ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత ఐటీ పరిశ్రమ “ఏఐ యాజ్ ఎ సర్వీస్” దిశగా ముందుకు సాగాలి’


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత కింద భారత ఏఐ, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ వృద్ధిలో హైదరాబాద్ పాత్ర కీలకం: కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్

प्रविष्टि तिथि: 11 JUL 2026 5:53PM by PIB Hyderabad

భారత్ సొంతమైన విశ్వసనీయ ప్రపంచ ఖ్యాతిని, నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను సద్వినియోగం చేసుకుంటూ... భారత ఐటీ పరిశ్రమ సాఫ్ట్‌వేర్ సేవల ఆధారిత నమూనా నుంచి "ఏఐ యాజ్ ఏ సర్వీస్" నమూనాకు మారాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వేలు, సమాచార, ప్రసార శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హెచ్‌వైఎస్ఈఏ) ఆధ్వర్యంలో "వికసిత్ భారత్-2047 నిర్మాణంలో సాంకేతికత పాత్ర" అంశంపై హైదరాబాద్‌ ఇండస్ట్రీ లీడర్ టౌన్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో శ్రీ వైష్ణవ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమం అనంతరం పరిశ్రమ ప్రముఖులతో రౌండ్‌టేబుల్ చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ వైష్ణవ్‌తో పాటు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

 


పరిశ్రమల ప్రముఖులనుద్దేశించి శ్రీ అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వికసిత్ భారత్-2047 దార్శనికతకు అనుగుణంగా కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో తయారీ, అధునాతన మౌలిక సదుపాయాల కల్పన ద్వారా భారత తదుపరి దశ వృద్ధి సాధ్యమవుతోందన్నారు.

ఐటీ పరిశ్రమను కృత్రిమ మేధ మౌలికంగా మార్చేసిందని పేర్కొంటూ... ప్రతీ కొత్త ఏఐ నమూనా కొత్త సామర్థ్యాలను, అవకాశాలను తీసుకువస్తుందన్నారు. పరిశ్రమలను అర్థం చేసుకోవడం, సమస్యలను గుర్తించడం, సమర్థమైన సాంకేతికత ఆధారిత పరిష్కారాలను అందించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంపాదించిన విశ్వాసమే భారత్ అతిపెద్ద బలమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

వ్యూహాత్మక మార్పు ఆవశ్యకతను ప్రధానంగా ప్రస్తావిస్తూ... భారత ఐటీ పరిశ్రమ ఇప్పుడు సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ నమూనాను దాటి, ఏఐని ఒక సేవగా అందించే (ఏఐ యాజ్ ఎ సర్వీస్) నమూనా దిశగా పరిణామం చెందాలని శ్రీ వైష్ణవ్ సూచించారు. పరిశ్రమల, విద్యాసంస్థల మధ్య సన్నిహిత సహకారంతో ఈ పరివర్తనను ముందుకు నడిపించాలని ఆయన కోరారు. ఇటీవలి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ... కృత్రిమ మేధలోని తాజా పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు,  ప్రభుత్వ భాగస్వామ్యంతో నాస్కామ్ ఒక సమగ్ర ఏఐ పాఠ్యప్రణాళికను అభివృద్ధి చేసిందని తెలిపారు. దానిని విద్యా మంత్రిత్వ శాఖ, ఏఐసీటీఈతో పంచుకున్నామని శ్రీ వైష్ణవ్ వివరించారు.



సెమీకండక్టర్ల తయారీ రంగంలో దేశం సాధించిన పురోగతిని వివరిస్తూ, 1960ల నుంచే భారత్ ఒక సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించాలని ఆకాంక్షించిందన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రత్యేక కృషి వల్ల ఆ దార్శనికత ఇప్పుడు వాస్తవరూపం దాల్చిందని శ్రీ వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం 12 సెమీకండక్టర్ తయారీ ప్లాంట్లు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నాయని తెలిపారు. వాటిలో మూడు ప్లాంట్లు ఇప్పటికే జపాన్, యూరప్, దేశీయ మార్కెట్లకు ఎగుమతి అవుతున్న చిప్‌లను ఉత్పత్తి చేస్తున్నాయని ఆయన వివరించారు.

దేశంలో అభివృద్ధి చెందుతున్న సెమీకండక్టర్ డిజైన్ వ్యవస్థ, దానికి తోడు ప్రపంచవ్యాప్తంగా నిపుణుల కొరత ఉండటం ఐటీ పరిశ్రమకు ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తోందని కేంద్ర మంత్రి అన్నారు. వినూత్నమైన సెమీకండక్టర్ పరిష్కారాలను రూపొందించడం కోసం ఎలక్ట్రానిక్స్, ఐటీ, డిజైన్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ రంగాల్లో తమకున్న బలాన్ని, అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కంపెనీలను ప్రోత్సహించారు. ప్రతిభావంతుల లభ్యతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం 315 విశ్వవిద్యాలయాలకు అధునాతన సెమీకండక్టర్ డిజైన్ సాధనాలను అందుబాటులోకి తెచ్చిందనీ శ్రీ వైష్ణవ్ తెలిపారు.



ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంపై శ్రీ వైష్ణవ్ మాట్లాడుతూ... ఈ రంగంలో భారత్ అపూర్వ వృద్ధిని సాధిస్తోందన్నారు. గత సంవత్సరం మొబైల్ ఫోన్లు దేశంలోనే అతిపెద్ద ఎగుమతి విభాగంగా ఆవిర్భవించాయని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం విలువ ప్రస్తుత రూ. 13 లక్షల కోట్ల నుంచి సమీప భవిష్యత్తులోనే రూ. 20 లక్షల కోట్లకు విస్తరిస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. ఒక్క తెలంగాణలోనే, కేంద్ర ప్రభుత్వం 104 ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల ఏర్పాటుకు మద్దతునిచ్చిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. నాలుగు ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లనూ మంజూరు చేసిందని, ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ)ను ఏర్పాటు చేసిందని ఆయన వివరించారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి దార్శనికత కింద హైదరాబాద్ ఒక ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించడానికి సిద్ధంగా ఉందని శ్రీ వైష్ణవ్ అన్నారు. నగరంలో మూడు బుల్లెట్ రైలు కారిడార్ల ఏర్పాటుకూ ప్రణాళిక చేస్తున్నారని తెలిపారు. ఇవి హైదరాబాద్‌ను హై-స్పీడ్ రైలు అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి ఒక ముఖ్య కేంద్రంగా నిలబెడతాయని ఆయన తెలిపారు.



తెలంగాణలో రైల్వే పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. యూపీఏ హయాంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైల్వే అభివృద్ధి కోసం ఏటా సుమారు రూ.880 కోట్లు పొందేదన్నారు. ప్రస్తుతం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే రూ.5,400 కోట్లకు పైగా నిధులు అందుతున్నాయని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా 1,300కు పైగా స్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా... అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలోని సుమారు 40 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

సాంకేతికత ఆధారిత వృద్ధి, ఆవిష్కరణలకు దేశంలోనే అత్యంత ముఖ్యమైన కేంద్రాల్లో ఒకటిగా హైదరాబాద్ ఆవిర్భవించిందని కేంద్ర మంత్రి అన్నారు. సెమీకండక్టర్లు, ఏఐ, కవచ్ టెక్నాలజీ, వీఎఫ్‌ఎక్స్, డిజిటల్ ఆవిష్కరణల వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఈ నగరం గణనీయ తోడ్పాటునందిస్తోందని పేర్కొన్నారు. కృత్రిమ మేధ, సెమీకండక్టర్ల తయారీ, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణల రంగాలకు సంబంధించి భారత్ భవిత నిర్మాణంలో ఈ నగరం కీలక పాత్ర పోషిస్తుందని శ్రీ వైష్ణవ్ వివరించారు.


‘గత దశాబ్ద కాలంలో భారత్ ఒక బలమైన డిజిటల్ పునాదిని నిర్మించుకుంది. ఇది డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల్లో దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టింది. యూపీఐ ద్వారా రూ. 314 లక్షల కోట్లకు పైగా విలువైన లావాదేవీలు జరిగాయి. స్వదేశీ 4జీ, 5జీ సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయి. సరసమైన ధరలకే డేటా సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ స్థాయి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు అన్ని రంగాల్లో ఆవిష్కరణలను, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తున్నాయ’ని కేంద్ర మంత్రి వివరించారు.

 


కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఈ అభివృద్ధి హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాకూడదన్నారు. వరంగల్, కరీంనగర్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలు పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఉపాధికి కేంద్రాలుగా ఆవిర్భవించాలని... తెలంగాణ వ్యాప్తంగా సమతుల్య ప్రాంతీయ వృద్ధి జరగాలని పేర్కొన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి, కొత్త రైల్వే మౌలిక సదుపాయాలు, 100 శాతం రైల్వే విద్యుదీకరణ వంటి పనులు కనెక్టివిటీని విస్తరిస్తూనే, హైదరాబాద్ వృద్ధినీ బలోపేతం చేస్తాయని శ్రీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

కేంద్ర మంత్రులు శ్రీ అశ్వినీ వైష్ణవ్, శ్రీ జి. కిషన్ రెడ్డి కొండకల్‌లోని మేధా బోగీస్ ఫ్యాక్టరీని, ఫ్యాబ్ సిటీ రోడ్డులోని మేధా సెర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌నూ సందర్శించారు. అక్కడ తయారీ కార్యకలాపాలను వారు సమీక్షించారు. సాంకేతిక సామర్థ్యాలు, భద్రతా సన్నద్ధత సంబంధిత వివరాలను గురించి అధికారులు, ఉద్యోగులతో సంభాషించారు. ప్రారంభ దశకు ముందు కీలక సౌకర్యాలనూ కేంద్ర మంత్రులు తనిఖీ చేశారు.
 
***

(रिलीज़ आईडी: 2283725) आगंतुक पटल : 50
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Odia