వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఫ్లైట్ బుకింగ్ వేదికలో మోసపూరిత పద్ధతులను అవలంబించిన స్పైస్‌జెట్‌కు లక్ష రూపాయల జరిమానా విధించిన సీసీపీఏ
ఈ పద్ధతులు వినియోగదారుల రక్షణ చట్టం-2019, వినియోగదారుల రక్షణ (ఇ-కామర్స్) నియమాలు-2020లోని 4(9) నియమం, మోసపూరిత పద్ధతుల నివారణ, నియంత్రణ మార్గదర్శకాలు-2023ను ఉల్లంఘించాయని నిర్ధారించిన సీసీపీఏ
प्रविष्टि तिथि:
17 JUL 2026 6:46PM by PIB Hyderabad
విమాన టికెట్ బుకింగ్ వేదికలో డార్క్ ప్యాటర్న్స్ అని పిలిచే మోసపూరిత పద్ధతులను అవలంబించినందుకు స్పైస్‌జెట్ లిమిటెడ్‌కు రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) జరిమానాను కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) విధించింది. ప్రధాన కమిషనర్ శ్రీమతి నిధి ఖరే, కమిషనర్ శ్రీ అనుపమ్ మిశ్రా నేతృత్వంలోని సీసీపీఏ ఈ నిర్ణయం తీసుకుంది.
సీసీపీఏ గమనించిన విషయాలు:
· ముందుగానే టిక్ చేసి ఉంచిన చెక్ బాక్స్ ద్వారా వినియోగదారులు తమ ప్రమేయం లేకుండానే స్పైస్ క్లబ్ లాయల్టీ ప్రోగామ్‌లో చేరుతున్నారు.
· వినియోగదారులు ఎలాంటి చర్య తీసుకోకపోయినా, డిఫాల్ట్ ఆప్షన్ ముందుగానే ఎంపిక చేసి ఉండటం వల్ల వారు ప్రచార సందేశాలను స్వీకరించేందుకు అంగీకరించినట్లుగా పరిగణించింది.
· సీసీపీఏ నోటిసు జారీ చేసిన అనంతరం కూడా తాను అనుసరిస్తున్న పాత పద్ధతిని మార్చి... భవిష్యత్తులో టెక్స్ట్ మెసేజులు, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా సందేశాలను పంపేందుకు ముందుగానే టిక్ చేసి ఉంచిన మరో చెక్‌బాక్స్‌ను ఉపయోగించడం కొనసాగించింది.
సాంకేతిక లోపం కారణంగా ఈ సమస్య తలెత్తిందని స్పైస్‌జెట్ విచారణలో తెలిపింది. అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టామని, వాటిని ఎల్లప్పుడూ కొనసాగిస్తామని ధృవీకరిస్తూ హామీ ఇవ్వాలని ఆ సంస్థను ఆదేశించారు.
స్పైస్‌జెట్ బుకింగ్ వేదికలో సీసీపీఏ గుర్తించిన మోసపూరిత పద్ధతులు:
· బలవంతపు చర్య – ముందుగానే టిక్ చేసి ఉంచిన చెక్ బాక్స్ ద్వారా వినియోగదారుల ప్రమేయం లేకుండానే వారిని స్పైస్ క్లబ్ లాయల్టీ ప్రోగ్రాంలోకి చేర్చడం.
· ఇంటర్‌ఫేస్ జోక్యం – సంస్థకు అనుకూలమైన ఆప్షన్‌ను ముందుగానే ఎంపిక చేసి ఉంచడం ద్వారా వినియోగదారుల నిర్ణయాన్ని ప్రభావితం చేయడం.
· మోసపూరిత ప్రశ్న – వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉన్న గందరగోళ పరిచే, ప్రతికూల పదాలతో కూడిన భాషను అంగీకార నిబంధనల్లో ఉపయోగించడం.
ఈ తరహా పద్ధతులు వినియోగదారుల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తాయని, నిర్ణయ సామర్థ్యాన్ని బలహీనపరుస్తాయని సీసీపీఏ గుర్తించింది. నిష్పక్షపాతమైన, పారదర్శకమైన వినియోగదారుల భాగస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని కూడా గమనించింది.
అనైతికమైన వాణిజ్య పద్ధతులు, ఒప్పందాలు, తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించిన వినియోగదారుల రక్షణ చట్టం-2019 లోని నిబంధనలను సంస్థ ఉల్లంఘించిందని సీసీపీఏ గుర్తించింది. స్పష్టమైన, సానుకూల చర్యల ద్వారా వినియోగదారుల ఆమోదాన్ని పొందాలని నిర్దేశించే వినియోగదారుల రక్షణ (ఇ-కామర్స్) నియమాలు-2020లోని 4(9) నియమం, మోసపూరిత పద్ధతుల నివారణ, నియంత్రణ మార్గదర్శకాలు-2023ను కూడా సంస్థ ఉల్లంఘించిందని నిర్ధారించింది.
వినియోగదారుల ఆమోదం తెలిపే విధానం ఎల్లప్పుడూ స్పష్టంగా, సరైన సమాచారంతో, స్వేచ్ఛాయుతంగా ఉండాలని ఈ ఉత్తర్వు పునరుద్ఘాటించింది. ముందుగా టిక్ చేసి ఉంచిన చెక్‌బాక్స్‌లు, డిఫాల్ట్ సెట్టింగులు లేదా మోసపూరిత ఇంటర్‌ఫేస్ డిజైన్ ద్వారా పొందిన సమ్మతి చెల్లదు. అది వినియోగదారుల సంక్షేమానికి, చట్ట నిబంధనలకు విరుద్ధం.
https://x.com/JoshiPralhad/status/2078098157972734331?s=20
వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి, న్యాయమైన, పారదర్శకమైన, వినియోగదారు-కేంద్రీకృత పద్ధతిలో డిజిటల్ వేదికలు వ్యాపారం చేసేలా చూడటానికి సీసీపీఏ కట్టుబడి ఉంది.
***
(रिलीज़ आईडी: 2285977)
आगंतुक पटल : 4