అణుశక్తి విభాగం
ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో జరిగిన 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత విద్యార్థులు
భారత్ తరఫున బరిలో నిలిచిన నలుగురికీ స్వర్ణ పతకాలు
प्रविष्टि तिथि:
19 JUL 2026 1:35PM by PIB Hyderabad
2026 జూలై 10 నుంచి 19 వరకు ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో జరిగిన 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో భారతదేశం అసాధారణమైన ప్రదర్శన కనబరిచింది. ఈ పోటీలలో పాల్గొన్న నలుగురు భారతీయ విద్యార్థులూ బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు.
విజేతలుగా నిలిచిన విద్యార్థులు:
-
దేబదత్త ప్రియదర్శి (స్వర్ణ పతకం) – భువనేశ్వర్, ఒడిశా
-
హర్షిత్ సింగ్లా (స్వర్ణ పతకం) – మండి గోవింద్గఢ్, పంజాబ్
-
కబీర్ చిల్లర్ (స్వర్ణ పతకం) – ఢిల్లీ
-
సందీప్ కూచి (స్వర్ణ పతకం) – హైదరాబాద్, తెలంగాణ
భారత్ నుంచి నలుగురు జ్యూరీ సభ్యులు ఈ బృందంతో పాటు వెళ్లారు. ప్రధాన మార్గదర్శకులుగా ప్రొఫెసర్ సుభజిత్ బందోపాధ్యాయ, మెంటార్‌గా డాక్టర్ ఇంద్రాణి సేన్ (హెచ్‌బీసీఎస్‌ఈ, ముంబయి) ఉన్నారు. శాస్త్రీయ పరిశీలకులుగా డాక్టర్ అనుబేందు అధికారి (ఐఐటీ ఖరగ్‌పూర్), డాక్టర్ జయశ్రీ గోపాలకృష్ణన్ (ఎన్ఇఎస్ రత్నం ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కాలేజ్, ముంబయి) వ్యవహరించారు.
దేశాల వారీగా పతకాల పట్టికలో భారత్, చైనా, వియత్నాం, ‘ఇండివిడ్యువల్ పార్టిసిపెంట్స్ గ్రూప్ బీ’లతో (రష్యా) కలిసి ఉమ్మడిగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం జరిగిన ఐసీహెచ్‌ఓలో 93 దేశాల నుంచి 363 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తద్వారా ఇది ఇప్పటివరకు జరిగిన ఐసీహెచ్‌ఓలలోనే అతిపెద్ద పోటీగా నిలిచింది. చరిత్రలోనే మొదటిసారిగా నలుగురు విద్యార్థులూ స్వర్ణ పతకాలు సాధించడంతో ఐసీహెచ్‌ఓ చరిత్రలో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.
ఈ పోటీలలో ప్రాయోగిక, సిద్ధాంత విభాగాలు రెండూ ఉన్నాయి. థియరీ పరీక్షలో మొత్తం 9 క్లిష్టమైన సమస్యలు ఇచ్చారు. అవి: మొక్కల ఎక్స్‌ట్రాక్ట్ నుంచి తయారు చేసిన నీలి రంగు ద్రావణం, బొగ్గు నిక్షేపం నుంచి లభించిన పసుపు రంగు రాయి (ఇది ఇబ్న్ సినా, అవి సెన్నా ల్యాబ్‌లో కూడా కనుగొన్నట్లు అంచనా ఉంది) రసాయన కూర్పును గుర్తించడం.. ఆసిలేటరీ బీజెడ్ (బీజెడ్) చర్య కైనెటిక్స్.. వివిధ ఫంక్షనలైజ్డ్ ఆర్గానిక్ సమ్మేళనాలను ఉపయోగించి పోరస్ ఫ్రేమ్‌వర్క్ మెటీరియల్స్ (సీఓఎఫ్‌లు అని పిలిచే రంధ్రాలు కలిగిన పదార్థాలు) తయారు చేయడం.. ఉర్తాబులక్‌లో 3 సంవత్సరాల పాటు ఎగిసిపడిన సహజ వాయువు మంటలను ఆర్పడానికి 1966లో నిర్వహించిన చారిత్రాత్మక అణు విస్ఫోటనంలో ఉపయోగించిన యురేనియం ద్రవ్యరాశిని అంచనా వేయడం.. నాలుగు ఒకేలాంటి ఫ్యాటీ యాసిడ్ శేషాలను కలిగి ఉండి, అంతఃకణ త్వచాలలో భాగమైన ఒక రకమైన ఫాస్ఫోఈస్టర్ అయిన 'కైరల్ కార్డియోలిపిన్' నిర్మాణాత్మక రహస్యాన్ని విశ్లేషించడం.. ఒక మాక్రోసైక్లిక్ మెటల్ కాంప్లెక్స్‌తో స్థిరపరచడం ద్వారా నానో-సైజ్ మాలిక్యులర్ బెల్ట్‌ను రూపొందించడానికి సరికొత్త కార్బన్ అల్లోట్రోప్స్ అయిన 'సైక్లోకార్బన్స్'ను ఉపయోగించడం.. ట్రాన్సిషన్ మెటల్ ఉత్ప్రేరకాలను ఉపయోగించి అమ్మోనియా ఉత్పాదక ప్లాంట్లలో నైట్రోజన్ స్థిరీకరణ.. సామర్థ్యాన్ని మరింత పెంచడానికి ఫోటోసెన్సిటైజర్ల వాడకంతో పాటు వాతావరణంలోని సీఓ2 ఉత్ప్రేరకాలు.. సైక్లోడెక్స్ట్రిన్స్ సింథటిక్ అనలాగ్స్ చర్యలు (ఇందులో విద్యార్థులకు స్టీరియోకెమికల్, రీజియో-స్పెసిఫిక్ రూపాంతరాలపై ఉన్న పట్టును పరీక్షించారు).
