ప్రధాన మంత్రి కార్యాలయం
అధికారిక విందు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
प्रविष्टि तिथि:
11 JUL 2026 12:32PM by PIB Hyderabad
ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్‌కు,
రెండు దేశాలకు చెందిన ప్రతినిధులకు,
నమస్కారం!
కియా ఓరా!
నాకు, నా ప్రతినిధి బృందానికి అందించిన సాదర స్వాగతానికి, విశేష ఆతిథ్యానికి నా మిత్రుడైన ప్రధాని లక్సన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన అందించిన ఆత్మీయ స్వాగతం వల్ల, ఈ రోజు ఆక్లాండ్ శీతాకాలపు చలి ప్రభావం కూడా కాస్త తగ్గినట్టుగా అనిపిస్తోంది. ఈ పర్యటన సందర్భంగా న్యూజిలాండ్ ప్రజల నుంచి నాకు లభించిన ఆప్యాయత, అభిమానం మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
గతేడాది భారత్‌లో ప్రధాని లక్సన్ చేపట్టిన పర్యటన.. మన ద్వైపాక్షిక సంబంధాల్లోని అన్ని అంశాల్లోనూ కొత్త శక్తిని నింపింది. ఆయన నాయకత్వమూ, స్పష్టమైన దార్శనికతా, దృఢమైన అంకితభావమూ.. భారత్, న్యూజిలాండ్ మధ్య ఉన్న స్నేహానికి కొత్త వేగాన్నీ, నూతన దిశనూ అందించాయి. గత నలభై ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. నాకంటే ముందు వచ్చిన వారు నా కోసం ఎన్నో మంచి పనులను వదిలి వెళ్లారు. వాటిని పూర్తి చేసే భాగ్యం నాకు దక్కిందని నేను తరచూ చెబుతూ ఉంటాను. మిత్రులారా, ఇది మన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతోంది.
మిత్రులారా,
ప్రజాస్వామ్య విలువల పట్ల భారతదేశానికీ, న్యూజిలాండ్‌కూ ఉన్న దృఢమైన విశ్వాసమే.. మనం కలిసి ముందుకు సాగడానికి అవసరమైన పునాదిని ఏర్పాటు చేస్తుంది. గడచిన కొన్నేళ్లుగా, మన ద్వైపాక్షిక సంబంధానికి మునుపెన్నడూ లేని వేగాన్ని మనం అందించాం.
మన సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, మరింత విస్తరించడంపై ఈ రోజు జరిగిన సమావేశంలో మేం విస్తృతంగా చర్చించాం. భారత్-న్యూజిలాండ్ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంపొందించేలా చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. ఈ విధానం ద్వారా స్పష్టమైన లక్ష్యాలతో, కచ్చితమైన ఫలితాలతో ప్రతి రంగంలోనూ మనం ముందుకు సాగుతాం.
ఈ ఏడాది రికార్డు సమయంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని మనం కుదుర్చుకున్నాం. ఈ విజయం రెండు దేశాల పరిశ్రమలకూ, రైతులకూ, యువతకూ నూతన అవకాశాలను అందిస్తుంది. వాణిజ్యంతో పాటుగా విశ్వసనీయతకూ, సాంకేతిక పరిజ్ఞానానికీ, ప్రతిభకూ సైతం మేం ఓ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం.
గడచిన మూడేళ్లలో మన ద్వైపాక్షిక వాణిజ్యం 50 శాతానికి పైగా వృద్ధి చెందింది. రాబోయే అయిదేళ్లలో రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి అవసరమైన బలమైన పునాదిని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అందిస్తుందని మేం విశ్వసిస్తున్నాం.
భారత్‌లో 20 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలన్న న్యూజిలాండ్ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఇది భారత దేశ వృద్ధి గాథలో దీర్ఘకాలిక భాగస్వామ్యులుగా మారే అవకాశాన్ని న్యూజిలాండ్ సంస్థలకు అందిస్తుంది.
మిత్రులారా,
మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అర్థవంతంగా మార్చేందుకు గాను రెండు దేశాలకున్న సామర్థ్యాలను ఆచరణాత్మక సహకారంగా మారుస్తున్నాం. ఫిన్‌టెక్ రంగానికి వస్తే న్యూజిలాండ్ చెల్లింపుల వ్యవస్థలతో భారత్ యూపీఐను అనుసంధానించే దిశగా ముందుకు సాగుతున్నాం.
వ్యవసాయ రంగం, పాడి, ఆహార శుద్ధి రంగాల్లో సహకారానికి బలమైన ప్రణాళికను మేం అభివృద్ధి చేశాం. ఇది మన రైతులకు, పాడి రైతులకు లబ్ధి చేకూరుస్తుంది.
న్యూజిలాండ్, భారత్ రెండు దేశాల్లోనూ సంప్రదాయ వైద్యంలో గొప్పవైన, శక్తిమంతమైన పద్ధతులున్నాయి. ఆరోగ్య సేవల రంగంలో మన సహకారంలో సంప్రదాయ ఔషధాల పాత్రను విస్తరించేందుకు కూడా ఈ రోజు మేం అంగీకరించాం.
