భారత ఎన్నికల సంఘం
తొలి అఖిల భారత మీడియా సమావేశం నిర్వహించిన ఈసీఐ
प्रविष्टि तिथि:
17 JUL 2026 9:01PM by PIB Hyderabad
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) “భాగస్వాములను అనుసంధానించడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం: ఎన్నికల్లో మీడియా పాత్ర” ఇతివృత్తంతో తొలి అఖిల భారత మీడియా సదస్సు-2026ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 380 మందికి పైగా మీడియా రంగ నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేష్ కుమార్ ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. భారత రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, భారత ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనల ప్రకారం దేశంలో ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకునే భాగస్వాములందరితో మొత్తం ఎన్నికల ప్రక్రియను ఏకకాలంలో ఆడిట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
దాదాపు 95 కోట్ల మంది భారతీయులు భాగంగా ఉన్న భారత ఓటర్ల జాబితా కాలంతో పాటు నిరంతరం మారుతూ ఉండే ఒక సజీవ పత్రమని సీఈసీ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఓటర్ల జాబితాల రూపకల్పనకు ఆధారమైన చట్టబద్ధమైన రక్షణల గురించి ప్రస్తావిస్తూ... 12 లక్షలకు పైగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు), 15 లక్షలకు పైగా బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు) ఈ ప్రక్రియలో "ఏకకాల ఆడిటర్లు"గా చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన తెలిపారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదు కావడం... దేశ ఎన్నికల వ్యవస్థపై భారత ఓటర్లకు ఉన్న నమ్మకానికి, భారత ప్రజాస్వామ్య చైతన్యానికి నిదర్శనమని శ్రీ జ్ఞానేష్ కుమార్ అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో పాల్గొన్న భారత ఓటర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రాజకీయ పార్టీలు, అభ్యర్థుల కీలక భాగస్వాములను భాగం చేస్తూ... ఎన్నికల ప్రక్రియలోని వివిధ అంశాలను గురించి, దేశంలో అత్యంత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించు ప్రక్రియను గురించి అందరికీ అవగాహన కల్పించడమే ఈ సదస్సు లక్ష్యం.
రాజ్యాంగంలో పొందుపరిచిన పారదర్శక చర్యలు... ప్రజా ప్రాతినిధ్య చట్టాలు-1950, 1951... ఈసీఐ ఎప్పటికప్పుడు జారీ చేసిన సూచనలు... ఈసీఐనెట్ వేదిక... ఎన్నికల్లో సాంకేతికత పాత్ర... ఎన్నికల సమయంలో మీడియా వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన రాజ్యాంగ నిబంధనలు, చట్టాలపై విస్తృత సమీక్షతో ఈ సమావేశం ప్రారంభమైంది.
ఎన్నికల వివిధ దశల్లో పారదర్శకతను నిర్ధారించడంలో, రాజకీయ పార్టీల భాగస్వామ్యాన్ని సులభతరం చేయడంలో, ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడంలో దేశంలో ఎన్నికల ఏకకాల ఆడిటర్లుగా బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు), పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్ల పాత్రను ప్రధానంగా ప్రస్తావిస్తూ... వారి పాత్రలు, బాధ్యతల గురించి సమావేశంలో స్పష్టంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా... ఓటర్ల జాబితా రూపకల్పన, పోలింగ్ ప్రక్రియ, లెక్కింపు ప్రక్రియపై బృందాలుగా ప్రదర్శన నిర్వహించారు. వివిధ భాగస్వాములతో ఏకకాల ఆడిట్‌కు ఆధారాన్ని అందించిన వివిధ చట్టబద్ధమైన ఫారమ్‌లను గురించి ప్రత్యక్ష అనుభవాన్ని పొందేందుకు మీడియా నిపుణులకు ఈ ప్రదర్శనలు అవకాశం కల్పించాయి.
సమావేశానంతరం మీడియా సిబ్బంది అడిగిన పలు ప్రశ్నలకు సీఈసీ శ్రీ జ్ఞానేష్ కుమార్ సవివరంగా సమాధానమిచ్చారు.
***
(रिलीज़ आईडी: 2286109)
आगंतुक पटल : 14