ఈ ప్రాయోగిక (ఎక్స్పెరిమెంటల్) పరీక్షలో మూడు సంక్లిష్టమైన సమస్యలు ఉన్నాయి. అవి: ఇచ్చిన తెలియని రసాయన కారకాలను ఉపయోగించి ఒక మెటల్ కాంప్లెక్స్‌ను సంశ్లేషణ చేయడం, గుణాత్మక విశ్లేషణ- కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ ద్వారా దాని రసాయన కూర్పును విశ్లేషించడం.. ఇచ్చిన 5 ఎంజైమ్ మిశ్రమాలను ఉపయోగించి మైక్రోస్కేల్ పరీక్షల ద్వారా బయోకెమికల్స్ (గ్లూకోజ్, యూరియా, యూరిక్ యాసిడ్, కొలెస్ట్రాల్ ఈస్టర్, ఒక రకమైన నూనె వంటివి) కలిగిన 20 మిశ్రమాలను గుర్తించడం… పీహెచ్-మెట్రిక్ టైట్రేషన్స్ ద్వారా 3 ఆమ్ల మిశ్రమాల కూర్పులను కనుగొనడం, దీనిని అనుసరిస్తూ పీహెచ్-మెట్రీ ద్వారా రెండు ఇండికేటర్ ద్రావణాలను (ఒకటి ఎర్ర క్యాబేజీ నుంచి సేకరించిన సహజ ఇండికేటర్, మరొకటి రెండు ఇండికేటర్ల మిశ్రమం) విశ్లేషించడం.
ఈ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు, భారత ప్రతినిధి బృందానికి మా హృదయపూర్వక అభినందనలు. ‘హెచ్‌బీసీఎస్‌ఈ’లో నిర్వహించిన ఓరియంటేషన్, ప్రీ-డిపార్చర్ శిక్షణ శిబిరాలలో జట్టును ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దినందుకు గాను హెచ్‌బీసీఎస్‌ఈ కెమిస్ట్రీ ఒలింపియాడ్ సెల్, ఇతర ఉపాధ్యాయులు- మెంటార్ల వనరుల బృందానికి ప్రత్యేక అభినందనలకు తెలియజేస్తున్నాం.
అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో భారత్ పాల్గొనటం ఇది 27వ సారి. ఈ సంవత్సరాలన్నింటిలోనూ మన దేశ విద్యార్థుల్లో 32 శాతం మంది స్వర్ణ పతకాలు, 51 శాతం మంది రజత పతకాలు, 17 శాతం మంది కాంస్య పతకాలు సాధించారు. గత పది ప్రాతినిధ్యాలను పరిశీలిస్తే స్వర్ణ, రజత పతకాల శాతాలు వరుసగా 43 శాతం, 53 శాతంగా నమోదయ్యాయి.
అంతర్జాతీయ వేదికపై భారతీయ నైపుణ్యాన్ని చాటిచెప్పడానికి వీలు కల్పిస్తూ ఈ ఒలింపియాడ్ కార్యక్రమానికి నిరంతరం బలమైన మద్దతును అందిస్తున్న నేషనల్ స్టీరింగ్ కమిటీ ఆన్ సైన్స్ ఒలింపియాడ్స్, ఉపాధ్యాయ సంఘాలు, నిధులు అందించే భారత ప్రభుత్వ సంస్థలకు (డీఏఈ, డీఎస్టీ, ఎంఓఈ) మేం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
***
(रिलीज़ आईडी: 2286431)
आगंतुक पटल : 13