బొగ్గు మంత్రిత్వ శాఖ
'ఇండియా మైనింగ్ వీక్-2026' సదస్సు షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి
నవంబరు 15 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటన
సుస్థిర వనరుల అభివృద్ధి భవితను తీర్చిదిద్దేందుకు ప్రపంచ విధాన రూపకర్తలు, పరిశ్రమల నాయకులు, పెట్టుబడిదారులు, సాంకేతిక ఆవిష్కర్తలు, మైనింగ్ వాటాదారులను ఒకచోట చేర్చనున్న భారత అతిపెద్ద మైనింగ్ సదస్సు
प्रविष्टि तिथि:
15 JUL 2026 8:04PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్ వేదికగా 2026 నవంబర్ 15 నుంచి 17 వరకు 'ఇండియా మైనింగ్ వీక్-2026' సదస్సును నిర్వహించనున్నట్లు కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. మైనింగ్, ఖనిజాల రంగానికి సంబంధించి దేశంలోనే అతిపెద్ద సదస్సు, ప్రదర్శనగా ఇది నిలవనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ప్రారంభోత్సవంలో భాగంగా... కేంద్ర గనులు, బొగ్గు శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే కలిసి కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ సదస్సు లోగో, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్, గనుల శాఖ కార్యదర్శి శ్రీ పీయూష్ గోయల్, బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రూపేందర్ బ్రార్‌తో పాటు ఆయా శాఖలకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మైనింగ్ రంగానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఇతర కీలక భాగస్వాములు హాజరయ్యారు.
సాంకేతికంగా అభివృద్ధి చెందిన, ప్రపంచంతో పోటీ పడగల, పర్యావరణపరంగా బాధ్యతాయుతమైన మైనింగ్ రంగాన్ని నిర్మించాలన్న భారత దార్శనికతను ప్రతిబింబిస్తూ... “బలమైన వనరులు, తెలివైన మైనింగ్, సుస్థిరమైన భవిష్యత్తు” అనే ఇతివృత్తంతో మూడు రోజుల పాటు ఈ సదస్సును నిర్వహించనున్నారు. మొత్తం మైనింగ్ వాణిజ్య కార్యకలాపాల వ్యాప్తంగా చర్చలు, సహకారం, వ్యాపార భాగస్వామ్యం కోసం ఇండియా మైనింగ్ వీక్-2026 ఒక ప్రధాన వేదికగా ఉపయోగపడుతుంది.
ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ... మైనింగ్ రంగంలో భారత నూతన ఆత్మవిశ్వాసం, దార్శనికత, ప్రపంచ ఆకాంక్షలను ప్రతిబింబించే ఒక చరిత్రాత్మక కార్యక్రమంగా ఇండియా మైనింగ్ వీక్-2026ను అభివర్ణించారు. భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, సుస్థిరమైన, సాంకేతికత ఆధారిత మైనింగ్ భవిష్యత్తును తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రభుత్వాలు, పరిశ్రమలు, పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ ప్రముఖులు, పరిశోధకులు, అంకుర సంస్థలు, విద్యావేత్తలను ఒకచోట చేర్చే ఈ కార్యక్రమం ఒక ప్రధాన అంతర్జాతీయ వేదికగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్ద కాలంలో చేపట్టిన పరివర్తనాత్మక సంస్కరణలను ప్రధానంగా ప్రస్తావిస్తూ... పారదర్శక వేలం ప్రక్రియలు, వాణిజ్య బొగ్గు తవ్వకం, వేగవంతమైన అన్వేషణ, వ్యాపార సౌలభ్యం, సాంకేతికత ఆధారిత పాలన వంటివి దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన మైనింగ్ గమ్యస్థానాల్లో ఒకటిగా నిలిపాయని ఆయన పేర్కొన్నారు. ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, సమర్థమైన సరుకు రవాణా వ్యవస్థలకు సంబంధించిన ప్రపంచ సవాళ్లను శ్రీ కిషన్ రెడ్డి ప్రస్తావించారు. