పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రామ పంచాయతీలలో నీటి బడ్జెట్ నిర్వహణపై జాతీయ మాస్టర్ ట్రైనర్లకు న్యూఢిల్లీలో ప్రారంభమైన శిక్షణ కార్యక్రమం


వాటర్ సెక్యూరిటీ మాన్యువల్ విడుదల; మొదటి దశలో 10 రాష్ట్రాలు, 100 జిల్లాలు, 1,000 గ్రామ పంచాయతీల గుర్తింపు

प्रविष्टि तिथि: 13 JUL 2026 6:03PM by PIB Hyderabad

కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ (ఎంఓపీఆర్) ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల వాటర్ బడ్జెటింగ్, నీటి భద్రతా ప్రణాళికపై మొట్టమొదటి జాతీయ స్థాయి మాస్టర్ ట్రైనర్ల శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. 2026 జూలై 13 నుంచి  16 వరకు నాలుగు రోజుల పాటు న్యూఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమం, దేశవ్యాప్తంగా రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిలలో మాస్టర్ ట్రైనర్ల బృందాన్ని తయారు చేయడానికి ఉద్దేశించిన ఒక సామర్థ్య పెంపు చొరవకు నాంది పలికింది. గ్రామ పంచాయతీలు సాంకేతికంగా పటిష్టమైన, ఆధారాలతో, సమాజ భాగస్వామ్యం తో కూడిన నీటి భద్రతా ప్రణాళికలను   రూపొందించడంలో ఈ ట్రైనర్లు సహాయం అందిస్తారు. తగిన బడ్జెట్ కేటాయింపు ద్వారా నీటి భద్రత ప్రణాళికలను సిద్ధం చేసేలా గ్రామ పంచాయతీల సామర్థ్యాన్ని పెంచడం, తద్వారా జల సమృద్ధి గల గ్రామ పంచాయతీల  దార్శనికతను ముందుకు తీసుకెళ్లడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని  గ్రామ పంచాయతీలు ప్రజా భాగస్వామ్యంతో, శాస్త్రీయ దృక్పథంతో, వాతావరణ మార్పులకు అనుగుణంగా నీటి భద్రత ప్రణాళికలను రూపొందించుకోవడానికి ఒక ఆచరణాత్మక మార్గదర్శినిగా ఉపయోగపడే జల సమృద్ధి పంచాయతీల శిక్షణ మాన్యువల్ ను (వాటర్ సఫిషియంట్ పంచాయతీస్ ట్రైనింగ్ మాన్యువల్ - ఫేజ్ 1, ఫేజ్ 2) కూడా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్ ప్రధానోపన్యాసం చేస్తూ, గ్రామీణ ప్రాంతాల సుస్థిర అభివృద్ధికి నీటి భద్రత అనేది ఒక అత్యంత కీలకమని స్పష్టం చేశారు. స్థానిక నీటి సమస్యలపై గ్రామ పంచాయతీలకు, అక్కడి ప్రజలకు ఇప్పటికే సంపూర్ణ,  ప్రత్యక్ష అవగాహన ఉందని ఆయన అన్నారు.  ఈ అవగాహనను వాటర్ బడ్జెటింగ్ ద్వారా ఒక క్రమబద్ధమైన కార్యాచరణగా మార్చేందుకే ఈ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా, క్షేత్రస్థాయిలో స్థిరమైన, ప్రజా భాగస్వామ్యంతో కూడిన జల నిర్వహణను  బలోపేతం చేయడంలో ఈ చొరవ విజయవంతం అవుతుందనే నమ్మకాన్ని శ్రీ భరద్వాజ్ వ్యక్తపరిచారు. సమాజానికి దీనిపై పూర్తి యాజమాన్య హక్కు ఉండాలని, ప్రజల ఆలోచనా ధోరణిలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

 కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ  అదనపు కార్యదర్శి శ్రీ సుశీల్ కుమార్ లోహాని మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల్లో నీటి సంరక్షణను ఒక భాగం చేయడంలోని ప్రాధాన్యతను వివరించారు. సమర్థవంతమైన నీటి నిర్వహణ గ్రామాల సమగ్ర అభివృద్ధిని వేగవంతం చేసే ఒక ఉత్ప్రేరకంలా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామ పంచాయతీలు నీటి భద్రత ప్రణాళికలను రూపొందించుకోవడంలో సహాయపడటానికి  దేశవ్యాప్తంగా మాస్టర్ ట్రైనర్ల బృందాన్ని తయారు చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. దీర్ఘకాలిక, సుస్థిరమైన జల నిర్వహణను ప్రోత్సహించేందుకు గానూ నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమాన్ని వివిధ దశల్లో అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ జాతీయ స్థాయి మాస్టర్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమం శాస్త్రీయ విధానాలు, సాంకేతిక ఆవిష్కరణలు సమాజ భాగస్వామ్యంతో కూడిన ప్రణాళికల ద్వారా జల నిర్వహణను బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి పెడుతుంది. పరస్పర చర్చలు, ఆచరణాత్మక విధానాలతో రూపొందించిన ఈ శిక్షణ కార్యక్రమం పాల్గొనేవారికి వాటర్ బడ్జెటింగ్, స్థానిక నీటి వనరులు, వాటి అవసరాల అంచనా, తగిన సంరక్షణ చర్యల గుర్తింపు, వాతావరణ మార్పులకు అనుగుణంగా, అందరినీ కలుపుకుపోయేలా ఉండే నీటి భద్రత ప్రణాళికల  తయారీలోనూ ఆచరణాత్మక నైపుణ్యాలను అందిస్తుంది. ఈ ప్రణాళికలను గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలతో అనుసంధానించడం, గ్రామ స్థాయిలో వీటిని అమలు చేయడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించడంపై కూడా ఇది దృష్టి పెడుతుంది. క్షేత్రస్థాయిలో ఈ సామర్థ్య పెంపు కార్యక్రమం క్రమంగా అందరికీ చేరేలా తోడ్పడేందుకు వీలుగా శిక్షణ అనంతర మూల్యాంకనాలు, వివిధ దశల మధ్య అసైన్‌మెంట్‌లను కూడా ఈ శిక్షణ పాఠ్యప్రణాళికలో చేర్చారు. ఈ కార్యక్రమం మొదటి దశను బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మొదలైన 10 రాష్ట్రాల పరిధిలోని 100 జిల్లాలు, 100 బ్లాకులు, 1,000 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకించారు.  మొదటి బ్యాచ్‌లో బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్,  పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. వీరు త్వరలో నిర్వహించే ప్రజల్లోకి వెళ్లే ప్రణాళిక ప్రచారం సమయంలో గ్రామ పంచాయతీలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ఏర్పాటయ్యే రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయి  శిక్షణ కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తారు.

***


(रिलीज़ आईडी: 2284308) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Malayalam