ఆయుష్
azadi ka amrit mahotsav

‘సౌశ్రుతం-2026’కు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము శ్రీకారం


నిదర్శనాధారిత ఆయుర్వేదం బలోపేతం దిశగా సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానంతో అనుసంధానించాలని పిలుపు

‘ఏఐఐఏ’లో కృత్రిమ మేధ ఆధారిత 3 టెస్లా ‘ఎంఆర్ఐ’ కేంద్రానికి ప్రారంభోత్సవం.. మహిళా ఆయుర్వేద పట్టభద్రులపై ‘ఎన్‌సీఐఎస్‌ఎం’ అధ్యయనం ఆవిష్కరణకు హాజరు

“ఆయుర్వేదం భవిష్యత్తు కోసం జీవవైవిధ్య పరిరక్షణ... మహిళా నిపుణులకు సాధికారత అత్యావశ్యకమని స్పష్టీకరణ
జ్ఞాన సంప్రదాయమే భారత నాగరికతకు బలం... ఆయుర్వేదం దీనికి దోహదకారులలో ఒకటి: ఢిల్లీ లెఫ్టినెంట్
గవర్నర్ తరణ్‌జిత్ సింగ్ సంధు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన ఆయుర్వేదం మళ్లీ అంతర్జాతీయ గుర్తింపు పొందింది: కేంద్ర మంత్రి ప్రతాపరావు జాదవ్

నిదర్శనాధారిత ఆయుర్వేద శస్త్రచికిత్స శాస్త్రాల ప్రాచుర్యం దిశగా ‘ఏఐఐఏ’లో 9 దేశాల నిపుణుల సమావేశం

प्रविष्टि तिथि: 15 JUL 2026 6:30PM by PIB Hyderabad

   రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఇవాళ న్యూఢిల్లీలోని ‘ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద’ (ఏఐఐఏ) ప్రాంగణంలో ‘సౌశ్రుతం-2026’ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు. ఆయుర్వేద శస్త్రచికిత్సకు ఆద్యుడైన సుశ్రుతుని జయంతి సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన ఆయుర్వేద శస్త్రచికిత్స శాస్త్రాలపై ‘ఏఐఐఏ’ ఈ మూడు రోజుల సదస్సును నిర్వహిస్తోంది. దేశవిదేశాల నుంచి ప్రముఖ శస్త్రవైద్యులు, పరిశోధకులు, విద్యావేత్తలు, విధాన రూపకర్తలు ఇందులో పాల్గొంటున్నారు.

ఈ సదస్సుకు శ్రీకారం చుట్టిన తర్వాత ‘ఏఐఐఏ’ ప్రాంగణంలో అత్యాధునిక ఏఐ ఆధారిత 3 టెస్లా హై-ఫీల్డ్ ఎంఆర్‌ఐ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. అలాగే, ‘ఆయుర్వేద మహిళా గ్రాడ్యుయేట్ల వృత్తి జీవన మూల్యాంకనం: పరిశీలనాత్మక అన్వేషణాధ్యయనం’ శీర్షికన నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (ఎన్‌సీఐఎస్‌ఎం) ఆవిష్కరణ కార్యక్రమంలోనూ ఆమె పాల్గొన్నారు.

అనంతరం సభనుద్దేశించి ప్రసంగిస్తూ- ప్రపంచంలో నేటి శాస్త్రీయ, క్రమబద్ధ శస్త్రచికిత్స పద్ధతులకు ఆచార్య సుశ్రుతుని ప్రయోగాత్మక కృషి పునాది వేసిందని రాష్ట్రపతి గుర్తుచేశారు. మానవాళి ఆరోగ్యంపై ఆయుర్వేద సంపూర్ణ దృక్పథానికి ఆధునిక ఆరోగ్య సంరక్షణ రంగంలో నేటికీ ఔచిత్యం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఆయుర్వేదం సుస్థిర పురోగమనం కోసం జీవవైవిధ్య పరిరక్షణ అత్యావశ్యకమని స్పష్టం చేశారు. శాస్త్రీయ ధ్రువీకరణతో సంప్రదాయ జ్ఞానాన్ని బలోపేతం చేయడంతోపాటు ఔషధ మొక్కల లభ్యతకు భరోసా ఇవ్వాల్సిన కర్తవ్యాన్ని రాష్ట్రపతి విశదీకరించారు.

