చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
హైదరాబాద్ వేదికగా 12వ కార్మిక ఉపాధి మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న భారత్
సామాజిక రక్షణ, శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం, నైపుణ్యాలు, కార్మికుల సంక్షేమం కోసం డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలపై సహకారాన్ని పెంపొందించుకోనున్న బ్రిక్స్ కార్మిక, ఉపాధి మంత్రులు
प्रविष्टि तिथि:
14 JUL 2026 6:55PM by PIB Hyderabad
హైదరాబాద్ వేదికగా జూలై 15–16 తేదీలలో2026 బ్రిక్స్ కార్మిక, ఉపాధి మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. 2026లో భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన జరగనున్న కీలక మంత్రిత్వ స్థాయి కార్యక్రమాలలో ఇది ఒకటిగా నిలవనుంది.
భారతదేశ అధ్యక్షతన 'స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం' (బిల్డింగ్ ఫర్ రెసిలియెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ- బ్రిక్స్) ఇతివృత్తంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర కార్మిక- ఉపాధి శాఖ మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయా ఈ బ్రిక్స్ కార్మిక- ఉపాధి మంత్రుల సమావేశానికి (ఎల్ఈఎంఎం) అధ్యక్షత వహిస్తారు.
2026 జూలై 13-14 తేదీలలో హైదరాబాద్‌లో జరుగుతోన్న మూడో బ్రిక్స్ ఎంప్లాయ్‌మెంట్ వర్కింగ్ గ్రూప్ (ఈడబ్ల్యూజీ) సమావేశం ముగిసిన అనంతరం ఈ ఎల్ఈఎంఎం సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ ఈడబ్ల్యూజీ సమావేశంలో సభ్య దేశాలు కింది నాలుగు ప్రాధాన్యత రంగాల్లో తమ అత్యుత్తమ విధానాలను, జాతీయ అనుభవాలను పంచుకున్నాయి:
-
సామాజిక భద్రతను పెంపొందించడం, శ్రామిక మార్కెట్లను క్రమబద్ధీకరించడం
-
శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని, వారి సమ్మిళితత్వాన్ని పెంపొందించడం
-
ఉపాధి యోగ్యత, నైపుణ్యాల మ్యాపింగ్, అభివృద్ధిపై పరస్పర సహకారం
-
గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులతో సహా శ్రామికులందరి ప్రయోజనం కోసం డిజిటల్ సాంకేతికతలను ఉపయోగించుకోవడం
సామాజిక భద్రతా సంస్కరణలు, క్రమబద్ధీకరణ వ్యూహాల నుంచి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ప్లాట్‌ఫామ్-ఆధారిత పనుల కోసం సమ్మిళిత నమూనాల వరకు మంత్రులు ఈ నాలుగు ప్రాధాన్యత రంగాలపై చర్చించనున్నారు. వీటితో పాటు తమ జాతీయ అనుభవాల నుంచి అత్యుత్తమ విధానాలను, వినూత్న పద్ధతులను పరస్పరం పంచుకోనున్నారు.
వర్కింగ్ గ్రూప్ ఒక ముసాయిదా ప్రకటనపై చర్చలను కూడా ముగించింది. దీనిని మంత్రుల పరిశీలన, ఆమోదం కోసం ఎల్ఈఎంఎం సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు.
వేగంగా మారుతున్న ఉపాధి రంగంలో బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ఉమ్మడి శ్రామిక మార్కెట్, ఉపాధి సవాళ్లపై నిరంతర సంప్రదింపులకు ఈ సమావేశం ఒక వేదికను అందిస్తుంది. బ్రిక్స్ దేశాల వ్యాప్తంగా సమ్మిళిత, సుస్థిర, దృఢమైన వృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో సామాజిక రక్షణ, శ్రామిక శక్తి నైపుణ్యాభివృద్ధి, శ్రామిక మార్కెట్ విధానాలను బలోపేతం చేయడంపై ఈ చర్చలు ప్రధానంగా కేంద్రీకృతమవుతాయి.
ఈ చర్చలు ఆచరణాత్మకమైన, ఇతర దేశాలు కూడా అనుకరించదగిన విధాన సాధనాలపై దృష్టి పెట్టనున్నాయి. మారుతున్న ఆర్థిక, సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా బ్రిక్స్ దేశాల్లోని శ్రామిక మార్కెట్లు సమ్మిళితంగా, అనుకూలమైనవిగా, క్రియాశీలంగా మారే మార్గాలను గుర్తించే ఉద్దేశంతో ఇవి ఉన్నాయి.
ఈ హైదరాబాద్ సమావేశం బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని.. కార్మికులు, ఉపాధి, శ్రామికుల సంక్షేమంపై ఆచరణాత్మక, భవిష్యత్-ఆధారిత ఫలితాలకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. నిరంతర సంప్రదింపులు, విజ్ఞాన భాగస్వామ్యం ద్వారా గౌరవప్రదమైన ఉపాధికి మద్దతు ఇచ్చేలా, సామాజిక రక్షణను విస్తృతం చేసేలా, నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేలా, భవిష్యత్తు పని రంగంలో ఎదురయ్యే అవకాశాలు- సవాళ్లకు శ్రామిక శక్తిని సంపూర్ణంగా సిద్ధం చేసేలా విధానాలను ముందుకు తీసుకెళ్లాలని బ్రిక్స్ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
***
(रिलीज़ आईडी: 2284663)
आगंतुक पटल : 5