చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశ శ్రమశక్తికి ‘సేవ’.. గౌరవమే మా పాలనలో ప్రధానాంశాలు: డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవ్య

దేశంలో ‘ఈఎస్‌ఐసీ’ లబ్ధిదారుల సంఖ్య రెట్టింపు పెరుగుదలతో నేడు 15 కోట్లకు చేరింది

· తెలంగాణలోని సనత్‌నగర్ ‘ఈఎస్‌ఐసీ’ ఆసుపత్రిలో కొత్త ఓపీడీ ప్రాంగణాన్ని ప్రారంభించిన డాక్టర్ మాండవ్య

· దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు సేవలు లభిస్తాయని వెల్లడి

प्रविष्टि तिथि: 14 JUL 2026 5:42PM by PIB Hyderabad

కేంద్ర కార్మిక-ఉపాధి, యువజన వ్యవహారాలు-క్రీడా శాఖల మంత్రి డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవ్య ఈ రోజు తెలంగాణలోని సనత్‌నగర్‌లోగల ‘ఈఎస్‌ఐసీ’ ఆసుపత్రి ప్రాంగణంలో రూ.211.13 కోట్లతో నిర్మించిన అవుట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఓపీడీ) భవనాన్ని ప్రారంభించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గల 12.3 లక్షల మందికి పైగా బీమా చందాదారులు, ఇతర లబ్ధిదారులకు విస్తృత సేవలు లభిస్తాయి.

 

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి ప్రసంగిస్తూ- దేశ పురోగమనంలో ‘శ్రమశక్తి’, ‘యువశక్తి’ రెండు కీలక స్తంభాలని డాక్టర్ మాండవ్య గుర్తుచేశారు. నేటి ఆధునిక యుగంలో ప్రగతి దిశగా సాంకేతిక పరిజ్ఞానాలు, కృత్రిమ మేధ ప్రధాన కారకాలైనప్పటికీ, ‘శ్రమశక్తి’ కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదన్నారు. ఈ కర్తవ్య నిర్వహణలో కార్మికులకు మరింత సమర్థంగా తోడ్పడే విధంగా వారికి గౌరవం, సామాజిక భద్రత కల్పన అత్యావశ్యకమని ఆయన స్పష్టం చేశారు. ఆ మేరకు దేశ శ్రమశక్తికి సేవ, గౌరవమే శ్రీ మోదీ ప్రభుత్వ పాలనలో ప్రధానాంశాలుగా ఉన్నాయని ప్రకటించారు.

 

సామాజిక భద్రత బలోపేతం దిశగా ప్రభుత్వ కృషిని వివరిస్తూ- దశాబ్దం కిందట ఈఎస్‌ఐసీ లబ్ధిదారుల సంఖ్య సుమారు 7.5 కోట్లు కాగా, నేడు రెట్టింపు పెరుగుదలతో 15 కోట్లు దాటిందని డాక్టర్ మాండవ్య తెలిపారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అంచనాలను ప్రస్తావిస్తూ- భారత్‌లో సామాజిక భద్రత పరిధి 2014లో 19 శాతం కాగా, ఇప్పుడు 64 శాతం దాటిందని పేర్కొన్నారు. తద్వారా 94 కోట్ల మంది ప్రజలు దీని పరిధిలోకి వచ్చారని ఆయన వివరించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వాన అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రస్తావిస్తూ- 80 కోట్ల మందికి పైగా పేదలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ సహా అర్హతగల పేద కుటుంబాల కోసం 4 కోట్లకు పైగా పక్కా ఇళ్లు నిర్మించినట్లు గుర్తుచేశారు. భారత కార్మికవర్గ జీవన ప్రమాణాల మెరుగుదలకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని తెలిపారు.