మన మధ్య ఉన్న దృఢమైన వ్యూహాత్మక విశ్వాసానికి రక్షణ, భద్రత రంగాల్లో విస్తరిస్తున్న మన సహకారమే నిదర్శనం. మన భాగస్వామ్యానికి అవసరమైన బలమైన విధానాన్ని గతేడాది కుదిరిన రక్షణ సహకార ఒప్పందం ఏర్పాటు చేసింది. ఇండో-పసిఫిక్‌లో నౌకావాణిజ్య సహకారానికి సంబంధించిన విధివిధానాలను ఈ రోజు ఆమోదించాం. మన మధ్య సమన్వయాన్నీ, పరస్పర కార్యాచరణనూ.. ద్వైపాక్షిక నావికా విన్యాసాలు, సరకు రవాణాలో తోడ్పాటు, హైడ్రోగ్రఫీ రంగంలో సహకారం మరింత బలోపేతం చేస్తాయి.
మిత్రులారా,
రెండు దేశాల మధ్య ఉన్న సంబంధానికి బలమైన ఆధారం ప్రజాసంబంధాలే. తమ కృషి, ప్రతిభతో న్యూజిలాండ్‌లో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని భారతీయులు సంపాదించుకున్నారు. వారి పట్ల శ్రద్ధ వహిస్తున్నందుకు ప్రధాని లక్సన్‌కూ, న్యూజిలాండ్ ప్రభుత్వానికీ, న్యూజిలాండ్ ప్రజలకూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
కళలు, సంస్కృతి, వారసత్వం, సృజనాత్మక పరిశ్రమల రంగాల్లో రెండు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలను వేగవంతం చేయడానికి సాంస్కృతిక సహకారంలో ఈ రోజు కుదిరిన ఒప్పందం సహకరిస్తుంది. భారతీయ విద్యార్థులు అత్యంత ప్రాధాన్యమిచ్చే దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. భారతదేశంలో క్యాంపస్‌లను ప్రారంభించాల్సిందిగా న్యూజిలాండ్ విశ్వవిద్యాలయాలను మేం ఆహ్వానిస్తున్నాం.
రెండు దేశాల మధ్య క్రీడా సంబంధాల్లో వందేళ్ల ఉత్సవాలను ఈ ఏడాది మనం నిర్వహించుకుంటున్నాం. వందేళ్ల కిందట మేజర్ ధ్యాన్ చంద్ నాయకత్వంలో ఇక్కడికి వచ్చిన హాకీ బృందం చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ మన క్రీడా భాగస్వామ్యానికి ఆ వారసత్వం స్ఫూర్తినిస్తూనే ఉంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రెండు దేశాల్లోనూ అనేక క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. క్రికెట్‌తో పాటు, ఇతర క్రీడల్లోనూ సహకారాన్ని పెంపొందించేందుకు క్రీడల సంయుక్త కార్యాచరణ ప్రణాళిక ద్వారా కృషి చేస్తున్నాం. ఈ దిశగా భువనేశ్వర్‌లో ఇటీవలే న్యూజిలాండ్ రగ్బీ, రగ్బీ ఇండియా మధ్య నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ఆశాజనకమైన ప్రారంభాన్నిచ్చింది.
మిత్రులారా,
అంతర్జాతీయ వేదికలపై కూడా భారతదేశం, న్యూజిలాండ్ విశ్వసనీయ భాగస్వాములుగా, మిత్రులుగా ఉన్నాయి. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితితో సహా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమని మేం విశ్వసిస్తున్నాం.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో కలసి ముందుకు సాగడానికి సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేశాం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, భద్రత కోసం భారత్, న్యూజిలాండ్ మధ్య సహకారం అత్యంత ముఖ్యమైనది.
మిత్రులారా,
మావోరి నూతన సంవత్సరం ‘మటారికి’ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరు ‘మటారికి’ అని పిలిచే నక్షత్ర మండలాన్ని అనాదిగా భారత్‌లో ‘కృత్తికా నక్షత్రం’ అని పిలుస్తున్నాం. ఈ నక్షత్రాలంత ఉజ్వలంగా మన సంబంధాలు ప్రకాశించేలా ఈ ‘మటారికి’ పండగ స్ఫూర్తినిస్తుందని విశ్వసిస్తున్నాను.
ప్రధాని లక్సన్,
మీ స్నేహానికీ, మీ అంకితభావానికీ, న్యూజిలాండ్‌లో నా పర్యటనను చిరస్మరణీయంగా మార్చినందుకూ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రగ్బీ క్రీడలో బృందస్ఫూర్తి, నమ్మకం ఎంత అవసరమో.. మనం కూడా అదే విధమైన పరస్పర విశ్వాసంతో ముందుకు సాగుదాం. మనం ఒకే జట్టులో ఉన్నాం. కాబట్టి సవాళ్లను కలసి ఎదుర్కొందాం.
ధన్యవాదాలు.
సూచన: ఇది ప్రధాని హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం.
(रिलीज़ आईडी: 2283928)
आगंतुक पटल : 13