ఆయుర్వేద రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని ఆమె పిలుపునిచ్చారు. దీర్ఘకాలిక వృత్తిని నిర్దేశించుకోవడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఆయుర్వేదాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహిస్తున్న ఆయుష్ మంత్రిత్వ శాఖను రాష్ట్రపతి ప్రశంసించారు. సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతలు, రోగ నిర్ధారణ పద్ధతులు, శాస్త్రీయ పరిశోధనలతో సంధానించడం వల్ల ఈ వ్యవస్థ పరిధి, విశ్వసనీయత విస్తరిస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ‘సౌశ్రుతం-2026’ వంటి కార్యక్రమాలు నిదర్శనాధారిత వైద్య విధానాన్ని మరింత బలోపేతం చేస్తూ ఆయుర్వేదానికి అంతర్జాతీయ ఆమోదాన్ని ఇనుమడింపజేస్తాయని ఆశాభావం వెలిబుచ్చారు.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ తరణ్‌జిత్ సింగ్ సంధు మాట్లాడుతూ- సుసంపన్న జ్ఞాన సంప్రదాయాలే భారత నాగరికతకు గొప్ప బలమని, దాని శాశ్వతత్వ దోహదకారులలో ఆయుర్వేదం ఒకటని పేర్కొన్నారు. సమకాలీన వైద్యంతో పాటు నివారణ, సంపూర్ణ, జీవనశైలి ఆధారిత విధానాల విలువను ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు నేడు అధికంగా గుర్తిస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయుర్వేదం విశ్వసనీయత సహా ప్రపంచవ్యాప్తంగా దానికి ఆమోదం పెంచే దిశగా శాస్త్రీయ పరిశోధన, ఆధారాల సేకరణ, అంతర్జాతీయ సహకార బలోపేతం అవసరాన్ని స్పష్టం చేశారు. నాణ్యమైన విద్య, పరిశోధన, ఆవిష్కరణల ద్వారా సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానంతో అనుసంధానించడంలో ‘ఏఐఐఏ’ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

కేంద్ర ఆయుష్ శాఖ, (స్వతంత్ర బాధ్యత) ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖల సహాయ మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ మాట్లాడుతూ- ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆయుర్వేదం అపాధారణ రీతిలో అంతర్జాతీయ గుర్తింపును, నవ్యోత్తేజాన్ని పొందిందని చెప్పారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘సౌశ్రుతం-2026’ ద్వారా అంతర్జాతీయ సహకారం పెంపొందడంతోపాటు ఆయుర్వేద శస్త్రచికిత్సలో నైపుణ్య వృద్ధికి కీలక వేదికగా నిలుస్తుందన్నారు. అలాగే, ‘ఎసీఐఎస్‌ఎం’ అధ్యయన నివేదికను ప్రస్తావిస్తూ- భవిష్యత్తు  పురోగతిలో మహిళా ఆయుర్వేద గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. నాయకత్వం, పరిశోధన, క్లినికల్ ప్రాక్టీస్‌ తదితరాల్లో వారి భాగస్వామ్యం పెంచే విధానపరమైన కార్యక్రమాలు, సంస్థాగత మద్దతు అవసరాన్ని స్పష్టం చేశారు. దేశ పురోగమనానికి, ప్రపంచ ఆరోగ్య సంరక్షణకు దోహదం చేసేలా యువ ఆయుర్వేద నిపుణులకు సాధికారత కల్పించాల్సిన ఆవశ్యకతను కూడా ఉద్ఘాటించారు.

‘ఏఐఐఏ’ డైరెక్టర్ ప్రొఫెసర్ (విడి) పి.కె.ప్రజాపతి విశి్ష్ట అతిథులను స్వాగతిస్తూ- ప్రాచీన ఆయుర్వేద శస్త్రచికిత్స పరిజ్ఞానాన్ని సమకాలీన శాస్త్రీయ ప్రగతితో సంధానించడంలో ‘సౌశ్రుతం-2026’ ఓ కీలక మలుపని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయులలో విద్యా రంగ సహకారాన్ని ఈ సదస్సు బలోపేతం చేస్తుందని, నాణ్యమైన పరిశోధనలను ప్రోత్సహించడం సహా ఆయుర్వేద శస్త్రచికిత్సలో వైద్య నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుందని ఆయన అన్నారు.

ఇక ‘ఏఐఐఏ’లో నేడు ప్రారంభించిన ఏఐ ఆధారిత 3 టెస్లా హై-ఫీల్డ్ ఎంఆర్ఐ కేంద్రం రోగ నిర్ధారణ సేవలను గణనీయంగా బలోపేతం చేస్తుంది. అలాగే, ఆయుర్వేదం-ఆధునిక వైద్యం మధ్య సమగ్ర పరిశోధన సౌలభ్యం కల్పిస్తూ రోగులకు చౌక, నాణ్యమైన సేవలను అందిస్తుంది.

సౌశ్రుతం-2026 విశిష్టత

ఈ మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో దేశం నలుమూలల నుంచే కాకుండా థాయిలాండ్, ఇజ్రాయెల్, ఆస్ట్రియా, యునైటెడ్ కింగ్‌డమ్, శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్, గ్రీస్ దేశాల నుంచి కూడా నిపుణులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా శాస్త్రవిజ్ఞాన కార్యక్రమాల కింద శల్య తంత్రం, క్షార సూత్రం, అగ్నికర్మ, పునర్నిర్మాణ శస్త్రచికిత్స, సమగ్ర కేన్సర్‌ చికిత్స, ఇతర ఆధునిక పరిశోధన రంగాలపై కీలక ఉపన్యాసాలు, బృంద గోష్ఠులు, కార్యశాలలు, సాంకేతిక సమావేశాలను నిర్వహిస్తారు. నిదర్శానాధారిత అంశాలపై చర్చకు ప్రోత్సాహం, ఆవిష్కరణల పెంపు, ఆయుర్వేద శస్త్రచికిత్స శాస్త్రాల అభివృద్ధి కోసం అంతర్జాతీయ సహకార బలోపేతం వంటివి ‘సౌశ్రుతం-2026’ నిర్దేశించుకున్న లక్ష్యాలు.

 

***


(रिलीज़ आईडी: 2285210) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Tamil