బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎస్ఈసీఎల్ ప్రతిష్ఠాత్మక సీఎస్ఆర్ కార్యక్రమం 'ఎస్ఈసీఎల్ కే సుశ్రుత్'ను గెజిట్ ఆఫ్ ఇండియాలో నోటిఫై చేసిన బొగ్గు మంత్రిత్వ శాఖ


పారదర్శకంగా, సమర్థంగా, సాంకేతికత ఆధారితంగా ప్రయోజనాలను అందించడానికి వీలు కల్పిస్తూ... గెజిట్ నోటిఫికేషన్ పొందిన తొలి బొగ్గు పీఎస్‌యూ సీఎస్ఆర్ పథకం

प्रविष्टि तिथि: 10 JUL 2026 9:17PM by PIB Hyderabad

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్), బొగ్గు మంత్రిత్వ శాఖ మార్గదర్శనంలో మరో కీలక ఘనతను సాధించింది. దీని ప్రతిష్ఠాత్మక కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమం 'ఎస్ఈసీఎల్ కే సుశ్రుత్'... గెజిట్ ఆఫ్ ఇండియాలో నోటిఫై అయిన తొలి బొగ్గు ప్రభుత్వ రంగ సంస్థల సీఎస్ఆర్ పథకంగా నిలిచింది.

ఆధార్ (ఆర్థిక, ఇతర రాయితీలు, ప్రయోజనాలు, సేవలను అర్హులైన లబ్దిదారులకు పంపిణీ చేయడం) చట్టం-2016, సుపరిపాలన కోసం ఆధార్ ప్రామాణీకరణ (సామాజిక సంక్షేమం, ఆవిష్కరణ, విజ్ఞానం) నియమాలు-2020లోని నిబంధనల ప్రకారం... ఎస్ఈసీఎల్ కే సుశ్రుత్ పథకం లబ్ధిదారుల కోసం ఆధార్ ప్రామాణీకరణకు వీలు కల్పిస్తూ బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. స్వచ్ఛంద ఆధార్ ప్రామాణీకరణ ద్వారా లబ్ధిదారులకు పారదర్శకంగా, సమర్థంగా, అర్హులందరికీ ప్రయోజనాలను అందించడాన్ని ఈ నోటిఫికేషన్ సులభతరం చేస్తుంది. ఆధార్‌ను ఉపయోగించకూడదని ఎంచుకున్న వారికి ప్రత్యామ్నాయ ప్రభుత్వ-ఆమోదిత గుర్తింపు పత్రాలను ఇది అందిస్తుంది.

2023లో ఎస్ఈసీఎల్ ప్రారంభించిన ' ఎస్ఈసీఎల్ కే సుశ్రుత్' పథకం ఈ కంపెనీ చేపట్టిన ప్రధాన సీఎస్ఆర్ కార్యక్రమం. ఇది ఎస్ఈసీఎల్ కార్యకలాపాలు సాగే ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా రెసిడెన్షియల్ నీట్ కోచింగ్ అందిస్తోంది. తద్వారా వారు వైద్య, అనుబంధ ఆరోగ్య సంరక్షణ రంగాల్లో వృత్తిని చేపట్టేందుకు ఇది వీలు కల్పిస్తుంది.

ఈ కార్యక్రమం నిలకడగా అసాధారణ ఫలితాలను అందించింది. మొదటి (2023–24) బ్యాచ్‌లో 40 మంది విద్యార్థులకు గానూ 39 మంది నీట్‌కు అర్హత సాధించారు. 11 మంది విద్యార్థులు ఎంబీబీఎస్, ఇద్దరు బీడీఎస్, ఇద్దరు బీఏఎమ్ఎస్, ఇద్దరు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీహెచ్) ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందారు. మరో ఇద్దరు విద్యార్థులు ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ కళాశాలల్లో వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశం పొందారు.

రెండో (2024–25) బ్యాచ్ విద్యార్థులు కూడా అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు. 40 మంది విద్యార్థుల్లో 31 మంది నీట్‌లో అర్హత సాధించారు. ప్రభుత్వ సంస్థల్లోనే ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎమ్ఎస్, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీ.ఎఫ్.ఎస్సీ) వంటి ప్రోగ్రామ్‌లలో వారు ప్రవేశాలు పొందారు.

ఎస్ఈసీఎల్ కే సుశ్రుత్ పరిణామ క్రమంలో ఈ గెజిట్ నోటిఫికేషన్ మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఇది దాని సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో పాటు... లబ్ధిదారులకు పారదర్శకత, జవాబుదారీతనం, అందుబాటులో ఉండే సౌలభ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

భారత ప్రభుత్వ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) పోర్టల్‌లో చోటు సంపాదించిన తొలి బొగ్గు ప్రభుత్వ రంగ సంస్థ సీఎస్ఆర్ పథకంగా ఈ కార్యక్రమం నిలిచింది. ఇది దాని పటిష్ఠమైన పాలనా ప్రణాళికను... సాంకేతికత ఆధారితమైన, పారదర్శకమైన సేవల పంపిణీకి సంబంధించి భారత ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఉండే తన విధానాన్నీ పునరుద్ఘాటిస్తుంది.

‘ఎస్ఈసీఎల్ కే సుశ్రుత్’ కార్యక్రమం... ఎస్ఈసీఎల్ గనుల ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలను కల్పిస్తోంది. తదుపరి తరం వైద్య నిపుణులను తీర్చిదిద్దడం ద్వారా దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకూ తన వంతు సహకారాన్ని అందిస్తోంది.

 

***

 

(रिलीज़ आईडी: 2283670) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Tamil