దేశంలో కార్మిక సంస్కరణల గురించి మాట్లాడుతూ- మునుపటి 29 చట్టాల స్థానంలో ప్రభుత్వం 4 కొత్త కార్మిక చట్టాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. దీనివల్ల సరళ, కార్మిక-ప్రాధాన్య కార్మిక విధానానికి బాటలు పడ్డాయని కేంద్ర మంత్రి తెలిపారు. నియామక పత్రాల జారీని తప్పనిసరి చేయడమే కాకుండా 40 ఏళ్లు పైబడిన కార్మికులకు ఏటా ఉచిత ఆరోగ్య పరీక్షలు, స్త్రీ-పురుషులకు సమాన వేతనం, ఏడాది సేవలు పూర్తిచేసిన వారికీ గ్రాట్యుటీ పొందే అర్హత వంటి అంశాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. పరిశ్రమలు-కార్మిక శక్తి మధ్య సామరస్యపూర్వక సంబంధాల ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు. వికసిత, సుసంపన్న భారత్‌ రూపకల్పన దిశగా యాజమాన్యాలు-ఉద్యోగులు సమష్టిగా కృషి చేయాలని డాక్టర్ మాండవ్య పిలుపునిచ్చారు. ఆసుపత్రిలో కొత్త ఓపీడీ భవన ప్రారంభోత్సవాన్ని ప్రస్తావిస్తూ- దీని ద్వారా కార్మికుల ఆరోగ్య సంరక్షణ సేవలు బలోపేతం కాగలవన్నారు. అలాగే, వారి సంక్షేమానికి ప్రభుత్వం సదా కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించారు.

 

ఈ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రగతిలో కార్మికశక్తి పాత్రకు గుర్తింపుగా సనత్‌నగర్‌లోని ‘ఈఎస్‌ఐసీ’ ఆసుపత్రి ఓపీడీ భవన నిర్మాణంలో శ్రమించిన నిర్మాణ కార్మికులను కేంద్ర మంత్రి సత్కరించారు. అంతేకాకుండా కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతర నిబద్ధత చూపుతున్నదని పేర్కొంటూ- ‘ఈఎస్‌ఐ’ లబ్ధిదారులకు నగదు ప్రయోజనాలను కూడా పంపిణీ చేశారు.

 

సనత్‌నగర్‌ ‘ఈఎస్‌ఐసీ’ వైద్య కళాశాల-ఆసుపత్రి ప్రాంగణంలో కొత్త ఓపీడీ భవన నిర్మాణాన్ని ఓ కీలక ఘట్టంగా కేంద్ర మంత్రి అభివర్ణించారు. ఈ ఆసుపత్రి ద్వారా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలు సహా రాష్ట్రంలోని 12,30,183 మంది బీమా చందాదారులకు, లబ్ధిదారులకు ఆధునిక-సమగ్ర అవుట్‌పేషెంట్ సేవలు అందుతాయని పేర్కొన్నారు. ఇది కళాశాల-ఆసుపత్రి కూడా కావడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా గల చందాదారులకూ ఆరోగ్య సంరక్షణ సేవలు లభిస్తాయన్నారు. ఈ ప్రాంగణంలోని 43,611.04 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమైన కొత్త సౌధంలో జనరల్ మెడిసిన్, ఈఎన్‌టీ, డెంటిస్ట్రీ, ప్రసూతి-గైనకాలజీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, సైకియాట్రీ, డెర్మటాలజీ, పల్మనాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, ఆయుష్ విభాగాల ‘ఓపీడీ’లు పనిచేస్తాయన్నారు. వీటితోపాటు ఫిజికల్ మెడిసిన్ అండ్‌ రిహాబిలిటేషన్, రేడియాలజీ, యోగా విభాగాలు సహా 3 వార్డులలో 60వంతున 180 సాధారణ పడకలు సహా 25 ఐసీయూ, 20 ఎన్‌ఐసీయూ పడకలు, ఐసీయూ/ఎన్‌ఐసీయూ యూనిట్లు, మందుల దుకాణం, ఒక క్లినికల్ లెక్చర్ థియేటర్ కూడా ఉన్నాయని తెలిపారు.

 

దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల విస్తరణ, కార్మిక శక్తికి సామాజిక భద్రత బలోపేతం దిశగా ఓ కీలక మలుపును ఈ ప్రారంభోత్సవాలు సూచిస్తాయి. కార్మిక శక్తికి గౌరవంతోపాటు వారి ఆరోగ్యం-సంక్షేమాన్ని దేశ పురోగమనంలో ప్రధానాంశాలుగా పరిగణించడం ద్వారా ‘శ్రమయేవ జయతే’ దార్శనికతను ప్రభుత్వం సాకారం చేస్తోంది.

***


(रिलीज़ आईडी: 2284610) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Gujarati