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న మైనింగ్ వ్యవస్థను నిర్మించడానికి విధాన సంస్కరణలు, సాంకేతిక పురోగతి, విలువ జోడింపు, సుస్థిరత, అంతర్జాతీయ సహకారాన్ని మిళితం చేసే సమీకృత విధానాన్ని భారత్ అనుసరిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ప్రపంచ భాగస్వామ్యాలను బలోపేతం చేస్తుందనీ, భారత ఖనిజ సంపదను, సాంకేతిక సామర్థ్యాలను ప్రదర్శిస్తుందని, స్వయం-సమృద్ధ, వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడానికి దోహదపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండియా మైనింగ్ వీక్-2026లో సాంకేతిక ఆవిష్కర్తలు, పరిశోధకులు, పరిశ్రమల ప్రముఖులు, ఇతర భాగస్వాములందరూ భాగం కావాలని కేంద్ర మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బొగ్గు ఎక్స్‌చేంజీల రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ పోర్టల్ అప్లికేషన్‌ను... కీలక, వ్యూహాత్మక ఖనిజ బ్లాక్‌ల వేలం ఎనిమిదో విడతనూ కేంద్ర మంత్రి ప్రారంభించారు.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దుబే మాట్లాడుతూ, భారత మైనింగ్ రంగం ఆర్థిక వృద్ధి, ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం కీలకమైన చోదక శక్తిగా ఆవిర్భవిస్తోందని అన్నారు. పారదర్శక పాలన, బాధ్యతాయుతమైన మైనింగ్ పద్ధతులు, సాంకేతిక పురోగతిపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారించడం ఈ రంగం అంతటా కొత్త అవకాశాలను సృష్టిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, సాంకేతికత ప్రదాతల మధ్య సహకారం ప్రాముఖ్యతనూ ఆయన వివరించారు. సురక్షితమైన, సుస్థిరమైన, ప్రపంచంతో పోటీపడగల మైనింగ్ వ్యవస్థ అభివృద్ధిని వేగవంతం చేయడానికి, ఆలోచనలను పంచుకోవడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఇండియా మైనింగ్ వీక్-2026 ఒక ముఖ్యమైన వేదికగా ఉపయోగపడుతుందని శ్రీ దుబే తెలిపారు.
బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ మాట్లాడుతూ మైనింగ్ రంగంలో భారత్ సాధించిన అద్భుతమైన పరివర్తనను ప్రదర్శించడానికి... ప్రపంచ పెట్టుబడిదారులు, సాంకేతికత ప్రదాతలు, పారిశ్రామిక భాగస్వాములకు ఇది అందించే అపారమైన అవకాశాలను తెలియజేయడానికి ఇండియా మైనింగ్ వీక్ ఒక విశిష్ట వేదికను అందిస్తుందని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చైతన్యవంతమైన నాయకత్వంలో... భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని శ్రీ విక్రమ్ దేవ్ దత్ పేర్కొన్నారు. దేశం 'వికసిత్ భారత్-2047' దార్శనికత దిశగా స్థిరంగా పురోగమిస్తున్న తరుణంలో... దేశ అభివృద్ధి ఆకాంక్షల కోసం సురక్షితమైన, సరసమైన, విశ్వసనీయమైన ఇంధనం అవసరమన్నారు. భారత ఆర్థిక సామర్థ్యం, పారిశ్రామిక సామర్థ్యం, ఇంధన భద్రతకు బొగ్గు, మైనింగ్ రంగం ఒక వ్యూహాత్మక ఆధారంగా పని చేస్తుందని ఆయన తెలిపారు.
గత దశాబ్ద కాలంలో, బొగ్గు మంత్రిత్వ శాఖ అత్యంత సమగ్రమైన నిర్మాణాత్మక సంస్కరణల ప్రయాణాన్ని చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ రంగాన్ని పారదర్శకమైన, పోటీతత్వం తో కూడిన, సాంకేతికత ఆధారితమైన, పెట్టుబడిదారులకు అనుకూలమైన వ్యవస్థగా మార్చిందని శ్రీ విక్రమ్ దేవ్ దత్ స్పష్టం చేశారు. ఫలితంగా, భారత్ వరుసగా రెండు సంవత్సరాలు ఒక బిలియన్ టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తిని సాధించడంతో పాటు, ఒక బిలియన్ టన్నుల బొగ్గు సరఫరానూ అధిగమించిందని తెలిపారు. తద్వారా దేశ ఇంధన భద్రత, పారిశ్రామిక ఉత్పాదకత, ఆర్థిక సామర్థ్యం గణనీయంగా బలపడ్డాయని శ్రీ విక్రమ్ దేవ్ దత్ పేర్కొన్నారు.
భారత వృద్ధి పథానికి బొగ్గు అనివార్యమని పునరుద్ఘాటిస్తూ... బొగ్గు రంగాన్ని బలోపేతం చేసి, దానిని తదుపరి స్థాయికి తీసుకెళ్లడం కేవలం ఆర్థిక అవసరం మాత్రమే కాదని, అది ఒక జాతీయ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. వాణిజ్య బొగ్గు తవ్వకాన్ని ఒక విజయవంతమైన సంస్కరణగా ఆయన అభివర్ణించారు. ఇది విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించిందని, కొత్త పెట్టుబడులను ఆకర్షించిందని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడానికి వీలు కల్పించిందని, ఈ రంగం అంతటా ప్రపంచస్థాయి అత్యుత్తమ పద్ధతులను ప్రోత్సహించిందని శ్రీ విక్రమ్ దేవ్ దత్ వివరించారు.
