీంనగర్ వంటి జనసాంద్రత గల ప్రాంతాల గుండా వెళుతుంది. ఇక్కడ ట్రాఫిక్ రద్దీ నిరంతర సవాలుగా మారింది. ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు, వాహనాల రాకపోకలు నిరంతరం పెరుగుతున్నందున.. అధిక సామర్థ్యం గల, సమర్థవంతమైన రహదారి మౌలిక సదుపాయాల అవసరం ఉంది.

 

****


(रिलीज़ आईडी: 2286837) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil