ఆయుష్
azadi ka amrit mahotsav

విజయవంతంగా ముగిసిన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద మూడు రోజుల అంతర్జాతీయ సెమినార్ ‘సౌశ్రుతం- 2026’


ఆచార్య సుశ్రుతుని శస్త్రచికిత్స వారసత్వాన్ని గౌరవించి, ముందుకు తీసుకువెళ్లడం లక్ష్యంగా నిర్వహించిన సెమినార్‌కు దేశవిదేశాల నుంచి హాజరైన నిపుణులు

प्रविष्टि तिथि: 17 JUL 2026 10:22PM by PIB Hyderabad

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) నిర్వహించిన మూడు రోజుల అంతర్జాతీయ సెమినార్ "సౌశ్రుతం-2026" ఈ నెల 17న జరిగిన సమావేశంతో విజయవంతంగా ముగిసింది. ఈ నెల 15 నుంచి 17 వరకు నిర్వహించిన ఈ సెమినార్‌కు ముందు, ఈ నెల 14న ఒక రోజు ప్రీ-కాన్ఫరెన్స్ కార్యశాల నిర్వహించారు. సుశ్రుత జయంతి పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు.

నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (ఎన్‌సీఐఎస్ఎమ్) చైర్‌పర్సన్ వైద్య మనీషా కొఠేకర్, దక్షిణ ఢిల్లీ పార్లమెంటు సభ్యులు (లోక్‌సభ) శ్రీ రాంవీర్ సింగ్ బిధూరి ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిధులుగా డాక్టర్ సుశ్రుత్ కనౌజియా, బోర్డ్ ఆఫ్ ఎథిక్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎన్‌సీఐఎస్ఎమ్... పద్మశ్రీ గ్రహీత, ప్రొఫెసర్ మనోరంజన్ సాహు హాజరయ్యారు.

వైద్య మనీషా కొఠేకర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమ నిర్వాహక బృందాన్ని అభినందించారు. సౌశ్రుతం వంటి సెమినార్లను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. అవి విద్యార్థులకు విలువైన అవగాహనను అందించడం ద్వారా ఆయుర్వేద రంగంలో విద్యాపరమైన, వృత్తిపరమైన భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయని ఆమె పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఆయుర్వేదాచార్యులు కేవలం వైద్యులుగా మాత్రమే కాకుండా, నైపుణ్యం కలిగిన శస్త్రవైద్యులుగానూ సమాజ గుర్తింపును పొందడంలో సహాయపడుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఆయుర్వేద విద్య, అభ్యాసాన్ని బలోపేతం చేయడానికి, ప్రోత్సహించడానికి కమిషన్ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని వైద్య మనీషా కొఠేకర్ పునరుద్ఘాటించారు.

ఏఐఐఏ డైరెక్టర్ ప్రొఫెసర్ పి.కె. ప్రజాపతి మాట్లాడుతూ, సౌశ్రుతం-2026 దార్శనికతను వివరించారు. శాస్త్రీయ చర్చలను పెంపొందించడానికి, సాక్ష్యాధారిత శస్త్రచికిత్సా పద్ధతుల సమాచారం పంచుకోవడాన్ని సులభతరం చేయడానికి, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ఆవిష్కరణలను ప్రదర్శించడానికి, ఆచార్య సుశ్రుతుని శాశ్వత శస్త్రచికిత్సా వారసత్వాన్ని స్మరించుకోవడానికి ఈ సెమినార్‌ను ఒక ప్రపంచ వేదికగా రూపొందించినట్లు ఆయన తెలిపారు. శస్త్రచికిత్సా విద్యలో పరిశోధన, ఆవిష్కరణ, శ్రేష్ఠతను ప్రోత్సహిస్తూనే... ఆయుర్వేదం, ఆధునిక శస్త్రచికిత్సా శాస్త్రాల మధ్య విద్యాపరమైన సహకారాన్ని బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని ప్రొఫెసర్ ప్రజాపతి పేర్కొన్నారు.

సెమినార్ ఆర్గనైజింగ్ ఛైర్మన్ ప్రొఫెసర్ యోగేష్ బాద్వే మాట్లాడుతూ, ఆయుర్వేదంలో శస్త్రచికిత్స పద్ధతుల నాణ్యతను మెరుగుపరచడానికి, ఆయుర్వేద శస్త్రవైద్య సమాజాన్ని బలోపేతం చేయడానికి ఏఐఐఏ కట్టుబడి ఉందన్నారు. ఆయుర్వేద శస్త్రచికిత్సలో శ్రేష్ఠతను సాధించడంలో సౌశ్రుతం వంటి అంతర్జాతీయ వేదికలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన జోడించారు.

సెమినార్‌కు అంతర్జాతీయ నిపుణులు అందించిన విలువైన సేవలకు గుర్తింపుగా ముగింపు సమావేశంలో వారిని సత్కరించారు.

సహకార పరిశోధన, ఆవిష్కరణల పట్ల ఇరు సంస్థల నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ... ఐఐటీ ఢిల్లీతో తన అవగాహన ఒప్పందాన్ని ఏఐఐఏ మరో ఐదేళ్లపాటు పునరుద్ధరించుకుంది.

ఈ కార్యక్రమంలో ఏఐఐఏ రాజభాషా విభాగం వార్షిక హిందీ పత్రిక 'ఆయుష్వల్లరి' మూడో సంచికనూ విడుదల చేశారు. కంటి వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, అపోహలను తొలగించడం, శాస్త్రీయ సమాచారాన్ని సరళమైన, సులభంగా అర్థమయ్యే భాషలో ప్రచారం చేయడం లక్ష్యంగా రూపొందించిన "కంటి వ్యాధులు: సాధారణ సమాచారం - నివారణ" అనే ప్రచురణనూ ప్రముఖులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 'సౌశ్రుతం-2026' స్మారక చిహ్నాన్నీ ఆవిష్కరించారు.

ఈ సెమినార్‌లో భారత్ సహా థాయ్‌లాండ్, ఇజ్రాయెల్, ఆస్ట్రియా, యునైటెడ్ కింగ్‌డమ్, శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్, గ్రీస్ దేశాల నుంచి ప్రముఖ విద్యావేత్తలు, శస్త్రచికిత్స నిపుణులు పాల్గొన్నారు. వారు శస్త్రచికిత్స, ఆరోగ్య సంరక్షణ సంబంధిత విభాగాల గురించి తమ నైపుణ్యం, అనుభవాలను పంచుకున్నారు.

పద్మశ్రీ గ్రహీత, ప్రొఫెసర్ ఎం. సాహు, పద్మశ్రీ గ్రహీత, ప్రొఫెసర్ కె.కె. థక్రాల్ సహా 30 మందికి పైగా ప్రముఖ జాతీయ నిపుణులతో పాటు... ఏఐఐఏ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (ఐఎంఎస్-బిహెచ్‌యు), జైపూర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎన్ఐఏ), జామ్‌నగర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద (ఐటీఆర్ఏ) వంటి అగ్రశ్రేణి సంస్థలు, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రముఖ శస్త్రచికిత్స కేంద్రాలకు చెందిన విశిష్ట అధ్యాపక బృందం ఈ సెమినార్‌లో పాల్గొన్నారు.

ఎయిమ్స్, లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అగర్తలాలోని ప్రభుత్వ వైద్య కళాశాల, న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్‌కు చెందిన ప్రఖ్యాత ఆధునిక శస్త్రచికిత్స నిపుణులు ఈ చర్చల్లో పాలుపంచుకున్నారు. ఆయుర్వేదం, సమకాలీన శస్త్రచికిత్స శాస్త్రాల మధ్య బహుళ విభాగాల సంబంధిత సమాచారాన్ని పరస్పరం పంచుకునే  ప్రక్రియను సులభతరం చేశారు.

పీహెచ్‌డీ విభాగం డీన్ అయిన ప్రొఫెసర్ మహేష్ వ్యాస్, పీడీ విభాగం డీన్ అయిన ప్రొఫెసర్ ఆర్.కె. యాదవ్, కార్యనిర్వహాక కార్యదర్శి డాక్టర్ వ్యాసదేవ మహంత, ఏఐఐఏ సీనియర్ అధ్యాపక సభ్యులూ ముగింపు సమావేశానికి హాజరయ్యారు.

సాంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రీయ పురోగతులతో అనుసంధానించే ప్రక్రియ బలోపేతంలోనూ, సంపూర్ణమైన, సాక్ష్యాధారిత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలోనూ సౌశ్రుతం-2026 మరో ముఖ్యమైన ముందడుగు వేసింది.


(रिलीज़ आईडी: 2286117) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Assamese