ఇండియా మైనింగ్ వీక్‌ను ప్రస్తావిస్తూ... దేశం సంస్కరణలను వేగవంతం చేస్తూ, సుస్థిర వృద్ధి కోసం కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్న తరుణంలో, భారత మైనింగ్ రంగానికి ఈ కార్యక్రమం అత్యంత కీలకమైనదని శ్రీ దత్ అన్నారు. పెట్టుబడి నిర్ణయాలను వేగవంతం చేయడం, ప్రాజెక్టుల అమలును సులభతరం చేయడం, నియంత్రణ ప్రక్రియలను మరింత పారదర్శకంగా, అంచనా వేయదగినవిగా, వినియోగదారులకు అనుకూలమైనవిగా మార్చడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారత ఇంధన పరివర్తన, అధునాతన తయారీ సామర్థ్యాలు, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని సాధించడంలో కీలక ఖనిజాల వ్యూహాత్మక ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రగతిశీల విధాన సంస్కరణలు, వేగవంతమైన అన్వేషణ ద్వారా పారదర్శకమైన, పోటీతత్వంతో కూడిన, పెట్టుబడిదారులకు అనుకూలమైన మైనింగ్ వ్యవస్థను సృష్టించడంపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని ఆయన స్పష్టం చేశారు. కీలక, వ్యూహాత్మక ఖనిజాల బ్లాకుల వేలం 8వ విడతను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం దేశీయంగా కీలక ఖనిజాల లభ్యతను మరింత బలోపేతం చేస్తుందనీ, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని, పెట్టుబడులను ఆకర్షిస్తుందని, భారత సమర్థమైన ఖనిజ వాణిజ్య కార్యకలాపాలను మరింత పటిష్టం చేస్తుందని శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. భారత మైనింగ్ సంస్కరణలు, వనరుల సామర్థ్యం, అభివృద్ధి చెందుతున్న అవకాశాలను ప్రదర్శించడానికి ఇండియా మైనింగ్ వీక్-2026 ప్రపంచస్థాయి వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ రంగంలో అంతర్జాతీయ సహకారం, ఆవిష్కరణలు, పెట్టుబడులను ఇది ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు.
బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రూపిందర్ బ్రార్ మాట్లాడుతూ, ఇండియా మైనింగ్ వీక్-2026లో పాల్గొనాలని దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులను స్వాగతించారు. ప్రపంచ భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత మైనింగ్ రంగ విశిష్టతను ప్రదర్శించడానికి ఈ సదస్సును ఒక ముఖ్యమైన వేదికగా ఆమె అభివర్ణించారు. పారదర్శకత, వ్యాపార సౌలభ్యం, సాంకేతిక పురోగతి, సుస్థిర మైనింగ్ పద్ధతులను ప్రోత్సహించడానికి బొగ్గు రంగంలో చేపట్టిన పరివర్తనాత్మక సంస్కరణలను ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమం అర్థవంతమైన చర్చలను సులభతరం చేస్తుందని... పెట్టుబడులు, సాంకేతిక సహకారాన్ని ప్రోత్సహిస్తుందని... బాధ్యతాయుతమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న మైనింగ్ కోసం దేశాన్ని ఒక ప్రాధాన్య గమ్యస్థానంగా మరింత బలోపేతం చేస్తుందని శ్రీమతి రూపిందర్ బ్రార్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇండియా మైనింగ్ వీక్-2026... 25,000 మందికి పైగా పరిశ్రమ నిపుణులు, నిర్ణయాధికారులను... 500 మందికి పైగా ప్రదర్శనకారులు, సాంకేతికత ప్రదాతలను... 200 మందికి పైగా ప్రముఖ వక్తలు, పరిశ్రమ నిపుణులను... 100కి పైగా సమావేశాల సెషన్‌లు, సాంకేతిక ప్రదర్శనలను... 50కి పైగా దేశాల భాగస్వామ్యాన్ని... 1,000 మందికి పైగా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులను... 300కి పైగా మైనింగ్, ఖనిజ కంపెనీలను... ప్రత్యేక బీ2బీ సమావేశాలు, నెట్‌వర్కింగ్ వేదికలను... సాంకేతిక ప్రదర్శనలు, ఉత్పత్తి ఆవిష్కరణలను... కీలక ఖనిజాలు, బొగ్గు, లోహాలు, మైనింగ్ ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుందని అంచనా.
మౌలిక సదుపాయాలు, తయారీ రంగం, ఇంధన భద్రత, కీలక ఖనిజాల విషయంలో భారత్ తన పెట్టుబడులను వేగవంతం చేస్తున్న తరుణంలో... దేశ దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి మద్దతునివ్వడంలో మైనింగ్ రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రపంచ స్థాయి మైనింగ్, వనరుల అభివృద్ధి కేంద్రంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో విజ్ఞానాన్ని పంచుకోవడం, పెట్టుబడులపై చర్చలు, సాంకేతికత ప్రదర్శన, వ్యూహాత్మక భాగస్వామ్యాల కోసం 'ఇండియా మైనింగ్ వీక్-2026' ఒక సమగ్ర వేదికను అందిస్తుంది.
ఉన్నత స్థాయి సమావేశం, అంతర్జాతీయ ప్రదర్శన, సాంకేతికత సమావేశాలు, నాయకత్వ స్థాయి చర్చలు, ప్రత్యేక నెట్‌వర్కింగ్ అవకాశాలు ఈ సదస్సులో భాగంగా ఉంటాయి. ఖనిజ భద్రత, అన్వేషణ, డిజిటలైజేషన్, ఆటోమేషన్, గని భద్రత, సుస్థిరత, కీలక ఖనిజాలు, వనరుల సామర్థ్యం, ఆవిష్కరణలు, మారుతున్న ప్రపంచ పరిణామాల నేపథ్యంలో మైనింగ్ భవిష్యత్తు వంటి కీలక అంశాలపై చర్చలు కేంద్రీకృతమవుతాయి.
మైనింగ్ పరికరాలు, సాంకేతికతలు, ఆటోమేషన్ సొల్యూషన్స్, భద్రతా వ్యవస్థలు, ఖనిజాలను శుద్ధి చేయడం, సుస్థిరతా కార్యక్రమాలు, వనరుల అబివృద్ధి ఆవిష్కరణల్లో తాజా పురోగతిని ఈ ప్రదర్శన ప్రదర్శిస్తుంది. ప్రముఖ మైనింగ్ కంపెనీలు, పరికరాల తయారీదారులు, సాంకేతికత ప్రదాతలు, ప్రభుత్వ ఏజెన్సీలను ఒకచోట చేర్చడం ద్వారా ఈ ప్రదర్శన... వ్యాపార నెట్‌వర్కింగ్, ఉత్పత్తి ఆవిష్కరణలు, సాంకేతిక ప్రదర్శనలు, వ్యూహాత్మక సహకారాలకు అవకాశాలను అందిస్తుంది.
విధాన రూపకర్తలు, ప్రభుత్వ అధికారులు, సీఈఓలు, మైనింగ్ పరిశ్రమ నాయకులు, పెట్టుబడిదారులు, సాంకేతిక ఆవిష్కర్తలు, పరిశోధకులు, సుస్థిరత నిపుణులు, అంతర్జాతీయ మేధావులతో కూడిన ప్రముఖుల బృందం ఇండియా మైనింగ్ వీక్-2026లో పాల్గొననుంది. ప్రపంచంలోని ప్రముఖ మైనింగ్ కంపెనీలు, అంతర్జాతీయ మైనింగ్ సంఘాలు, పరికరాల తయారీదారులు, సాంకేతికత సంస్థలు, కన్సల్టింగ్ సంస్థల నుంచి వచ్చిన విశిష్ట వక్తలు ప్రపంచ అత్యుత్తమ పద్ధతులు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, పెట్టుబడి పోకడలు, మైనింగ్ పరిశ్రమ భవిష్యత్ దిశ గురించి ప్రసంగిస్తారు.
ఇండియా మైనింగ్ వీక్-2026 సన్నాహక కార్యక్రమాల ఈ ప్రారంభ సమావేశం మొదటి అధికారిక మైలురాయిగా నిలుస్తుంది. గనుల రంగ ప్రముఖులు, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులు, సాంకేతిక ఆవిష్కర్తలు, అంతర్జాతీయ భాగస్వాములతో దేశంలోనే అత్యంత ముఖ్యమైన సమావేశంగా భావిస్తున్న ఈ సదస్సు కోసం చక్కటి వేదికను ఇది సిద్ధం చేస్తుంది.
ఇండియా మైనింగ్ వీక్-2026 గురించి మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి:
https://indiaminingweek.org/mining/index.html
(रिलीज़ आईडी: 2285214)
आगंतुक पटल : 14